బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-సలహా అడగడం అంత పాపం ఇంకోటిలేదు…


   అప్పుడప్పుడు కొంతమందిని చూస్తూంటాము. ఒక్క పనీ ఇంకోళ్ళ సలహా లేనిదే చేయలేరు. పోనీ అదైనా ఏ ఒక్కడితో సరిపెడతారా, అబ్బే, మళ్ళీ అదే విషయాన్ని, ఇంకో పదిమందిని అడగడం. మామూలేగా, ఏ ఇద్దరూ ఒకే రకమైన సలహా ఛస్తే ఇవ్వరు! ఇంక ఈ సలహా అడిగినవాడు, జుట్టు పీక్కోడం తప్ప ఇంకో గతుండదు. అయినా సరే, తన అలవాటు మాత్రం మార్చుకోడు.

ఓ వస్తువు కొనాలంటే, ఏ బ్రాండు మంచిదో అడగడం. పిల్లల్ని ఏ స్కూల్లో వేస్తే బావుంటుందో, ఆ తరువాత ఏ కాలేజీలో వేస్తే బావుంటుందీ, చివరకిఏ స్ట్రీం లో వేస్తే బావుంటుందో కూడా, ఇంకోళ్ళ సలహా తీసికోకుండా ఉండడు. చెప్పేవాళ్ళదేం పోతుందీ? వాళ్ళు చేయాలని చేయలేకపోయినవేవో, వీడి నెత్తిన రుద్దేస్తారు. ప్రతీ సారీ, చేయాలనుకోవడమే కాదు, ఒక్కొక్కప్పుడు, ఏ పేపర్లోనో చదివినవి కూడా, ఈ సలహా అడిగినవాడికి తగిలించి, ఆ తరువాత అన్నీ బావుంటే, తనూ ప్రయత్నించవచ్చు కదా అని. అదేదో టెస్ట్ రైడ్ లాగన్నమాట!
పోతే అవతలివాడు పోతాడు. మనం బాగానే ఉండొచ్చు
.

ఓ పెళ్ళి సంబంధం చూడాలన్నా ఇదే పధ్ధతి. ఇంకోళ్ళ సలహాలు తీసికోవద్దనడం లేదు, దానికీ ఓ వావీ వరసా ఉండాలి. అవతలివాడు ఇంకోళ్ళకి సలహా ఇచ్చేటంత ఉద్దండుడా అనేది తెలిసికోవాలి. ఊరికే గుడ్డెద్దు చేలో పడ్డట్టు, కనిపించినవాడినల్లా సలహా అడక్కూడదు అని నా అభిప్రాయం. ఏ ట్రైనులోనో, బస్సులోనో వెళ్ళేటప్పుడు చూస్తూంటాము, తను దిగవలసిన చోటు ఎక్కడో తెలియదనుకోండి, పక్క వాడితో మొదలెట్టి, చుట్టుపక్కలున్న ప్రతీవాడినీ అడిగేయడమే!బస్సుల్లో కండక్టర్నడిగితే పోదూ? రైళ్ళల్లో పోనీ, కొంతవరకూ ఫరవా లేదు. కొందరిని రైళ్ళలో అడగ్గానే, తనదగ్గరున్న టైంటేబిల్ చూసి చెప్పేవారు, మారోజుల్లో. ఇప్పుడు ఎక్కడా ఆ టైంటేబిళ్ళు కనిపించడమే లేదు. లోకళ్ళలో అయితే ఆ గొడవే లేదు, హాయిగా
ప్రయాణం చేస్తున్న బోగీల్లోనే, ట్రైన్ రూట్ పెడతారు. ముంబై పూణే ల్లో చూశాను. మిగిలిన చోట్ల సంగతైతే నాకు తెలియదు.

మనం ఎవరింటికైనా వెళ్ళాలని, ఏ బస్సెక్కో వెళ్ళి, మనక్కావలిసిన ప్రదేశం గురించి, నలుగుర్నీ అడిగి, ఎక్కడో అక్కడ దిగుతాము. దిగిన తరువాత ప్రారంభం అవుతాయి తిప్పలు. ఆ ప్రదేశమేదో తెలిసి చావదు, ఏ కారు పక్కనో సిగరెట్టు కాలుస్తున్నవాడినో అడిగామనుకోండి, అతనంటాడూ, ఇదిగో కొద్ది దూరంలోనే, జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటాడు. మనం వాడిని నమ్ముకుని నడక మొదలెడతాము, ఎంతకీ కనిపించదే, ఆ కారు పెద్దమనిషి చెప్పిన జస్ట్ ఫైవ్ మినిట్స్, కార్లో వెడితేనూ. నాలాటి వినోభా భావేలకి కాదు! నడవగా, నడవగా, దారిలో ఇంకో పచారీ కొట్టువాడినీ, కూర్ల బండి వాళ్ళనీ అడిగి, మొత్తానికి ఆ సొసైటీ చేరితే, మళ్ళీ అందులో ఇంకో కిలోమీటరు నడవాలి! అక్కడకూడా ఓ వరసలో ఉంటాయా బ్లాక్కులు,అబ్బే
మొదట్లో సి-1 తో మొదలయి, మనకి కావలిసిన సి-2 చివర్లో ఎక్కడో ఉంటుంది. వెధవ్వేషాలు కాపోతే, బ్లాక్కుల నెంబర్లేనా వరసలో వేసి ఏడ్వచ్చుగా! ఇన్ని తిప్పలూ పడి, ఆ వెళ్ళినవాడింట్లో అడిగామనుకోండి, ఏమిటీ మీ సొసైటీలో వరసలో ఉండవా బ్లాకులూ, నెంబర్లూ అంటే, వాడంటాడూ, ముందర ఈ బిల్దింగు కట్టారూ, దానితో అలా వేసేశారు నంబర్లూ అని. నీ నెత్తేం కాదూ, బిల్డింగులు అన్నీ కట్టిన తరువాతే నెంబర్లిస్తారు, పోనీ నువ్వు చెప్పినట్లే ఉధ్ధరించాడూ అనుకుందాం, తరవాతైనా ఆ నెంబర్లు వరసలో తగలేయొచ్చుగా అంటే సమాధానం ఉందదు!

మా రాజమండ్రీ కాపరం లో,ఓ ఫ్రిజ్ కొనుక్కుందామని, ఎరక్కపోయి మావాణ్ణి సలహా అడిగాను, పోనీ నాకు కొత్తకదా, వాడు అంతకుముందు, అయిదారేళ్ళనుండీ ఉంటున్నాడూ అని.ఏవో రెండు మూడు బ్రాండులు చూశాము, ఫలానాది బావుంటుందేమోరా అన్నాడు మావాడు. పోనీ ఇంకో కొట్లో చూద్దామా అని నాకూ తట్టలేదు, అంతా ఖర్మ, ఆటోమేటిక్ డిఫ్రాస్ట్ ఉందా లేదా అని చూసుకోకుండా, ఊపుకుంటూ కొనేశాను. ఛస్తున్నాను దానితో, ఓ రెండు రోజులపాటు డిఫ్రాస్ట్ నొక్కడం మర్చిపోయి చూస్తే, ఆఫ్రీజర్ లో హిమాలయాలు ఏర్పడిపోతాయి. తలుపు ఛస్తే తెరుచుకోదు. బాధ భరించలెక ఆ డిఫ్రాస్ట్ బటన్ నొక్కితే, పోనీ ఆ నీళ్ళేనా సరీగ్గా పోతాయా, ఆ దరిద్రపు కంపెనీ వాడు, కంప్రెసర్ పక్కన నీళ్లు ఉండే ట్రే లిటికంత పెట్టాడు. ఓ పదినిమిషాల్లో వంటిల్లంతా నీళ్ళే, బయటకి వచ్చేస్తాయిగా! మా ఇంటావిడెమో, అప్పటికే రెండు మూడు సార్లు తుడిచేసి, వంటిల్లంతా చకా చక్ చేసేసి ఉంటుంది. ఇక్కడేమో ఫ్లోరంతా నీళ్ళూ. పైగా కనిపించి చావవూ. నాకేం తెలియదు, కొన్నారుగా ఓ దిక్కుమాలిన ఫ్రిజ్జూ, మీరే తుడవండి అంటుంది.తప్పుతుందా, ఇంక నేను, కింద చతికిలపడి, ఓ గుడ్డా, ఓ పాత్రా పైగా ఇంటినిండా స్టీలు పాత్రలే ( ఏగాణీ….. దమ్మిడీ క్షవరం లాగ). ఆ గుడ్డని ఆ పాత్రలో ముంచడం, దాన్ని పాత్రలో పిండడం, కాపడం పెట్టినట్లు! పోనీ ఆ ట్రే ని తీసి ఖాళీ చేద్దామా అంటే, దాన్ని ఏవేవో వైర్లతో బిగించిపారేశాడు. రాజమండ్రీ లో ఉన్నంతకాలం, మళ్ళీ ఎవరినీ లేనిపోని సలహాలడగలేదు. కావలిసినవేవో,కొట్టుకెళ్ళడం కొనుక్కోవడం. పైగా అప్పుడే నెట్ చూడ్డం ఓటి వచ్చేసిందిగా, హాయిగా రివ్యూలు చదవడం! కాని నాకు మాత్రం ఈ ఫ్రిజ్ వదలడం లేదు. ఎప్పుడో చూసి చూసి ఎక్స్ఛేంజ్ లో ఇచ్చేస్తాను ఓ గొడవొదుల్తుంది!

నేను చదివిన జోక్కు….

Regular naps prevent old age, especially if you take them while driving.

4 Responses

  1. హన్నా! మీరు బండ్లు నడపరు, కాబట్టి, మిగిలినవారంత నిద్ర పోతూ నడిపితే ముదుసలి కానక్కర లేదంటారా? వామ్మో ! మంచి జోకే !
    “సలహా తీసుకునేంత పాపం లేదు”

    Like

  2. మోహన్ గారూ,

    ఏమో నచ్చుతుందేమో పోనీలే అని సలహా ఇచ్చానూ. అఖ్ఖర్లేకపోతే నేనేం చేయనూ !!!!

    Like

  3. conductor మరిచిపోతె,గతేంటండి.మనలాగ చాలా మంది conductor ని అడిగి వుండొచు.అందరిని గుర్తు పెట్టుకొవాలని లేదుగా బాబాయి గారు.చెన్నై లొ నా స్వానుభవం ఇది….conductor తన పని లొ వుంటాడు.సొ పక్కవాడిని అడగటమే better…ofcourse,,మిగతా వాటిల్లొ మీరు correct అనుకొండి..

    Like

  4. నిరుపమా,

    మీరన్నదీ నిజమే. కానీ అలాగని బస్సులో ఉండే ప్రతీవాడినీ అడుగుతూ పోతూంటే, మొదట అడగబడ్డవాడికి చిర్రెత్తుకొస్తుంది !!

    Like

Leave a comment