బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–నా అగచాట్లు..

    ఈ వేళ ప్రొద్దుట, మా అబ్బాయి మా మనవడు చి.అగస్థ్య కి పాస్ పోర్ట్ కి ఎప్లికేషన్ ఇవ్వడానికి వెళ్తూ, నన్ను కూడా రమ్మన్నాడు. సరే పనేముందీ అనుకుంటూ నేనూ బయలుదేరాను, తన కారులో. ఈ మధ్యన ఆన్ లైన్ లో ఎప్లికేషన్లు తీసికుని వాళ్ళిచ్చిన టైముకి వెళ్ళి డబ్బులు కట్టాలిట.దాంట్లో 10.00AM 14/10/2010 అని ఇచ్చారు. వాళ్ళు టైమిచ్చారుకాబట్టి తొందరగానే పని పూర్తైపోతుందన్నాడు. మేము వెళ్ళేసరికే ఓ రెండు వందలమందిదాకా క్యూలో నుంచున్నారు.తనకి అడగడానికి మొహమ్మాటపడుతున్నాడూ, పోన్లే నేనే వెళ్ళి సంగతేదో కనుక్కుందామని వెళ్ళి అడిగితే తేలిందేమయ్యా అంటే, ఆన్ లైన్ లో ఎప్లై చేసిన ప్రతీవాడికీ by default అదే టైము ఇస్తారుట! ఈ మాత్రందానికి ఇంత హడావిడి ఎందుకో అర్ధం అవదు.దాంతో అర్ధం అయిందేమిటంటే, online అయినా offline మనం ఇదివరకటిలాగానే క్యూల్లో నుంచోవడమే! అక్కడ ఉండే సెక్యూరిటీ వాడు నన్ను లోపలికి వెళ్ళనీయనన్నాడు. మీకేం పనీ అని అడిగితే
ఊరికే టైంపాస్స్ కీ అన్నాను.లోపల బాగా రద్దీగా ఉంటుందీ, బయటే బాగుంటుందీ అనడంతో, చేసేదేంలేక బయటే నుంచుండిపోయాను. మా అబ్బాయి అంతసేపు ఊరికే నుంచోడం ఎందుకూ, కారులో కూర్చుని ఏ పేపరో చదువుకో అని కారు తాళాలు ఇచ్చాడు.

    అక్కడిదాకా బాగానే ఉంది. మా కారు పెట్టిన చోటుకి వెళ్ళి, డోర్ తీద్దామని ప్రయత్నిస్తే ( నేను ఎప్పుడైనా కార్ల తాళాలు తీశానా!) దీనిల్లుబంగారంగానూ రాదే! అటు తిప్పీ ఇటుతిప్పీ ప్రయత్నించాను. అప్పటికే ప్రక్కనే నిల్చున్నవాళ్ళు నావైపు అనుమానంగా చూడ్డం మొదలెట్టారు ఏ కార్ లిఫ్టరో అనుకుని! ఇంక లాభం లేదనుకుని, వాళ్ళనే అడిగేశాను నాయనలారా ఇది మా అబ్బాయి కారూ, తను లోపల క్యూలో నుంచున్నాడు, టైము పడుతుందని నన్ను కార్లో కూర్చోమన్నాడూ అని! నా అదృష్టం బాగుండి, వాళ్ళు అదేదో సెంట్రల్ లాకింగుని ఓ నొక్కు నొక్కి మొత్తానికి తీశారు.పోనీ నేనైనా బుధ్ధిమంతుడిలా, ముందరి డోర్ తీసి కూర్చోవచ్చుగా, అబ్బే ముందర కూర్చోడం ఎప్పుడైనా అలవాటుంటేగా,పెద్ద గొప్పగా వెనక్కాల డోర్ తీసి అందులో సెటిల్ అయ్యాను. గాలి రావడం లేదని అద్దం కిందకు దింపుదామంటే రాదు. పోనీ తలుపు తీద్దామంటే వెనక్కాలి రెండు డోర్లకీ child lock వేసేశాడు. లోపల్నించి రాదూ,బయటకు వెళ్ళాలంటే దారేది భగవంతుడా అనుకున్నాను. పోనీ ఆ లాక్ తిసినవాళ్ళు ఉంటారేమో అడగొచ్చూ అనుకుంటే అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారు! ముందర సీట్ లోకి వెళ్తే, డోర్ తీసికుని బయటకు వెళ్ళొచ్చూ అని తెలుస్తోంది, కానీ వెళ్ళడం ఎలాగ? సీట్లేమో ఇరుగ్గా ఉన్నాయీ.

   మొత్తానికి ఏదో తిప్పలు పడి పద్మాసనాలూ, యోగాసనాలూ వేసి అన్ని రకాల acrobatics చేసి, ముందర సీటులోకి వెళ్ళాను. ఈ ప్రక్రియ లో కాలు దేంట్లోనైనా ఇరుక్కుపోతే అదో అప్రదిష్టా! ముందరకైతే వెళ్ళాను కానీ, ఆ డోర్ గ్లాసు రాదూ. ఇదికాదు పధ్ధతీ అనుకుని, ఆ డోర్ తెరిచేసి కూర్చుని, ఊపిరి పీల్చుకుని ఓ పేపరు తీసికుని సెటిల్ అయ్యాను!అక్కడితో కథ పూర్తయినా బాగుండును,ఆ పక్క కారు తీసేయగానే, ఆ ఖాళీలోకి ఇంకో ఆవిడ వచ్చింది. మా కారు అడ్డం వచ్చిందేమో, అంకుల్ కొద్దిగా కారుని పక్కకు జరపండీ అని అడిగారు. ‘మా తల్లే నువ్వొక్కర్తివే తరవాయీ, నన్నే ఆడిగావా’ అనుకుని. ఏం మొహమ్మాట పడకుండా చెప్పేశాను, ‘నాకు రాదూ, మీరే ఇంకో చోటుకి వెళ్ళండీ’ అని.

    ఓ రెండు గంటల తరువాత, మా అబ్బాయి పని పూర్తిచేసికుని వచ్చాడు. అదేమిటి డాడీ ఏ.సీ. వేసికునుండవలసింది,అంటే అప్పటిదాకా నేను పడ్డ తిప్పలు చెప్పేసరికి, నవ్వాపుకోలేకపోయాడు. అలా కాదూ, తాళం ఇగ్నిషన్ లో పెట్టి ఒకసారి తిప్పితే, అన్నీ యాక్టివేట్ అవుతాయీ,అలా చేయవలసిందీ అన్నాడు. నాయనా నారోజు బాగోపోతే ఆ కీ కాస్తా ఒకసారికి బదులు రెండు సార్లు తిరిగితే ఏమౌతుంది బాబూ, అంటే కారు స్టార్ట్ అవుతుందీ అన్నాడు!’ ఏదో ఉన్నంతకాలం నన్ను ఇలా వెళ్ళిపోనీ, నీ కార్లూ వద్దూ, కీ లూ వద్దూ అన్నాను! అలా కాదూ, మొదట్లో కంప్యూటరు నేర్చుకోమంటే అప్పుడూ ఇలాగే అన్నావూ, ఇప్పుడు చూడు మన tenderleaves పని అంతా మీరే చూస్తున్నారూ,అలాగే డ్రైవింగు కూడా నేర్చేసికో అన్నాడు. చూడు నాయనా అది వేరూ, ఇది వేరూ. కంప్యూటర్ కి ఏమైనా అయితే మీరందరూ ఉన్నారు బాగుచేయడానికి. కారు నడిపేటప్పుడు ఏమైనా జరిగి, ఏ కాలో చెయ్యో విరిగితే నేనే బాధ పడాలి, ఈ వయస్సులో అంత అవసరమా అన్నాను!
నా టపా కి టాపిక్ దొరుకుతుందనే ప్రొద్దుట నన్ను తీసికెళ్ళాడుట పైగా !!

%d bloggers like this: