బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-USB,UPS,USP ఏమిటో అంతా గందరగోళం….

   శీర్షికలో పెట్టిన మూడు పదాలతోనూ నాకెప్పుడూ గందరగోళం గానే ఉంటూంటుంది! వాటి అర్ధాలు తెలియక కొంతకాలం అవస్థపడ్డాను, ఏదో పిల్లల్ని అడిగి తెలిసికున్న తరువాత, వాటిని వాడే సందర్భాలు తెలియక చిక్కుల్లో పడిపోతూంటాను!
‘ఏమి మాయ చేశావే ఇంగ్లీషా ‘ అనుకుంటూ, పోనీ మీతోనైనా చెప్పుకుందామని ఈ టపా! ఊరికే నవ్వేసికోకండి, అసలు ఈయనకి ఈ వయస్సులో ఇవన్నీ అవసరమా, హాయిగా రామా కృష్ణా అంటూ ఓ మూలని కూర్చోక అనుకుంటున్నారు కదూ! ఏమిటో అన్నీ తెలుసుననుకోవడం,ఏదో వాగడం! పోనీ హాయిగా ఏ పత్రికో పేపరో చదివేసి కూర్చోక ఎందుకండీ ఇవన్నీ? దాన్నే ‘ఆబ’ అంటారు!పిల్లల ధర్మమా అని కంప్యూటరోటి నేర్పించారు, పోనీ అన్నీ చెప్తారా,అబ్బే, మీకు అవసరం ఉండదూ, అయినా అంతకావలిసిస్తే మేమున్నాంగా అంటారు. ఏదో వాళ్ళందరూ మాట్లాడుకునేటప్పుడు విన్నవాటినే, గుర్తుంచేసికుని ‘ఓహో అలాగా…’ అనుకుంటూ, వాటిని నాకంటే అధమాధముడు( కంప్యూటరు విషయంలో) ఎవడైనా దొరికితే వాడెదురుగుండా ఎడా పెడా వాడేయడమే!వాళ్ళుకూడా ‘ఓహో ఎంత అదృష్టవంతులూ, మీకు చాలానే వచ్చునే’ అనుకుంటూంటారు!

    ప్రస్తుత విషయానికొస్తే… ఈ మధ్యన మా అబ్బాయీ,కోడలూ ప్రారంభించిన గ్రంధాలయం కోసం ఓ ఫ్లాట్ అద్దెకు తీసికున్నారు.దాంట్లో ఓ రెండు కంప్యూటర్లూ, వాళ్ళ లాప్ టాప్పులూ పెట్టుకున్నారు.అక్కడ ఇంకా నెట్ కనెక్షన్ రాలేదు లెండి,దాంతో మా కోడలు ఫోను చేసింది, మేముండే చోటుకి, ‘మామయ్యగారూ, వచ్చేటప్పుడు, మీ USB తీసికుని రండీ’ అని.ఇక్కడ నాకున్న కంప్యూటరులో ఈ USB ఏమిటో తెలియదు!నెట్ రావడానికి వచ్చే ఆ బుచ్చి కాడని USB అంటారని నాకేం తెలుసూ? పాపం ఒకదానికోటి చెప్పిందేమో అనుకుని,టేబుల్ క్రింద ఉండే UPS ని ఓ పేద్ద సంచీలో పెట్టుకుని చక్కాపోయాను.’USB తెచ్చారా’ అని అడగ్గానే, జేబులోంచి తీసి ఇస్తానేమో అని చూస్తున్న మా కోడలు, ‘ఇదేమిటీ ఈయన్ని USB తీసుకురమ్మంటే, ఏదో కూరలు తీస్తున్నట్లు సంచీ తీస్తారూ’అనుకుంది.నేను నాతో తెచ్చినదాన్ని టేబిల్ మీద పెట్టాను.అదేమిటీ దీన్ని తెచ్చారూ అంటే, ‘నాకేం తెలుసూ, ఇదే అనుకున్నానూ’ అనేటప్పటికి,మా పిల్లలకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు! ఆ తరువాత విషయం అర్ధం అయేలా చెప్పారనుకోండి.

   మా వాళ్ళు ప్రారంభించిన గ్రంధాలయం గురించి వీళ్ళూ, వీళ్ళ పార్ట్నరూ ఏదో డిస్కస్ చేసికుంటూంటే, నేనెందుకూ అక్కడ పానకంలో పుడక లాగ, అయినా సరే నాకూ ఏదో వచ్చునూ అని చూపించుకోవాలిగా, వాళ్ళు చెప్పేదంతా వింటూ కూర్చోచ్చుగా, అబ్బే, అలా ఉండిపోతే మననెవడు పట్టించుకుంటాడు? మా గ్రంధాలయంలో ‘పుస్తకాలు తీసికోవడానికి, ఎవరూ ఎక్కడికీ వెళ్ళఖ్ఖర్లేదు, పుస్తకాలే మీదగ్గరకి వస్తాయీ’. దీన్నేదో అంటారు, ఎవరివద్దా లేనిదాన్ని, సమయానికి గుర్తొచ్చి చావదూ,అమ్మయ్యా గుర్తొచ్చింది ‘హా UPS’ అదే కదా మన UPS అని ఇంకోసారి అనేటప్పటికి, మా వాడి ఫ్రెండు/పార్ట్నర్ హటాత్తుగా మాట్లాడుతూన్నవాడల్లా, అర్ధం కాక ఆగిపోయాడు! అలాటి దాన్ని USP అంటారుట! ఏమిటో ఇలాగున్నాయి నా పాట్లు!

   ఇక్కడితో అయిందా పోనీ అనుకుంటే, ఈ మధ్యన మన సత్యాన్వేషణ బ్లాగరు, రెహ్మానుద్దీన్ తో పరిచయం అయిన తరువాత, అతనితో చెప్పాను, ‘ నా దాంట్లో ( కంప్యూటరులో) తెలుగులో అక్షరాలు టైపు చేసినప్పుడు బాగానే వస్తున్నాయి కానీ,కొన్నిటిలో అక్షరాలకి బదులుగా బాక్స్ ల్లాగ వస్తున్నాయీ, ఏమైనా చెసిపెట్టు బాబూ’ అన్నాను. ‘ మీ OS ఏమిటండీ’ అన్నాడు. మళ్ళీ ఈ గొడవేమిటీ అనుకుంటూ‘వాడెవడూ’ అన్నాను. గవర్నమెంటు లో పనిచేసినంతకాలం, ఈ ఆఫీసు సూపర్నెంట్లే గా(OS)నాకు తెలిసినవాళ్ళు.’ కాదు మాస్టారూ,మీ Operating System ఏమిటీ’ అన్నాడు. ‘నాయనా నాకు ఆ గొడవలేమిటో తెలియదూ, నువ్వే చూసుకో’ అనేటప్పటికి, అయ్యబాబోయ్
ఈ ఊళ్ళోనే ఉంటే ఈయనతో వేగడం ఎలాగరా బాబూ అనుకుని, హైదరాబాద్ పోస్టింగు తీసికుని వెళ్ళిపోయాడు!!

   ఆఫీసంటే గుర్తొచ్చింది, నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు, ఒకసారి మా ఆఫీసులో డాక్యుమెంట్స్ ఫైలు చేద్దామనుకుంటే, వాటికి చిల్లులు ( పైల్లో పెట్టడానికి) చేయడానికి, మా ఆర్డర్లీతో పక్క సెక్షను కి వెళ్ళి Punching machine తీసుకు రారా అంటే, వాడు నా ఎదురుగుండానే మోటారు సెక్షను వాళ్ళకి ఫోను చేసి ఓ ట్రక్కు అడిగాడు, ఎందుకురా అంటే, ‘మీరు అదేదో మెషిను తెమ్మన్నారుగా, అందుకూ’ అన్నాడు. మా నాయనే దాన్ని జేబులో పెట్టి తేవచ్చు అన్నాను.
దాన్నే అంటారు ఎంత చెట్టుకు అంత గాలీ అని! ఆ రోజున వాడికి పంచింగ్ మెషీన్ అంటే తెలియలేదు, ఈవేళ నాకు USB అంటే తెలియలేదు! అదండీ సంగతి!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Hoarding

    ఈ టపాకి నేనిచ్చిన శీర్షిక ఏదో యాడ్ హోర్డింగ్ గురించి కాదు. మనదేశంలో national passion అయిన అత్యవసర వస్తువుల్ని అవసరం ఉన్నా లేకపోయినా దాచడం అనే అలవాటు గురించి!ఏ సరుకైనా సరే ఖరీదు పెరిగిపోతూందనేసరికి కొనేయడం, దాచేయడం! అది కొనే సరుకే కానఖ్ఖర్లేదు, ఇంట్లో వచ్చే నీళ్ళతో సహా ఏదీ కాదనర్హం హోర్డింగుకి…

    ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న సాయంత్రం, మా సొసైటీ వాచ్ మన్ ఎంతో ప్రేమగా పిలిచి చెప్పాడు- ఈ వేళ ఏదో టాంక్ క్లీనింగు చేస్తారూ, ప్రొద్దుట పదినుండి సాయంత్రం ఆరు దాకా నీళ్ళుండవూ, బకెట్లలో పట్టుకుని ఉంచుకోండీ అని. ఏదో చెప్పాడుకదా అని,మా ఇంటావిడా, నేనూ ప్రొద్దుటే లేచేసి ( ఈ వేళా, నిన్నా ఆవిడ పుట్టినరోజులెండి, నిన్న తిథుల ప్రకారం, ఈవేళ తేదిల ప్రకారం,ఇంకా సీనియర్ సిటిజెన్ స్టేజీకి రాలేదు,ఆవిడకి రైళ్ళలో పూర్తి టిక్కెట్టే తీసికోవాలి!), స్నానపానాదులు పూర్తిచేసేసి, ఖాళీ ఉన్న ప్రతీ బకెట్ లోనూ,టబ్ లోనూ పీకలదాకా నీళ్ళు నింపేశాము. ఇంతా చేసి,నీళ్ళు ఆగనూ లేదు.ఏదో ఓ రెండు గంటలు తప్పించి రోజంతా రానే వచ్చాయి. వాడు చెప్పుండకపోతే, నీళ్ళు హోర్డింగు చేసేవాళ్ళము కాదుగా. వాడెవడో చెప్పాడు, మనం అతిజాగ్రత్తకు పోయి, అవసరం ఉన్నా లేకపోయినా నీళ్ళు పట్టేసుకుంచుకోవాలనే అభద్రతా భావం! ఇది ఇంటి స్థాయిలో.

    ఇంక జాతియ స్థాయికి పోతే అడక్కండి.ఇదివరకటి రోజుల్లో, కొందరు రెవెన్యూ స్టాంపులు ఓ పేద్ద లాట్ లో కొనేసి దాచేసుకునేవారు. అంతదాకా ఎందుకూ, మాకు మిలిటరీ క్యాంటీన్ లో సరుకులు బయటికంటె, ముఫై నలభై శాతం తక్కువలో దొరుకుతాయని, సబ్బులూ, పేస్టులూ లాటివి పెద్ద సంఖ్యలో కొనేసి దాచుకోవడం, పోనీ అలాగని అవన్నీ వాడతారా,అబ్బే,ఆ పేస్టులూ, సబ్బులూ క్రుంగి క్రుశించి పోయాక బయట పడేయడం. కొంతమందైతే చిల్లర దుకాణాలకి అమ్మేసుకుంటారనుకోండి. అలాగే గవర్నమెంటు డిస్పెన్సరీలకి వెళ్ళి, ఊరికే ఇస్తున్నారుకదా అని, అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ రోజులకి మందులు రాయించి పుచ్చుకోవడం.పోనీ అవేమైనా వాడతారా,అవసరం లేకుండా మందులు మింగితే చచ్చూరుకుంటారు! expiry date అవగానే పెంటకుప్పలో పడేయడం.

   అవే కాదు, గవర్నమెంటుకీ ఉంది ఇలాటి ఆబ! ఏదైనా ఓ ఫాక్టరీయో, ఇంకోటో పెడదామనుకున్నారనుకోండి,ఎక్కడ పడితే అక్కడ స్థలం ప్రొక్యూరు చేసేస్తారు. అందులో మా రక్షణ శాఖ వారు మరీనూ. హైదరాబాదు దగ్గరలో ఎద్దుల మైలారం అనే ఊరులో ఓ ఆర్డ్నెన్స్ ఫాక్టరీ ఉంది.దానికి ఎన్ని ఎకరాల స్థలంఉందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఏమైనా అంటే డిఫెన్స్ ఆఫ్ ఇండియా అంటారుదయతలిచి ఏదో ఐ.ఐ.టి కి కొంత స్థలం ఇచ్చారు!

   గుర్తుండే ఉంటుంది ఇదివరకటి రొజుల్లో కేంద్ర బడ్జెట్ రోజున పెట్రొలు అమ్మేవారుకాదు,బడ్జెట్ లో ఖరీదు ఎలాగూ పెరుగుతుందీ, లాభాలు చేసికోవచ్చని. ఇప్పుడు ఆ గొడవే లేదు,ఉరుము లేని పిడుగులా ఎప్పుడు పడితే అప్పుడే పెంచుతున్నారు.
అంతదాకా ఎందుకూ, వెళ్ళినా వెళ్ళకపోయినా, జాగ్రత్త కోసం మూడు నెలల ముందరనుంచీ రైల్వే టిక్కెట్లు రిజర్వు చేసేసుకోవడం.అలా అనకండీ, వెళ్ళాల్సిన అవసరం రావొచ్చేమో అని ముందరే చేసికుంటారూ, దీన్ని కూడా హోర్డింగ్ అంటారేమిటీ,చిత్రం కాపొతే, అనకండి. వెళ్ళడం వేరూ, వెళ్ళాలేమో వేరూ! అవసరం లేకపోయినా టికెట్టు బ్లాక్ చేసేయడం వలన, ప్రతీ వాడూ తత్కాల్ లో తీసికోవలసివస్తోంది. దీంట్లో కన్సెషన్లుండవు, డబ్బులెక్కువ. చూశారా, అవసరంలేకపోయినా టిక్కెట్టు బ్లాక్ చేసినవాడు నష్టపోయేది రిజర్వేషన్ ఛార్జీ మాత్రమే (క్యాన్సిల్ చేసినందుకు).

   మన ప్రభుత్వం పీ.డీ.ఎఫ్ స్కీం పేరు చెప్పి ఎన్నెన్ని టన్నుల ఆహార పదార్ధాలు సేకరించి, గోడౌన్లు నింపి, చివరకు వాటిని ఎలా వ్యర్ధ పరుస్తున్నారో? పైగా సుప్రీం కోర్ట్ వారు, పోనీ ఆ ఆహారపదార్ధాల్ని ఫ్రీగా ఇచ్చేయకూడదా అంటే, పవారు గారికీ, ప్రధానమంత్రి గారికీ పొడుచుకొచ్చేసింది, హాత్తెరీ ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి మీరెవ్వరూ అంటూ, మేము సలహా కాదు ఇచ్చిందీ, ఆర్డరూ అని చెప్పినా సరే, మన కేంద్ర ప్రభుత్వం గో టు హెల్ అనేసి, ఆ విషయమే మర్చిపోయింది. ఈ లోపులో ఎఫ్.సి.ఐ గోడౌన్లలో బియ్యం తగలడిపోతూనే ఉంది.

   ఇదివరకటి రోజుల్లో,వ్యవసాయం చేసేవారు, వారికి ఏడాదికి సరిపడా ధాన్యం గాదెల్లో నింపుకుని, మిగిలినదంతా బయటకు ఇచ్చేసేవారు, పోనీండి అమ్ముకునేవారు. ఏదో ఒకటి దాచేసుకునేవారు కాదు. ఈ ప్రభుత్వ లెవీ బియ్యం, రూల్స్ వచ్చినప్పటినుంచీ, ప్రతీవాడూ హోర్డింగే! ఖరీదులు పెరిగిపోయాయంటే పెరగవు మరీ.చివరాఖరుకి చిల్లర కాయిన్స్ కూడా హోర్డింగే !

   ఈ వేళ్టి కొసమెరుపేమిటంటే- నిన్న నా కారు అగచాట్లు వ్రాశానుకదా, ఈ వేళ మాఇంటావిడ పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరితోనూ కలిసి హొటల్ కి వెళ్ళాము.అదేదో వాలే పార్కింగో ఏదో చేశారు. బయటకి వచ్చి నుంచునే సరికి, ఆ సెక్యూరిటీ వాడు నాతో ‘ साब आप्का गाडी बहर लाया ‘ అంటూ తాళ్ళాలు నాచేతిలో పెట్టాడు. ఓ వెర్రి నవ్వోటి నవ్వేసి ఆ తాళాలు తీసికున్నాను.వాడికి నామొహం చూసి అలా అనాలనిపించిందేమో పూర్ చాప్ !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–నా అగచాట్లు..

    ఈ వేళ ప్రొద్దుట, మా అబ్బాయి మా మనవడు చి.అగస్థ్య కి పాస్ పోర్ట్ కి ఎప్లికేషన్ ఇవ్వడానికి వెళ్తూ, నన్ను కూడా రమ్మన్నాడు. సరే పనేముందీ అనుకుంటూ నేనూ బయలుదేరాను, తన కారులో. ఈ మధ్యన ఆన్ లైన్ లో ఎప్లికేషన్లు తీసికుని వాళ్ళిచ్చిన టైముకి వెళ్ళి డబ్బులు కట్టాలిట.దాంట్లో 10.00AM 14/10/2010 అని ఇచ్చారు. వాళ్ళు టైమిచ్చారుకాబట్టి తొందరగానే పని పూర్తైపోతుందన్నాడు. మేము వెళ్ళేసరికే ఓ రెండు వందలమందిదాకా క్యూలో నుంచున్నారు.తనకి అడగడానికి మొహమ్మాటపడుతున్నాడూ, పోన్లే నేనే వెళ్ళి సంగతేదో కనుక్కుందామని వెళ్ళి అడిగితే తేలిందేమయ్యా అంటే, ఆన్ లైన్ లో ఎప్లై చేసిన ప్రతీవాడికీ by default అదే టైము ఇస్తారుట! ఈ మాత్రందానికి ఇంత హడావిడి ఎందుకో అర్ధం అవదు.దాంతో అర్ధం అయిందేమిటంటే, online అయినా offline మనం ఇదివరకటిలాగానే క్యూల్లో నుంచోవడమే! అక్కడ ఉండే సెక్యూరిటీ వాడు నన్ను లోపలికి వెళ్ళనీయనన్నాడు. మీకేం పనీ అని అడిగితే
ఊరికే టైంపాస్స్ కీ అన్నాను.లోపల బాగా రద్దీగా ఉంటుందీ, బయటే బాగుంటుందీ అనడంతో, చేసేదేంలేక బయటే నుంచుండిపోయాను. మా అబ్బాయి అంతసేపు ఊరికే నుంచోడం ఎందుకూ, కారులో కూర్చుని ఏ పేపరో చదువుకో అని కారు తాళాలు ఇచ్చాడు.

    అక్కడిదాకా బాగానే ఉంది. మా కారు పెట్టిన చోటుకి వెళ్ళి, డోర్ తీద్దామని ప్రయత్నిస్తే ( నేను ఎప్పుడైనా కార్ల తాళాలు తీశానా!) దీనిల్లుబంగారంగానూ రాదే! అటు తిప్పీ ఇటుతిప్పీ ప్రయత్నించాను. అప్పటికే ప్రక్కనే నిల్చున్నవాళ్ళు నావైపు అనుమానంగా చూడ్డం మొదలెట్టారు ఏ కార్ లిఫ్టరో అనుకుని! ఇంక లాభం లేదనుకుని, వాళ్ళనే అడిగేశాను నాయనలారా ఇది మా అబ్బాయి కారూ, తను లోపల క్యూలో నుంచున్నాడు, టైము పడుతుందని నన్ను కార్లో కూర్చోమన్నాడూ అని! నా అదృష్టం బాగుండి, వాళ్ళు అదేదో సెంట్రల్ లాకింగుని ఓ నొక్కు నొక్కి మొత్తానికి తీశారు.పోనీ నేనైనా బుధ్ధిమంతుడిలా, ముందరి డోర్ తీసి కూర్చోవచ్చుగా, అబ్బే ముందర కూర్చోడం ఎప్పుడైనా అలవాటుంటేగా,పెద్ద గొప్పగా వెనక్కాల డోర్ తీసి అందులో సెటిల్ అయ్యాను. గాలి రావడం లేదని అద్దం కిందకు దింపుదామంటే రాదు. పోనీ తలుపు తీద్దామంటే వెనక్కాలి రెండు డోర్లకీ child lock వేసేశాడు. లోపల్నించి రాదూ,బయటకు వెళ్ళాలంటే దారేది భగవంతుడా అనుకున్నాను. పోనీ ఆ లాక్ తిసినవాళ్ళు ఉంటారేమో అడగొచ్చూ అనుకుంటే అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారు! ముందర సీట్ లోకి వెళ్తే, డోర్ తీసికుని బయటకు వెళ్ళొచ్చూ అని తెలుస్తోంది, కానీ వెళ్ళడం ఎలాగ? సీట్లేమో ఇరుగ్గా ఉన్నాయీ.

   మొత్తానికి ఏదో తిప్పలు పడి పద్మాసనాలూ, యోగాసనాలూ వేసి అన్ని రకాల acrobatics చేసి, ముందర సీటులోకి వెళ్ళాను. ఈ ప్రక్రియ లో కాలు దేంట్లోనైనా ఇరుక్కుపోతే అదో అప్రదిష్టా! ముందరకైతే వెళ్ళాను కానీ, ఆ డోర్ గ్లాసు రాదూ. ఇదికాదు పధ్ధతీ అనుకుని, ఆ డోర్ తెరిచేసి కూర్చుని, ఊపిరి పీల్చుకుని ఓ పేపరు తీసికుని సెటిల్ అయ్యాను!అక్కడితో కథ పూర్తయినా బాగుండును,ఆ పక్క కారు తీసేయగానే, ఆ ఖాళీలోకి ఇంకో ఆవిడ వచ్చింది. మా కారు అడ్డం వచ్చిందేమో, అంకుల్ కొద్దిగా కారుని పక్కకు జరపండీ అని అడిగారు. ‘మా తల్లే నువ్వొక్కర్తివే తరవాయీ, నన్నే ఆడిగావా’ అనుకుని. ఏం మొహమ్మాట పడకుండా చెప్పేశాను, ‘నాకు రాదూ, మీరే ఇంకో చోటుకి వెళ్ళండీ’ అని.

    ఓ రెండు గంటల తరువాత, మా అబ్బాయి పని పూర్తిచేసికుని వచ్చాడు. అదేమిటి డాడీ ఏ.సీ. వేసికునుండవలసింది,అంటే అప్పటిదాకా నేను పడ్డ తిప్పలు చెప్పేసరికి, నవ్వాపుకోలేకపోయాడు. అలా కాదూ, తాళం ఇగ్నిషన్ లో పెట్టి ఒకసారి తిప్పితే, అన్నీ యాక్టివేట్ అవుతాయీ,అలా చేయవలసిందీ అన్నాడు. నాయనా నారోజు బాగోపోతే ఆ కీ కాస్తా ఒకసారికి బదులు రెండు సార్లు తిరిగితే ఏమౌతుంది బాబూ, అంటే కారు స్టార్ట్ అవుతుందీ అన్నాడు!’ ఏదో ఉన్నంతకాలం నన్ను ఇలా వెళ్ళిపోనీ, నీ కార్లూ వద్దూ, కీ లూ వద్దూ అన్నాను! అలా కాదూ, మొదట్లో కంప్యూటరు నేర్చుకోమంటే అప్పుడూ ఇలాగే అన్నావూ, ఇప్పుడు చూడు మన tenderleaves పని అంతా మీరే చూస్తున్నారూ,అలాగే డ్రైవింగు కూడా నేర్చేసికో అన్నాడు. చూడు నాయనా అది వేరూ, ఇది వేరూ. కంప్యూటర్ కి ఏమైనా అయితే మీరందరూ ఉన్నారు బాగుచేయడానికి. కారు నడిపేటప్పుడు ఏమైనా జరిగి, ఏ కాలో చెయ్యో విరిగితే నేనే బాధ పడాలి, ఈ వయస్సులో అంత అవసరమా అన్నాను!
నా టపా కి టాపిక్ దొరుకుతుందనే ప్రొద్దుట నన్ను తీసికెళ్ళాడుట పైగా !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అప్పులు/ఋణాలు…

   మళ్ళీ ఏం వచ్చిందో మన చానెళ్ళు ,పత్రికలు గత వారంరోజులుగా స్వల్ప ఋణాల సంస్థల వెనక్కాల పడ్డారు. ఆ సంస్థలకి వాళ్ళు చేసే పన్లనీ అదేదో హై సౌండింగ్ పేర్లు–మాక్రో ఫైనాన్స్/మైక్రో ఫైనాన్స్ అనో ఇంకేదో సింగినాదమో పేరుతో పిలుస్తారుట! ఏది ఏమైనా వాళ్ళిచ్చేది అప్పులే! అయినా పేరులో ఏముందిలెండి? ఏ రాయైతేనేమిటిట బుర్ర పగులకొట్టుకోడానికి? ఆ విషయానికొస్తే, చిట్ ఫండులకీ, ఫైనాన్సు కంపెనీలకీ,క్రెడిట్ కార్డులకీ,కొంప కట్టుకోడానికిచ్చే అప్పులకీ,బ్యాంకుల వాళ్ళు మనవెనక్కాల పడి ఇచ్చే అప్పులకీ అలా చెప్పుకుంటూపోతే,ఎవడిచ్చే అప్పయినా తల తాకట్టు పెట్టైనా తిరిగి ఇవ్వాలిగా? ఏమిటో ఆ అప్పు తీసికునేటప్పుడు ఏదో మాయా మైకం కమ్మేస్తుంది అప్పు తీసికున్న ప్రతీ వాడికీనూ.ఇవ్వలేకపోతామా అనుకుంటూ తీసికుంటారు.పని అయిపోయి, వాయిదాలు కట్టేటప్పుడు వస్తుంది గొడవంతా. ఆ అప్పిచ్చినవాడు, మనకేమైనా మేనత్త కొడుకా ఏమిటీ,వదిలెయడానికి?

    ఇదివరకటి రోజుల్లో అప్పులు దొరికేవి కాదు కాబట్టి, చచ్చినట్లు చేతిలో డబ్బులున్నప్పుడే వస్తువులు కొనడం, ఓ కొంప కట్టుకోవడం లాటివి చేసేవారు.మహ ఉంటే పచారీ కొట్టులోనో, బట్టలకొట్టులోనో ఖాతాలుండేవి.తరువాత్తర్వాత, బ్యాంకులవాళ్ళ సౌజన్యంతో ఏదో ఫ్రిజ్జిలూ, టి.వీ.లూ కొనుక్కోడానికి Instalments కొనుక్కోడానికి వీలుపడేది. దానిక్కూడా ఏవేవో సంతకాలూ, గ్యారంటీలూ కావల్సివచ్చేవి. డబ్బులు టైముకి కట్టకపోతే, మనం కొనుక్కున్న సరుకు కాస్తా తిసుకుచక్కాపోయేవాడు.

    ప్రపంచంలో ఎవడూ చారిటీ కోసం అప్పులివ్వడు చిట్ ఫండు వాడు, ఓ లక్ష కావాలంటే,ఏ ఎనభైవేలకో పాడాలి,అంటే ఇరవైవేలు మనం అదనంగా కడుతున్నామన్న మాటే కదా! అలాగే హౌసింగు లోన్ తీసికోండి,చూడ్డానికి 8%- 10% అంటారు, ఓ పాతికేళ్ళకి, ముందర మనం కట్టే వాయిదాలన్నిటినీ వాడు వడ్డీ క్రిందే జమ చేసేసికుంటాడు, అందుకే ఎప్పుడడిగినా మన ప్రిన్సిపల్ ఎమౌంటు ఎక్కడుందే గొంగళీ అంటే అక్కడే ఉంటుంది!ఏదో ఉధ్ధరించేస్తున్నట్లుగా కబుర్లు చెప్తారు మళ్ళీ. క్రెడిట్ కార్డుల పేర్లతో వాళ్ళు వసూలుచేసే వడ్డీ ఏమైనా తక్కువా ఏమిటీ? తేడా ఏమిటంటే, పేద్ద స్టైలుగా ఆ కార్డులు ఊపుకుంటూ,ఓ సంతకంపెట్టేస్తే చాలు! వాళ్ళుమాత్రం ఊరుకుంటారా, తిరిగి ఇవ్వకపోతే, ఎవళ్ళో గూండాగాళ్ళని పంపించి, ముక్కు పిండి వసూలు చేస్తారు.ఈ క్రెడిట్ కార్డులు,ఈ బి.పి.ఎల్ ( బిలో పావర్టీ లైన్) వాళ్ళకి ఇవ్వరుకాబట్టి, ఈ స్వల్పఋణాల సంస్థలు ఊరిమీదకు బయలుదేరాయి.దానికీ ప్రభుత్వం అనుమతిచ్చిందికదా.వాళ్ళు ఏదో ఎక్కువ వడ్డీ వసూలు చేసేస్తారట,ఎవడిస్తాడండీ ఈ రోజుల్లో చవగ్గా!వాళ్ళ కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి జీతాలూ భత్యాలూ ఎవడిస్తాడు? మనం ఇచ్చే వడ్డీమీదే బ్రతకాలి!ఆ వాయిదాలు వసూలు చేయడానికి వచ్చిన వాళ్ళని అల్లరి పెడితే ఎలాగ? పైగా చానెల్స్ లో కనిపించేవారందరిదీ ఒకటే మాట, ఆవిడెవరో స్టూడియోలో కూర్చుని మరీ చెప్పేస్తోంది, ‘అప్పు తీర్చకపోతే ఆత్మహత్య చేసికో కావలిసిస్తే’ అని అంటున్నారూ అని.ఇదంతా స్టోరీకి ఒకవైపేకదా! మరి ఆ సూక్ష్మఋణాల కంపెనీ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడంలేదేం? ఈ మధ్యన చూస్తూన్నాము, Paid News అని, ఇదికూడా ఆ కోవకే చెందిందనుకోవడంలో తప్పేమిటిట?

   ఛాన్సు రావాలే కానీ,మన రాజకీయనాయకులు రంగంలోకి వచ్చేస్తారు.నాయుడుగారూ,నారాయణ గారూ పొద్దుటినుంచి ఒకటే హడావిడి! ఇదంతా ఆత్మహత్యలు చేసికున్నవారి మీద సానుభూతి లేక ఏదో వ్రాస్తున్నాననుకోకండి.వాళ్ళు తీసికున్న అప్పులు తీర్చాలికదండీ మరి.ఏ చార్మినార్ బ్యాంకో,కృషీ బ్యాంకో దివాళాతీస్తే మనవాళ్ళు ఏం చేయలేరు. కారణం అలా నష్టపడ్డవారు vote bank లోకి రారు. సో కాల్డ్ ఇంటలెక్చుఅల్స్! ఏదో పేద్ద ఉధ్ధరించేస్తున్నట్లుగా, ఓటు వేయడానికి వెళ్ళకపోవచ్చు.‘ఈ దేశం బాగుపడదండీ’ అంటూ, ఈమాత్రందానికి వోటింగుకూడా ఎందుకూ అంటూ శలవిచ్చారుకదా అని ఏ సినిమాకో పోయే ప్రబుధ్ధులు.వీళ్ళనెవరు బాగుచేయకలరూ?అందుకే అలా ఏడుస్తున్నారు.ఈ స్వల్పఋణాలు తీసికుని ( అప్పుడు బాగానే ఉంటుంది),ఇవ్వలేక ఆత్మహత్యలూ వగైరాలు చేసికుంటూంటే ఎంత హడావిడో? ఎంతైనా vote bank లోకి వాళ్ళ ముఖ్యపాత్ర ఎక్కువ.అందుకే అందరూ ఇంత గొడవ చేస్తున్నారు.

    మనం తీసికునే హెల్త్ పాలిసీలు తీసికోండి, రెండేళ్ళపాటు మనం డబ్బులు కడితేనే కానీ, దాని ఉపయోగం ఉండదు. అలాగే హౌసింగు లోన్ తీసికున్నప్పుడు ఓ యాభై కాగితాలమీద సంతకాలు పెట్టించుకుంటారు అందులో ఏం వ్రాశారో చదవడానికి మనకు తీరికా, ఓపికా ఉండదు. వెధవది ఓ యాభై సంతకాలు పెడితే ఏం పోయిందీ, డబ్బులు వచ్చాయా లేదా బస్! జీవితం అంతా ఫలానావాడి ‘సౌజన్యంతో’ అని బ్రతికేయడమే!మనం అప్పు తీర్చకపోయినా, ఓ ఈ.ఎం.ఐ కట్టకపోయినా, ఆ బ్యాంకువాడొచ్చి కారు పట్టుకుపోతాడు, లేదా పేపర్లో ఓ ప్రకటనిచ్చేసి ఇల్లు వేలానికి పెడతాడు. మనం నోరుమూసుకు కూర్చుంటాము,అప్పుడు ఈ నాయకులు మన రెస్క్యూకి రారు,ఎందుకంటే మనం సో కాల్డ్ మిడిల్ క్లాసు కాబట్టి.
ప్రభుత్వం వారు ఈ రెండుమూడు రోజుల్లోనూ ఓ ఆర్డినెన్స్ జారీ చేస్తారుట, అక్కడికి ఇప్పటికే రూల్సూ, రెగ్యులేషలూ,చట్టాలూ లేవన్నట్లు!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-VeryVery Special Laxman

VVSL

మన లక్ష్మణ్ గురించి ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో,అందులోనూ ఒక ఆస్ట్రేలియన్ వ్రాసింది, చదివితే ( పైన ఇచ్చినది) తెలుస్తుంది, వాళ్ళని మనవాడు ఎన్నెన్ని తిప్పలు పెడుతున్నాడో!! నాకైతే ఆ వ్యాసం బలేగా నచ్చేసింది !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   మనం చూస్తూంటాం/ వింటూంటాం కొంతమందికి ఒక అలవాటుంటుంది.అడిగినా అడక్కపోయినా, ‘Frankly speaking’,’To tell you the truth” सच बोल्ना है तॉ’,’నిజం చెప్పాలంటేనండీ’ అంటూ రైల్వే స్టేషన్లో
ప్రకటనల్లాగ, తనకొచ్చిన మూడు భాషల్లోనూ ఎనౌన్స్ చేసేస్తాడు! అంటే అప్పటిదాకా మనతో చెప్పినవన్నీ అబధ్ధాలనే కదా అర్ధం! మనమేమో వెర్రివెధవల్లాగ, వాడు చెప్పిందే వేదం అనుకుని విటూంటాం! ఆ ఏడుపేదో ముందరే ఏడిస్తే,గొడవే ఉండేదికాదు కదా! మన దారేదో మనమే చూసుకుందుం.అబ్బే అంతదృష్టం కూడానా? మన ఖర్మకాలి, ఏదో ఊళ్ళో అందరూ అనుకుంటూన్నారుకదా అని ఏదో విషయంలో సలహాకి వెళ్తే వచ్చే గొడవ ఇది. కొంతమందుంటారు, సొసైటీ లో
ఓ పెద్ద ఇమేజ్ బిల్డ్ చేసేసికుని, ప్రపంచంలో తమకి తెలియని విషయమేదీ లేనట్లు!

ఇదివరకటి రోజుల్లో చూసేవారం, ఓ పెద్దాయన హాయిగా భోజనం చేసేసి, అరుగుమీద ఓ పడక్కుర్చీ వేసికుని, వీధిలో వెళ్ళే ప్రతీవారినీ పలకరించడం. అప్పుడంటే పరిస్థితులు వేరు.అలా అడిగినాయనమీద ఆ ఊళ్ళో ఉండేవారికి ఉన్న నమ్మకమూ, గౌరవమూనూ.నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు, అవతలివారికి ఉపయోగించే సలహాలే ఇచ్చేవారు.అలాగని మనం ఆయనిచ్చిన సలహా పాటించకపోయినా కొపం తెచ్చుకునేవారు కాదు. చెప్పడం వరకే వారి పని.వినడం వినకపోవడం
మన ఇష్టం.అందుకే అనేవారు ‘నిండుకుండ ఎప్పుడూ తొణకదు’ అని.

ఈ రోజుల్లో ఆ కుండలూ లేవూ, ఆ నీళ్ళూ లేవు!అవతలివాడు చెప్తే మనం ఎందుకు వినాలీ అనే కానీ, పోనీ వింటే ఏంపోయిందీ అనుకోరు.కాలమాన పరిస్థితులు అలా మారిపోయాయి మరి.ఆ రొజుల్లో ఓ మాస్టారుంటారనుకోండి, స్కూల్లో చదువుకునే కుర్రాడి తండ్రి, ఎప్పుడైనా కనిపిస్తే, ఆ కుర్రాడి బాగోగులు ఆ తండ్రితో చర్చించేవారు.ఆ చర్చ ఎంతదాకా వచ్చేదంటే, ‘మీవాడికి పాఠాల్లో ఏమైనా సందేహాలుంటే, ప్రతీ రోజూ ఓ గంట నా దగ్గరకు పంపించండి, కుర్రాడు తెలివైనవాడు, కొంచం అందిస్తే వృధ్ధిలోకి వస్తాడు’. అలా అడగడంలో ఈ మేస్టారి స్వార్ధం ఏమీ ఉండేది కాదు. కుర్రాడి అభివృధ్ధే ఈయన ఆశయం.అలాగని సాయంత్రాలు మాస్టారి ఇంటికి వెళ్ళినందుకు ఆయనకేమీ ట్యూషను పీజిచ్చుకోనఖ్ఖర్లేదు. ఊరికే, మిగిలిన పిల్లల్తో కలిసి చదువుకుంటే, ఇంకొచం బాగా చదువుతాడని.అలా మా రోజుల్లో నాకు తెలిసిన గురువులు ఎంతో మందుండేవారు. ఎక్కడో ఎందుకూ, మా ఇంట్లోనే మా నాన్నగారిదగ్గరకూ, ఆ తరువాత మా పెద్దన్నయ్యగారి దగ్గరకూ
వచ్చి, చదువుకునే వారిని ఎంతోమందిని చూస్తూండేవాడిని.
అలాటి వాతావరణంలోనే పెరిగి పెద్దయినా, నాకు మాత్రం చదువు అబ్బలేదు. దానికి మావాళ్ళు మాత్రం ఏంచేస్తారు?’పెరటి మొక్క వైద్యానికి పనికిరాదనే సామెత నాలాటివారిని చూసే వచ్చుంటుంది!
ఏదో మొదలెట్టి, ఏదో నాస్టాల్జియా లోకి వెళ్ళిపోయాను. ఎంతైనా గతం నాస్థి అంటారుకానీ, ఆ గతంలొకి వెళ్తే ఎన్నెన్ని మధుర జ్ఞాపకాలు గుర్తొస్తాయో! అరే మళ్ళీ అలాటి రోజులు వస్తే ఎంత బాగుండునూ, ఈసారి మాత్రం ఒక్క క్షణం వృధాపోకుండా అన్నీ ఆస్వాదించేయాలి అనుకుంటాము.అవి రానూ రావూ, మనం అనుభవించే అవకాశమూ రాదూ! కానీ అలా ఆలోచించడంలోనే ఉంది ఆనందమంతా!వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ఈ స్థితికి రావడానికి అరవై ఏళ్ళొస్తాయి!

ప్రారంభంలో చెప్పానే, ఆ త్రిభాషా ప్రవీణులు, వాళ్ళు అప్పటిదాకా చెప్పిందంతా అబధ్ధమనికాదు, పాపం అదో ఊతపదం. ప్రతీదాన్నీ మనకి నొక్కి చెప్పడానికన్నమాట! అందరూ అలాగే ఉంటారనుకుంటే మనం పప్పులో కాలేసేమన్నమాటే,కొంతమందుంటారు, తమకు తెలిసినదో, విన్నదో, ఏ పుస్తకంలోనో చదివిందో వాళ్ళకున్న జ్ఞానాన్నీ అవతలివాడికి ఆపాదిద్దామని ప్రారంభిస్తారు.మొహమ్మాటానికి, ఆయనేమైనా అనుకుంటారేమో అనుకుని, ఓపిగ్గా వింటాము.మరీ ఆయన అతిశయోక్తి చేసి చెప్తూంటే,ఇంక ఉండలేక ఏదో అల్లరి ప్రశ్న వేసామనుకోండి, అంతే ఒప్పెసుకుంటాడు!అలాటివారిని చూసినప్పుడు జాలేస్తూంటుంది ఒక్కొక్కప్పుడు.మనకున్న జ్ఞానం ఎంతండీ? నిజంగా అంత జ్ఞానం ఉన్నవారు,అసలు బయటపడనే పడరు.
సర్వే జనా సుఖినోభవంతూ!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-టైంపాస్

    ఏ సినిమా అయినా హిట్ అవాలంటే, ఆ యూనిట్ లో ఉండే ప్రతీవారికీ ( Spotboys, Drivers,Junior Artists Suppliers etc…)తోసహా.ఇదివరకటి రోజుల్లో, ప్రతీ భాషలోనూ వచ్చే సినిమాల్లో, వీరందరి పేర్లూ
సినిమా టైటిల్స్ చూపించేటప్పుడే స్క్రీన్ మీద కనిపించేవి. ఉదాహరణకి..కళ-గోఖలే, దుస్తులు- పీతాంబరం… అంటూ, ఆఖరికి Distributors వివరాలు కూడా. ఆ రోజుల్లో అయితే తెలిసేది కాదు, వీళ్ళందరిపేర్లూ ఎందుకు వేస్తున్నారో!
క్రమక్రమంగా, ఆ వివరాలు సినిమా మొదట్లో చూపించడం మానేసి, మొక్కుబడిగా, సినిమా అంతా అయి, ప్రేక్షకులు సీట్లలోంచి బయటకు వెళ్ళే హడావిడిలో ఉన్నప్పుడు, అదికూడా యమా స్పీడులో చూపించేస్తూంటారు. పోనీ ఎప్పుడైనా ఆ సినిమా ఏ టీ.వీ. లో వచ్చినప్పుడో చూద్దామన్నా, పైన చెప్పిన టెక్నీషియన్ల పేర్లు, బుల్లి బుల్లి అక్షరాల్లో కనిపిస్తాయి, ఛస్తే చదవడానికి వీలు పడదు. ఈ వేళ ఇదేమిటీ, ఈ టెక్నీషియల్ని గురించి ఇంత బాధ పడిపోతున్నారేమిటీ అని అడక్కండి. నటులూ, దర్శకుల కంటే కూడా వీరిపాత్ర సినిమా విజయంలో పెద్ద పాత్ర వహిస్తుందని నా అభిప్రాయం.

   ఎవార్డులు ఇచ్చేసమయంలోకూడా,టెక్నికల్ ఎవార్డులని ఈమధ్యన మొదలెట్టారు, కానీ ఆ బహుమతి గ్రహీతలు స్టేజ్ మీదకొచ్చినప్పుడు, ఒక్కడంటే ఒక్కడూ పట్టించుకోడు పాపం! మళ్ళీ ఏ హీరోయో, హీరోయినో వచ్చినప్పుడు మాత్రం ఈలలూ, చప్పట్లూ, Standing ovationలూనూ.ఆ టెక్నీషియన్ల ప్రతిభే లేకపోతే, ఈ హీరోలూ, హీరోయిన్లూ ఎక్కడుండేవారుట? మన 50-60 ఏళ్ళ హీరోల్ని, స్టూడెంట్లగానూ, Angry young man ల గానూ చూపించడంలో, ఆ మేకప్పు వాళ్ళు ఎంత శ్రమపడుతున్నారో గుర్తుండదు. అదంతా తమ ప్రతిభే అనుకుని ఆ హీరోలూ, వాళ్ళ అభిమాన సంఘాలూ మంగళ హారతులూ వగైరా చేస్తూంటారు. వాడెవడికో Best actor వచ్చిందీ, తమ అభిమాన నటుడికి రాకపోవడంలో ఏదో రాజకియం ఉందీ అంటూ మీడియాలో గెంతులేస్తూంటారు!

   నిన్న అదేదో చానెల్ లో Wanted అనే హిందీ సినిమా వస్తూంటే, అది మన మహేష్ బాబు నటించిన ‘పోకిరీ’Hindi version అని తెలిసి ఎలా ఉందో అని చూసాను.ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రం గా ఉంది! అక్కడికి నేనేదో మహేష్ బాబు ఫాన్ అని కాదుకానీ, I feel he does not overact.ఇక్కడ Salmankhan అంతా ఆపోజిట్! వీడికి మొత్తం సినిమాలో ఒక్క సీన్లోనైనాపై బట్టలు విప్పందే నిద్ర పట్టదు!చివరలో ఒక సీన్ లో ప్రకాష్ రాజ్, వీడిమీదకి ఒక కాగడా లాటిది విసురుతాడు.That was enough to provoke our hero to take off his shirt ! వాడి సిక్స్ ప్యాక్కో, సెవెన్ ప్యాక్కో చూపించడం!నలభై ఏళ్ళొచ్చినా, ఇంకా యూత్ ఫుల్ గా ఉండడం చూడ్డానికి బాగానే ఉంటుంది. మరీ ప్రతీ సినిమాలోనూ అలా షర్టులు తీసేసికోవడం ఎందుకో? ఈ విషయం లో మన వాళ్ళు చాలా బెటర్! పాపం హిరోయిన్లే బట్టలిప్పుకోడంలో ఉత్సాహం చూపిస్తూంటారు!

   ఈ వేళ సాయంత్రం’మా’ టీ.వీ. లో ఒక మంచి కార్యక్రమం వినే/చూసే అవకాసం వచ్చింది-‘నవ సాహితీ సౌరభం’-అనుకుంటాను. శ్రీ సముద్రాల (సీనియర్) గారిచే రచింపబడిన కొన్ని అద్భుతమైన పాటల గురించి శ్రీ వెన్నెలకంటి ( సినీ గీత రచయిత) అనుకుంటాను చెప్పారు.కార్యక్రమం అద్భుతంగా ఉంది.కానీ ఆయన టీ.వీ. లో బాగా కనిపించడానికి వేసికున్న పెద్ద పెద్ద పువ్వుల స్లాక్ మాత్రం చాలా గాడీ గా ఉంది. సందర్బానుసారంగానైనా కొద్దిగా సొబర్ డ్రెస్ వేసికుంటే ఆయనదేమి పోయిందిట? His dress was definetely an eyesore! ఇలాటి చిన్న చిన్న విషయాల్లో కొద్దిగా శ్రధ్ధ తీసికుంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్

Miles away from Champions’ League _ Sports _ Times Crest

   మన నాయుడుగారు ఈవేళ, కాకినాడలో, ప్రభుత్వ మద్యం పాలిసీ గురింఇ వేస్తున్న రంకెలు ఊస్తూంటే, నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు! ఎన్.టి.ఆర్ పెట్టిన మద్యపాన నిషేదాన్ని, అధికారంలోకి రాగానే ఎత్తేసింది ఎవరుటా? ఇప్పుడు ధర్మపన్నాలు చెప్పడానికి, ఈ రాజకీయనాయకులకి ఎగ్గూ, సిగ్గూ ఉండదనుకుంటాను!

   కర్ణాటక లో, ఇదివరకటి రోజుల్లో హర్యానా లో జరిగినట్లుగా,horse trading ప్రారంభం అయింది.ఏ పార్టీకి ఆ పార్టీ నీతులు చెప్పేవారే!బాగుపడిందల్లా, అటూ ఇటూ కాని స్వతంత్ర శాసన సభ్యులు, వాళ్ళ పని హాయిగా ఉంది, గాలి సోదరులు ఇచ్చే ముడుపులు తినేసి, వచ్చే రెండు మూడు తరాలకీ సరిపోయే డబ్బు సంపాదిస్తారు!అక్కడ బిహారు లో బి.జె.పీ అద్యక్షుడు, తన కొడుక్క్కి సీటివ్వలెదని అలిగి, రాజీనామా చేశాడు.అదంతా సెటిల్ అయిపోయిందని ఇప్పుడే తెలిసింది-అంటే వాడికొడుక్కి సీటిచ్చారన్నమాట!

   కానన్వెల్తు క్రీడల్లో మనవాళ్ళు జొరుగా హుషారుగా వెళ్తున్నారు, ఒక్క సానియమ్మ తప్ప!తన ట్రెడిషను తప్పకుండా, మళ్ళీ ఓడిపోయింది! మొన్నెపుడో ఒక టపా వ్రాశాను, మన దేశంలోని క్రీడా అసోసిఏషన్స్ గురించీ, క్రీడలగురించినూ, ఈ వేళ్టి Times Crest లో అదే విషయం మీద శ్రీ బోరియా మజుందార్ వ్రాసిన ఒక వ్యాసం వచ్చింది. ఒకసారి పైన ఇచ్చిన(నీలంరంగు) దానిమీద నొక్కి చదవండి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- కామన్వెల్త్ క్రీడలు

www-expressindia-com (1)

    ప్రస్తుతం ఢిల్లీ లో జరుగుతున్న కామన్వెల్తు క్రీడల్లో,inspite of all odds, మన క్రీడాకార్లు అందులోనూ షూటర్స్ చాలా మంచి ప్రదర్శనలు ఇచ్చి, మన దేశానికి స్వర్ణ పతకాలు తెస్తున్నారు. ఇందులో మన ప్రభుత్వం క్రెడిట్ ఎక్కడా ఉన్నట్లులేదు! ఒలింపిక్స్ లో అభినవ్ బింద్రా, స్వర్ణం తెచ్చినప్పుడు, మనప్రభుత్వం చంకలెగరేశారు.నిజంగా అభినవ్ తండ్రి ఇచ్చిన సదుపాయలతోనే నెగ్గాడు. మన దేశంలోని వివిధ క్రీడా సంస్థలు ఎంతంత చేస్తున్నాయో ప్రతీ రోజూ చూస్తూనే ఉన్నాము.

    ఒక్కటంటే ఒక్క అసోసిఏషన్ చూపించండి, అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని! ప్రతీ దానికీ ఓ రాజకీయనాయకుడిని ఏ ఛైర్మన్/ ప్రెసిడెంటు గానో చేయడం, వాడేమో యుగాల తరబడి, చేతికొచ్చినంతా మెక్కేయడం. అదేదో తమ స్వంత ఇలాకాలా భావిస్తారు. ఏళ్ళ తరబడి క్రీడాకార్లకివ్వలిసిన డబ్బులివ్వరు, చివరకు మేము దేశం తరపున ఆడం అని బెదిరించేదాకా వస్తుంది పరిస్థితి!అప్పుడు హడావిడిగా ఎవరికీయవలసినది వాళ్ళకి ఇచ్చేసి, చేతులు దులిపేసికుంటారు. క్రికెట్ తప్ప మిగిలిన అన్ని క్రీడల సంగతీ ఇంతే. పోనీ ఏదో అన్ని సరీగ్గా జరుగుతున్నాయన్నంతసేపు పట్టదు, ఏ కోచ్చో ఎవరో క్రీడాకారిణిని మోలెస్ట్ చేశాడనో, లేక ఇంకెదో చేశాడనో న్యూస్సూ! ఇన్ని అవాంతరాలున్నప్పుడు, మనవాళ్ళు పతకాలు తేవడంలేదో అని మెడ మీద తలకాయ ఉన్న ప్రతీవాడూ ఏడవడం ఎందుకో?

   మన అసోసిఏషన్లవాళ్ళు ఏదో తమ జేబుల్లోంచి డబ్బు ఇచ్చేస్తున్నామనేలా ప్రవర్తిస్తూంటారు! ఏమిటో లాలూలూ, పవార్లూ, ఇంకా ఇలాటివాళ్ళే అసలు క్రీడా సంస్థలకి అద్యక్షుళ్ళేమిటీ? వాళ్ళ వాళ్ళ పన్లు సరీగ్గా చేయరూ, పైగా క్రీడల్ని తగలేయడం ఎందుకో? క్రికెట్ లో ఇంకో గోలా! వాళ్ళకి డబ్బులెన్నున్నాయో వాళ్ళకే తెలియదు!అసలు మన జనాల్ని అనాలి, ప్రతీ మాచ్ కీ ఊపుకుంటూ వెళ్ళిపోతారు,అంత ఎండలోనూ ఓపిగ్గా కూర్చుంటారు, మనదేశం నెగ్గిందా సరే, లేకపోతే వాడెవడో అలా ఆడవల్సింది కాదూ, ఇలా ఆడుంటే నెగ్గేవాళ్ళం అంటూ, కిళ్ళీకొట్టువాడిదగ్గరనుండి, పార్లమెంటు మెంబర్లదాకా ప్రతీవాడూ చెప్పేవాడే! ఎప్పుడో ఎక్కడో తెలుస్తుంది, ఆ మాచ్చిలు ముందరే ఫిక్స్ అయ్యాయని! ఈమాత్రందానికి,అంతంతసేపు ఎండల్లో ఉండడం దేనికో? వీటికి సాయం ODI లూ,T-20 లూ, లేకపోతే IPL లూ! ప్రతీ దాంట్లోనూ ఏదో ఒక లఫ్డాయే! ఏదైనా మాచ్ లో ఓడిపోయినప్పుడు, మన క్యాప్టెన్ గారు ‘మాకు ఏడాదంతా ఆడడంతో అలిసిపోయామూ’ అనేది ఒక standard excuse. ఎవరికోసం ఆడుతున్నాడంటా, వాడికొచ్చే డబ్బులకోసమేకదా! పైగా వీళ్ళిచ్చే యాడ్లోటీ.Less said the better!

    ఈ గోలంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, కామన్వెల్తు క్రీడల్లో, నిన్నో, మొన్నో పూణె అమ్మాయి- Anisaa Sayyed- కి షూటింగులో స్వర్ణం వచ్చింది.అంతే మన రైల్వే శాఖవారు, ‘ వాహ్ వాహ్ మన రైల్వేల్లో క్రీడలకి ఎంతంతా ఎంకరేజ్మెంటిచ్చేస్తున్నామో అంటూ డప్పాలకి పోయారు. పైన ఇచ్చిన దానిమీద క్లిక్ చేయండి, అసలు సంగతేమిటో, రైల్వేవారు ఈ అమ్మాయికి ఎంత సహాయం చేశారో తెలుస్తుంది. పాపం మమతమ్మ మాత్రం ఏం చేస్తుంది లెండి, ఆవిడకి బెంగాల్లో రాజకీయాలతోటే టైముండడం లేదూ, ఇలాటివన్నీ పట్టించుకోడానికి టైమెక్కడిదీ? కావలిసిస్తే ఓ ఎన్క్వైరీ కమిషను వేస్తుంది తరువాత!
मॅरा भारत महान !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-కొత్త పరిచయం

    ఆ మధ్యన ఒక టపా చదివాను, మా పూణె నగరాన్ని గురించి, ఛడా మడా తిడుతూ.ఎంత చెప్పినా ఇక్కడ చాలాకాలం నుండి ఉంటూ, ఎవరైనా ఈ నగరాన్ని గురించి అలా వ్రాస్తే ఏమిటో బాగుండదు.సరే చూద్దాము, ఈ పెద్దమనిషి ఇంకా ఏమేమి వ్రాస్తాడో, అన్నీ వ్రాసినతరువాత ఒకసారి బ్రైన్ వాష్ చేయొచ్చులే అని ఊరుకున్నాను. ఆ తరువాత కొన్ని టపాల్లో, తను ఈ ఊళ్ళో చూసిన కొన్ని ప్రదేశాలగురించి వ్రాస్తూ, తనుండే హైదరాబాదు నగరంతో పోలుస్తూ, ఏదో నాలుగు మంచిముక్కలు వ్రాశాడు! పరవాలెదూ కుర్రాడు సరైన దారిలో పడుతున్నాడూ అనుకుని సంతోషించాను!

    ఆ తరువాత ఒక మెయిల్ పంపుతూ, నన్ను కలుసుకోవాలనుందన్నాడు , సరే ఇదీ బాగుందీ అనుకుని నా సెల్ నెంబరిచ్చాను.ఓ ఆదివారం ప్రొద్దుటే ఫోను చేస్తానన్నాడుకదా అని రోజంతా చూశాను.అబ్బే అలాటి పనెందుకు చేస్తాడూ? ఆదివారం వస్తే ఎక్కడెక్కడో తిరగాలనుంటుందికానీ, నాలాటివారితో టైము వేస్టు చేయాలనెవరికుంటుందీ? ఆ తరువాతి శనివారం నేను ‘పూణె ఆంధ్రసంఘం లో శ్రీ షణ్ముఖశర్మ గారి ప్రవచనం గురించి వ్రాసినప్పుడు, పెద్ద గొప్పగా ‘నాక్కూడా చెప్తే నేనుకూడా వద్దునుకదాండీ’ అని ఓ వ్యాఖ్య పెట్టాడు.దానికి నేను కూడా ఘాటుగా ఓ సమాధానం పెట్టాను-‘ ఫొను నెంబరిచ్చినా కాల్ చేయడానికిగానీ, పోనీ ఫోను నెంబరైనా ఇవ్వడానికి గానీ వీలుపడని వారిని ఎలా సంప్రదించగలననుకున్నారూ’ అని! అంతే రాత్రి పదైందనైనా ఆలోచించకుండా రాత్రికి రాత్రే ఫోను చేసేశాడు! అలా చేస్తాడనేకదా నేను వ్యాఖ్యకి సమాధానం వ్రాసింది!
మేముండే ఏరియా వివరాలు తెలిసికుని, మర్నాడు సాయంత్రం వచ్చాడు. తీరా చూస్తే తను వ్రాసే informative posts కీ అతనికీ అసలు పోలికే లేదు!అంటే నా ఉద్దేశ్యం, నిండా పాతికేళ్ళైనా లేవు, ఈ ఆధ్యాత్మిక విషయాల్లోకి ఎలా వచ్చావయ్యా బాబూ అంటే, అప్పుడు చెప్పాడు-తను అన్నీ తన తల్లిగారి పెంపకం వల్లే నేర్చుకున్నానని.చాలా ముచ్చటేసింది, ఈ రోజుల్లో
‘ ఓ యూ ఆర్ టెల్గూ’ అనే వారితో పోలిస్తే,ఈ అబ్బాయి కి ఉన్న, భాష మీద పట్టూ ఆశ్చర్యం వేసింది. నాకైతే అంత శుధ్ధమైన తెలుగు రాదు బాబూ!పైగా నన్నేమైనా ప్రశ్నలు వేస్తాడేమో అని భయపడ్డాను!అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, నేనే ఏదేదో వాగేసి, అతనెదురుగానే మా ఇంటావిడతొ చివాట్లు తినేసి ( ఇది నాకు అలవాటైపోయిందిలెండి, ఎవరైనా వస్తే మొత్తం అంతా నేనే మాట్లాడేస్తూంటానని!). ఓ గంటన్నర అవీ ఇవీ కబుర్లు చెప్పెసి, బయలుదేరాడు.పోన్లే అతన్ని బస్సుదాకా దిగబెట్టి వద్దామూ అనుకుని నేనుకూడా వెళ్ళాను. దార్లో కొట్టిందీ వర్షం( మర్నాడు పేపర్లో చదివాము పూణె లో గత వంద సంవత్సరాల్లోనూ రికార్డు వర్షంట!) అడక్కండి. పైగా అంటాడూ, ‘నాకైతే ఇలా వర్షంలో తడవడం చాలా ఇష్టం’ అని. ఇక్కడ నాకు కళ్ళజోడు మీద నీళ్ళు పడి, ఏమీ కనిపించి చావదూ, పోనీ అని తీసేస్తే, ఏ గోతిలో పడతానో అని భయం!

   మొత్తానికి ఎలాగోలాగ అతను బస్సు ఎక్కేశాక, కొంపకి బయలుదేరాను, కళ్ళజోడు మీద continuous గా నీళ్ళుపడుతూండడంతో, అసలు కళ్ళజోడు లేదేమో అనుకుని, ఎక్కడో జారిపోయిందేమో అని ఆ వర్షంలోనే మళ్ళీ బస్ స్టాప్ దాకా వెతుక్కుంటూ వెళ్ళాను! क्या डूंढ् रहॅ है అని అడిగిన వాళ్ళకి, मॅरा चश्मा అని జవాబిచ్చేసరికి, వాళ్ళకి నవ్వొచ్చి, वॉ तॉ तुम्छा ढोलॅ वर है बाबा అనేటప్పటికి, నాకెంతనవ్వొచ్చిందో, ఆమధ్యన సరీగ్గా అలాటిదే ఓ యాడ్ చూశాను!
ఇంత వర్షంలోనూ అతను ఇంటికి వెళ్ళి ఓ టపా కూడా పెట్టాడు. ఏదో కొత్త కుర్రాడుకదా, అమ్మా నాన్నలకి దూరంగా ఉన్నాడూ,ఎమొషనల్ అయిపోయి ఏమేమిటో వ్రాశాడు. మరీ నమ్మేయకండి! మరీ అతనిలా ఏమీ సస్పెన్సులో పెట్టడంలేదు–‘ సత్యాన్వేషణ’ శీర్షికతో మంచి టపాలు వ్రాస్తున్న రహ్మానుద్దిన్ షేక్.
We totally enjoyed his company.

%d bloggers like this: