బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-పూణె ఆంధ్ర సంఘం

    ఈవేళ శనివారం (02/10/2010) ప్రొద్దుట మా పూణె లోని ఆంధ్ర సంఘం వారు ఒక అద్భుతమైన కార్యక్రమము, ఓ అద్భుతమైన అనుభూతీ ఇచ్చారు.మా స్నేహితుడు శ్రీ నాగప్రసాద్ గారు క్రిందటి వారంలో చెప్పారు-అక్టోబరు 2 న శ్రీ సామవేదం షణ్ముఖశర్మగారిచే శ్రీలలితాసహస్రనామం మీద ఓ కార్యక్రమం ఉంటుందని,తప్పకుండా రావాలనీను.రాజమండ్రీ వెళ్ళినప్పటినుండీ, నాకు
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలమీద కొద్దికొద్దిగా ఆసక్తి కలిగింది. ఆ తరువాత శ్రీ గరికపాటి వారి ప్రసంగం ప్రత్యక్షంగా వినడంతో పుర్తిగా Bowled over అయిపోయాను. ఆ తరువాత శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు అన్ని డౌన్లోడ్ చేసుకున్నాను.

   మరీ వాటిలోని గొప్పతనం అర్ధంఅవదు కానీ వింటున్నంతసేపూ, మరో లోకంలోకి వెళ్ళిపోతాను.వారు చెప్పేవిధానంలో ఉందేమో?ప్రతీరోజూ ఓ గంటసేపు వీటికే కేటాయిస్తున్నాను.మా ఇంటావిడకైతే అడగఖ్ఖర్లేదు. అమ్మవారి గురించి కార్యక్రమం ఏదైనా ఉందీ అంటే, అన్ని పనులూ మానుకుని, ఎంతదూరమైనా వెళ్తుంది.బహుశా తన పూజల్లోని పుణ్యమేమోనేమో, నన్ను, మాకుటుంబాన్నీ కాపాడుతోంది.

    ప్రొద్దుటే 10.00 గంటలకి వెళ్ళాము.ముందుగా ఉప్మా, కాఫీ తో ఆహ్వానించారు. ఆ తరువాత శ్రీ శర్మగారి ప్రవచనం ప్రారంభం అయింది. అద్భుతం!రెండున్నరగంటలపాటు ఎంతో బాగా చెప్పారు.మేము చేసికున్న అదృష్టం వలన అంత మంచి ప్రవచనం వినే భాగ్యం కలిగింది.

    ఆ తరువాత అందరికి ప్రసాదం రూపంలో పులిహోర, చక్రపొంగలీ, దధ్ధోజనం, ఓ కాజా ( కావలిసినంత), వచ్చినవారందరికీ ( ఓ నూట యాభై మందిదాకా ఉంటారు) పెట్టారు. అవికూడా ఎంత రుచిగా ఉన్నాయంటే, మనం పూణే లోనే ఉన్నామా, లేక ఆంధ్రప్రదేస్ లోని ఏ దేవాలయంలోని ప్రసాదాలా అన్నంత అద్భుతంగా!

    అప్పుడెప్పుడో ఉగాది సంబరాల్లో పెట్టిన ‘తెలుగు భోజనం’ గురించి వ్రాశాను. అందులో పేరులోతప్ప రుచిలో తెలుగుతనం కనిపించలేదు. కానీ ఈవేళ దానికి పూర్తిగా విరుధ్ధం. ప్రసాదాలకుండే రుచి పూర్తిగా అస్వాదించకలిగాము.
ఇటువంటి కార్యక్రమాలు మన ప్రాంతాల్లో తరచూ జరుగుతూంటాయి. కానీ రాష్ట్రేతర ప్రదేశాల్లో ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసినందుకు పూణె ఆంధ్రసంఘం వారికి అబినందనలు

%d bloggers like this: