బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-కొత్త పరిచయం

    ఆ మధ్యన ఒక టపా చదివాను, మా పూణె నగరాన్ని గురించి, ఛడా మడా తిడుతూ.ఎంత చెప్పినా ఇక్కడ చాలాకాలం నుండి ఉంటూ, ఎవరైనా ఈ నగరాన్ని గురించి అలా వ్రాస్తే ఏమిటో బాగుండదు.సరే చూద్దాము, ఈ పెద్దమనిషి ఇంకా ఏమేమి వ్రాస్తాడో, అన్నీ వ్రాసినతరువాత ఒకసారి బ్రైన్ వాష్ చేయొచ్చులే అని ఊరుకున్నాను. ఆ తరువాత కొన్ని టపాల్లో, తను ఈ ఊళ్ళో చూసిన కొన్ని ప్రదేశాలగురించి వ్రాస్తూ, తనుండే హైదరాబాదు నగరంతో పోలుస్తూ, ఏదో నాలుగు మంచిముక్కలు వ్రాశాడు! పరవాలెదూ కుర్రాడు సరైన దారిలో పడుతున్నాడూ అనుకుని సంతోషించాను!

    ఆ తరువాత ఒక మెయిల్ పంపుతూ, నన్ను కలుసుకోవాలనుందన్నాడు , సరే ఇదీ బాగుందీ అనుకుని నా సెల్ నెంబరిచ్చాను.ఓ ఆదివారం ప్రొద్దుటే ఫోను చేస్తానన్నాడుకదా అని రోజంతా చూశాను.అబ్బే అలాటి పనెందుకు చేస్తాడూ? ఆదివారం వస్తే ఎక్కడెక్కడో తిరగాలనుంటుందికానీ, నాలాటివారితో టైము వేస్టు చేయాలనెవరికుంటుందీ? ఆ తరువాతి శనివారం నేను ‘పూణె ఆంధ్రసంఘం లో శ్రీ షణ్ముఖశర్మ గారి ప్రవచనం గురించి వ్రాసినప్పుడు, పెద్ద గొప్పగా ‘నాక్కూడా చెప్తే నేనుకూడా వద్దునుకదాండీ’ అని ఓ వ్యాఖ్య పెట్టాడు.దానికి నేను కూడా ఘాటుగా ఓ సమాధానం పెట్టాను-‘ ఫొను నెంబరిచ్చినా కాల్ చేయడానికిగానీ, పోనీ ఫోను నెంబరైనా ఇవ్వడానికి గానీ వీలుపడని వారిని ఎలా సంప్రదించగలననుకున్నారూ’ అని! అంతే రాత్రి పదైందనైనా ఆలోచించకుండా రాత్రికి రాత్రే ఫోను చేసేశాడు! అలా చేస్తాడనేకదా నేను వ్యాఖ్యకి సమాధానం వ్రాసింది!
మేముండే ఏరియా వివరాలు తెలిసికుని, మర్నాడు సాయంత్రం వచ్చాడు. తీరా చూస్తే తను వ్రాసే informative posts కీ అతనికీ అసలు పోలికే లేదు!అంటే నా ఉద్దేశ్యం, నిండా పాతికేళ్ళైనా లేవు, ఈ ఆధ్యాత్మిక విషయాల్లోకి ఎలా వచ్చావయ్యా బాబూ అంటే, అప్పుడు చెప్పాడు-తను అన్నీ తన తల్లిగారి పెంపకం వల్లే నేర్చుకున్నానని.చాలా ముచ్చటేసింది, ఈ రోజుల్లో
‘ ఓ యూ ఆర్ టెల్గూ’ అనే వారితో పోలిస్తే,ఈ అబ్బాయి కి ఉన్న, భాష మీద పట్టూ ఆశ్చర్యం వేసింది. నాకైతే అంత శుధ్ధమైన తెలుగు రాదు బాబూ!పైగా నన్నేమైనా ప్రశ్నలు వేస్తాడేమో అని భయపడ్డాను!అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, నేనే ఏదేదో వాగేసి, అతనెదురుగానే మా ఇంటావిడతొ చివాట్లు తినేసి ( ఇది నాకు అలవాటైపోయిందిలెండి, ఎవరైనా వస్తే మొత్తం అంతా నేనే మాట్లాడేస్తూంటానని!). ఓ గంటన్నర అవీ ఇవీ కబుర్లు చెప్పెసి, బయలుదేరాడు.పోన్లే అతన్ని బస్సుదాకా దిగబెట్టి వద్దామూ అనుకుని నేనుకూడా వెళ్ళాను. దార్లో కొట్టిందీ వర్షం( మర్నాడు పేపర్లో చదివాము పూణె లో గత వంద సంవత్సరాల్లోనూ రికార్డు వర్షంట!) అడక్కండి. పైగా అంటాడూ, ‘నాకైతే ఇలా వర్షంలో తడవడం చాలా ఇష్టం’ అని. ఇక్కడ నాకు కళ్ళజోడు మీద నీళ్ళు పడి, ఏమీ కనిపించి చావదూ, పోనీ అని తీసేస్తే, ఏ గోతిలో పడతానో అని భయం!

   మొత్తానికి ఎలాగోలాగ అతను బస్సు ఎక్కేశాక, కొంపకి బయలుదేరాను, కళ్ళజోడు మీద continuous గా నీళ్ళుపడుతూండడంతో, అసలు కళ్ళజోడు లేదేమో అనుకుని, ఎక్కడో జారిపోయిందేమో అని ఆ వర్షంలోనే మళ్ళీ బస్ స్టాప్ దాకా వెతుక్కుంటూ వెళ్ళాను! क्या डूंढ् रहॅ है అని అడిగిన వాళ్ళకి, मॅरा चश्मा అని జవాబిచ్చేసరికి, వాళ్ళకి నవ్వొచ్చి, वॉ तॉ तुम्छा ढोलॅ वर है बाबा అనేటప్పటికి, నాకెంతనవ్వొచ్చిందో, ఆమధ్యన సరీగ్గా అలాటిదే ఓ యాడ్ చూశాను!
ఇంత వర్షంలోనూ అతను ఇంటికి వెళ్ళి ఓ టపా కూడా పెట్టాడు. ఏదో కొత్త కుర్రాడుకదా, అమ్మా నాన్నలకి దూరంగా ఉన్నాడూ,ఎమొషనల్ అయిపోయి ఏమేమిటో వ్రాశాడు. మరీ నమ్మేయకండి! మరీ అతనిలా ఏమీ సస్పెన్సులో పెట్టడంలేదు–‘ సత్యాన్వేషణ’ శీర్షికతో మంచి టపాలు వ్రాస్తున్న రహ్మానుద్దిన్ షేక్.
We totally enjoyed his company.

%d bloggers like this: