బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   మనం చూస్తూంటాం/ వింటూంటాం కొంతమందికి ఒక అలవాటుంటుంది.అడిగినా అడక్కపోయినా, ‘Frankly speaking’,’To tell you the truth” सच बोल्ना है तॉ’,’నిజం చెప్పాలంటేనండీ’ అంటూ రైల్వే స్టేషన్లో
ప్రకటనల్లాగ, తనకొచ్చిన మూడు భాషల్లోనూ ఎనౌన్స్ చేసేస్తాడు! అంటే అప్పటిదాకా మనతో చెప్పినవన్నీ అబధ్ధాలనే కదా అర్ధం! మనమేమో వెర్రివెధవల్లాగ, వాడు చెప్పిందే వేదం అనుకుని విటూంటాం! ఆ ఏడుపేదో ముందరే ఏడిస్తే,గొడవే ఉండేదికాదు కదా! మన దారేదో మనమే చూసుకుందుం.అబ్బే అంతదృష్టం కూడానా? మన ఖర్మకాలి, ఏదో ఊళ్ళో అందరూ అనుకుంటూన్నారుకదా అని ఏదో విషయంలో సలహాకి వెళ్తే వచ్చే గొడవ ఇది. కొంతమందుంటారు, సొసైటీ లో
ఓ పెద్ద ఇమేజ్ బిల్డ్ చేసేసికుని, ప్రపంచంలో తమకి తెలియని విషయమేదీ లేనట్లు!

ఇదివరకటి రోజుల్లో చూసేవారం, ఓ పెద్దాయన హాయిగా భోజనం చేసేసి, అరుగుమీద ఓ పడక్కుర్చీ వేసికుని, వీధిలో వెళ్ళే ప్రతీవారినీ పలకరించడం. అప్పుడంటే పరిస్థితులు వేరు.అలా అడిగినాయనమీద ఆ ఊళ్ళో ఉండేవారికి ఉన్న నమ్మకమూ, గౌరవమూనూ.నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు, అవతలివారికి ఉపయోగించే సలహాలే ఇచ్చేవారు.అలాగని మనం ఆయనిచ్చిన సలహా పాటించకపోయినా కొపం తెచ్చుకునేవారు కాదు. చెప్పడం వరకే వారి పని.వినడం వినకపోవడం
మన ఇష్టం.అందుకే అనేవారు ‘నిండుకుండ ఎప్పుడూ తొణకదు’ అని.

ఈ రోజుల్లో ఆ కుండలూ లేవూ, ఆ నీళ్ళూ లేవు!అవతలివాడు చెప్తే మనం ఎందుకు వినాలీ అనే కానీ, పోనీ వింటే ఏంపోయిందీ అనుకోరు.కాలమాన పరిస్థితులు అలా మారిపోయాయి మరి.ఆ రొజుల్లో ఓ మాస్టారుంటారనుకోండి, స్కూల్లో చదువుకునే కుర్రాడి తండ్రి, ఎప్పుడైనా కనిపిస్తే, ఆ కుర్రాడి బాగోగులు ఆ తండ్రితో చర్చించేవారు.ఆ చర్చ ఎంతదాకా వచ్చేదంటే, ‘మీవాడికి పాఠాల్లో ఏమైనా సందేహాలుంటే, ప్రతీ రోజూ ఓ గంట నా దగ్గరకు పంపించండి, కుర్రాడు తెలివైనవాడు, కొంచం అందిస్తే వృధ్ధిలోకి వస్తాడు’. అలా అడగడంలో ఈ మేస్టారి స్వార్ధం ఏమీ ఉండేది కాదు. కుర్రాడి అభివృధ్ధే ఈయన ఆశయం.అలాగని సాయంత్రాలు మాస్టారి ఇంటికి వెళ్ళినందుకు ఆయనకేమీ ట్యూషను పీజిచ్చుకోనఖ్ఖర్లేదు. ఊరికే, మిగిలిన పిల్లల్తో కలిసి చదువుకుంటే, ఇంకొచం బాగా చదువుతాడని.అలా మా రోజుల్లో నాకు తెలిసిన గురువులు ఎంతో మందుండేవారు. ఎక్కడో ఎందుకూ, మా ఇంట్లోనే మా నాన్నగారిదగ్గరకూ, ఆ తరువాత మా పెద్దన్నయ్యగారి దగ్గరకూ
వచ్చి, చదువుకునే వారిని ఎంతోమందిని చూస్తూండేవాడిని.
అలాటి వాతావరణంలోనే పెరిగి పెద్దయినా, నాకు మాత్రం చదువు అబ్బలేదు. దానికి మావాళ్ళు మాత్రం ఏంచేస్తారు?’పెరటి మొక్క వైద్యానికి పనికిరాదనే సామెత నాలాటివారిని చూసే వచ్చుంటుంది!
ఏదో మొదలెట్టి, ఏదో నాస్టాల్జియా లోకి వెళ్ళిపోయాను. ఎంతైనా గతం నాస్థి అంటారుకానీ, ఆ గతంలొకి వెళ్తే ఎన్నెన్ని మధుర జ్ఞాపకాలు గుర్తొస్తాయో! అరే మళ్ళీ అలాటి రోజులు వస్తే ఎంత బాగుండునూ, ఈసారి మాత్రం ఒక్క క్షణం వృధాపోకుండా అన్నీ ఆస్వాదించేయాలి అనుకుంటాము.అవి రానూ రావూ, మనం అనుభవించే అవకాశమూ రాదూ! కానీ అలా ఆలోచించడంలోనే ఉంది ఆనందమంతా!వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ఈ స్థితికి రావడానికి అరవై ఏళ్ళొస్తాయి!

ప్రారంభంలో చెప్పానే, ఆ త్రిభాషా ప్రవీణులు, వాళ్ళు అప్పటిదాకా చెప్పిందంతా అబధ్ధమనికాదు, పాపం అదో ఊతపదం. ప్రతీదాన్నీ మనకి నొక్కి చెప్పడానికన్నమాట! అందరూ అలాగే ఉంటారనుకుంటే మనం పప్పులో కాలేసేమన్నమాటే,కొంతమందుంటారు, తమకు తెలిసినదో, విన్నదో, ఏ పుస్తకంలోనో చదివిందో వాళ్ళకున్న జ్ఞానాన్నీ అవతలివాడికి ఆపాదిద్దామని ప్రారంభిస్తారు.మొహమ్మాటానికి, ఆయనేమైనా అనుకుంటారేమో అనుకుని, ఓపిగ్గా వింటాము.మరీ ఆయన అతిశయోక్తి చేసి చెప్తూంటే,ఇంక ఉండలేక ఏదో అల్లరి ప్రశ్న వేసామనుకోండి, అంతే ఒప్పెసుకుంటాడు!అలాటివారిని చూసినప్పుడు జాలేస్తూంటుంది ఒక్కొక్కప్పుడు.మనకున్న జ్ఞానం ఎంతండీ? నిజంగా అంత జ్ఞానం ఉన్నవారు,అసలు బయటపడనే పడరు.
సర్వే జనా సుఖినోభవంతూ!!

%d bloggers like this: