బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- టి.వీ. జ్ఞాపకాలు-1

    మాకు పూణె లో 1973-74 లలో అనుకుంటా, బ్లాక్ ఎండ్ వైట్ టి.వి లు వచ్చాయి. మేము అప్పటికి ఫాక్టరీ క్వార్టర్లకి వెళ్ళలేదు. కలస్ అని ఒక చోట ఉండేవాళ్ళం. శనాదివారాలు, ఓ కొట్టువాడు, రోడ్డుమీదవెళ్ళే ప్రతీవారూ చూసేటట్లుగా, ఓ బ్లాక్ ఎండ్ వైట్ టి.వి లో కార్యక్రమాలు చూపించేవాడు.అప్పుడప్పుడు, బయట వాక్ కి ( అప్పుడే కొత్తగా పెళ్ళి అయింది, భార్యతో బయట షికారుకెళ్ళడంలో మజాయే వేరుగా ఉండేది!),వెళ్ళినప్పుడు ఏవో, హిందీ సినిమా పాటలూ, సినిమాలూ చూసేవాళ్ళం. ఎప్పటికైనా సరే, ఇంట్లోకి ఓ టి.వి. కొనేశాయాలని అప్పుడే అనుకున్నాను.మనం అనుకుంటే సరిపోతుందా, జేబులో డబ్బులుండొద్దూ? ఇప్పటిలాగ, ఆరోజుల్లో ఏమైనా క్రెడిట్ కార్డులా, బ్యాంకు లోన్లా?
అప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలాగ, దుకాణాల్లో ఎక్కడైనా వాయిదాలమీద ఎవడైనా ఇస్తాడేమో అని ప్రయత్నించాము. అబ్బే మన మొహం,జీతం ( రూ.1000/- మాత్రమే) చూసి ఎవడిస్తాడండీ? కట్లూ వగైరాలు పోయి చేతికి వచ్చేది ఎంతా? ఓ ఆరువందలు!

    అప్పుదు తెలిసింది,మా ఫాక్టరీ క్రెడిట్ సొసైటీ లో అప్పిస్తారనిన్నూ, దాన్ని జీతంలోంచి తీసుకుంటారనిన్నూ.నాకు అప్పిచ్చేవాడు దొరకాలేకానీ, తీర్చడం ఫరవాలేదు.చేతిలోకి ఎంతొస్తే దాంట్లోనే బ్రతుకుతాం.అప్పటికే ఓ పాపకి తల్లితండ్రులమైనా, అదో ధైర్యం! ఇంట్లోకి ఓ వస్తువొస్తుందని ఉత్సాహం! మొత్తానికి రూ.3000 ఇచ్చారు. ఆ డబ్బు పుచ్చుకుని, నేను పెళ్ళికి పూర్వం రికార్డులూ అవీ తీసికెళ్ళే కొట్టుకి వెళ్ళి, ఓ క్రౌన్ టి.వి. కి ఆర్డరు ఇచ్చేశాను.ఖరీదు- రూ.3050/-
ఫాక్టరీకి వెళ్ళి డబ్బావాలా చేత ఓ చీటీ పంపేశాను, సాయంత్రానికల్లా మనింటికి టి.వీ. వచ్చేస్తోందోచ్ అని! సాయంత్రం, క్రౌన్ కంపెనీ ఇంజనీర్ వచ్చి,మా ఇంట్లో టి.వి. ఇన్స్టాల్ చేశాడు. అక్కడికేదో సాధించేసిన ఫీలింగు. మర్నాటినుండి, ఎప్పుడు బయటకి వెళ్ళినా అందరూ మనవైపే చూస్తున్నారనే ఫీలింగోటి, ఎందుకంటె, మా కాలనీ లో అప్పటికి ఎవరిదగ్గరా టి.వి. ఉండేది కాదు!

   ఆ రొజుల్లో బొంబే నుండే కార్యక్రమాలు వచ్చేవి. భాష అర్ధం అయినా అవకపోయినా, రాత్రి 10.30 దాకా అన్ని కార్యక్రమాలూ చూడడం. Whats Good Word అని ఓ కార్యక్రమం, సబీరా మర్చెంట్ నిర్వహించేవారు. అద్భుతం! టి.వీ. వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో తెలిసింది. సిధ్ధార్థ్ బాసు క్విజ్ కార్యక్రమం చాలా బాగుండేది. గురువారాలు ఛాయా గీత్ టైముకల్లా, చుట్టుప్రక్కలుండేవాళ్ళందరూ వచ్చేసేవారు. అందరూ స్నేహితులే, ఎవర్ని వద్దంటాం? ఒకటిమాత్రం ఒప్పుకోవాలి,ఎప్పుడూ దగ్గరలో ఉన్న స్నేహితుల్ని మాత్రం ఎప్పుడూ పిలిచేవారం కాదు.రమ్మన్నా, వద్దన్నా వచ్చేవారు రాకమానరు. దూరంగా ఉండే స్నేహితుల్ని మాత్రం ఆదివారాలు సినిమా, కం భోజనానికి పిల్చేవాళ్ళం.

    ఆ సందర్భంలోనే,టి.వీ. వచ్చిన మొదటాదివారం, ఆగస్టు 15,1975 టి వి లో ‘వక్త్’ ( Waqt) సినిమా వేస్తున్నాడని, మా ఫ్రెండుని ఫామిలీతో రమ్మన్నాము. టి.వీ. మీద దుమ్మూ, ధూళీ పడకూడదని, మా ఇంటావిడ, దానిమీద ఓ క్లాత్ వేసేది.మాకేం తెలుసూ, ఆ టి.వి. వాల్వ్ సెట్ అనిన్నూ, దాంట్లొకి వెంటిలేషన్ కోసం, చిల్లులు పెట్టాడనీనూ. కొంతసేపు సినిమా అయిన తరువాత, పొగలూ,శగలూ రావడం మొదలెట్టాయి, ఠప్ మని చప్పుడుతో అదికాస్తా బొమ్మ ఆగిపోయింది! అది ఆగిపోవడం కంటే, ఇంటికొచ్చినవాళ్ళూ, మా ఫుకట్ ప్రేక్షకులూ నవ్వుకుంటారేమో అని భయం. అందరితోనూ, ఫణిబాబు కొన్న టి.వీ. మంచి క్వాలిటీది కాదూ అని యాగీ చేస్తారేమో అనో భయం.ఏమిటో ఎప్పుడూ ఊళ్ళోవాళ్ళేమనుకుంటారో అనే భయం.ఆ మధ్యవర్గపు ఫీలింగులు ఇప్పుడు లేవనుకోండి.

    క్రౌన్ టి.వీ వాడికి ఫోను చేసిన అరగంటలో వారి ఇంజనీర్ వచ్చి, మా ఇంటావిడ లోపల్నించి కాఫీ తెచ్చేలోపల రిపేర్ పూర్తిచేసేశాడు. లోఖండే అని ఒకతను వచ్చేవాడు. ఈ మధ్యన తనిష్క్ యాడ్ లో ఆమీర్ ఖాన్ ని చూస్తూంటే, అతనే గుర్తుకొస్తాడు. తేడా ఏమిటంటే ఇక్కడ ఆమిర్ ఖాన్ కాఫీ త్రాగుతాడు, అక్కడ మా లోఖండే త్రాగేవాడుకాదు. ఇతనిలాగ అతను ఎం.డి. కాడు, Partner మాత్రమే! ఆ క్రౌన్ టి.వీ తో మా కుటుంబ అనుబంధం ఏడు సంవత్సరాల ఎనిమిది నెలలు! ఎన్నెన్ని మంచి కార్యక్రమాలొచ్చేవో? ఇప్పడు, టి.వీ ల్లో కార్యక్రమాలు కుటుంబం అంతా కలిసి చూడ్డమే పడదనుకోండి, అధవా అందరూ కలిసినా, అందరిదీ తలో టేస్టూ!అయినా అనుకుంటాం కానీ, ఆ రిమోట్ మన చేతిలో ఉంటుందా ఏమిటీ? ఏది కనిపిస్తే అది చూడడం.

    1983 లో నాకు వరంగాం transfer అయినప్పుడు, ఆ ఊళ్ళో టి.వి. లేదని, దీన్ని అమ్మేద్దామని బేరం పెడితే, మాకు దగ్గరలోనే ఉండే బేకరీ అతను, రు.1000/- కి తీసికుంటానన్నాడు.దాన్ని తీసికెళ్ళేరోజుమాత్రం, ఇంట్లో మేమందరమూ చాలా సెంటిమెంటల్ అయిపోయాము ఏదో ఇంట్లోవారే పోయినట్లు!ఓ వారం రోజులపాటు ఏమీ తోచలేదు. నిజం చెప్పాలంటే బెంగ పెట్టేసికున్నాము!ఎంతవరకూ వచ్చిందంటే, మా టి.వీ కొన్నతని ఇంటికి వెళ్ళి మా టి.వీ చూసేదాకా! ఇంకా మా టి.వీ. అంటే కొనుక్కున్నతను కాళ్ళిరగ్గొడతాడు! చెప్పొచ్చేదేమిటంటే ప్రాణం లేని వస్తువైనా, సంవత్సరాలు గడిచేకొద్దీ దానితో మన జీవితాలు ఎంతలా ముడిపడిపోతాయో అని!
ఇది నా మొదటి టి.వీ. కథ. అప్పుడే అయిపోలేదు.ఇంకో రెండింటిగురించి మరో టపాలో. దానికీ కారణం ఉంది చివర్లో చెప్తాను.

%d bloggers like this: