బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- Double standards

    దేవాలయాల్లో చూస్తూంటాము పెద్ద పెద్ద బోర్డులు- ‘Switch off your mobiles’ అని ఒకటీ, ‘Photography not allowed’ అని ఇంకోటీ! అవి మనలాటి సామాన్య మానవమాత్రులకి మాత్రమే వర్తిస్తాయనుకుంటాను!
ఈ మధ్యన చాలా చానెల్స్ లో ఆంధ్రదేశంలోని రమారమి ప్రతీ దేవాలయం గురించీ ( ఒక్క పెద్ద తిరుపతి తప్ప), ఏదో ఒకపేరు- తీర్థయాత్ర, గోపురం, మాఊరి దేవతలు… ఇంకోటేదో-తో కార్యక్రమం చూపిస్తూనే ఉంటారు. మరి ఆ చానెల్ వాళ్ళని అనుమతించగా లేనిది, మనలాటివారిని కూడా ఫొటోలు తీసికోనిస్తే ఏం నష్టంట? ఏ దేవాలయంలోనైనా సరే, ‘ఫొటోలు తీసికొచ్చాండీ’ అని అడగండి, ఠక్కుమని చెప్పేస్తారు, అక్కడివారు, ‘ లేదండీ కావలిసిస్తే, దేవస్థానం వారు తీసిన ఫొటోలు కావలసిస్తే కొనుక్కోండీ’ అంటారు! ఆ తరువాత ఏ చానెల్ లోనో చూస్తూంటాము, మనని ఫొటోలు తీసికోకూడదన్న దేవాలయం గురించి ఓ కార్యక్రమం, కొసమెరుపేమిటంటే, మనల్ని ఏ పూజారైతే ఫొటోలు తీసికోవద్దన్నాడో. ఆయనే ప్రామినెంటు గా కనిపిస్తాడు!!

   అలాగే సెల్ ఫోన్ల విషయంలోనూ- మన దగ్గర ఉన్న సెల్ ఫోన్లు గేటుదగ్గరే తీసేసికుంటారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే, దేవాలయ సంబంధిత అధికారో, లేక పూజారో, ఎవరితోనో సెల్ ఫోనులో మాట్లాడుతూ కనిపిస్తాడు! పోనీ అలాటి దృశ్యమేదైనా రికార్డు చేద్దామంటే, మన కెమేరాలూ, కెమెరా ఫోన్లూ అసలు లోపలికే తీసికెళ్ళనీయరే! బహుశా ఇదే కారణం అనుకుంటాను- వాళ్ళు చేసే దుష్కార్యాలని కెమేరా లో బంధించనీయకపోవడానికే! అంతే కానీ ఆ దేముడి sanctity ఏదో కాపాడదామని కాదు!

    అలాగే ఏ ప్రైవేటు డాక్టరు దగ్గరకైనా వెళ్ళండి, అక్కడో బోర్డు దర్శనం ఇస్తుంది- Take off your shoes/chappals- అని. మనం ఏదో దేవాలయంలొకి వెళ్తున్నట్లు, బుధ్ధిగా చెప్పులో/షూసో బయటే విడిచి లోపలకి అడుగెడతాము. మన ముందరే, ఏ నర్సో, ఏ డాక్టరో బయటకీ లోపలకీ చెప్పులతోనో, బూట్లతోనో తిరిగేస్తూంటారు! మరి,అక్కడుండే రూలు వాళ్ళకి వర్తించదా లేక వాళ్ళవేమైనా దేవతా చెప్పులా? వచ్చే రోగాలేవో ఆ డాక్టర్ల ద్వారానూ రావచ్చుకదా?

   అలాగే పెట్రొల్ బంకుల దగ్గర ‘Switch off your mobiles’ అనే బోర్డు తప్పకుండా చూస్తాము!అక్కడుండే ఎటెండెంట్లు ఎడా పెడా సెల్ ఫోన్లలో మాట్లాడేస్తూంటారు!ఏం వాళ్ళ ఫోన్లలో ఏమైనా ప్రత్యేకమైన సదుపాయం ఉందా,అంటుకోకుండా ఉండేందుకు! అన్నిటిలోకీ పెద్ద జోకు ఏమిటంటే, ఈ మధ్యన ఓ శ్మశాన వాటికకి, ఓ గ్యాసు గోడౌన్ కీ మధ్యన ఓ గోడ మాత్రమే అడ్డు, ఆ గోడమీద పెద్ద పెద్ద అక్షరాలతో ‘ ‘No smoking’ అని. గోడ పక్కనున్నదేమిటో?
ఇలా వ్రాసుకుంటూ పోతే ఎన్నెన్నో Double standards. చెప్పేవాడికి వినేవాడెప్పుడూ లోకువే !!

    నిన్నటి నాటపా లో పెట్టిన ఐ.పి.ఎడ్రసూ,శ్రీ వెంకట్, శ్రీ పానిపురి ఇచ్చిన వ్యాఖ్యలోని ఐ.పి.ఎడ్రసూ డిలీట్ చేశాను. కారణం మరేమీ లేదు, అసభ్య వ్యాఖ్యలు పెట్టిన పాఠకుడు క్షమాపణ చెప్పాడూ, మళ్ళీ అలాగ చేయనని ప్రామిస్ చేశాడు, పోనీ ఒక ఛాన్సిద్దాము.ఎవరైనా తప్పులు చేస్తారు, కానీ పశ్చాత్తాపం చెందినట్లు కనిపిస్తున్నారు, ఎంతైనా వయస్సులో పెద్దవాణ్ణి, అలా చేయడంలో ఎవరికీ అభ్యంతరం లేదనే భావిస్తున్నాను.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అందరికీ వందనాలు !

    నిన్న నేను వ్రాసిన టపామీద స్పందించిన శ్రేయోభిలాషులు–-తార, వీకెండ్ పొలిటీషియన్,రహ్మానుద్దీన్,మయూరి, వంశీ,వేణు, కృష్ణశ్రీ,నిరుపమ, శరత్,వెంకట్, జాబిలి,పానిపురి, కొత్తపాళి,కృష్ణ, బికె,మలక్ పేట రౌడీ,సౌమ్య,వేణు శ్రీకాంత్,జ్యొతి. శివాని,శ్రీనివాస్, సుజాత, భారతి. రాజ్,— అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నామీదుండే అభిమానానికి కృతజ్ఞతావందనాలు!I am overwhelmed by the show of affection and regard you all have expressed. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.

    ఈ సందర్భంలో ఈవేళ జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలి-నిజం చెప్పాలంటే, మీ అందరి వ్యాఖ్యలూ చదవగానే కడుపు నిండిపోయింది! అయినా మామూలుగా చేసే భోజనం చెయ్యాలి కదా! అదేదో కానిచ్చేసి, కొదవగంటి కుటుంబరావు గారి ‘నవలలు’ చదువుతూ కునుకు తీశాను.ఇంతలో మా అబ్బాయి వచ్చి, ‘ఫోనొచ్చిందీ’ అన్నాడు.ఏమిటా అని చూస్తే, ఆ ఫోను బెంగళూరు నుండి అని తెలిసింది. హల్లో అనగానే, ‘ సార్ మీ టపాలో అసభ్యకరమైన వ్యాఖ్య పెట్టింది నేనే..క్షమించండి’ అంటూ మొదలెట్టి , అలా పెట్టడానికి కల కారణాలు ఏవేవో చెప్పి,నేను పెట్టిన టపా డిలీట్ చేయమన్నాడు.మీరు అడగ్గానే డిలీట్ చేసేస్తానని ఎలా అనుకున్నారూ? ఒక సారి ‘సారీ’ చేప్పేస్తే, ఇప్పటిదాకా హరించిన మనశ్శాంతి తిరిగి వస్తుందా అన్నాను. కాదండీ మీరు దాన్ని డిలీట్ చేయకపొతే, my career is at stake అన్నాడు. సంభాషణ ఓ పావుగంట జరిగింది.అదే కాకుండా అప్పటికే క్షమాపణ చెప్తూ, ఇంకో రెండు వ్యాఖ్యలు పెట్టాడు, వాటిని అనుమతించమన్నాడు, తీరా చూస్తే వాటిమీదున్న ‘రచయిత’ ఇంకా అలాగే అసభ్యంగానే ఉంది.మరి మీరు పెట్టుకున్న పేరుతో మీ ఎపాలజీని కూడా అనుమతించలేనూ అని చెప్పాను. అయినా మీ అందరి కోసం తను పెట్టిన వ్యాఖ్య వెర్బేటం
పెడుతున్నాను “I am very sorry sir I dont it can get you hurt .. I am very sorry .. pls delete this post. I dont know u take this seriously. I was also getting so many fake comments and which is why I had to do this please delete this post. will not repeat” అని ఒకటీ,”tappayipoyindi dayachesi ee post delet cheyandi malli illanti tappu jaragadu. pls .” అని ఇంకోటీ వ్రాశాడు. అయినా దీన్ని వ్యాఖ్యల్లో ప్రచురించడం లేదు, కారణం: రచయిత పేరు ప్రింటబుల్ గా లేదు.

    ఈ టపా ఉద్దేశ్యం,నిన్నటి టపాకు జరిగిన పరిణామాలు మీ అందరితోనూ పంచుకోవాలనీనూ, నాకు జరిగినలాటి అనుభవం అంతర్జాలంలో ఎవరికీ కూడా జరగకూడదనీనూ! మరో సారి కృతజ్ఞతలతో, మీ అందరి ఆదరాభిమానాలూ ఇలాగే కొనసాగుతూండాలని ఆశిస్తూ ( వ్యాఖ్యలు పెట్టకపోయినా సరే!)..

%d bloggers like this: