బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Hoarding

    ఈ టపాకి నేనిచ్చిన శీర్షిక ఏదో యాడ్ హోర్డింగ్ గురించి కాదు. మనదేశంలో national passion అయిన అత్యవసర వస్తువుల్ని అవసరం ఉన్నా లేకపోయినా దాచడం అనే అలవాటు గురించి!ఏ సరుకైనా సరే ఖరీదు పెరిగిపోతూందనేసరికి కొనేయడం, దాచేయడం! అది కొనే సరుకే కానఖ్ఖర్లేదు, ఇంట్లో వచ్చే నీళ్ళతో సహా ఏదీ కాదనర్హం హోర్డింగుకి…

    ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న సాయంత్రం, మా సొసైటీ వాచ్ మన్ ఎంతో ప్రేమగా పిలిచి చెప్పాడు- ఈ వేళ ఏదో టాంక్ క్లీనింగు చేస్తారూ, ప్రొద్దుట పదినుండి సాయంత్రం ఆరు దాకా నీళ్ళుండవూ, బకెట్లలో పట్టుకుని ఉంచుకోండీ అని. ఏదో చెప్పాడుకదా అని,మా ఇంటావిడా, నేనూ ప్రొద్దుటే లేచేసి ( ఈ వేళా, నిన్నా ఆవిడ పుట్టినరోజులెండి, నిన్న తిథుల ప్రకారం, ఈవేళ తేదిల ప్రకారం,ఇంకా సీనియర్ సిటిజెన్ స్టేజీకి రాలేదు,ఆవిడకి రైళ్ళలో పూర్తి టిక్కెట్టే తీసికోవాలి!), స్నానపానాదులు పూర్తిచేసేసి, ఖాళీ ఉన్న ప్రతీ బకెట్ లోనూ,టబ్ లోనూ పీకలదాకా నీళ్ళు నింపేశాము. ఇంతా చేసి,నీళ్ళు ఆగనూ లేదు.ఏదో ఓ రెండు గంటలు తప్పించి రోజంతా రానే వచ్చాయి. వాడు చెప్పుండకపోతే, నీళ్ళు హోర్డింగు చేసేవాళ్ళము కాదుగా. వాడెవడో చెప్పాడు, మనం అతిజాగ్రత్తకు పోయి, అవసరం ఉన్నా లేకపోయినా నీళ్ళు పట్టేసుకుంచుకోవాలనే అభద్రతా భావం! ఇది ఇంటి స్థాయిలో.

    ఇంక జాతియ స్థాయికి పోతే అడక్కండి.ఇదివరకటి రోజుల్లో, కొందరు రెవెన్యూ స్టాంపులు ఓ పేద్ద లాట్ లో కొనేసి దాచేసుకునేవారు. అంతదాకా ఎందుకూ, మాకు మిలిటరీ క్యాంటీన్ లో సరుకులు బయటికంటె, ముఫై నలభై శాతం తక్కువలో దొరుకుతాయని, సబ్బులూ, పేస్టులూ లాటివి పెద్ద సంఖ్యలో కొనేసి దాచుకోవడం, పోనీ అలాగని అవన్నీ వాడతారా,అబ్బే,ఆ పేస్టులూ, సబ్బులూ క్రుంగి క్రుశించి పోయాక బయట పడేయడం. కొంతమందైతే చిల్లర దుకాణాలకి అమ్మేసుకుంటారనుకోండి. అలాగే గవర్నమెంటు డిస్పెన్సరీలకి వెళ్ళి, ఊరికే ఇస్తున్నారుకదా అని, అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ రోజులకి మందులు రాయించి పుచ్చుకోవడం.పోనీ అవేమైనా వాడతారా,అవసరం లేకుండా మందులు మింగితే చచ్చూరుకుంటారు! expiry date అవగానే పెంటకుప్పలో పడేయడం.

   అవే కాదు, గవర్నమెంటుకీ ఉంది ఇలాటి ఆబ! ఏదైనా ఓ ఫాక్టరీయో, ఇంకోటో పెడదామనుకున్నారనుకోండి,ఎక్కడ పడితే అక్కడ స్థలం ప్రొక్యూరు చేసేస్తారు. అందులో మా రక్షణ శాఖ వారు మరీనూ. హైదరాబాదు దగ్గరలో ఎద్దుల మైలారం అనే ఊరులో ఓ ఆర్డ్నెన్స్ ఫాక్టరీ ఉంది.దానికి ఎన్ని ఎకరాల స్థలంఉందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఏమైనా అంటే డిఫెన్స్ ఆఫ్ ఇండియా అంటారుదయతలిచి ఏదో ఐ.ఐ.టి కి కొంత స్థలం ఇచ్చారు!

   గుర్తుండే ఉంటుంది ఇదివరకటి రొజుల్లో కేంద్ర బడ్జెట్ రోజున పెట్రొలు అమ్మేవారుకాదు,బడ్జెట్ లో ఖరీదు ఎలాగూ పెరుగుతుందీ, లాభాలు చేసికోవచ్చని. ఇప్పుడు ఆ గొడవే లేదు,ఉరుము లేని పిడుగులా ఎప్పుడు పడితే అప్పుడే పెంచుతున్నారు.
అంతదాకా ఎందుకూ, వెళ్ళినా వెళ్ళకపోయినా, జాగ్రత్త కోసం మూడు నెలల ముందరనుంచీ రైల్వే టిక్కెట్లు రిజర్వు చేసేసుకోవడం.అలా అనకండీ, వెళ్ళాల్సిన అవసరం రావొచ్చేమో అని ముందరే చేసికుంటారూ, దీన్ని కూడా హోర్డింగ్ అంటారేమిటీ,చిత్రం కాపొతే, అనకండి. వెళ్ళడం వేరూ, వెళ్ళాలేమో వేరూ! అవసరం లేకపోయినా టికెట్టు బ్లాక్ చేసేయడం వలన, ప్రతీ వాడూ తత్కాల్ లో తీసికోవలసివస్తోంది. దీంట్లో కన్సెషన్లుండవు, డబ్బులెక్కువ. చూశారా, అవసరంలేకపోయినా టిక్కెట్టు బ్లాక్ చేసినవాడు నష్టపోయేది రిజర్వేషన్ ఛార్జీ మాత్రమే (క్యాన్సిల్ చేసినందుకు).

   మన ప్రభుత్వం పీ.డీ.ఎఫ్ స్కీం పేరు చెప్పి ఎన్నెన్ని టన్నుల ఆహార పదార్ధాలు సేకరించి, గోడౌన్లు నింపి, చివరకు వాటిని ఎలా వ్యర్ధ పరుస్తున్నారో? పైగా సుప్రీం కోర్ట్ వారు, పోనీ ఆ ఆహారపదార్ధాల్ని ఫ్రీగా ఇచ్చేయకూడదా అంటే, పవారు గారికీ, ప్రధానమంత్రి గారికీ పొడుచుకొచ్చేసింది, హాత్తెరీ ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి మీరెవ్వరూ అంటూ, మేము సలహా కాదు ఇచ్చిందీ, ఆర్డరూ అని చెప్పినా సరే, మన కేంద్ర ప్రభుత్వం గో టు హెల్ అనేసి, ఆ విషయమే మర్చిపోయింది. ఈ లోపులో ఎఫ్.సి.ఐ గోడౌన్లలో బియ్యం తగలడిపోతూనే ఉంది.

   ఇదివరకటి రోజుల్లో,వ్యవసాయం చేసేవారు, వారికి ఏడాదికి సరిపడా ధాన్యం గాదెల్లో నింపుకుని, మిగిలినదంతా బయటకు ఇచ్చేసేవారు, పోనీండి అమ్ముకునేవారు. ఏదో ఒకటి దాచేసుకునేవారు కాదు. ఈ ప్రభుత్వ లెవీ బియ్యం, రూల్స్ వచ్చినప్పటినుంచీ, ప్రతీవాడూ హోర్డింగే! ఖరీదులు పెరిగిపోయాయంటే పెరగవు మరీ.చివరాఖరుకి చిల్లర కాయిన్స్ కూడా హోర్డింగే !

   ఈ వేళ్టి కొసమెరుపేమిటంటే- నిన్న నా కారు అగచాట్లు వ్రాశానుకదా, ఈ వేళ మాఇంటావిడ పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరితోనూ కలిసి హొటల్ కి వెళ్ళాము.అదేదో వాలే పార్కింగో ఏదో చేశారు. బయటకి వచ్చి నుంచునే సరికి, ఆ సెక్యూరిటీ వాడు నాతో ‘ साब आप्का गाडी बहर लाया ‘ అంటూ తాళ్ళాలు నాచేతిలో పెట్టాడు. ఓ వెర్రి నవ్వోటి నవ్వేసి ఆ తాళాలు తీసికున్నాను.వాడికి నామొహం చూసి అలా అనాలనిపించిందేమో పూర్ చాప్ !!

%d bloggers like this: