బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మీరే చెప్పండి

    మామూలుగా ఎవరైనా ఫోను చేసి, ఏదైనా సమాచారం అడిగితే, మనకు తెలిస్తే సమాధానం చెప్తాము, లేకపోతే తెలియదని చెప్పేస్తాము! నా అనుభవంలో ఈ రెండేళ్ళలోనూ జరిగినదేమిటంటే, ఏదో నేను గత 47 సంవత్సరాలనుండీ ఇక్కడే ఉండడం వలన అనండి, ఏవరో ఒకరు ఫోను చేసి దేనికోదానికి సమాచారం అడుగుతూంటారు. కోఇన్సిడెంటల్ గా వారు అడిగేదేమిటంటే, వారింట్లో స్వర్గస్థులైన ఏ పెద్దవారిదో,సెరిమనీ గురించే! నాకు తెలిసినంతలో రాఘవేంద్ర మఠం గురించి వివరాలు తెలుపుతూంటాను. అక్కడివరకూ బాగానే ఉంది. కానీ వచ్చిన గొడవల్లా ఏమిటంటే, అలా ఫోను చేసి తెలిసికున్న తరువాత, వారి పని అయిందా, నేనిచ్చిన సమాచారం సరైనదేనా, తెలిపితే, మరోసారి ఎవరైనా అడిగినా చెప్పొచ్చు. ఈ మాత్రం కర్టిసీ ఆశించడంలో తప్పేమీ లెదని నా అభిప్రాయం.ముక్కూ మొహం తెలియని నాకు ఫోను చేయడంలో లేని మొహమ్మాటం, ఓసారి పని అయిందో లేదో తెలియచేయడంలో ఎందుకో అర్ధం కాదు!
అలాగని నాకేదో జీవితాంతం గ్రేట్ ఫుల్ గా ఉండాలనడం లేదు. ఏదో ఓ సారి ఫోను చేసి చెప్పేస్తే అదో తృప్తీ!

    నేను ఏదైనా సందర్భాల్లో ఎవరైనా సహాయం చేస్తే మాత్రం వారిని జీవితాంతం గుర్తుంచుకుంటాను. వారి బాగోగులు వీలున్నప్పుడు తెలిసికుంటూంటాను.అదేదో పేద్ద గొప్ప విషయం అని చెప్పడంలేదు, మానవ సంబంధాలు ఇంప్రూవ్ చేసికోవడం వీటివల్లే.

    నేనేదో కాలక్షేపానికి బ్లాగులోకంలోకి వచ్చి నా దారిన నేను టపాలు వ్రాస్తూంటాను.అందరికీ నచ్చాలని లేదు. నచ్చినవారు ఏదో వ్యాఖ్య పెట్టినప్పుడు, ఏనుగెక్కినంత సంబర పడతాను. లేనప్పుడు, అయ్యో మనం వ్రాసిన టపా ఎవరికీ నచ్చలేదనుకుని ఊరుకుంటాను! చాలామందికి చదవడానికి సమయమున్నా, వ్యాఖ్య పెట్టడానికి మూడ్ ఉండకపోవచ్చు, లేదా ప్రతీ రోజూ వ్రాస్తూనే ఉంటాడీయనా, రోజూ వ్యాఖ్యలు పెట్టే ఓపిక ఎవరికుంటుందీ అనీ అనుకోవచ్చు.దీంట్లో అభ్యంతరం ఏమీ లేదు. ఎవరిష్టం వారిది. ఉదాహరణకి, నేను ప్రతీ రోజూ చాలా టపాలు చదువుతూనే ఉంటాను, అయినా వ్యాఖ్య పెట్టడానికి బధ్ధకం! అలాగే అవతలివారికీ అనిపించొచ్చుకదా! So no issue!

    ఇప్పుడు నేను వ్రాసేదంతా దేనిగురించంటే, ఈమధ్యన ఒక దుష్టుడు, వాడికి నా టపాలు నచ్చడంలేదనుకుంటాను, అలాగైతే చదవడం మానేయొచ్చు. కానీ ఓ పిచ్చికుక్కలా, అసభ్యకరమైన పదాలతో, నా టపాలమీద వ్యాఖ్యలు పెడుతున్నాడు. ఇలా అసభ్యకరమైన పదాలు వాడడానికి, వాడిని తప్పుపట్టలేము. వాడి పెడిగ్రీ అలాటిది! దానికి వాణ్ణేం చేయగలము? పైగా ఈ మధ్యన ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు, వాడి వ్యాఖ్యల్ని దమ్ముంటే ప్రచురించమని,సరైన పదజాలం ఉపయోగించినా, ఆఖరికి వాడి పేరైనా సరీగ్గా ఉండుంటే, తప్పకుండా ప్రచురించేవాడిని. ఎందుకంటే ఈ బ్లాగులోకంలో అందరూ మర్యాదస్థులు కనుక.ఈ మధ్యన వాడి మెయిల్ ఐ.డీ కూడా ఇచ్చాడు.అలాగని వాడికి మెయిల్ పంపితే జరిగేదేమిటీ- అశుధ్ధం మీద బెడ్డ వేసినట్లేకదా, మనమీదకే చిందుతుంది. అసలు దీని గురించి ఓ టపా వేస్టు చెయడం ఎందుకూ అనుకున్నాను కానీ, నాకైనట్లే ఇంకా ఎందరికో జరుగుతూండవచ్చు కదా.

    ఇలాటి దరిద్రులనుండి మనని మనం కాపాడుకోవడం ఎలాగో ఎవరైనా సలహా ఈయగలరా? లేక నాదారిన నన్ను వ్రాసుకోమంటారా? మీరే చెప్పండి.

%d bloggers like this: