బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– టైం పాస్


    ఓ ట్రైను నిండా పసుప్పచ్చ జండాలు ఎగరేసుకుంటూ, మన వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు.అక్కడ సోనియా గాంధీని కలుసుకుని,తెలంగాణా విషయం తొందరగా పరిష్కరించమని చెప్పటానికిట.నిన్న కే.సి.ఆర్ చెప్పనే చెప్పారు ఇదంతా ఓ డ్రామా, స్టంటూ అని.ఈవేళ టి.వీ. లో చూస్తూంటే, ఏడవాలో నవ్వాలో తెలియలేదు. మనవాళ్ళందరూ పెద్ద పెద్ద నినాదాలు చేసికుంటూ, సోనియమ్మ ఇంటివైపు వెళ్ళడం, అక్కడేమో పోలీసులు వీళ్ళని అరెస్టు చేయడం. వీళ్ళరిచే అరుపులు ఆ హిందీ వాళ్ళకేమైనా అర్ధం అవుతాయా ఏమైనా? ఏదో, మేమూ తెలంగాణాకోసం చేయవలసిన ప్రయత్నం చేస్తున్నామూ అని చూపించుకోడం కాకపోతే ఏమిటీ? అప్పుడేమో బాబ్లీ డాం అని మహరాష్ట్రలో తెలుగువారి ఆత్మగౌరవం మంట కలిసిందో అని గోల పెట్టారు, ఇప్పుడేమో ఢిల్లీ !

   ప్రతీవాడూ తెలుగువారి ఆత్మగౌరవం గురించి మాట్లాడేవాడే! తెలుగులలితకళాతోరణానికి, వాడెవడో డబ్బులిచ్చాడుట, దాంతో రాజీవ్ గాంధీ పేరు తగిలించారుట. ఏమయ్యిందిట? రేపెప్పుడో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే, ఆ వచ్చేవాళ్ళెవరో, ప్రతీదాని పేరూ ఎలాగూ మారుస్తారు, కొంచం ఓపిక పట్టొచ్చుగా.ఆగస్టులో తెలుగు భాషా దినోత్సవానికి ఓ రెండు గంటలపాటు రావడానికి వీలు కుదరని ప్రతీ వాడూ, తెలుగుభాష గురించీ, ఆత్మగౌరవం గురించీ మాట్లాడేవాడే! పైగా నిన్న అదేదో చానెల్( ఏ.బి.ఎన్ అనుకుంటా)’ తెలుగుకళాతోరణం మైన్టైన్ చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బేలేకపోతే, అయిదుకోట్లమంది తెలుగువారిని ఒక్కొక్కడినీ రెండేసి రూపాయలిమ్మన్నా, కోటానుకోట్లు వసూలైఉండేవికావా…’ అని పాపం వాపోయాడు! ఇదేమన్నా రెండురూపాయలకి కిలో బియ్యం స్కీమా ఏమిటీ?

   అప్పుడెప్పుడో రాంగోపాల్ వర్మ ‘బెజవాడ రౌడీలు’ అని తను తీసే సినిమాకి పేరు ఎనౌన్స్ చేసేటప్పటికి, బెజవాడలో ఉండే సో కాల్డ్ ‘ఆత్మగౌరవనీయులైన’ హిస్టరీ షీటర్సందరూ, ‘హాత్తెరీ, బెజవాడ రౌడీలంటాడా…’ అని చేతిలో మైకులు పుచ్చుకుని, టి.వీ.చానెళ్ళలో మన ప్రాణం తీశారు.మరి ఈవేళ మధ్యాన్నం నుండీ ‘ నాన్ స్టాప్ కవరేజ్ ఆన్ బెజవాడ గ్యాంగ్ వార్…’ అని వాడెవడో చానెల్ వాడు చేస్తున్నదేమిటిట?

   ఇంకోడెవడో (ఎన్ టివి అనుకుంటా) యోగా గురించి ఒ చర్చా కార్యక్రమం పెట్టాడు. అక్కడెక్కడో ఎవరో అమ్మాయి ‘యోగా’ పేరుతో, సొకాల్డ్ అసభ్యకరమైన ప్రదర్శన ఇస్తోందని. ఆ వంకతో, మన చానెల్ వాడు, వీళ్ళు మాట్లాడుతున్నంతసేపూ ఆ ‘అసభ్యకరమైన’ క్లిప్పింగులే చూపించుకున్నాడు.అదేమిటో పేద్ద విషయమైనట్లు,వాళ్ళెవరో ఏదో చేస్తున్నారని ఏడవడం కంటే, ఇప్పుడు వస్తూన్న తెలుగు సినిమాల్లో చూపిస్తున్నవాటి గురించి, ఒక్కడంటే ఒక్క చానెల్ వాడైనా అడుగుతాడా? ఏమైనా అంటే ‘కలాపోసన’ అంటారు.ప్రతీరోజూ చానెళ్ళలో వచ్చే రాబోయే సినిమాల ప్రొమోలు చూస్తే చాలు, అవిమాత్రం ఏమైనా తక్కువా?

   అక్కడ కర్ణాటకలో ఇంకంటాక్స్ వాళ్ళు, గాలి గాళ్ళ వెనక్కాల పడ్డారంటే మరి పడరూ? పాపం యడ్డీ కోసం, డబ్బులెక్కణ్ణించి వచ్చాయో తెలియొద్దూ? పోనీ ఈ ఐ.టీ వాళ్ళైనా సరీగా ఉంటారా, అక్కడ మాయావతి చాలా పవిత్రురాలూ( ఇంకం టాక్స్ విషయంలో) అని తేల్చేశారు! శుభం భోయా !
ఇంకా ఎన్నెన్ని వింతలూ విశేషాలూ చూడాలో రోజంతా? మళ్ళీ ఇంకో టపాలో !!

6 Responses

 1. గురువుగారు…మీరు రెండో పేరాలో చెప్పినదానికి విసుగు చెందాల్సిందెందుకో అర్ధం కావడంలేదు…….ఎవడో డబ్బిచ్చుకొని మనది మాత్రమే అయిన ప్రద్దానికి వాడనుకున్న పేరు తగిలిస్తే ఊరుకొని కూర్చొవాలా…….ప్రపంచబ్యాంకు అప్పులిచ్చిందికదా అని మెడలో బోర్డు పెట్టేసుకు తిరగముకదా. అసలు భాషా దినోత్సవం జరపాల్సిన అగత్యం ఏంటి మనకు…అదేమన్నా తెలుగుపై పరాయి భాషల దౌర్జన్యాన్ని అంతం చేసిన రోజా? భాషా దినోత్సవానికి రాకపోతే తెలుగుపై గౌరవం లేనట్టా ఏమిటి..!!

  ఆ పేరాను పొలిటిషియన్లను ఉద్దేశించి రాసారేమిటి…అలాగైతే నన్ను, నా వ్యాఖ్యను క్షమించేయండి… 🙂

  Like

 2. ఎవరో చేసే యాక్షన్ కు మనం బాద పడుతున్నాం అంటే అది మన తప్పు. మౌనమే మనకు మంచి ఉపశమనం. We should enjoy their comedy acts and comments.

  Like

 3. అయ్యా
  మీరిలా తెలుగు భాష మీద మాకున్న మమకారాన్నీ సమైక్యాంధ్ర ఉద్యమాన్నీ కించపరచడం భావ్యంగా లేదు. తెలుగుతల్లి కళాతోరణాన్ని పేరు మార్చేస్తే చూస్తూ ఊరుకోమనా, మేము నానాయాగీ చేయబట్టేకదా కేంద్రం దిగి వచ్చింది. ఆత్మగౌరవం కాకపోతే మరేమిటి? పెద్దవారు మీరు ఏ మేరకు ప్రతిఫలిస్తాయో కూడా తెలియకుండా మేము చేసిన పోరాటాన్ని హర్షించక మీరు కూడా ఆత్మగౌరవం నిలబెట్టే పోటుగాళ్ళా అన్నట్లు మాట్లాడతారెందుకు? మేము ఉన్న ఊరిని నమ్ముకున్నాం, ఊళ్ళొదిలి పరాయి రాష్ట్రాలు వలసపోలేదు, వేరే భాషలు నేర్చుకుని అవితప్ప మాట్లాడని ఆయా ప్రాంతపు వ్యక్తులతో అత్యుత్సాహం కనబరస్తూ వారి భాహ్సలు మాట్టాడి, మా భాషని ఖూనీ చేసుకోదలుచుకోలేదు.
  మీరు హైదరాబాదులో వుంటే తెలిసేది, సమైక్యాంధ్ర భావం నరనరాలా ఎలా జీర్ణించుకుపోయిందో, 6 యేళ్ళ బాలుడు నుండీ, 60 యేళ్ళ ముదుసలి వఱకూ మా వూరిని దక్కించుకోవాలనే సంకల్పంతో పిడికిలి బిగించి యుద్ధంకోసం ఎదురుచూస్తున్నామో , ఎవరో వచ్చి రాష్ట్రాన్ని రాయించేసుకుని ఎలాగా రాజీవ్‌ పేరు కొమరభీం పేరుగా మార్చకపోరు అని ఎదురుచూసేంత చాతగాని వాళ్ళలా కనిపిస్తున్నామా?
  చివరి రక్తం బొట్టు వఱకూ పోరాడతాం, హైదరాబాదు సాధించుకుంటాం.
  ఈ వ్యాసం మాలో సందిగ్ధతని కలజేసి, మా పోరాటపటిమపై ఉదాసీనతని కలచేయగలదు.

  Like

 4. నాగార్జునా,

  నాకు ఎవరి భావాలూ కించపరచాలనే ఉద్దేశ్యం లేదు.మన నాయకుల నౌటంకిలు చూసి తట్టుకోలేక వ్రాసింది మాత్రమే.

  Like

 5. ఏ టు జెడ్ డ్రీంస్,

  అదే హాయనిపిస్తోంది.

  Like

 6. వీజే గారూ,

  పరాయి రాష్ట్రంలో ఏదో ఉధ్ధరించేద్దామని రాలేదు.మన తెలుగు భాషని ఖూనీ చేయలేదు.తెలుగువారెప్పుడూ చేతకానివారని కూడా అనలేదు.నేను ఈ మధ్యన జరుగుతున్న సంఘటనలు చూసే, తట్టుకోలేక వ్రాశాను. ఎవరో నాలాటి అనామకుడు వ్రాసిన వ్యాసం చదివితేనే సంధిగ్దత కలుగచేస్తే ఎలాగండి బాబూ?
  My best wishes are with you.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: