బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–‘జైసే కో తైసా’

    కొంతమందికి నోట్లో ఏదో నములుతూ మాట్లాడడం అలవాటు. రికీ పాంటింగ్ ని చూడండి, ఫీల్డ్ లో ఉన్నంతసేపూ ఏదో (చూయింగ్ గం అనుకుందాము) నములుతూనే ఉంటాడు.అది తన అలవాటు కావొచ్చు లెక అవసరం అవొచ్చు. అది ఈ నవయుగంలో తప్పు కాకపోవచ్చు. కానీ మాకు చిన్నప్పుడు ఓ సంగతి చెప్పారు-ఎప్పుడూ నోట్లో ఏదో మేక లాగ నెమరేస్తూ మాట్లాడకు అని. ఈ విషయం పెద్దవారితో మాట్లాడేటప్పుడు తప్పకుండా పాటించమనేవారు.ఇప్పటి వారికి ఇది చాదస్థంగా అనిపించొచ్చు. కానీ ఎక్కడైనా ఎప్పుడైనా సరే అలా ఏదో నములుతూ మాట్లాడేవారిని చూస్తే మాత్రం చాలా చిరాకేస్తుంది. ఎవరి అభిప్రాయం వారిది.

కిళ్ళీ అలవాటున్నవారు, నోట్లో కిళ్ళీ మెళుకువగా ఉన్నంతసేపూ ఉండాల్సిందే. చిన్నప్పుడు కిళ్ళీ తింటే చదువురాదనేవారు. అందువలన ఆ అలవాటు రాలేదు. అలాగని చదువూ రాలేదు !చెప్పానుగా ‘తేగ’ లోని ‘చందమామ’, కిళ్ళీ ఈ రెండూ నిషేధం. ఏమిటో అనుకుంటాము కానీ, ఇలాటివి మానేస్తే చదువొస్తుందా? తలరాత కూడా ఉండాలండి బాబూ. ఈ కిళ్ళీ లలో మళ్ళీ రకాలు–జర్దా కిళ్ళీ, మిఠాయి కిళ్ళీ అని.ఇప్పుడు ఎవడూ అడిగేవాడు లేడూ అని పోనీ కిళ్ళీ వేసికుందామా అంటే అసలు పళ్ళే లేవు!! ఈ పళ్ళు లేకపోవడం వలన కొన్ని కొన్ని చిన్న చిన్న సంతోషాలు మిస్స్ అయిపోతున్నాను.మామిడిపళ్ళ సీజన్ లో ముక్కలు చేసి తీసికోవడానికి కుదరదు. ఓ స్పూన్ తో నైస్ గా తిసికోవలసి వస్తుంది. అదేదో స్టైలూ ఫాషనూ అనుకుంటారు. నా కష్టం ఎవరికి తెలుస్తుంది? మా మనవరాలు అస్తమానూ నన్ను ఆట పట్టిస్తూంటుంది.ఎవరికెంత రాసుందో అంతే ప్రాప్తం !!

ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాను.అసలు ఈ పోస్ట్ దేనిగురించంటే, ఇక్కడ మహారాష్ట్రా లో ఇంకో అలవాటోటి ఉందండోయ్- ‘తంబాకూ'(అంటే మన పొగాకు) వాటిని పొడి చేసి ప్యాకెట్లలో అమ్ముతారు. అది చేతిలో వేసికొని,దాంట్లో సున్నం వేసి,ఆ రెండింటినీ శుభ్రంగా పొడి చేసేసికొని,పైన వచ్చే పొట్టులాటిది ఊదేస్తాడు. మన ఖర్మ కాలి ఎదురుగుండా ఉన్నామనుకోండి, ఆ డస్ట్ అంతా మన కళ్ళలోకి వెళ్తుంది. పొట్టు ఊదేయగా మిగిలిన పౌడర్ ని స్టైల్ గా కుడిచేతి బొటను వేలూ, చూపుడు వేలూ కలిపి( ప్రాసెసింగ్ అంతా ఎడమ అరచేతిలో చేస్తారు), ఎడమ చేత్తో క్రింది పెదవిని కొంచెం ముందుకు లాగి, ఆ రెండు వేళ్ళలోదీ అక్కడ పెట్టుకుంటాడు. అది అక్కడ ఊరుతూ ఉంటుంది. ఆజ్యూస్ ని మింగుతూ తాదాత్మ్యం చెందిపోతాడు. చెప్పానుగా ఎవరి అలవాటు వాళ్ళది. దీనిలో ఏమీ తప్పులేదు.ఈ మధ్యన ఎక్కడ చూసినా పాన్ పరాగ్ లేదా ఇంకోటి-వాటి అన్నింటిలోనూ ఉండేది పొగాకే. ఎక్కడ చూసినా పది పదిహేనేళ్ళ పిల్లలు కూడా దీనికి బానిసలయ్యారు. దీంట్లోంచి బయటకు తీయడం ఆ భగవంతుడిక్కూడా సాధ్యం కాదు.ఆ సంగతి వదిలేయండి.

ఇది తింటున్నంతసేపూ, జ్యూసులాటిది ఊరుతుంది కదా, దాన్నంతా ఎక్కడ మింగకలుగుతాడూ, ప్రతీ రెండు మూడు నిమిషాలకీ ఉమ్మేస్తూండాలి.ప్రస్తుత పోస్ట్ ఈ ‘ఉమ్మేయడం’ అనే దౌర్భాగ్యపు అలవాటు గురించి.ఏ ఆఫీసు,రోడ్డు చూసినా ఈ దరిద్రపు మరకలతో నిండి పోయుంటాయి. ఆఫీసుల్లో మెట్లమీదుగా వెళ్ళేటప్పుడు చూడండి-కార్నర్లు అన్నీ ఈ డిజైన్ తో నిండిపోతాయి.లిఫ్ట్ లని కూడా వదలరు ఈ ‘పక్షులు’.కొన్ని కొన్ని ఆఫీసుల్లో అయితే, కొంతమంది తెలివైన వాళ్ళు ఆ కార్నర్ లలో ఏ దేముడి బొమ్మైనా పెట్టేస్తూంటారు. ఈ ఉమ్మేవాళ్ళ కి ఏదో దైవ భీతి ఉంటుందిగా అందువలన కొన్ని కొన్ని ఆఫీసుల మెట్లు ఇంకా శుభ్రంగానే ఉంటున్నాయి.

కొంతమంది ట్రైన్ లో కానీ, బస్సులో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు, అడిగి మరీ ‘విండో సీట్ ‘ తీసికుంటారు. అదేదో ప్రకృతి ని ఆస్వాదిద్దామనుకొని కాదు, నోరారా ఉమ్మేసికుందామని మాత్రమే. వాడిదేం పోయింది,మింగినంత మింగి, మిగిలినది ఆ కిటికీలోంచి ఉమ్మేయడమే. నోట్లో ఉన్నది పూర్తి అయిపోతే, మళ్ళీ కిళ్ళీయో, తంబాకో, పాన్ పరాగ్గో వాడి నెత్తో మళ్ళీ దట్టించేయడమే. ఇంతవరకూ ఎవడిష్టం వాడిది. కానీ ఈ ఉమ్మేయడమనే ప్రక్రియ వెనక్కాల సీటుల్లో కూర్చొన్న వారికి ప్రాణాంతకమౌతుంది. ఎందుకంటే వీడు ఉమ్మేసినదంతా వెనక్కాల వాళ్ళ మీద స్ప్రే అవుతుంది. వీడికేమీ పట్టింపు లేదు. చెప్పినా వినడూ.ఆ మాత్రం సంస్కారం లేకపోతే కష్టమండి బాబూ !!

ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే, ఈవేళ సిటీ బస్సులో 20 రూపాయల టిక్కెట్టు కొనుక్కుని, ఊరంతా తిరుగుదామని బయలుదేరాను. మూడు సీట్లకి ముందులో ఓ పెద్దమనిషి కూర్చొన్నాడు. ఈయన నోటినిండా తంబాకో, మరోటో దట్టించినట్లున్నాడు, ప్రతీ రెండు నిమిషాలకీ ఎదో తుంపరల్లా పడుతూంటే, ఏమిటా అని చూస్తే, ఈయన కనిపించాడు. కండక్టర్ తో చెప్పి, నా కొచ్చిన అసౌకర్యం చెప్పాను. పాపం కండక్టర్ నామీద జాలి పడి, వెళ్ళి అతనితో చెప్పాడు. అతనేమన్నాడంటే, బస్సుల్లో సిగరెట్ కాల్చకూడదన్నారు కానీ,తంబాకూ తినకూడదని రూల్ లేదూ, నా ఇష్టం, నాకు తోచినది తింటానూ అన్నాడు. వీడు వినేటట్లుగా లేడనుకొని, మెల్లిగా విండో గ్లాసు వేసేశాను, లేనిపోని గొడవెందుకూ అని.
వీడి ఉమ్ముల కార్యక్రమం సాగుతూనే ఉంది. ఇలాటి సంస్కార హీనుల్ని బాగుచేయడం ఎవరి తరం? అనుకున్నంత సేపు పట్టలేదు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బస్సు ఆగింది, ఇంతలో, ఓ యువకుడు లోపలికి వచ్చి, వీడి కాలరు పట్టుకుని,ఎడా పెడా తిట్టడం మొదలెట్టాడు. జరిగిన సంగతేమయ్యా అంటే బస్సు ఆగినట్లు గమనించక, ఈ దరిద్రుడు అలవాటు ప్రకారం బస్సు విండో లోంచి తుపుక్కున ఉమ్మేశాడు. అదివెళ్ళి, ప్రక్కనే బైక్కు మీద ఆగిన కుర్రాడి షర్ట్ మీద స్ప్రే అయింది. ప్రక్కకు చూస్తే, బస్సులోని ఈ మానవుడు, నోరు తుడుచుకుంటూ కనిపించాడు. అంతే బైక్కు స్టాండ్ వేసేసి, బస్సు లోకి వచ్చాడు. అందరూ అడ్డ పడి ఆపకపోతే, వీడి పని అయిపోయేదే ఈవేళ. జీవితంలో మళ్ళీ కిటికీలోంచి ఉమ్మేయడు!!.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ఇలాగ ఉండాలి

online

పట్టువదలని ‘విక్రమార్కిణి’

%d bloggers like this: