బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు– Best of both Worlds !!–1

   మేము రాజమండ్రీ నుండి పూణే రావడానికి కారణాలు చెప్పానుగా. అక్కడ ఉన్న ఏణ్ణర్ధం లోనూ, అన్ని రకాల సామాన్లూ కొనేశాను. ఇక్కడ ఉన్న ఫ్లాట్ లో సామాన్లు ఏదీ కదపకుండా, అన్నీ మళ్ళీ కొన్నాను. ఇక్కడకు రావడానికి ఓ ట్రక్కు ఎరేంజ్ చేయవలసి వచ్చింది.ఈ సామాన్లన్నీ మా డిజైనర్ ఫ్లాట్ లో పట్టవూ, ఎలాగరా భగవంతుడా అనుకున్నాను. మా అబ్బాయంటాడూ, ఆ సామాన్లన్నీ అమ్మేసి వచ్చేయండీ అని.నేనేమో ఓ లక్ష రూపాయలు పెట్టి కొన్న సరుకంతా అమ్మడం మొదలెడితే, పదివేలు కూడా రాదు. పైగా ఆ కొత్త వస్తువులు అన్నీ అనుభవించినట్లూ ఉండదు. ఇదికాదు పధ్ధతి నాన్నా, నేను ఓ ఫ్లాట్ అద్దెకు తీసికుంటానూ, దాంట్లో మేముంటామూ, నీదగ్గరకీ, అక్క దగ్గరకీ వెళ్తూ వస్తూంటాము. మీరు కూడా వీకెండ్స్ లో మా దగ్గరకి వస్తూండండి అని వాడికి నచ్చచెప్పి, ఎలాగైతేనే పూణే లో మేము ఇంకో ఫ్లాట్లో ఉండడానికి రంగం సిధ్ధం చేశాను.ఇంకో ఇల్లు కొనడం తరువాత చూసుకోవచ్చూ,అనుకొని అద్దె ఇల్లుకి ప్రయత్నం మొదలెట్టాము.

   ఏజెంట్ ద్వారా వెళ్దామంటే, ఉత్తి పుణ్యాన్న వాడికి ఇంటికి ఇచ్చే అద్దె లో 2 శాతం వాడికిచ్చుకోవాలి. ఏజెంట్ ద్వారా కాకుండా ఓనర్నే పట్టుకుని సంపాదించాలనే ఏకైక ధ్యేయంతో ‘ ఇళ్ళ వేట’ మొదలెట్టాము.ఇక్కడ మహరాష్ట్ర లో ఇంకో గొడవ ఉందండోయ్– అదేదో లీజ్ ఎగ్రీమెంట్ వ్రాయాలిట. ఆ లీజు కూడా 11 నెలలకి మాత్రమే. ఈ పుణ్యకాలం అయిపోగానే, ఓనర్ గారు అద్దె పెంచొచ్చట !!వీటికి సాయం ఇంటరెస్ట్ ఫ్రీ డిపాజిట్ ఒకటి. మనవైపు అయితే ఏదో రెండు నెలల అద్దె ఎడ్వాన్సు అడుగుతారు.ఇక్కడ దానికి డబల్ అంటే నాలుగు నెలల అద్దె ఇవ్వాలి. ఇప్పుడయితే ఫర్వాలేదు. మేము పూనా వచ్చిన కొత్తల్లో అంటే 1963 ప్రాంతాల్లో, అద్దెకు ఇల్లు కావాలంటే అదేదో ‘పగిడీ’ అని తీసికునేవాళ్ళు.అంటే ఇల్లు ఎప్పుడు ఖాళీ చేసినా, ఆ డబ్బు మాత్రం తిరిగి రాదు. అద్దె కొంచెం తక్కువగానే ఉండేది.

    ఏనాడో తండ్రి అద్దెకు తీసికొన్న ఇల్లు వంశపారంపర్యంగా కొడుక్కి కూడా వస్తుందన్నమాట.ఎన్నాళ్ళైనా అద్దె పెంచడానికి వీల్లేదు. కాల క్రమేణా, రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చిన తరువాత, ఆ బిల్డింగ్ లు అమ్మడానికి, ఈ అద్దెకున్నవాళ్ళకి ఎదురు కట్నం ఇవ్వాల్సి వచ్చేది.ఈ సందర్భంలో ఓ విషయం గుర్తొస్తుంది. మా అఫీసరు ఒక తెలుగాయన, విశ్రాంత వాడిలో ఓ ఇల్లు కట్టుకున్నారు. ఎదో తమ స్వంత జిల్లావాడు కదా అని ఇంకో తెలుగువాడికి అద్దెకిచ్చారు. ఈ అద్దెకు తీసికున్న పెద్దమనిషికి ఆ మాత్రం కృతజ్ఞత ఉండొద్దూ, ఖాళీ చేయడానికి నానా తిప్పలూ పెట్టాడు !! ఆ రోజుల్లో ఎవరికైనా అద్దెకివ్వాలంటే వెనుకాడేవారు.అవసరం అయితే ఇల్లు ఖాళీ చెయ్యడు, కావాలంటే కోర్ట్ కెళ్ళమంటాడు. ఆ కోర్ట్ లో సివిల్ కేసు తేలేటప్పడికి ఎవరికెవరో !!

    మహరాష్ట్ర ప్రభుత్వం ధర్మమా అని ఆ గొడవన్నీ మానేసి,ఇప్పుడు ఎవడికైనా కొంప కావాలంటే, ఓ స్టాంప్ పేపర్ మీద ఓ అగ్రీమెంట్ వ్రాసుకోవాల్సిందే !! ఎలాగైతెనే ఓ ఫ్రెండ్ రికమెండేషన్ ద్వారా ఓ రెండు రూమ్ముల పోర్షన్ సంపాదించాము.మా వాడిచేత గృహ ప్రవేశం చేయించాము. అద్దె 7500/- డిపాజిట్ 30,000. ఆ ఓనర్లు ఇంకో ఇల్లు కొనుక్కున్నారుట,అందుకని ఈ ఇల్లు అద్దెకిచ్చేశారు. ఈ ఇంటికి లిఫ్ట్ గొడవలేమీ లేవు.గ్రౌండ్ ఫ్లోర్ లోనే.వచ్చిన గొడవల్లా ఏమిటంటే, పార్కింగ్ ప్లేసులోనే కావలిసిన వాళ్ళకి ఓ ఫ్లాట్ కట్టి ఇచ్చేశాడు, ఆ బిల్డర్ ! దాంతోటి ఏమయ్యిందంటే, ఏ మధ్యాహ్నమో భోజనం చేసి పడుక్కుందామనుకుంటే ఎవడో ఒకడు ఏదో బైక్కో, స్కూటరో పేద్ద సౌండ్ చేసికుంటూ స్టార్ట్ చేస్తాడు. ఆ ఇంటికి సూర్య రశ్మి అనేది ఎక్కడా రాదు. అందుచేత ‘ కిరణ జన్య సంయోగ క్రియ'( ఫోటో సింథసిస్) కి ఆస్కారమే లేకుండా పోయింది !! దీని ధర్మమా అని, వాషింగ్ మెషీన్ లో ఉతికిన బట్టలు కూడా ఆరేవి కావు.

   వీటికి సాయం, ఆ వాచ్ మెన్నూ, మేమూ ఒకే స్థాయిలో ఉండేవాళ్ళం. తలుపుకి బయట వాడూ, లోపల మేమూ. ఎలాటివాడిని ఎలా అయ్యానురా బాబూ అనుకునేవాడిని!!ఆ మధ్యన మా అబ్బాయి యు.ఎస్. వెళ్ళవలసివస్తే, మేము,మాకోడలికీ, మనవరాలికీ తోడుందామని, మా స్వంత ఫ్లాట్ కి ఉండడానికి వెళ్ళాము. ఓ పది రోజుల తరువాత వచ్చేసరికి ఇల్లంతా పాడుపడినట్లైపోయింది. ఎంతైనా పదిహేనేళ్ళయింది ఆ ఇళ్ళు కట్టి.ఇదొకటే కాకుండా, మేము లేనప్పుడు, ఎలెక్ట్రిసిటీ ఆఫీసు వాడొచ్చి, మేము కరెంట్ బిల్లు కట్టలేదని, ఫ్యూజ్ తిసేసి పోయాడు. నేను బిల్లు వచ్చిన రెండో రోజుకల్లా కట్టేశాను. ఆ వచ్చినవాడు దీపావళి బక్షీసు కోసం వచ్చాడనుకుంటాను. ఇలాటి దరిద్రం ఈ 40 ఏళ్ళలోనూ ఎప్పుడూ జరగలేదు. అసహ్యం వేసేసింది.ఇంక ఇల్లు మార్చేయాలనే ఆలొచనొచ్చేసింది.

    మనకు ఆలోచన వచ్చేస్తే సరిపోతుందా, ఇదేమైనా బజార్లోకి వెళ్ళి కూరలు కొనడంలాటిదా? అయినా నేనూ, మా ఇంటావిడా కలిసి ఈవెనింగ్ వాక్ కి వెళ్ళినప్పుడల్లా, ఏ అపార్ట్మెంట్లో అయితే లైట్లుండవో, అవన్నీ ఖాళీయే అనే సూత్రం( థీరీ) పాటించి, అలాటివి వెదకడం మొదలెట్టాము. మా అదృష్టం కొద్దీ ప్రయత్నం మొదలెట్టిన రెండు రోజులకల్లా ఓ కొంప పట్టుకున్నాము. మిగిలిన వివరాలు రేపు !!

%d bloggers like this: