బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-టెలిపోన్ నంబర్లు

    మనలో చాలామందికి ఓ అలవాటు ఉంది.ఓ టేబుల్ మీద ఓ నోట్ ప్యాడ్ పెట్టుకుని, దానిలో ఏదో ఫోన్ నంబర్ రాసుకుంటాము.అలాగే ఓ కాగితం మీద కూడా రాసుకుంటాము.ఆనెంబర్ ఎవరిదో వ్రాయడం మర్చిపోతాము.ఎప్పుడో చూసినప్పుడు, మనం నోట్ చేసికున్న నెంబర్ ఎవరిదో ఛస్తే గుర్తుకు రాదు.కొంతమందైతే ఇలాటివన్నీ జాగ్రత్తగా మెయిన్టైన్ చేస్తారు.కానీ బధ్ధకం వివరాలు వ్రాయడానికి.

   మెము రాజమండ్రీ లో ఉన్నప్పుడు ఓ రోజున ఫోన్ రింగ్ అయితే తీశాను.అవతల మాట్లాడే ఆవిడ,ఎటువంటి నోటీసూ లేకుండా ‘మీరు వంట చేయడానికి ఏం తీసికుంటారూ?’అన్నారు.నాకైతే పేద్ద షాక్ ఇచ్చేసిందావిడ!!’చూడండమ్మా, నాకు తిండి తినడం తప్ప వంటలూ అవీ చేసే అలవాటు లేదూ. మా ఇంటావిడ రోజూ సణుగుతూంటుంది,ప్రతీ రోజూ నేనే చెయడం, ఒక్క రోజైనా మీరు చేయకూడదా, పైగా చిన్నప్పుడు, మీఇంట్లో అందరికీ చేసేవాడినని, ఊరికే గొప్పలు పోతారూ’ అని. ఇదిగో మీరు ఇలాటి ప్రశ్నలు వేసి, నా కాపురంలో చిచ్చు పెట్టకండమ్మా అని ఫోన్ పెట్టేయబోతుంటే, ఆవిడ ఇంకా ఆగక, ‘మీరు ఫలానాయేనా, వై జంక్షన్ లో మీ చుట్టాలున్నారా, ఫలానా వాళ్ళు మీచుట్టాలేనా, అంటూ ఏదో రిఫరెన్స్ ఇచ్చారు.’ చూడండి, మీరు చెప్పిన వాళ్ళు మా చుట్టాలే, మా మరదలు, నన్ను మరీ వంట బ్రాహ్మడు చేసెయ్యదు, మీరే ఏదో పొరబాటు పడి ఉంటారు’అన్నాను.’లేదండి, ఎవరైనా వంట బ్రాహ్మడుంటే నెంబర్ ఇయ్యమన్నానూ, తనే ఇచ్చింది’అని, ఆవిడ నేను వంట బ్రాహ్మణ్ణి కాదంటే ఒప్పుకోదే !!ఇలా కాదని, ఫోన్ పెట్టేశాను.

   మా మరదలికి ఫోన్ చేసి, ‘ఏమమ్మా, మేం మీకేం ద్రోహం చేశాం, ఇలా నాగురించి లేనిపోనివన్నీ అందరికీ చెప్తున్నావూ’ అన్నాను.తను సంగతేమితని అడిగింది. నాకు వచ్చిన ఫోన్ గురించీ,ఆ నంబర్ కూడా తనే ఇచ్చిన సంగతీ చెప్పాను.అసలు జరిగిందేమిటంటే, ఈ ఫోన్ చేసినావిడ చుట్టం ఒకరు, మా పై అంతస్థు లో ఉండేవారు.మా మరదలు ఈవిడకీ చుట్టం, వాళ్ళింటికి వెళ్ళినప్పుడు, గోదావరి గట్టు అపార్ట్మెంట్ లో, మా బావగారూ,అక్కయ్య గారూ ఉంటున్నారూ
అని చెప్పి మా ఫోన్ నంబర్ ఇచ్చిందిట. అంతకుముందే ఓ వంట బ్రాహ్మడుగారి నెంబరూ రాసుకుంది ఈవిడ. దానికిందే నా నెంబరూ రాసుకుంది.ఇదన్నమాట ఈ కన్ప్యూజన్ కి కారణం!! కొంతసేపైన తరువాత, ఆవిడ దగ్గరనుండి ఫోన్ వచ్చింది. ఈ సారి ఆవిడ ఏం అడుగుతుందో అని హడిలి పోయాను.అదేమీ లేకుండా, మనసారా, నోరారా క్షమాపణలు చెప్పడానికే చేశారు !! ఆ తరువాత మా కుటుంబంతో మంచి స్నేహం అయింది.

   అలాగే, మా ఇంటావిడకి కూడా అయింది–బ్లౌజులు కుట్టే ఓ మనిషి గురించి వెదుకుతూ, ఎవరో ఇస్తే ఓ నంబర్ సెల్ లో నోట్ చేసికుంది.ఆవిడ పేరు ‘సునీత’. ఇంకోసారి మరో ‘సునీత’ నంబర్ నోట్ చేసికుంది. వీళ్ళిద్దరికీ సునిత 1,
సునీత 2 అని గుర్తుగా నోట్ చేసికుంది. వాళ్ళే పనులు చేస్తారో నోట్ చేసికోలేదు. ఓ సారి అవసరం వచ్చి, ఓ సునీతకి ఫోన్ చేసి, బ్లౌజ్ పీసులున్నాయీ, వచ్చి కొల్తలు తీసికోండి అని ఫోన్ చేస్తే,ఆవిడేమో, నాకు బ్లౌజులూ అవీ కుట్టడంరాదు మొర్రో అంటుంది.
అందువలన, మనం ఎప్పుడైనా ఎవరిదైనా నంబర్ నోట్ చేసికోవలసివస్తే, ఆ నెంబర్ ఎదురుగా, వాళ్ళెవరో ఏమిటో కూడా వ్రాసేసుకుంటే ఇలాటి కష్టాలు రావు !!

   నాకు రాజమండ్రీ లో ఫోన్ డైరెక్టరీ వచ్చిన కొత్తలో, అమలాపురం ఫోన్ చేసి, మా చిన్ననాటి స్నేహితుడు, ధవళేశ్వరం లో ఉంటున్నాడని తెలిసి, అతన్ని వెదకడం మొదలెట్టాను.అతని పేరున్న ఓ ముగ్గురి నెంబర్లు పట్టుకున్నాను.మొదటి నెంబర్ కి ఫోన్ చేసి, ‘ఫలానా వారున్నారా’అని అడిగాను. ఆ ఫోన్ ఎత్తినతను ‘ అయ్యో ఆయన పోయి ఇవాళ్టికి నాలుగో రోజు’ అన్నాడు.’అయ్యో పాపం, సారీ ‘అని ఫోన్ పెట్టేశాను. రెండో నంబర్కి ఫోన్ చేస్తే, ఆ పేరుగలాయన(నేనెవరికోసం వెదుకుతున్నానో ఆయన) పోయి రెండు రోజులయిందన్నారు!! ఏనాటి ఋణమో, వాళ్ళకీ నాకూ, ఏ పరిచయం లేకుండా వాళ్ళగురించి అడిగాను!!

మూడో నంబర్ కి ఫోన్ చేయడానికి ధైర్యం చాల లేదు.అయినా ఏమైతేఅదే అవుతుందని ఫోన్ చేయగానే, నాక్కావలిసిన మనిషే దొరికాడు. అయినా నా సంతృప్తి కోసం–‘మీరు ఫలానాయేనా, అమలాపురమేనా,పూణే లోనూ, చెన్నైలోనూ
పనిచేశారా వగైరా వగైరా అన్నీ అడిగి కానీ, నా పేరు చెప్పుకోలేదు!!