బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-క్రొత్త పరిచయం

   ఈ వీకెండంతా మా అబ్బాయీ,కోడలూ, మనవరాలితో గడిపి ప్రొద్దుటే మా ‘గూటి’కి చేరాము. మధ్యాహ్నం ‘సుందరకాండ’ సినిమా వస్తూంటే చూస్తూ కూర్చొన్నాను.సాయంత్రం 5 దాకా దానితో కాలక్షేపం అయింది.సరే కంప్యూటర్ దగ్గరకు వద్దామనుకుంటే, అప్పటికే మా ఇంటావిడ అక్కడే సెటిల్ అయి కనిపించింది. ఇప్పుడే కూర్చొన్నాను,అప్పుడే తయారా అంది.ఇదికాదు పధ్ధతీ అని రిలాక్స్ అవుతున్నాను. ఇంతలో ‘మీ ఫ్రెండెవరో ఆన్లైన్ లో హల్లో అంటున్నారూ, చూడండి’ అంది. దొరికిందే చాన్స్ అని వచ్చి చూస్తే ఇందుకూరి శ్రీనివాస రాజు ( తెలుగు బ్లాగర్–‘పడమటి గోదావరి రాగం’ ).అతను పూణే లోనే ఉన్నానని చెప్పాడు.సరే ఎక్కడా అని అడిగితే మేము ఉండే ప్రదేశానికి కొంచెం దూరం లోనే ఉన్నాడని తెలిసి, మేం ఉండే ఏరియా చెప్పి రమ్మన్నాను.

    ఓ పదిహేను నిమిషాల్లో సాయంత్రం 6.15 కి వచ్చాడు.ఏదో ఫార్మల్ పరిచయాలూ అవీ అయిన తరువాత ఇంక ఖబుర్లు మొదలెట్టాము.మర్చిపోయానండోయ్ చెప్పడం, వచ్చేటప్పుడు నా పేవరెట్ బెల్లం మిఠాయి తెచ్చాడు.ఇంతా చేస్తే, శ్రీనివాసరాజు, మా అబ్బాయికంటె ఓ నాలుగు రోజులు మాత్రమే చిన్న ! ఇతనితో ఏం మాట్లాడతాములే అని కొంచెం సంకోచించాను.ముందర ‘మీరూ’ అని ఎడ్రస్ చేసి, ‘నువ్వు’ లోకి దిగిపోయాను. పాపం మొహమ్మాటానికి ‘పరవా లేదండీ’ అన్నాడనుకోండి. ఏదో నా వయస్సు అడ్డంపెట్టుకొని,ఇలా జబర్దస్తీ చేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు?

   ఎవరైనా కొత్తవాళ్ళు వస్తే నన్ను పట్టుకునే వాడెవరూ? అవతలి వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా ఏదో వాగేస్తూంటాను.మా ఇంటావిడ అనేదేమిటంటే’అస్తమానూ మీరే మాట్లాడుతారూ, అవతలి వాళ్ళకు ఛాన్సెక్కడిస్తారూ’అని.అంటే ‘ప్రతీ రోజూ నువ్వు మాట్లాడేవన్నీ వింటున్నానా లేదా, ఏదో దొరక్క దొరక్క ఛాన్సొస్తే నీకెందుకూ దుగ్ధ ‘ అంటూంటాను ! మా దెబ్బలాట చూసి ఆ వచ్చిన అబ్బాయి హడలిపోతాడేమో అని నా బెంగ.బ్లాగ్గులమీద కొంచెంసేపు మాట్లాడుకున్నాము.తను తెలుగులో మొదట బ్లాగ్గు ప్రారంభించినప్పుడు ఎలా ఉండేదో, తనని సీనియర్ బ్లాగర్లు ఎలా ప్రోత్సహించేవారో అన్నీ చెప్పాడు.నా గొడవేదో నేను చెప్పాను.
అవీ ఇవీ ఖబుర్లు చెప్పుకుంటూంటే మధ్యలో అతని భార్య దగ్గరనుండి ఫోన్ వచ్చింది, దానికి సమాధానంగా ‘ఇదిగో వచ్చేస్తున్నాను పది నిమిషాల్లో’అన్నాడు. ‘ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి వచ్చానండి, అప్పుడే 2 గంటలయింది’ అన్నాడు.
అన్ని ఖబుర్లూ పూర్తి చేసికొని, ఇంక క్రిందికి వచ్చి ఇంకో అరగంట ఖబుర్లు చెప్పుకున్నాము! అంతా కలిపి 3 గంటలు పూర్తయింది ! చెప్పొచ్చేదేమిటంటే, నేను ఒక పూర్వ పరిచయం లేని వ్యక్తిని మూడు గంటల సేపు కూర్చోపెట్టకలిగాను.

   మా ఇంటావిడంటుందీ ‘ పాపం మీరు చెప్పే లెక్చర్ వినలేక ఎంత బాధపడ్డాడో, మొదటిసారే అలా భయ పెట్టేస్తే ఇంకోసారి మళ్ళీ అడుగెట్టడు’అని.
ఈ సారి వచ్చేటప్పుడు తన భార్యని తీసికొస్తానని,చెప్పాడు. చూద్దాం! నాతో ఖబుర్లు నచ్చాయో లేక బోరు కొట్టాయో! నా అనుభవంలో ఉన్న విషయం ఏమంటే, ఎవరైనా సరే, బయటివాళ్ళతో గడపడానికి ఎప్పుడూ ముందే ఉంటారు!ఇంట్లో వాళ్ళకి వీళ్ళ విషయం అంతా ముందే తెలుసుగా! చెప్పిందే చెప్తూ, విన్నదే వింటూ ఎన్నిసార్లు ఓపిక పడతారూ? దేనికైనా ‘ ప్రెష్ నెస్’ అనేది ఉంటేనే అందరికీ బాగుంటుంది.
Thank you Srinivas, for the nice company you gave us. God Bless you& your wife.

%d bloggers like this: