బాతాఖానీ- లక్ష్మిఫణి కబుర్లు-Best of Both Worlds–2

   ముందుగా వెళ్ళి అక్కడి వాచ్ మన్ ని పట్టుకున్నాము.అదేమిటో నాకీ వాచ్ మన్లతో అనుబంధం పెరిగిపోతూంది!! వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓ పోర్ష ఖాళీ ఉంది.ఆ ఫ్లాట్ ఓనర్ ఓ అమ్మాయి, పెళ్ళిచేసికొని, యు.ఎస్. వెళ్ళిపోయిందిట, ఎలాగో ఆవిడ మెయిల్ ఐ.డి పుచ్చుకొని ఓ మెయిల్ పంపేశాను. మర్నాటికి, ఆ అపార్త్మెంట్ కొసం ఎవరినైతే సంప్రదించాలో అతని కాంటాక్ట్ నెంబర్ పంపారు. ఏమైతేనే వెదికి ఆ పెద్దమనిషిని పట్టుకున్నాము.ఇన్ని తిప్పలూ పడి, తీరా వెళ్ళి చూస్తే దాన్నిండా ఆ అమ్మాయి సామాన్లున్నాయి. కట్నం తో పాటు ఓ ఫ్రిజ్, రెండు డబల్ కాట్లూ, ఓ సోఫా సెట్టూ ఉన్నాయి. ఇంక దానిలో నా సామాన్లెలా పడతాయీ?

    రాజమండ్రీ లో మూడు రూమ్ముల ఫ్లాట్ లో ఉన్న సామానంతా ఎలాగో ముందుగా తీసికొన్న రెండు రూమ్ముల్లొ సద్దాము. ఇదేమో సింగిల్ బెడ్ రూం ఫ్లాట్. సైకలాజికల్ గా సింగిల్ బెడ్ రూం, హాల్, కిచెన్ లో సద్దేసుకోవడానికి సిధ్ధ పడ్డాము, కానీ అప్పటికే సామాన్లున్న కొంపలో ఎలాగ? రెడ్డొచ్చె మొదలు అన్నట్లు, మళ్ళీ వేట ప్రారంభం!! కానీ ఆ సొసైటీ చాలా బాగుంది, ఎలాగైనా అక్కడ ఏదైనా ఖాళీ అవుతే బాగుండుననిపించింది. ఈ నా తిక్కశంకరయ్య కోరికలన్నీ ఆ భగవంతుడు వింటాడు కాబోలు, మర్నాడే అదే సొసైటీ లో ఇంకో ఫ్లాట్ ఖాళీ అవుతోందని తెలిసి, ఆ ఓనర్ని పట్టేశాను.వాళ్ళతో ఆ ఫ్లాట్ చూసుకొన్నాము. నచ్చేసింది. మా కండిషన్లు అన్నీ ( అంటే ప్రతీ పదకొండు నెలలకీ ఖాళీ చేయమనకూడదు) ఒప్పుకున్నారు! నా అదృష్టమేమిటో తెలియదు, నాకు ఇప్పటిదాకా దొరికిన ఓనర్లు ( రాజమండ్రీ లో ఇద్దరూ, ఇక్కడ ఇద్దరూ) చాలా మంచివాళ్ళు.1963 నుండి 1974 దాకా నేను ఇళ్ళ ఓనర్లు కూడా !!
ఇంక పాత ఓనరుతో ఈ శుభవార్త చెప్పడం ఎలాగా? ఆయనతో ఎగ్రీమెంట్ ప్రకారం ఓ నెల నోటీసు ఇవ్వాలి. పాపం ఆ పెద్దమనిషి, ఎటువంటి ప్రోబ్లెం లేకుండా, డిపాజిట్ డబ్బులు తిరిగి ఇచ్చేశారు. గాడ్ బ్లెస్ హిం !!ఇంక కొత్త ఓనర్ కి డబ్బులు ఇచ్చేసి, ఈ కొత్త ఫ్లాట్ లోకి మారిపోయాము డిసెంబర్ ఒకటో తారీకున.

   ఇంత హడావిడి లోనూ ఓ విషయం నాకు ఎప్పటికీ అర్ధం అవదు. రాజమండ్రీ లో ముందర రామాలయం సెంటర్ లో రెండు బెడ్ రూంలు, గోదావరి గట్టుమీద మూడు బెడ్ రూంలూ, మళ్ళీ పూణేలో ముందర రెండు బెడ్రూంలూ, సామానేమయినా అమ్మేశామా ? లేదు. మరి ఆ ట్రక్కు సామానూ ఈ సింగిల్ బెడ్ రూం హాల్ కిచెన్ లో హాయిగా ఏ ఇరుకూ లేకుండా, మా ఇంటావిడ ఎలా సద్దేసిందో !! మా అమ్మాయికి భయం, ఈ కొత్త ఫ్లాట్ లో ఎక్కువైన సామాన్లు
వాళ్ళింట్లో ఎక్కడ పెట్టమంటామో అని ( అందులో ఓ సొఫా సెట్ వాళ్ళదే !) ముందరే చెప్పేసింది, మీకు ఇరుకయితే అమ్మేయండి అంతే కానీ నా నెత్తిమీద పెట్టకండి అని!

   అన్నీ బాగానే ఉన్నాయి కానీ, వీకెండ్స్ లో అమ్మాయీ, అబ్బాయీ ఫామిలీలతో వస్తే, పెద్దవాళ్ళం మా ఆరుగురికీ హాల్లో కావలిసినంత ప్లేస్ ఉంది కానీ, మా ఇద్దరు మనవరాళ్ళూ, మనవడికీ ప్లేసు సరిపోవడం లేదు!పెద్ద మనవరాలు 10 ఏళ్లది కాబట్టి మాతోనే కూర్చుంటుంది. వచ్చిన గొడవల్లా మిగిలిన ఇద్దరు ‘చిటుకూ’ లతోనే !! వాళ్ళకి జంప్ చేయడానికి ప్లేసు దొరకడం లేదు !!మొదటి సారి చూసిన తరువాత,పిల్లలే ఎడ్జస్ట్ అయిపోయారు. శుక్రవారం అమ్మాయీ పిల్లలూ, శనాదివారాల్లో అబ్బాయీ కోడలూ, మనవరాలూనూ వస్తున్నారు. త్వరలో ఇంకో మనవడో, మనవరాలో వచ్చిన తరువాత ఇంటికి పూర్తి షేప్ వచ్చినట్లే. ఓ వారం అమ్మాయి దగ్గరకూ, ఓ వారం అబ్బాయి దగ్గరకూ వెళ్తాము. ఎంత రాత్రయినా కారు లో దిగబెట్టేస్తున్నారు.

   ఏది ఏమైనా ప్రాణానికి హాయిగా ఉంది.మా ఇంటావిడకి తుడుచుకోవడం ఈజీ అయింది. నాక్కూడా ‘ప్రొహిబిటెడ్’ ప్లేసులు తగ్గాయి( ఆవిడ తడిగుడ్డతో తుడుస్తూంటే!). మహా అయితే కాళ్ళు సోఫాలో పెట్టుకోమంటుంది.నా కాలక్షేపం నాకుంది–బ్లాగ్గులూ, నా మిస్టరీ షాప్పింగూ. పూణే వచ్చిన తరువాత ఇప్పటికి ఓ అర డజను చేశాను ( షాపర్స్ స్టాప్, క్రోమా ). నా ఉద్దేశ్యం లో ఎవరి స్పేస్ వారికి ఉండాలి. ఓ ఫోన్ కాల్ వేటులో ఉన్నాము.
భగవంతుడి దయ ఇలాగే మాకు సర్వదా ఉండాలని ప్రార్ధిస్తూ !! ఇప్పుడు అర్ధం అయిందా ఈ పోస్ట్ కి పేరు’ Best of Both Worlds’ ఎందుకు పెట్టానో !!

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–అంకెల ఆటగాడు

Ramaanujan

ప్రతీ భారతీయుడూ గర్వపడేలా చేసిన మహత్తర వ్యక్తికి నివాళి. ‘ఈనాడు’ లో వచ్చిన వ్యాసం.

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–“స్వర్గమంటే ఇదేరా “

Swargam

ఈ శీర్షికతో ఈనాడు లో డాక్టర్.యల్లాప్రగడ మల్లిఖార్జున రావు గారి వ్యాసం, చదివి ఆనందించండి.