బాతాఖానీ- లక్ష్మిఫణి కబుర్లు-Best of Both Worlds–2

   ముందుగా వెళ్ళి అక్కడి వాచ్ మన్ ని పట్టుకున్నాము.అదేమిటో నాకీ వాచ్ మన్లతో అనుబంధం పెరిగిపోతూంది!! వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓ పోర్ష ఖాళీ ఉంది.ఆ ఫ్లాట్ ఓనర్ ఓ అమ్మాయి, పెళ్ళిచేసికొని, యు.ఎస్. వెళ్ళిపోయిందిట, ఎలాగో ఆవిడ మెయిల్ ఐ.డి పుచ్చుకొని ఓ మెయిల్ పంపేశాను. మర్నాటికి, ఆ అపార్త్మెంట్ కొసం ఎవరినైతే సంప్రదించాలో అతని కాంటాక్ట్ నెంబర్ పంపారు. ఏమైతేనే వెదికి ఆ పెద్దమనిషిని పట్టుకున్నాము.ఇన్ని తిప్పలూ పడి, తీరా వెళ్ళి చూస్తే దాన్నిండా ఆ అమ్మాయి సామాన్లున్నాయి. కట్నం తో పాటు ఓ ఫ్రిజ్, రెండు డబల్ కాట్లూ, ఓ సోఫా సెట్టూ ఉన్నాయి. ఇంక దానిలో నా సామాన్లెలా పడతాయీ?

    రాజమండ్రీ లో మూడు రూమ్ముల ఫ్లాట్ లో ఉన్న సామానంతా ఎలాగో ముందుగా తీసికొన్న రెండు రూమ్ముల్లొ సద్దాము. ఇదేమో సింగిల్ బెడ్ రూం ఫ్లాట్. సైకలాజికల్ గా సింగిల్ బెడ్ రూం, హాల్, కిచెన్ లో సద్దేసుకోవడానికి సిధ్ధ పడ్డాము, కానీ అప్పటికే సామాన్లున్న కొంపలో ఎలాగ? రెడ్డొచ్చె మొదలు అన్నట్లు, మళ్ళీ వేట ప్రారంభం!! కానీ ఆ సొసైటీ చాలా బాగుంది, ఎలాగైనా అక్కడ ఏదైనా ఖాళీ అవుతే బాగుండుననిపించింది. ఈ నా తిక్కశంకరయ్య కోరికలన్నీ ఆ భగవంతుడు వింటాడు కాబోలు, మర్నాడే అదే సొసైటీ లో ఇంకో ఫ్లాట్ ఖాళీ అవుతోందని తెలిసి, ఆ ఓనర్ని పట్టేశాను.వాళ్ళతో ఆ ఫ్లాట్ చూసుకొన్నాము. నచ్చేసింది. మా కండిషన్లు అన్నీ ( అంటే ప్రతీ పదకొండు నెలలకీ ఖాళీ చేయమనకూడదు) ఒప్పుకున్నారు! నా అదృష్టమేమిటో తెలియదు, నాకు ఇప్పటిదాకా దొరికిన ఓనర్లు ( రాజమండ్రీ లో ఇద్దరూ, ఇక్కడ ఇద్దరూ) చాలా మంచివాళ్ళు.1963 నుండి 1974 దాకా నేను ఇళ్ళ ఓనర్లు కూడా !!
ఇంక పాత ఓనరుతో ఈ శుభవార్త చెప్పడం ఎలాగా? ఆయనతో ఎగ్రీమెంట్ ప్రకారం ఓ నెల నోటీసు ఇవ్వాలి. పాపం ఆ పెద్దమనిషి, ఎటువంటి ప్రోబ్లెం లేకుండా, డిపాజిట్ డబ్బులు తిరిగి ఇచ్చేశారు. గాడ్ బ్లెస్ హిం !!ఇంక కొత్త ఓనర్ కి డబ్బులు ఇచ్చేసి, ఈ కొత్త ఫ్లాట్ లోకి మారిపోయాము డిసెంబర్ ఒకటో తారీకున.

   ఇంత హడావిడి లోనూ ఓ విషయం నాకు ఎప్పటికీ అర్ధం అవదు. రాజమండ్రీ లో ముందర రామాలయం సెంటర్ లో రెండు బెడ్ రూంలు, గోదావరి గట్టుమీద మూడు బెడ్ రూంలూ, మళ్ళీ పూణేలో ముందర రెండు బెడ్రూంలూ, సామానేమయినా అమ్మేశామా ? లేదు. మరి ఆ ట్రక్కు సామానూ ఈ సింగిల్ బెడ్ రూం హాల్ కిచెన్ లో హాయిగా ఏ ఇరుకూ లేకుండా, మా ఇంటావిడ ఎలా సద్దేసిందో !! మా అమ్మాయికి భయం, ఈ కొత్త ఫ్లాట్ లో ఎక్కువైన సామాన్లు
వాళ్ళింట్లో ఎక్కడ పెట్టమంటామో అని ( అందులో ఓ సొఫా సెట్ వాళ్ళదే !) ముందరే చెప్పేసింది, మీకు ఇరుకయితే అమ్మేయండి అంతే కానీ నా నెత్తిమీద పెట్టకండి అని!

   అన్నీ బాగానే ఉన్నాయి కానీ, వీకెండ్స్ లో అమ్మాయీ, అబ్బాయీ ఫామిలీలతో వస్తే, పెద్దవాళ్ళం మా ఆరుగురికీ హాల్లో కావలిసినంత ప్లేస్ ఉంది కానీ, మా ఇద్దరు మనవరాళ్ళూ, మనవడికీ ప్లేసు సరిపోవడం లేదు!పెద్ద మనవరాలు 10 ఏళ్లది కాబట్టి మాతోనే కూర్చుంటుంది. వచ్చిన గొడవల్లా మిగిలిన ఇద్దరు ‘చిటుకూ’ లతోనే !! వాళ్ళకి జంప్ చేయడానికి ప్లేసు దొరకడం లేదు !!మొదటి సారి చూసిన తరువాత,పిల్లలే ఎడ్జస్ట్ అయిపోయారు. శుక్రవారం అమ్మాయీ పిల్లలూ, శనాదివారాల్లో అబ్బాయీ కోడలూ, మనవరాలూనూ వస్తున్నారు. త్వరలో ఇంకో మనవడో, మనవరాలో వచ్చిన తరువాత ఇంటికి పూర్తి షేప్ వచ్చినట్లే. ఓ వారం అమ్మాయి దగ్గరకూ, ఓ వారం అబ్బాయి దగ్గరకూ వెళ్తాము. ఎంత రాత్రయినా కారు లో దిగబెట్టేస్తున్నారు.

   ఏది ఏమైనా ప్రాణానికి హాయిగా ఉంది.మా ఇంటావిడకి తుడుచుకోవడం ఈజీ అయింది. నాక్కూడా ‘ప్రొహిబిటెడ్’ ప్లేసులు తగ్గాయి( ఆవిడ తడిగుడ్డతో తుడుస్తూంటే!). మహా అయితే కాళ్ళు సోఫాలో పెట్టుకోమంటుంది.నా కాలక్షేపం నాకుంది–బ్లాగ్గులూ, నా మిస్టరీ షాప్పింగూ. పూణే వచ్చిన తరువాత ఇప్పటికి ఓ అర డజను చేశాను ( షాపర్స్ స్టాప్, క్రోమా ). నా ఉద్దేశ్యం లో ఎవరి స్పేస్ వారికి ఉండాలి. ఓ ఫోన్ కాల్ వేటులో ఉన్నాము.
భగవంతుడి దయ ఇలాగే మాకు సర్వదా ఉండాలని ప్రార్ధిస్తూ !! ఇప్పుడు అర్ధం అయిందా ఈ పోస్ట్ కి పేరు’ Best of Both Worlds’ ఎందుకు పెట్టానో !!

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–అంకెల ఆటగాడు

Ramaanujan

ప్రతీ భారతీయుడూ గర్వపడేలా చేసిన మహత్తర వ్యక్తికి నివాళి. ‘ఈనాడు’ లో వచ్చిన వ్యాసం.

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–“స్వర్గమంటే ఇదేరా “

Swargam

ఈ శీర్షికతో ఈనాడు లో డాక్టర్.యల్లాప్రగడ మల్లిఖార్జున రావు గారి వ్యాసం, చదివి ఆనందించండి.

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు– Best of both Worlds !!–1

   మేము రాజమండ్రీ నుండి పూణే రావడానికి కారణాలు చెప్పానుగా. అక్కడ ఉన్న ఏణ్ణర్ధం లోనూ, అన్ని రకాల సామాన్లూ కొనేశాను. ఇక్కడ ఉన్న ఫ్లాట్ లో సామాన్లు ఏదీ కదపకుండా, అన్నీ మళ్ళీ కొన్నాను. ఇక్కడకు రావడానికి ఓ ట్రక్కు ఎరేంజ్ చేయవలసి వచ్చింది.ఈ సామాన్లన్నీ మా డిజైనర్ ఫ్లాట్ లో పట్టవూ, ఎలాగరా భగవంతుడా అనుకున్నాను. మా అబ్బాయంటాడూ, ఆ సామాన్లన్నీ అమ్మేసి వచ్చేయండీ అని.నేనేమో ఓ లక్ష రూపాయలు పెట్టి కొన్న సరుకంతా అమ్మడం మొదలెడితే, పదివేలు కూడా రాదు. పైగా ఆ కొత్త వస్తువులు అన్నీ అనుభవించినట్లూ ఉండదు. ఇదికాదు పధ్ధతి నాన్నా, నేను ఓ ఫ్లాట్ అద్దెకు తీసికుంటానూ, దాంట్లో మేముంటామూ, నీదగ్గరకీ, అక్క దగ్గరకీ వెళ్తూ వస్తూంటాము. మీరు కూడా వీకెండ్స్ లో మా దగ్గరకి వస్తూండండి అని వాడికి నచ్చచెప్పి, ఎలాగైతేనే పూణే లో మేము ఇంకో ఫ్లాట్లో ఉండడానికి రంగం సిధ్ధం చేశాను.ఇంకో ఇల్లు కొనడం తరువాత చూసుకోవచ్చూ,అనుకొని అద్దె ఇల్లుకి ప్రయత్నం మొదలెట్టాము.

   ఏజెంట్ ద్వారా వెళ్దామంటే, ఉత్తి పుణ్యాన్న వాడికి ఇంటికి ఇచ్చే అద్దె లో 2 శాతం వాడికిచ్చుకోవాలి. ఏజెంట్ ద్వారా కాకుండా ఓనర్నే పట్టుకుని సంపాదించాలనే ఏకైక ధ్యేయంతో ‘ ఇళ్ళ వేట’ మొదలెట్టాము.ఇక్కడ మహరాష్ట్ర లో ఇంకో గొడవ ఉందండోయ్– అదేదో లీజ్ ఎగ్రీమెంట్ వ్రాయాలిట. ఆ లీజు కూడా 11 నెలలకి మాత్రమే. ఈ పుణ్యకాలం అయిపోగానే, ఓనర్ గారు అద్దె పెంచొచ్చట !!వీటికి సాయం ఇంటరెస్ట్ ఫ్రీ డిపాజిట్ ఒకటి. మనవైపు అయితే ఏదో రెండు నెలల అద్దె ఎడ్వాన్సు అడుగుతారు.ఇక్కడ దానికి డబల్ అంటే నాలుగు నెలల అద్దె ఇవ్వాలి. ఇప్పుడయితే ఫర్వాలేదు. మేము పూనా వచ్చిన కొత్తల్లో అంటే 1963 ప్రాంతాల్లో, అద్దెకు ఇల్లు కావాలంటే అదేదో ‘పగిడీ’ అని తీసికునేవాళ్ళు.అంటే ఇల్లు ఎప్పుడు ఖాళీ చేసినా, ఆ డబ్బు మాత్రం తిరిగి రాదు. అద్దె కొంచెం తక్కువగానే ఉండేది.

    ఏనాడో తండ్రి అద్దెకు తీసికొన్న ఇల్లు వంశపారంపర్యంగా కొడుక్కి కూడా వస్తుందన్నమాట.ఎన్నాళ్ళైనా అద్దె పెంచడానికి వీల్లేదు. కాల క్రమేణా, రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చిన తరువాత, ఆ బిల్డింగ్ లు అమ్మడానికి, ఈ అద్దెకున్నవాళ్ళకి ఎదురు కట్నం ఇవ్వాల్సి వచ్చేది.ఈ సందర్భంలో ఓ విషయం గుర్తొస్తుంది. మా అఫీసరు ఒక తెలుగాయన, విశ్రాంత వాడిలో ఓ ఇల్లు కట్టుకున్నారు. ఎదో తమ స్వంత జిల్లావాడు కదా అని ఇంకో తెలుగువాడికి అద్దెకిచ్చారు. ఈ అద్దెకు తీసికున్న పెద్దమనిషికి ఆ మాత్రం కృతజ్ఞత ఉండొద్దూ, ఖాళీ చేయడానికి నానా తిప్పలూ పెట్టాడు !! ఆ రోజుల్లో ఎవరికైనా అద్దెకివ్వాలంటే వెనుకాడేవారు.అవసరం అయితే ఇల్లు ఖాళీ చెయ్యడు, కావాలంటే కోర్ట్ కెళ్ళమంటాడు. ఆ కోర్ట్ లో సివిల్ కేసు తేలేటప్పడికి ఎవరికెవరో !!

    మహరాష్ట్ర ప్రభుత్వం ధర్మమా అని ఆ గొడవన్నీ మానేసి,ఇప్పుడు ఎవడికైనా కొంప కావాలంటే, ఓ స్టాంప్ పేపర్ మీద ఓ అగ్రీమెంట్ వ్రాసుకోవాల్సిందే !! ఎలాగైతెనే ఓ ఫ్రెండ్ రికమెండేషన్ ద్వారా ఓ రెండు రూమ్ముల పోర్షన్ సంపాదించాము.మా వాడిచేత గృహ ప్రవేశం చేయించాము. అద్దె 7500/- డిపాజిట్ 30,000. ఆ ఓనర్లు ఇంకో ఇల్లు కొనుక్కున్నారుట,అందుకని ఈ ఇల్లు అద్దెకిచ్చేశారు. ఈ ఇంటికి లిఫ్ట్ గొడవలేమీ లేవు.గ్రౌండ్ ఫ్లోర్ లోనే.వచ్చిన గొడవల్లా ఏమిటంటే, పార్కింగ్ ప్లేసులోనే కావలిసిన వాళ్ళకి ఓ ఫ్లాట్ కట్టి ఇచ్చేశాడు, ఆ బిల్డర్ ! దాంతోటి ఏమయ్యిందంటే, ఏ మధ్యాహ్నమో భోజనం చేసి పడుక్కుందామనుకుంటే ఎవడో ఒకడు ఏదో బైక్కో, స్కూటరో పేద్ద సౌండ్ చేసికుంటూ స్టార్ట్ చేస్తాడు. ఆ ఇంటికి సూర్య రశ్మి అనేది ఎక్కడా రాదు. అందుచేత ‘ కిరణ జన్య సంయోగ క్రియ'( ఫోటో సింథసిస్) కి ఆస్కారమే లేకుండా పోయింది !! దీని ధర్మమా అని, వాషింగ్ మెషీన్ లో ఉతికిన బట్టలు కూడా ఆరేవి కావు.

   వీటికి సాయం, ఆ వాచ్ మెన్నూ, మేమూ ఒకే స్థాయిలో ఉండేవాళ్ళం. తలుపుకి బయట వాడూ, లోపల మేమూ. ఎలాటివాడిని ఎలా అయ్యానురా బాబూ అనుకునేవాడిని!!ఆ మధ్యన మా అబ్బాయి యు.ఎస్. వెళ్ళవలసివస్తే, మేము,మాకోడలికీ, మనవరాలికీ తోడుందామని, మా స్వంత ఫ్లాట్ కి ఉండడానికి వెళ్ళాము. ఓ పది రోజుల తరువాత వచ్చేసరికి ఇల్లంతా పాడుపడినట్లైపోయింది. ఎంతైనా పదిహేనేళ్ళయింది ఆ ఇళ్ళు కట్టి.ఇదొకటే కాకుండా, మేము లేనప్పుడు, ఎలెక్ట్రిసిటీ ఆఫీసు వాడొచ్చి, మేము కరెంట్ బిల్లు కట్టలేదని, ఫ్యూజ్ తిసేసి పోయాడు. నేను బిల్లు వచ్చిన రెండో రోజుకల్లా కట్టేశాను. ఆ వచ్చినవాడు దీపావళి బక్షీసు కోసం వచ్చాడనుకుంటాను. ఇలాటి దరిద్రం ఈ 40 ఏళ్ళలోనూ ఎప్పుడూ జరగలేదు. అసహ్యం వేసేసింది.ఇంక ఇల్లు మార్చేయాలనే ఆలొచనొచ్చేసింది.

    మనకు ఆలోచన వచ్చేస్తే సరిపోతుందా, ఇదేమైనా బజార్లోకి వెళ్ళి కూరలు కొనడంలాటిదా? అయినా నేనూ, మా ఇంటావిడా కలిసి ఈవెనింగ్ వాక్ కి వెళ్ళినప్పుడల్లా, ఏ అపార్ట్మెంట్లో అయితే లైట్లుండవో, అవన్నీ ఖాళీయే అనే సూత్రం( థీరీ) పాటించి, అలాటివి వెదకడం మొదలెట్టాము. మా అదృష్టం కొద్దీ ప్రయత్నం మొదలెట్టిన రెండు రోజులకల్లా ఓ కొంప పట్టుకున్నాము. మిగిలిన వివరాలు రేపు !!

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–‘ మాకొద్దీ తెల్లదొరతనం’

garimella

  ఈ పాట ఈ రోజుల్లో రిలవెంట్ కాకపోవచ్చు. మా చిన్నప్పుడు, ఏ నోట విన్నా ఈ పాటే. ఆ పాట వ్రాసిన శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారిని సంస్మరించుకుందాం.

బాతాఖానీ–లక్ష్మిఫణి కబుర్లు–పేర్లు

   మా చిన్నప్పుడు ఒక్కొక్క ఇంటిలోనూ కనీసం అయిదారుగురు సంతానం (3+3) లేక (4+2) ముందరిది మొగ పిల్లల సంఖ్యా, రెండోది ఆడ పిల్లల సంఖ్యా.ఎక్కడో రేర్ గా ( 1+5 ) ఉండేవారు.ఇంక వాళ్ళకి పేర్లు పెట్టడం లో ఒక పధ్ధతి ఉండేది. ఇంటికి పెద్ద అబ్బాయికి తాత(తండ్రిగారి తండ్రి) గారి పేరు ఫిక్స్! రెండో వాడికి అమ్మగారివైపు తాతగారి పేరు.ఆమూడో వాడు వాళ్ళు మొక్కుకున్న దేముడి పేరు. అస్సలు రెండు వైపుల తాతలు,మామ్మ,అమ్మమ్మల పేర్లు వంతులవారీగా పెట్టడానికేనేమో ఇంటినిండా అంతమంది పిల్లలు !!   ఈ పేర్లలో వాళ్ళ ఇష్టదైవాలు వీలున్నన్ని ఇరికించేయడం. అన్నీ కలిపి ఈ అబ్బాయి పేరు ఎస్.ఎస్.ఎల్.సీ పుస్తకంలో రెండు లైన్లలో వ్రాయవలసి వచ్చేది!!ఉదాహరణకి … వీరవెంకటసత్యమార్కండేయనరసింహ….ఏదో రావో,శర్మో,వర్మో. ఎవరికి తోచినది వాళ్ళు పిలిచేవారు.కీర్తిశేషులైన భర్త గారి పేరుండడం వలన మామ్మగారు, తన నోటితో ఆ పేరు ఉఛ్ఛరించేవారు కాదు.ఇందులో ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉండేది, ఎవరూ వీడిని ఒక్కమాటన్నా ఊరుకునేది కాదు. మా పెద్దన్నయ్య గారిది మా తాత గారి పేరు అందువలన ఆయనని ‘నాన్నారూ’ అని పిలిచేవారు మానాన్నగారు. రెండో ఆయన పేరు మా ఇంకో తాత గారి పేరు, అందువలన ఆయనని, మా అమ్మమ్మ గారు’చిట్టిపంతులూ’ అనేవారు.

ఇంత పేద్దపేరు పలకలేక ఏదో ముద్దుపేర్లు పెడతారు. చంటి,పంతులూ,అబ్బాయి,… ఇంక వీళ్ళు జీవితాంతం ఆ ముద్దుపేరుతోనే చలామణి అవుతారు. పంతులు మావయ్య, అబ్బాయి మావయ్య అంటూ. ఇంట్లో ఒక్కళ్ళకి పెద్దబ్బాయీ, రెండో వాడికి చిన్నబ్బాయీ, మూడో వాడికి బుల్లబ్బాయీ. మాకు ఓ పోస్ట్ మాస్టారుండే వారు, ఆయనని అందరూ బుల్లబ్బాయి అని పిలిచేవారు. ఆయన పేరేమిటో ఆయనే మరచిపోయుంటారు!!

ఇంక ఆడ పిల్లలకి చిట్టి, బేబీ, పాపాయి,చిన్న చెల్లీ, పెద్ద చెల్లీ –అందరూ ఇలాగే పిలిచేవారు. ఆఖరికి ఆ ‘చిన్నచెల్లి’ అనే ప్రాణిని ఆవిడ భర్త కూడా. మా అమ్మగారిని ‘చిట్టి అమ్మన్న’ అనేవారు.అందరికీ ఆవిడ ‘చిట్టి పిన్ని’ గానే తెలుసు.మా పెద్దమ్మగారొకరు ఉండెవారు, ఆవిడ అందరికీ చిన్నక్కయ్యే. ఏమిటో అసలు చుట్టరికం ఏమిటో తెలిసేది కాదు. మా పిన్ని గారిని’ బంగారం’ అనేవారు.పేరు ఏ రామలక్ష్మో అయితే ‘రామం’ అనేవారు. ఈ రామం అనే వ్యక్తి మొగో, ఆడో బయటవాళ్ళకి ఎవరికీ తెలిసేది కాదు.మాకో వెంకటం పిన్ని ఉండేవారు–ఆవిడపేరు వెంకట లక్ష్మి.సూర్య తో వచ్చేపేరైతే ‘సూరీడు’ గ్రాంట్ అయేది.చంద్రశేఖరం అయితే ‘చంద్రుడు’.

ఉద్యోగం లో చేరినప్పుడు నాకు ఓ మంచి స్నేహితుడు ఉండేవారు, అతని పేరు సక్సేనా,ఆంధ్రేతరులు ఇంటిపేరు అసలు పేరు తరువాత పెట్టుకుంటారని నాకేం తెలుసూ, ఒకసారి వాళ్ళింటికి వెళ్ళి, సక్సేనా ఉన్నారా అంటే, ఇంట్లో ఉన్నవాళ్ళంతా వచ్చేశారు.అయ్యబాబోయ్, మీరుకాదూ, నా ఫ్రెండ్ సక్సేనా కావాలీ అన్నాను. మేం అందరమూ సక్సేనాలమే, నీక్కావలిసిన వాడి పేరేమిటీ అని నన్నేడిపించేశారు. ఇంతట్లో నాక్కావలిసిన సక్సేనా వచ్చి నన్ను రక్షించాడు. అతని పేరు అడిగితే చెప్పాడు -‘సురేంద్ర’ అని.అలాగే మేము వరంగాం లో ఉన్నప్పుడు ‘శ్రీవాత్సవ’ అని ఒకతను ఉండేవాడు, అది ఆయన ‘గోత్రం’ పేరనుకుని, మా చుట్టం ఒకాయన, ‘ మన వాడేనా ‘ అన్నాడు !

ఇప్పటి వాళ్ళకి ఈ గొడవలేమీ లేవు. పిల్లలకి అన్నీ రెండక్షరాలో, మహా అయితే మూడక్షరాలో పేర్లు పెట్టేయడం.ఇంటిపేరుని ఎలాగోలాగ ఉంచేసుకుంటున్నారు. ఛాన్స్ దొరికితే దాన్ని కూడా కుదించడానికి ఏమీ సంకోచించరు.ఈ రోజుల్లో
తాతా లేడూ, అమ్మమ్మా లేదు.అన్నీ ‘ఓ’ పాజిటివ్ లాగ ‘యూనివర్సల్’ పేర్లే
!! హాయిగా ఉంది కదూ!!

   కానీ పీత కష్టాలు పీతవన్నట్లు,వీళ్ళ నాన్నల పేర్ల ధర్మమా అని ఇప్పటి వాళ్ళకీ కష్టాలున్నాయి. పాస్ పోర్ట్ లోనూ, ‘పాన్ కార్డ్’ లోనూ ఈ నాన్నలు అనే ప్రాణి పేరు తప్పని సరి చేశారు మన ప్రభుత్వం వారు.పాస్ పోర్ట్ లో ఆ చేంతాడంత ( నాన్న గారిది) పేరు వ్రాయడానికి కొంతైనా స్థలం ఉంటుంది.పాన్ కార్డ్ లో లిక్కంత చోట్లో ఈ పేరు వ్రాయడానికి నానా హైరాణా పడిపోతారు.కానీ తన తండ్రి పేరులో ఉన్న ఆ అనుబంధం,ఈ నాటి వాళ్ళకి తెలుస్తాయా?

 

 

!

బాతాఖానీ–లక్ష్మిఫణి కబుర్లు-నేను చదివిన ఓ మంచి కథ

Salty Coffee – A Beautiful Love Story

  ఈ వేళ మెయిల్ లో ఎవరో పంపారు. హృదయాన్ని ఆకట్టుకునే ఈ మంచి కథ ని మీతో పంచుకుంటున్నాను.

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-రాహుల్ బజాజ్

bajaj

    మరి రాహుల్ బజాజ్ హృదయం క్షోభించిందంటే తప్పేముంది? అయినా అతని కొడుకు చేసినదీ రైటే కదా! ఎక్కడైనా ఇలాటి తారతమ్యం తప్పదుగా !! మనం ఎలా ఎడ్జస్ట్ అవుతామూ అన్నదే ప్రశ్న !!

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–పేపర్ల లింకులు

   ఈ మధ్యన నెట్ లో అన్నిపేపర్లూ ( తెలుగు,ఇంగ్లీషు) చదివి, వాటిలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను.’సాక్షి’ లో లింకులు బాగానే వస్తున్నాయి. ‘ ఈనాడు’ లోవి ముందుగా పోస్ట్ చేసినప్పుడు బాగానే ఉంటున్నాయి కదా అని పోస్ట్ చేస్తూంటే, ‘ కూడలి’ ‘హారం’ లలో వచ్చిన తరువాత ‘ఎర్రర్’ ‘ నాట్ ఫౌండ్’ అని నన్ను వీధిన పెట్టేస్తున్నాయి. ఈ వేళ ఒకాయన (శ్రీ కుమార్) చివాట్లు కూడా వేశారు !!ఆయనకి క్షమాపణలు చెప్తూ, ఏమిటా సంగతీ అని పరిశీలిస్తే తెలిసిందేమిటయ్యా అంటే,’ఈనాడు’ లోవి ‘పీ.డీ.ఎఫ్’ చేస్తేకానీ సరీగ్గా రావడంలేదు.అందువలన ఎక్కడైతే ‘ఈనాడు’ లింకులు పెట్టానో అవన్నిటినీ రిపైర్ చేయడం మొదలెట్టాను.
కొంచెం ఓపిక పట్టండి.అన్నిటినీ సరిచేసే కార్యక్రమంలో పడ్డాను.సరీగ్గా టెక్నిక్ తెలియకుండా అస్సలు ఈలాటివన్నీ పోస్ట్ చేసి మమ్మల్ని హింసించడం ఎందుకూ అనకండి. అదో సరదా! క్షమించేస్తారు కదూ !!

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-అపరిచితులతో తస్మాత్ జాగ్రత్త!!

20091216b_003119006
My Experience

   ఈ వేళ ‘ఈనాడు’ వార్తాపత్రిక చదువుతుంటే ఒక వార్త నన్ను ఆకర్షించింది.నాకు పూణే లో జరిగిన అనుభవం, అప్పుడు ఎప్పుడో నా ఇంగ్లీష్ బ్లాగ్గులో వ్రాశాను.ఆతావెతా చెప్పేదేమిటంటే,ఎక్కడైనా,ఎప్పుడైనా, ఎవరైనా సరే ‘అపరిచితుల’ తో చాలా జాగ్రత్తగా ఉండండి.సర్వేజనా సుఖినోభవంతూ !!