బాతాఖానీ–లక్ష్మిఫణి కబుర్లు-క్యాలెండర్లూ, డెయిరీ ల గోల !

    ఈ వేళ్టి బ్లాగ్గుకి థీం నిజం చెప్పాలంటే మా ఇంటావిడ ఇచ్చింది. తనకి ప్రవచనాలూ అవీ వింటూంటే తీరిక లేకపోయేసరికి నేను ఆ థీం ని ‘హడప్’ చేసేశాను! చెప్పానుగా ఆడవారికి మంచి మంచి ఆలోచనలు వస్తూంటాయి. వాటిని టైము చూసి ‘కొట్టేయడమే’ మనం చేసే నిర్వాకం !!

   ఈ న్యూ యియర్ వచ్చేటప్పడికి ఏడాదినుండీ మనకి పలకరించడానికి తీరికలేని వాళ్ళందరి ఫోన్ నెంబర్లూ ముందేసికొని ఇంక ఫోన్లు చేయడం మొదలెడతాము.ఏదో ‘విష్ యు ఏ హాప్పీ న్యూ యియర్’ అనడం తో మొదలవుతుంది. మనకి బాగా తెలిసిన వాడైతే కొంచెం క్షేమ సమాచారాలు అడుగుతాము. ఏదో మొహమ్మాట ఖాతాదారుడైతే అవతలివాడు ‘విష్ యు సేమ్’ తో వదిలేస్తాడు. ఒక్కొక్కప్పుడు, అవతలివాడు మనని మించినవాడౌతాడు. మన దగ్గరనుండి ఫోన్ వచ్చే మాటైతే, ఛాన్స్ దొరికింది ( ఫోన్ బిల్ మనకి పడుతుందిగా!!) కదా అని, క్రిందటేడాదంతా తను చేసిన ఘనకార్యాలన్నీ చెప్పేస్తాడు! కొంతమంది దగ్గరనుండి ఫోన్లు వస్తాయి. ప్రొద్దుటే 11 గంటలదాకా వీటితో కాలక్షేపం అయిపోతుంది.

   మేము ఫాక్టరీల్లో పనిచేసేటప్పుడు, ఆ రోజు మా జనరల్ మెనేజర్ గారి ఛాంబర్ ప్రొద్దుట అంతా తెరిచే ఉంచేవారు. ప్రతీ వాడు ఆ రూం లోకి వెళ్ళి ఒకసారి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పి వచ్చేవారం.నా చిన్నప్పుడైతే, మా నాన్నగారు హెడ్ మాస్టర్ కదా, టీచర్లు అందరూ బొకేలూ, స్వీట్సూ తెచ్చేవారు.
1963 లో ఉద్యోగం మొదలెట్టినప్పటినుండీ,కొంతకాలం డెయిరీ లు కొనుక్కొని వ్రాసేవాడిని. ఒక్కొక్కప్పుడు రీడర్స్ డైజెస్ట్ తో వచ్చే లిటికంత డైరీయే గతి! పెళ్ళి అయేదాకా వ్రాశాను. ఆ తరువాత బధ్ధకం వచ్చి వ్రాయడం మానేశాను.ఇదొకటే కారణం కాదు, మనం ఏదో మూడ్ లో ఉన్నప్పుడు ఏదో వ్రాస్తాము, ఆ తరువాత ఎవడైనా( అదీ భార్య అయితే) చదివితే మన ప్రాణం మీదకొస్తుంది! ఒక సంగతి ఏమంటే,1963 నుండి 1974 దాకా వ్రాసిన డెయిరీలన్నీ జాగ్రత్త చేసికున్నాను.ఎప్పుడైనా వాటిని చదివితే నవ్వొస్తుంది. ఎన్నెన్ని నూతన సంవత్సర రిజల్యూషన్స్ చేసికునేవాడినో! ఒక్కటీ అమలు పరచుకోలేదు! అందుకే కదా వ్రాసేది! అన్నింటిలోనూ ఉండేది ఏ రోజు ఎవరితో ఏ సినిమాకి వెళ్ళానో!

    ఇంకో అలవాటుంటుంది, చిన్నప్పుడు ప్రతీ కొట్టుకీ వెళ్ళడం ,క్యాలెండర్ అడగడం. ఆ కొట్టువాడేదో అంకెల క్యాలెండర్ వేసేవాడు.కంపెనీల క్యాలెండర్ మీద ఏదో దేముడి బొమ్మో, ఏ సినిమా స్టార్ బొమ్మో ఉండేది.ఎన్ని క్యాలెండర్లు సంపాదిస్తే అంత గొప్ప! మన స్నేహితులందరి దగ్గరా చూపించుకోవచ్చు! పాత కేలండర్ బొమ్మ మనం చదివే పుస్తకానికో, నోట్స్ కో అట్ట వేసేసేయడం! ఆ రోజుల్లో అంటే 60 లలో ఏ సినిమా స్టార్ బొమ్మైనా ఉన్నా అది కొంచెం’మర్యాద’ గా ఒంటి మీద పూర్తి బట్టతో ఉండాల్సిందే ! లేకపోతే గోవిందా ! కాలేజీ కి వచ్చిన తరువాత అనుకుంటా,మా ఫ్రెండు ఒకడి దగ్గర మేర్లిన్ మన్రో ఫేమస్ పోజు ( తను కట్టుకున్న స్కర్ట్ ఫాన్ గాలికి ఎగిరిపోతూంటుంది) ఉన్న క్యాలెండరుండేది. వాడు ఎక్కడినుండో కొట్టుకు వచ్చేశాడు. వాళ్ళింట్లో చివాట్లేశారు. అందుకని మరీ బయట పారేయలేక నాకిచ్చాడు. కాలేజీ కొచ్చానుగా, అందుకని, నేనేదో శ్రధ్ధ గా చదివేసి ఉధ్ధరించేస్తాననుకొని, నాకు ఒక రూం విడిగా ఇచ్చారు. అమలాపురం లో మా ఇంట్లో మొత్తం 14 రూంలు ఉండేవి ! పాపం మా ఇంట్లో వాళ్ళు నేను బాగా చదువుకోవల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సమకూర్చారు. నాకో విడిగా రూమ్మూ, అందులోకి ఎవరూ రాకపోవడం( ఏదో డిస్టర్బ్ అయిపోతానేమో అని!) లాటివి చాలా చేశారు.కానీ తల రాత మరోలా ఉంటే ఇలాటి సౌకర్యాలు ఏం లాభం? చెప్పొచ్చేదేమంటే, ఆ మేర్లిన్ మన్రో కేలెండర్ ఓ మూడు నెలల పాటు నా రూంలో ఉండేది.క్వార్టర్లీ పరీక్షలలో మార్కులు చూసిన తరువాత, మా నాన్నగారు ఓ రోజు
నా రూం లోకి ఇనస్పెక్షన్ కి వచ్చి, ఈ ‘సువర్ణ’ మార్కులకి కారణం ఏమిటా అని చూస్తే, ఈ కేలెండర్ కనిపించింది. నాలుగు చివాట్లేసి, మళ్ళీ ఆ కేలెండర్ ఎక్కడ దాస్తానో అని పర పరా చింపేశారు ! అస్సలు ‘సౌందర్య పోషణ’ లెకుంటే ఎలాగ బాబూ !

    ఇంక ఉద్యోగం లో ప్రతీ ఏడాదీ, ఎవడో ఒకడు ఓ క్యాలెండరూ, డెయిరీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రెస్పాన్సిబుల్ పేరెంట్స్ అయ్యాము కదా,అంకెలున్నవో ( అవీ పేద్ద పేద్దవి) పాల లెఖ్ఖలూ అవీ వ్రాసుకోవడానికి వీలుగా, లేక ఏదో ల్యాండ్ స్కేప్పు
ఉన్నవో తెచ్చేవాడిని. మిగిలిన వన్నీ ఎవరో ఒకరికి ఇచ్చేసి పాప్యులర్ అయేవాడిని! ఇంక ఈ డెయిరీ లలో లాండ్రీ కి ఇచ్చిన బట్టల లెఖ్ఖలూ,జమా ఖర్చులూ వ్రాయడం! ఏది ఎలాగున్నా ఓ తెలుగు క్యాలెండర్, ‘వెంకట్రామా’ప్రతీ ఇంట్లోనూ
కంపల్సరీ ! ఇప్పుడు ‘సాక్షి’,’స్వాతి’ వాళ్ళు ఓ తెలుగు క్యాలెండరొకటి ఇస్తున్నారు.వంటింట్లో ఒకటీ, హాల్లోనో, బెడ్రూంలోనో ఒకటీ. ఇప్పుడు మనం ఉండేవి అంతే కదా !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–HAPPY 2010

New Year

శ్రీ దూర్వాసుల వారి ధర్మమా అని శుభ్రంగా అచ్చ తెలుగులో శుభాకాంక్షలు తెలుపుకోకలుగుతున్నాము.