బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-శకునాలు

ఈ వేళ ప్రొద్దుట బయటకు ఏదో పనిమీద వెళ్దామని బస్ స్టాప్ లో నుంచున్నాను.ఇంతలో మా ఫ్రెండ్ ఒకతను కనిపించి, మామూలు పరామర్శలయిన తరువాత, ‘కహా జారహెహో’ అన్నాడు.నాకు ప్రపంచంలో చిర్రెత్తుకొచ్చేది, ఈ ప్రశ్నే.మనం ఎక్కడికి వెళ్తే వీళ్ళకెందుకూ?ఉత్తిపుణ్యాన్న కనిపించిన ప్రతీ వాడినీ అడగడమే.విసుపంతా దాచేసుకొని, పెద్ద మనిషి తరహాగా,చెప్పాను, నేను వెళ్ళే పనిగురించి.ఇక్కడ పూణే లో సీనియర్ సిటిజెన్స్ కి సిటీ బస్సుల్లో 20 రూపాయలకి పాస్ తీసికుంటే, ఆ రోజంతా ఆ టికెట్ తో ఎక్కడైనా, ఏబస్సైనా ఎక్కి ఊరంతా బలాదూర్ గా తిరగొచ్చట.నాకు కిట్టుబాటవుతుంది, ఈ పధ్ధతి. వెళ్ళినప్పుడల్లా ఈ బస్సు టికెట్లకే అయిపోతూంది, వచ్చే పెన్షనంతా!!ఆ సంగతి చెప్తే,ఆ పెద్దమనిషంటాడూ,’ఊరికే తిరగడానికి నాకైతే టైమే ఉండదూ,నీకు అలాగ కాదుగా, కావలిసినంత టైమూ’అని. ఆ పెద్దమనిషి నాకంటే రెండేళ్ళు ముందర రిటైర్ అయ్యాడు.ఆయనకి ఇంట్లోఅంత పనేమి ఉంటుందో, నాకెందుకూ, అలాగని నాకు చేతినిండా టైమే టైమూ అని ఏడవడం ఎందుకూ. నేనేమన్నా అడిగానా? ఎవరిష్టం వాళ్ళది.ఇంతట్లో బస్సొచ్చేసింది, ఆయన జ్ఞానబోధ నుండి తప్పించుకున్నాను!! చెప్పొచ్చేదేమిటంటే, చిన్నప్పటినుండీ పెరిగిన వాతావరణం అనండి, నమ్మకాలు అనండి, ఇంకా కొన్నిటిని పట్టుకొని వేళ్ళాడుతూన్నాను.బయటకు వెళ్ళేటప్పుడు, ఇంకోళ్ళు అడిగేముందరే చెప్పేస్తాను, నా ప్రోగ్రాం అంతా.ఎవరైనా వెళ్ళేటప్పుడు’ ఎక్కడకు వెళ్తున్నారూ’ అని ఏ భాషలోనైనా అడిగితే, వెళ్ళిన పని అవదని ఓ నమ్మకం!! అలాగే ఈవేళ ప్రొద్దుట కూడా, ముందర వెళ్ళిన చోట పని అవలేదు.

చిన్నప్పుడు,ఈ శకునాల ప్రభావం ఎంతలా ఉండేదంటే, ఏ ప్రయాణానికైనా వెళ్తూంటే, మా అమ్మగారో చెల్లెలో ఎదురొచ్చేవారు.వచ్చిన గొడవల్లా, నేను పరీక్షలకెళ్ళేముందర కూడా, ఏదో ఉధ్ధరించేస్తానని, పాపం వాళ్ళు ఎదురొచ్చేవారు.ఏదో వాళ్ళ అపోహ కానీ,ఎవరైనా ఎదురొస్తే,పరీక్షలు బాగా వ్రాస్తామా,నాకైతే, పొట్టకోస్తే అక్షరం ముక్కుండేది కాదు.బహుశా, మా వాళ్ళు ఎదురొచ్చేరు కాబట్టి ఎక్కడా పరీక్షలు ఫెయిల్ అవకుండా లాగించేశాను.బి.ఎస్.సీ సెప్టెంబర్లో కదా పాస్ అయిందీ, అని అడక్కండి, మార్చ్ లో అప్పటి ఫాషన్ ప్రకారం ‘విత్ డ్రా ‘ అయ్యానోచ్ !! మా అమ్మగారు ఉన్నంతకాలమూ ఎప్పుడూ మంగళవారం నాడు ప్రయాణం చేయనిచ్చేవారు కాదు.ఎవరైనా తుమ్మితే,మళ్ళీ ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుని వెళ్ళవలసిందే.నూనె కావిడి వాడు, ఒంటి బ్రాహ్మడు,పిల్లి, వితంతువు,ఇలాగ ఓ పేద్ద లిస్టుండేది, వీళ్ళలో ఎవరు ఎదురొచ్చినా బయల్దేరకూడదని.అందువలన కాలేజీకో, స్కూలుకో వెళ్ళేముందర కిటికీ లో కూర్చొని మంచి శకునాలకోసం ఎదురు చూడడం ఓ వింత అలవాటైపోయింది. గుర్రం బండి, పాలవాడు,పొదితో మంగలీ,జంట బ్రాహ్మలూ, చాకలి మూటతో,ఇంక అమ్మాయిలైతే ఎవరైనా ( ఇది అన్నింటిలోకీ బాగుండేది)–ఇలాటివన్నీ మంచి శకునాలుట !!

ఈ రోజుల్లో అయితే చెప్పిన ఈ శకునాలు ఎలా ఎదురౌతాయండీ? గుర్రబ్బళ్ళు పోయి ఆటోలు వచ్చాయి, ఆవచ్చేవాడిని అడగలేముగా నువ్వు బ్రాహ్మడివా అని,ఈ రోజుల్లో క్షవరాలకి సెలూన్ లకి వెళ్తూంటే ఇంక పొదులతో ఎవరు ఎదురొస్తారూ?డ్రై క్లీనింగ్ లాండ్రీల రోజుల్లో, మూట పుచ్చుకొని వచ్చేవాడెవడండి బాబూ?ఇంక ఇదివరకటి రోజుల్లో అయితే నుదిటిమీద బొట్టు ధర్మమా అని ఆ వచ్చే ఆవిడ స్టేటస్ ఏమిటో తెలిసేది.ఇప్పుడు అలాగ కాదుగా, బొట్టు పెట్టుకోకపోవడం ఓ ఫాషనూ. ఏమిటో వెర్రినమ్మకాలూ అవీనూ.జరిగేది ఎలాగూ జరక్క మానదు. ఈ శకునాలకోసం మన పనులు మానుకొలేముగా.ఎడ్జస్ట్ అయిపోవాలి బాబూ.ఒకటి మాత్రం ఇంకా మానలేదు–ఎవరైనా తుమ్మితే ‘చిరంజీవ’అనడం.ఈ రోజుల్లో అందరికీ కామన్ గా ‘ గాడ్ బ్లెస్ యు’ అనేస్తే ఏ గొడవా ఉండదు.ఒకటి మాత్రం తమాషాగా ఉంటుంది–తుమ్మేసిన తరువాత ‘ఎక్స్క్యూజ్ మీ’ అని ఎందుకంటారో.పైన వ్రాసిందంతా చదివి నేను ఏదో ఛాందస్సుణ్ణని అనుకోకండి. నేనెంత ఛాందస్సుణ్ణో నా బ్లాగ్గులన్నీ చదివితే మీకే తెలుస్తుంది !!

%d bloggers like this: