బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-ఆవకాయ


    వేసవి కాలం వచ్చిదంటే ప్రతీ తెలుగు వారింటా ఆవకాయ హడావిడి వచ్చేస్తుంది. మా రోజుల్లో అయితే మామిడికాయ ఎప్పుడూ బయట మార్కెట్ లో కొనవలసిన అవసరం ఉండేది కాదు. మా అమ్మమ్మ గారి పొలంనుండి వచ్చేవి. ఎవరిచేతో కారాలు కొట్టించడం, ఆవపిండీ, ఉప్పూ రెడీ చేసికోవడం, మమ్మల్ని గానుగ వాడిదగ్గరకు పంపి నూనె తెప్పించేవారు.

    పిల్లల డ్యూటీ ఏమిటంటే మామిడికాయ ముక్కలు తరగగానే,ఆ ముక్కలన్నీ శుభ్ర పరచడం. మాగాయ , పులిహోరావకాయా, తొక్కుపచ్చడి, మెంతావకాయా పెట్టేవారు. అప్పుడప్పుడు వేసికోవడానికి ఉల్లావకాయ పెట్టేవారు. పిల్లల పని ఏమిటయ్యా అంటే, ఆ వెల్లుల్లి రెబ్బలు నూనెలో ముంచి, కొంచెం పసుపు రాసి ఉంచేవారు, వాటికి పైన ఉన్న తొక్కు తీయడం. బలేఉండేది.

    ఆవకాయ కలిపేసిన తరువాత, అన్నం ఆ పళ్ళెంలో వేసి కలిపి ముద్దలు పెట్టినప్పుడుండే మజా ఇంకెక్కడా దొరకదు. కొత్తావకాయ వేసికొని తిన్న తరవాణీ అన్నం రుచి ప్రపంచంలో ఇంకేదానికీ ఉండదు! అలాటివన్నీ తీపి తీపి జ్ఞాపకాల్లా మిగిలిపోయాయి.

    ఇప్పటికీ మా ఇంటావిడ ఇంట్లోనే ఊరగాయలు పెడుతోంది. టెంకొచ్చిన కాయ తీసికుని రండీ అంటుంది.నాకు అది ఎలా తెలుస్తుందో ఇప్పటికీ అర్ధం అవదు.ఏదో బజారుకెళ్ళడం, తెలిసిన కొట్టువాడిని అడిగి, ముదురుగా ఉన్న కాయలు వాడిచేతే సెలెక్ట్ చేయించి, అక్కడే ముక్కలు చేయించి తీసుకు రావడం. ఓ పాతిక కాయలు తెండీ అంటుంది. దాని సైజు చెప్పదు.రామా ఈజ్ ఎ గుడ్ బాయ్ లాగ, బజారుకెళ్ళి వాడిని ఓ పాతిక కాయలు, తూపించి ముక్కలు చేయించడం. ఇంతా శ్రమ పడి తెస్తే, ఇన్నెందుకూ అంటుంది, నా అదృష్టం బాగోపోతే, ఆముక్కలు కొన్ని సరీగ్గా తెగక, పాడైపోతే, సగం ముక్కలు ‘రిజెక్టెడ్ బిన్ ‘లో వెసేస్తుంది మొత్తం గత 38 ఏళ్ళలోనూ, ఏ రెండు మూడు సార్లో తప్ప,( అప్పుడు కూడా మాఇంటావిడ పర్యవేక్షణ లో), ఆవకాయ పెట్టడానికి మామిడి కాయ నేనే తెస్తూంటాను.ఒక్కసారంటె ఒక్కసారికూడా, చివాట్లు తినకుండా లేను !!

    ఈ సారి హైదరాబాద్ నుండి పిండీ,కారం తెప్పించింది.క్రిందటి మూడు సార్లూ మన దేశం( ఆంధ్ర) లోని పిండీ, కారం అలవాటు పడిపోయి. మొదట మాగాయి కోసం ఓ పదిహేను రోజుల క్రితం పెద్ద కాయలు తెచ్చాను. నా అదృష్టం బాగుండి, అవి చాలా బాగున్నాయంది.అబ్బో ఇన్నాళ్ళకు నాకు కూడా కాయ సెలెక్ట్ చెయ్యడం వచ్చేసిందే అని సంబర పడిపోయాను!

   ఈ మధ్య రెండు మూడు రోజులు గాలీ, వానా రావడం తో, గాలికి రాలి దెబ్బతిన్న కాయలు దొరుకుతాయీ అందువల్ల ఓ రెండు రోజులు ఆగి తెమ్మంది.అర్రే, ఓ సంగతి చెప్పడం మర్చేపోయాను-కాయలు ( మాగాయకి) బాగానే ఉన్నాయీ, అమ్మయ్యా అనుకుని, ‘తిల్ ఆయిల్’ తెమ్మంటే క్రింద రిలయెన్స్ లోకి వెళ్ళి, ‘సరసోంకా ఆయిల్'( ఆవనూనె) తెచ్చాను,ఈవిడేమో తన భర్త గారి ‘ఎఫిష్యెన్సీ’ మీద నమ్మకం ఉంచి, చూసుకోకుండానే బాటిల్ సీల్ విప్పేసింది. తరువాత తెలిసింది, అది ఆవనూనె, నువ్వుల నూనె కాదూ అని. నేను ఇంటికొచ్చిన తరువాత, నా ‘మామూలు’ దొరికేసింది! అసలు ఆవనూనెకీ, పప్పునూనెకీ తేడా తెలియకుండా ఎలా ఉన్నారండి బాబూ వగైరా వగైరా… సీల్ విప్పేసిన తరువాత కొట్టువాడెక్కడ పుచ్చుకుంటాడూ? నోరుమూసుకుని మళ్ళీ వెళ్ళి,ఆ తిల్ ఆయిల్ తెచ్చాను.ఏదో ఆ మాగాయ ప్రకరణం పూర్తయ్యింది ఎలాగో.మళ్ళీ మొదలు దాంట్లో ఊట వెయ్యాలీ, అలాటి కాయలే తెండీ అంటూ.

    మొత్తానికి రెండు రోజులు తెరిపిచ్చింది కదా అని ఈ వేళ బయలుదేరాను. ఎన్నికాయలూ అంటే ఛస్తే చెప్పదు, ఓ గిన్నె తీసుకొచ్చి దీంతో నాలుగు గిన్నెల ముక్కలుండాలీ అంటుంది.ఆ గిన్నేంటో, ఆకొలతేంటో నన్ను పుట్టించిన బ్రహ్మక్కూడా తెలియదు, సరే తప్పేదేముందీ అని బయలుదేరి వెళ్ళాను.మరీ మా ఇంటావిడ చూపించిన గిన్నె పట్టుకుని వెళ్ళలేను కదా. ఏదో దేముడి మీద భారం వేసేసి మార్కెట్ కి వెళ్ళాను.మామిడికాయలు నిగ నిగా నాదృష్టికి బాగున్నట్లే కనిపించాయి. ఇప్పుడేమిటీ గడచిన ముప్పైఏళ్ళనుండీ అలాగే కనిపిస్తున్నాయి. సరే అని కిలోకి ఎన్నికాయలొస్తాయీ అని అడిగి, వాడు అయిదు కాయలొస్తాయీ అన్నాడు కదా అని, వాటిని ముక్కలు చేస్తే ఆ ‘కొలత గిన్నె’తో నాలుగు గిన్నెలొస్తాయీ అని మెంటల్ గా కాలుక్యులేట్ చేసేసి, సరే ఓ పాతిక కాయలు తూచూ అన్నాను.వాటిని తరగడానికి కిలోకీ అయిదు రూపాయలన్నాడు.

    ఆ కాయల్ని తరిగేవాడితో, కాయల్ని తడిగుడ్డతో తుడిచి కొయ్య మన్నాను.వాడెందుకు తుడుస్తాడూ, నాకో గుడ్డ ఇచ్చి దాన్ని తడపడానికి నీళ్ళిచ్చి, అక్కడే పక్కనే కూర్చుని నన్నే తుడవమన్నాడు.సరే అని, నేను తడిగుడ్డతో తుడవడం, వాడు తరగడం.వచ్చేటప్పుడు ఇంకో మాట చెప్పిందండోయ్, ప్రతీ ముక్కకీ టెంకలోని భాగం ఉండేటట్లు చూడాలని.ప్రతీ సారీ చెప్తుందనుకోండి.వాడితో ఈ మాట చెప్పగానే పాపం వాడు కూడా, సాధ్యమైనంతవరకూ ప్రతీ ముక్కకీ టెంక భాగం ( కొద్దో గొప్పో) ఉండేటట్లు చూసి, మొత్తానికి ఆరు కిలోల ముక్కలూ, ఓ పాలిథీన్ బ్యాగ్గులో వేసికుని మిట్ట మధ్యాన్నం 12 గంటలకి కొంపకి చేరాను

   ఇంకా ఏమీ అనలెదు కదా అంతా బాగానేఉండేఉంటుందీ అనుకున్నంతసేపు పట్టలేదు, ‘మీరు కాయ కొట్టేటప్పుడు అక్కడే ఉన్నారా, ఎక్కడైనా తిరుగుతూన్నారా’అంది. మళ్ళీ ఇంకా ఏమీ అనలెదు కదా అంతా బాగానేఉండేఉంటుందీ అనుకున్నంతసేపు పట్టలేదు, ‘మీరు కాయ కొట్టేటప్పుడు అక్కడే ఉన్నారా, ఎక్కడైనా తిరుగుతూన్నారా’అంది. మళ్ళీఏమ్వచ్చింది దేముడోయ్ అనుకొని, సంగతేమిటా అని అడిగితే చెప్పింది, ‘కాయలన్నీ లేతగా ఉన్నాయి, ఆవకాయకి బాగుండదు’అని. నా ట్రెడిషన్ ప్రకారం ఈ సారికూడా మామిడికాయలు సరీగ్గా చూసుకొని తీసుకురాలేదు.

    ఆ బాగాలేని ముక్కల్ని ఎలాగో సాల్వేజ్ చేసేసి, మొత్తానికి ఈ ఏడాది కూడా కొత్తావకాయ పెట్టేసింది.ఇటుపైన అంటే వచ్చే ఏడాది, ఆవిడనే తీసికెళ్ళీ మామిడికాయలు సెలెక్ట్ చేయించాలని
ఇప్పుడే బుర్రలోకి ఓ ఆలోచన వచ్చింది.ఇంక అప్పుడు నన్నేమీ అనడానికి వీలుండదుగా !!
.

14 Responses

  1. బావుంది మాష్టారూ మీ ఆవకాయోపఖ్యానం. మేము ముంబయిలో ఉన్నప్పుడు (క్రితం సంవత్సరం వరకూ) ప్రతి సారీ మామిడికాయలకు వాషీ మార్కెట్టుకు వెళ్ళటం, మేము ఉన్న పొవాయ్ నుండి దాదాపు 30 కిలో మీటర్లు. అక్కడ నుంచి కాయలు, గుజరాత్ వి ముక్కలు కొట్టి మరీ తేవటం. నూనెదే సమస్య అయ్యేది. నువ్వుల నూనె కొన్ని ప్రత్యేక షాపుల్లోనే దొరికేది. ఇక కారం మటుకు మళ్ళి ప్రత్యేకంగా చెంబూరు వెళ్ళాలి. ఇలా నానా తంటాలు పడి పెట్టినా, సంవత్సరం పొడుగునా కూడ ఆవకాయ, మాగాయ హాయిగా తినటానికి అవకాశం. ఇక్కడ బెంగుళూరులో అంత కష్టపడకుండానే దగ్గరలోనే దొరుకుతున్నాయి అన్నీ. ఈ మధ్యనే ఈ ముఖ్యమైన అంకం పూర్తయ్యింది.

    Like

  2. ఇప్పుడే మీ శ్రీమతి గారు రాసిన ఆవకాయ కబుర్లు విన్నాను. ఏమైనా నా వోటు ఆవిడకే అండీ. 🙂 అబ్బా, మీరు ఇద్దరూ అచ్చు మా అమ్మా, నాన్న గారు లాగానే.

    నాకూ మీ లాగానే ఎలాంటి కాయలు తేవాలో తెలియదు, కానీ మరీ అన్యాయంగా నువ్వుల నూనె బదులు ఆవ నూనె తెచ్చేయ్యటం ? హ హ హ .

    మా అమ్మ, నాన్న గారికీ ఇదే గోల ఆవకాయ సీజన్లో. ఏమో మరి నా పెళ్ళయితే, ఇంట్లో ఆవకాయ పెడితే ? నేను ఎలాంటి కాయలు తెస్తానో ?

    చెల్లి కి, తమ్ముడికి పెళ్లి అయినా, వాళ్ళకి ఈ బాధలు లేవు. ఆవకాయ అంటే నాకు లాగ, వాళ్ళకి ఇష్టం లేదు మరి.కొంచెం ఇంట్లోధీ పట్టుకేల్తారు.

    మీరు ఇద్దరూ భలే సరదాగా రాస్తుంటారు.సున్నితమైన హాస్యం మీ దంపతుల సొంతం. 🙂

    Like

  3. శివరామప్రసాద్ గారూ,
    ఇప్పుడు ఏ శ్రమా లేకుండా ఊరగాయలు పెట్టుకోగలుగుతున్నందుకు సంతోషం !

    Like

  4. కుమార్,

    తమదాకా వస్తేకానీ…అనే సామెత గుర్తుంచుకోండి.నాలాటి అమాయకులను అల్లరి పెట్టగానే సరిపోదు!చూద్దాంగా భవిష్యత్తులో ఎలా ఉంటుందో ? పోన్లెండి ,ఏదిఏమైనా నేనూ, మాఇంటావిడా వ్రాస్తున్న బ్లాగ్గులు నచ్చుతున్నందుకు సంతోషం.

    Like

  5. 🙂 ఇన్నాళ్ళూ మీ బ్లాగు అప్పుడప్పుడూ చూస్తూ మా నాన్నగారు బ్లాగు వ్రాస్తే ఇలాగే ఉంటుందేమో అని చాలా సార్లు అనుకునేదాన్ని.. ఇప్పుడు సూర్యలక్ష్మిగారి బ్లాగు చూసాక, మా అమ్మాన్నాన్నల బ్లాగులు ఇలాగే ఉంటాయి అనిపిస్తుఉంది.

    Like

  6. మా చిన్నప్పుడు మీరు చెప్పినట్టే “ఆవకాయ హడావిడి” చేసేవాళ్ళం.

    నా పెళ్ళికి ముందునుంచీ ప్రవాసాంధ్రుడినే కాబట్టి “ప్రవాస ఆవకాయ” పెట్టే ధైర్యం ఇంతవరకు చెయ్యలేదు.

    సెలవులకి ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకోవడమే.

    Like

  7. చేతనా,

    మరింకెందుకు ఆలస్యం? అమ్మగారికీ, నాన్నగారికీ బ్లాగ్గులు వ్రాయడం నేర్పేయండి !!

    Like

  8. బోనగిరీ,

    ఇంకా ఎన్నాళ్ళు అమ్మని కష్టపెడతారు? ఎప్పుడో అప్పుడు ప్రారంభించాలిగా ! అందులో మజా ఏమిటో తెలుస్తుంది. లేకపోతే ‘ప్రియా’ పచ్చళ్ళే గతి !

    Like

  9. ఇప్పుడే సూర్యలక్ష్మి గారి ఆవకాయ ప్రహసనం విని(విని అని ఎందుకన్నానంటే ఆవిడ చెప్తుంటే వింటున్నట్టే అనిపించింది చదువుతుంటే) అక్కడ ఇచ్చిన link పట్టుకుని ఇక్కడకి వచ్చానండీ. ఇద్దరూ ఇద్దరే…:) కానీ సూర్యలక్ష్మి గారికే నా వోటు. నేను ఎప్పుడూ అమ్మలకే సపోర్టు మరి.
    మాన్నాన్న గారు ఈ తరవాణీ అన్నాన్ని తల్చుకుని తెగ మురిసిపోతూ వుంటారు, మా అమ్మ ఏమిలేదే చద్దన్నాన్ని, మజ్జిగ లోనో ఇంకెందులోనో పడేసి నిలవ చేసి అది తింటారు అని తీసిపడేస్తుంది. అప్పుడు మా నాన్నగారు దాని చరిత్ర, గొప్పతనం అంతా చెప్పేదాకా వదలరు. ఇది ఎన్నిసార్లు జరిగివుంటుందో గుర్తులేదు కాని ఇప్పుడు తల్చుకుంటుంటే భలే ముచ్చటేస్తుంది.

    Like

  10. భమిడి పాటివారూ నమస్కారం.
    బాగున్నారా? .
    పచ్చడి మామిడికాయ సెలెక్టు చేయడం అంత సులువేమీ కాదు మాష్టారూ . దానికి ఎక్ష్పర్తైజ్ కావాలి మరి .
    అది రాలు కాయో కోతకాయో ,తెలియాలి. ఎజాతో తెలియాలి. టెంక ముదిరిందో లేదో తెలియాలి. పండుబారకుండా చూడాలి.అసలు విషయానికి వస్తే కాయలన్నీ పుల్లగా వున్నాయో చూడాలి. అమ్మేవాడు ఒకే కానుంచి శాంపుల్ చూపుతున్నాడా రాండం గా కాయలు తీసి రుచి చూపిస్తున్నాడా చూడాలి.
    లేకపోతె తీపి వేయకుండానే తీపావకాయ పట్టేయ్యాల్సి వస్తుంది. మీ అనుభం బాగుంది . ఆవకాయ కలిపేసిన తరువాత, అన్నం ఆ పళ్ళెంలో వేసి కలిపి ముద్దలు పెట్టినప్పుడుండే మజా ఇంకెక్కడా దొరకదు. .. TRUE !ఊరగాయ పట్టిన తరువాత అన్నమేసి కలిపి దాన్నే దేవుడి ముద్దలని పెట్టేవాళ్ళు ..శ్రేయోభిలాషి …నూతక్కి

    Like

  11. స్ఫురితా,

    మా ఇంటావిడకే మీ ఓటైతే నా బ్లాగ్గులో వ్యాఖ్య పెట్టడం ఎందుకమ్మా !!

    Like

  12. రాఘవేంద్ర రావుగారూ,

    ఈ థీరీ అంతా నాకూ క్లాసులు తీసికుందండి, మా ఇంటావిడ. ప్రాక్టికల్ గా చేసేటప్పుడు ఇలాటివన్నీ గుర్తుండవు

    Like

  13. నమస్కారమండీ…!ఇప్పుడే చూసానండీ…ofcourse its too late .నేను మాత్రం నాన్నగారి కే ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను కాబట్టి మీకే నా ఫుల్ సపోర్టండీ .. కానీ నా పెళ్ళి అయ్యిం తర్వాత తెలిసిందండి.. ఆడవాళ్ళ(భార్యల)ని మగవాళ్ళు(భర్తలు) ఎలా అర్థం చేసుకుంటారో… 🙂 sir your blog is really excellent ..

    Like

  14. హంసవాహిని,

    Thank you very much.God bless you & your family.

    Like

Leave a comment