బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ప్రతీదీ చెప్పిన వెంటనే చేశాయాలంటే ఎలా….

    మీలో చాలామందికి గుర్తుండే ఉంటుందనుకుంటాను, 1984 లో శ్రీ రాజీవ్ గాంధీ మనదేశానికి ప్రధాన మంత్రి అయ్యారు. అప్పుడు ఆయనకున్న అర్హతల్లా, శ్రీమతి ఇందిరా గాంధీ కొడుకుగా పుట్టడమే. అంతకంటే, ఆయన ప్రత్యేకంగా దేశానికి చేసిన సేవ ఏమీ లేదు. మనదేశం లో ఉన్న సదుపాయం ఏమిటంటే, ఏ ప్రాముఖ్యం ఉన్న మనిషికో, భార్యగానో, కొడుగ్గానో, కూతురుగానో, మేనల్లుడిలానో, మేనకోడలుగానో పుట్టేస్తే చాలు. మిగిలినదంతా, మన ” వందిమాగధులే” చూసుకుంటారు. This facility is exclusive property of our politicians only…. ఆ రాజకీయనాయకుడికి పైన వివరించినవారెవరూ లేకపోతే, వాడి ఖర్మ ! ఉండాలే కానీ, వాళ్ళని ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులూ చేయడానికి, మనవాళ్ళు చేయగలిగినంత చేస్తూనే ఉంటాము. స్వతంత్రం వచ్చిన దగ్గరనుండీ, ఇలాటి కేసులు కావలసినన్నున్నాయి. ఇది మనదేశ సౌభాగ్యానికున్న ఒక ప్రత్యేక గుణం !

    అయినా ఈ టపా మన దేశం చేసికున్న అదృష్టాల గురించీ, దౌర్భాగ్యాల గురించీ కాదులెండి. పైన చెప్పిన సదరు రాజీవ్ గాంధీ గారు, ప్రధాన మంత్రి అయీ అవగానే పాపం ఏదో దేశసేవ చేసేసి, దీన జనోధ్ధరణా వగైరా చేసేద్దామని నిశ్చయించేసికున్నారు. పైగా ఉడుకు యువ రక్తం ఓటీ. మన దేశం లో సమస్యలకేమైనా లోటేమిటీ? పైన కాశ్మీరు నుండి కింద కన్యాకుమారి దాకా, వెదకాలే కానీ కావలిసినన్నున్నాయి! ఏ పనీలేని… పిల్లి తల గొరిగాట్ట.. అలాగే మన నాయకులకి సమస్యే ఉండఖ్ఖర్లేదు, గాల్లో సృష్టించగలరు. ఎలా అని అడక్కండి, ఈ నాయకులందరూ తాంత్రికుల దగ్గరా, బాబాల దగ్గరా నేర్చుకున్న విద్య లెండి. వాళ్ళకి కూడా కొదవ లేదు. ఉన్న మాట చెప్పుకోవాలిలెండి, అప్పటిదాకా ఉన్న సమస్యలన్నీ, పాపం ఆ రాజీవ్ గాంధీ సృష్టించినవి కాదు, వాళ్ళమ్మగారూ, తాతగారూ సృష్టించినవీ, ఇంకోళ్ళెవరిచేతో సృష్టించబడి, వారి అమ్మ,తాత గార్లచేత resolve చేయబడనీయనివీనూ ! ఒకచోట అస్సాం గొడవా, ఇంకోచోట పంజాబ్ గొడవా, కాశ్మీరు సమస్యైతే మన గంగమ్మ తల్లిలా జీవనది లాటిది. భారత దేశం ఉన్నన్నాళ్ళూ ఉంటూనే ఉంటుంది.

    సదరు రాజీవ్ గాంధీ గారు, ఏదో ప్రధాన మంత్రయ్యారూ, ఆగస్టు పంద్రా తారీఖు రోజున ఎర్రకోట బురుజుల మీద నుంచుని, ఓ అరగంట మాట్లాడేస్తే సరిపోతుంది కదా, ఎందుకంటే, ఎన్నో ఏళ్ళనుండీ ఆగస్టు పంద్రా తారీఖు ముందర రోజు రాత్రి మన ప్రెసిడెంటు గారూ, మర్నాడు ప్రొద్దుట తెల్లారేటప్పటికి ఎర్ర కోట బురుజులమీదనుంచి ప్రధాన మంత్రీ, ఘోషిస్తూనే ఉంటారు– మేము ఫలానా చేస్తామూ, ఇంకోటేదో స్కీము పెట్టామూ అని. అవేమైనా పెట్టారా చేశారా ? ఏదో వాళ్ళు చెప్తూ ఉంటారూ, మనం వింటూంటామూ. వాళ్ళ speech writers రాసిందేదో శుభ్రంగా చదివేయడమే ! ఏదో జరిగిపోతుందీ, రాత్రికి రాత్రి దేశమంతా బాగుపడిపోతుందీ అనుకోడం మన బుధ్ధితక్కువ. వాళ్ళేదో కాలక్షేపానికి చెప్తూ ఉంటారు, ప్రతీ దాన్నీ నమ్మేయడమే హన్నా !!

   మన రాజీవ్ గాంధీ గారు, over enthusiasm తో , ముందుగా అస్సాం పంజాబులకెళ్ళి వాళ్ళకున్న దీర్ఘకాల సమస్యలన్నిటికీ ఓ accord సంతకాలు పెట్టేశారు. మిగిలిన నాయకులందరూ నెత్తి బాదుకున్నారు. ఇదేమిటీ ఈ కుర్రాడూ, మనం చెప్పినట్టు వింటాడు కదా అని ప్రధాన మంత్రి చేస్తే, మన అస్థిత్వాన్నే పికేసేటట్టున్నాడూ అని. ఇన్నాళ్ళూ ఈ సమస్యల గురించి వాళ్ళకి తెలియకనా, తెలుసు, కానీ ప్రతీదీ solve చేసేస్తూ పోతే, మనకి కాలక్షేపం ఎలా, అనుకుని చూడు నాయనా, తప్పమ్మా అలా చేసేయకూడదూ అని ఏదో నచ్చచెప్పారు, పాపం ఆయనకూడా , అదీ నిజమేగా, ఎన్నెన్ని పెండింగులో ఉంచితే అంత మంచిదీ అనే ఓ నీతిపాఠం నేర్చేసికున్నాడు ! కథ కంచికీ అనుకుంటే మీరు కరెక్టు కాదు, ఆ కథే నా ఈ టపాకి inspiration

    మొన్నెప్పుడో మా ఇంటావిడ ఓ టపా వ్రాసింది. ఆవిడకి నన్ను దుమ్మెత్తి పోయడం తప్ప ఇంకో పని లేదు, అనడం కాదు కానీ, అసలు వాళ్ళత్తగారేదో చెప్పిందీ, వాటినన్నిటినీ ఇలా పబ్లిక్కుగా వ్రాసేయాలా ? అయినా తను చెప్పిందంతా, చెప్పగానే చేసేయకుండా, నా దారిన నేనేదో నాకు తోచినప్పుడే చేస్తానూ అని కదా ఆవిడ ఘోషా. అవునూ, చేస్తానూ, ఆవిడ చెప్పిందల్లా అక్షరాలా కరెక్టే ! కానీ అందులో నిఘూడమైన రహస్యం తెలియడం లేదే తనకీ ! ఏదో మాటవరసకి అనుకుందాం, ఆవిడ చెప్పీ చెప్పగానే చేసేస్తానూ అని, నష్టం ఎవరికీ, ఆవిడకే కదా ! ప్రతీదీచెప్పినవెంటనే చేసికుంటూ పోతే, ఇంక చెప్పడానికి ఏం ఉంటుంది కొన్ని రోజులు గడిచేటప్పటికీ? తనకీ కాలక్షేపం ఉండొద్దూ? ఏదో తన మంచే దృష్టిలో పెట్టుకుని అలా చేస్తాను కానీ, ఆవిణ్ణి కష్ట పెట్టడం నాకేమైనా హాబీయా ఏమిటీ? పోనీ నా అంతట నేనే ఏదో initiative తీసికుని తెద్దామా అనుకుంటే, నేనెమైనా చెప్పానా అంటుంది. తెస్తే ఓ తప్పు. తేకపోతే ఇంకో తప్పు. తుమ్మడమూ తనే, చిరంజీవా అనుకోడమూ తనే. ! ఇదండీ విషయం !!!

%d bloggers like this: