బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– just ..taken for granted….

   ప్రపంచంలో అందరికీ ఉన్న గుణం ఏమిటంటే, ప్రతీ విషయాన్నీ, చాలా వ్యవస్థలనీ, take it for granted గా తీసేసికోడం ఈ విషయంలో ఆడవారు మాత్రం, అదీ “అమ్మ” తనం వచ్చిన తరువాత మాత్రమే rare exceptions.. అదేమిటో ప్రతీ “అమ్మ” నీ మనం అందరమూ take it for granted గా అదేదో మన హక్కులా తీసేసికుంటాము. పాపం ఆ వెర్రి తల్లి, ఎటువంటి అభ్యంతరమూ లేకుండా అన్నిటినీ భరిస్తుంది. ఈ విషయంలో తండ్రులు మాత్రం, కొద్దికాలం భరించినా, ఏదో ఒక రోజు బి.పి. రైజు చేసేసికుని చెప్పేస్తారు.కానీ తల్లికి మాత్రం పిల్లలు ఎప్పుడూ పసివాళ్ళలాగే చూస్తుంది. అదే బలహీనతని మనం అందరమూ exploit చేస్తాము.

   అసలు పుట్టినప్పటినుంచీ మొదలవుతుంది ఈ స్వభావం. చిన్న పిల్లల్ని చూడండి, ఇంటినిండా ఆట సామాన్లేసికుని కూర్చుంటారు. లోపల పెట్టడానికి అమ్మే కావాలి. ప్రొద్దుటే నిద్ర లేచిన తరువాత, దుప్పట్లు మడత పెట్టడానికి బధ్ధకం, పోనిద్దూ భార్య చేస్తుందిలే, పనా పాటా అనుకోడం. అక్కడకేదో ఆడపిల్లలు బుధ్ధిమంతులనడం లేదు, పెళ్ళయ్యేదాకా వాళ్ళూ అదే పధ్ధతి. సడెన్ గా పెళ్ళై, ఇంకో సామ్రాజ్యానికి వెళ్ళడంతోటే, అన్నీ మారిపోతాయి! అదేమైనా హార్మోనల్ ఛేంజా అంటే, నాకూ తెలియదు!

   ఇప్పుడంటే ప్రతీ ఇంటికీ సెప్టిక్ టాయ్లెట్లొచ్చాయి కానీ, ఇదివరకు లేవుగా, ఆ రోజుల్లో పంచాయితీ బోర్డు వాళ్ళు, ఎవరినో పంపేవారు, night soil ఎత్తడానికి. ఎలాగూ వాడొస్తాడులే అనుకోడం, ఏ కారణం చేతైనా ఆ మనిషి రాకపోతే ఉండేది మన పని. అలాగే .పని మనుష్యులూ, పాల వాడూ, బట్టలుతికేవాళ్ళూ, ఆసుపత్రిల్లో పనిచేసే వారూ, నర్సులూ, సాయంకాలం పూట ఆ రోజుల్లో వీధి దీపాలు వెలిగించేవారూ, బస్సు డ్రైవర్లూ, కండక్టర్లూ, చివరాఖరికి పోలీసులూ ఒకళ్ళేమిటి, ప్రతీ వాడినీ మనం అందరమూ take it for granted గా తీసేసికోడమే! పైన చెప్పిన ఏ ఒక్కరు, రాకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేయకపోయినా మనం ఎక్కడుంటామో ఆ భగవంతుడికే తెలియాలి!

   ఇదేదో trade union వాళ్ళలా మాట్లాడడానికి కాదు ఈ టపా, మనలో ఎంతమంది, వాళ్ళ కష్ట సుఖాల గురించి ఆలోచిస్తాము? మన గొడవలే మనకుంటే, ఇంకోళ్ళ విషయాలు ఆలోచించడానికి టైమెక్కడిది మహాశయా అని అడక్కండి. నిజమే, ఉద్యోగంలో ఉన్నప్పుడు నేనూ ఈ విషయాల గురించి ఆలోచించేవాడిని కాదు. కానీ రిటైరయిన తరువాత, పైగా ప్రతీ రోజూ ప్రవచనాలు వినడంతో ఎప్పుడూ వీటి గురించే ఆలోచనలు. పోన్లెండి, మీలాగే మేమూ రిటైరయిన తరువాత పెట్టుకుంటామూ ఇలాటి వ్యాపకాలూ, ఇంక మమ్మల్నొదిలేయండీ అనొచ్చు. కానీ రిటైరే అవనఖ్ఖర్లేకుండా, ఏదో మీ వంతు మీరూ చేయొచ్చు– పైన చెప్పాను చూడండి– నిద్ర లేవగానే దుప్పట్లు మడత పెట్టడమూ, మనం స్నానం చేయగానే, తరువాతివారు జారి పడకుండా, బాత్రూం లో ఓ చీపురేయడమూ, మరీ భార్య చెప్పేవరకూ ఆగఖ్ఖర్లేకుండా, వెసికున్న షర్టు ఏ కాలరు దగ్గరో మాపు పట్టగానే, ఉతకడానికి వేసేయడమూ, ఇంట్లో ఉన్న న్యూసు పేపర్లు మరీ పేరుకుపోకుండా, ఏ రద్దీవాడికో అమ్మేయడమూ, భోజనానికి ముందు కంచాలూ, గరిటెలూ పెట్టడమూ, కనీసం మన కంచం మనమే తీయడమూ వగైరా ..వగైరా…

   ఇదేమిటీ సడెన్ గా ఈయనేమిటీ ప్రవచనాలు మొదలెట్టాడూ అనుకుంటున్నారా? అవునండి, చివరకి ఇప్పటికి జ్ఞానోదయం అయింది.though late than never! ప్రతీ దానికీ భార్యని take it for granted గా తీసేసికుంటే, ఎప్పుడో సడెన్ గా ఓ రోజు చెప్పేస్తుంది ” మీకు చాకిరీ ఇంక చేయలేనూ…” అని. మరప్పుడేం చేస్తాం? అందుకే చెప్తున్నా, మరీ లేట్ కానీయకండి, పైన చెప్పినవేవీ మరీ పేద్ద పేద్ద పనులు కాదు. అప్పుడప్పుడు గోడకి ఏ బూజో ఉంటే, మనమూ తీయొచ్చు, ప్రతీ దానికీ భార్యే అఖ్ఖర్లెదు. పైగా ఇందులో ఓ సౌకర్యం కూడా ఉంది– వాళ్ళు లేకపోతే మనకి జీవితమే లేదూ అని అనుకోనఖ్ఖర్లేకుండా, వాళ్ళకీ తెలియచేయడం! ఏదో ముందర కొద్దిగా కష్టంగా ఉన్నా అలవాటైపోతుంది! పైగా మనమీద టపాలు వ్రాయడమూ తగ్గుతుంది! చూశారా ఎక్కడో మళ్ళీ ఆ male ego తొంగి చూసేస్తోందీ. అసలు ఇదే కదా కారణం మనకున్న ఆ take it for granted కి మూల కారణం !

    అంతదాకా ఎందుకూ, ఏ రోడ్డుమీదో వెళ్ళేటప్పుడు చూస్తూంటాం, అరటిపండు తొక్కలు పడుండడం, మర్నాడు ఏ కార్పొరేషనువాడో వచ్చి తీస్తాడులే అని వదిలేయఖ్ఖర్లేకుండా, మనం తీసేస్తే ఏమీ ప్రాణం పోదు! అయినా సరే, వాడే రావాలీ, వాడిది కదా ఈ పనీ అనుకోడం! ఈవేళ ప్రొద్దుటే, కొద్దిగా పెందరాళే రమ్మన్నాడు కదా అని, ఏడు గంటలకే బయలుదేరాను. బస్సులో కండక్టరు తో కబుర్లు మొదలెట్టాను, మీ డ్యూటీ ఎప్పుడు ప్రారంభం అవుతుందీ అంటే, అయిదింటికీ అన్నాడు. వామ్మోయ్ ఏదొ ఓ రోజున ఈ బస్సువాళ్ళు రాకపోతే మన గతి ఆటోల పాలే కదా! అలాగే పోలీసులున్నంతకాలం, వాళ్ళని పట్టించుకునే నాధుడు లేడు. అదేదో సినిమాలో లాగ ఎప్పుడో, తిక్కరేగి వాళ్ళు డ్యూటీలోకి రావడం మానేస్తే తెలిసొస్తుంది మన పని! అందుకే ప్రతీ దాన్నీ take it for granted గా తీసేసికోడం అంత ఆరోగ్య లక్షణం కాదు!

%d bloggers like this: