బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– సొసైటీల్లో పడే కష్టాలు….

   ఇదివరకటి రోజుల్లో ఈ బహుళ అంతస్థుల భవనాలూ వగైరా లేకపోవడంతో, ఏదో ఉన్న ఇంటిలోనే సంతృప్తి పడి లాగించేసేవారం. ప్రభుత్వం వారిచ్చిన క్వార్టర్లు కూడా, మహ ఉంటే రెండస్థులుండేవి. వాటిలో ఉండే కష్టాలు వాటిలోనూ ఉండేవనుకోండి, ఉదాహరణకి, ఏ భారీ వర్షమైనా వస్తే, మెట్లక్రింద నీళ్ళతో నిండిపోయేది. కింద క్వార్టరు వాళ్ళని బ్రతిమాలో, బామాలో బయటకి వెళ్ళడం. ఒక్కోప్పుడు మరీ భారీ వర్షం అయితే, క్రింద పోర్షనులోని వాళ్ళింట్లోకీ నీళ్ళొచ్చేసేవి. అలాగని పైనున్నవాడు ఏదో సుఖపడిపోవడం లేదు, సీలింగంతా కారడం. ఎప్పుడో కట్టిన క్వార్టర్లూ, అయిదేళ్ళకోసారి maintainance అనోటి చేసేవారు. ఈ లోపులో ఏ సివిల్ వర్క్స్ వాడికైనా డబ్బులు ( దక్షిణ, తాంబుల రూపం లో) కిట్టాలంటే, ఈ క్వార్టర్స్ కి ముక్తి లభించేది.

   రిటైరయ్యే లోపులో ఏదో ఒక కొంప తయారుచేసికోవాలిగా, ఆ కారణంగా, ఎక్కడో అక్కడ మన తాహతు బట్టి ఓ 2BHK, లేక 3 BHK కొనేసుకోడం.అక్కడ నుండి ప్రారంభం అవుతాయి built-in కష్టాలు! ఎక్కడ చూసినా, నాలుగునుంచి, పది అంతస్థులదాకా బిల్డింగులు. ఏదో గాలొస్తుందనో, లెక మనం బుక్ చేసే టైముకే ఖాళీ లేకో మన అదృష్టం బాగోకో, ఏమైతేనేం, ఏ నాలుగో అంతస్థులోనో దొరుకుతుంది మనకి ఓ ఫ్లాట్. మినిమం నాలుగంతస్థులుంటేనే లిఫ్ట్ ట. ఆ బిల్డర్లూ మహా దుష్టులు. నాలుగుంటేనే Fire Equipment కంపల్సరీట. అంటే మూడంతుస్థుల్లో ఉండే వాళ్ళు చచ్చినా సరే ఎవడికీ పట్టదన్నమాట!

   ఇంక ఈ ఫ్లాట్లన్నిటికీ ఓ సొసైటీ ఫార్మ్ చేసి, ఎవడో ఒకడిని సెక్రెటరీ, ప్రెసిడెంటు చేస్తారు. వాళ్ళ కష్టాలు వారివి, ఉన్న నలభై యాభై ఫ్లాట్లలోనూ, కనీసం ఓ అరడజను పక్షులుంటారు, నెల నెలా ఇవ్వాల్సిన society charges ఎప్పుడూ నాగా యే ! మా స్వంతిల్లున్న సొసైటీ లో ఉన్నవి 12 ఫ్లాట్టులు, అందులోనే ఇద్దరున్నారీ టైపు పక్షులు. మనం ఇచ్చే డబ్బుల్లో,సెక్యూరిటీ వాడికిచ్చే జీతాలూ, కరెంటు ఛార్జీలూ, క్లీనింగ్ చేసే వాళ్ళూ, అప్పుడప్పుడు తెచ్చే వాటర్ టాంకర్ల ఛార్జీలూ, అన్నిటికంటే ముఖ్యం Lift Maintainance ఛార్జి. ఇదిటండి మనం కట్టే పైస పైసా ఖర్చూ.

   ఎంతంత పేద్ద పేద్ద బ్రాండువి పెట్టినా సరే, ఈ లిఫ్టులు నెలలో కనీసం మూణ్ణాల్రోజులు పడుక్కుంటాయి. ఇంక మన వింగులో ఉండేవాళ్ళు, కుర్రాళ్ళు, వాళ్ళకీ జన్మానికో శివరాత్రిలా మెట్లెక్కి రావడం ఓ excercise అనుకుంటారు. మన ఖర్మ కాలి మాలాటివాళ్ళు ఏ నాలుగో ఫ్లోర్ లోనో ఉంటారు. కిందికీ పైకీ వెళ్ళడానికి ఓపికుండదు. లిఫ్టు గురించి మాట్లాడే నాధుడుండడు. మేము ఎలాగైనా ” అద్దె” కి ఉండేవాళ్ళం. మా మాటపట్టించుకునేవాడెవ్వడూ? ఇంక ఆ ప్రెసిడెంటో,సెక్రటరీయో ఇంకో వింగులో ఉంటారు. వాళ్ళకేం పట్టిందీ, ఇంకో వింగువాడి లిఫ్ట్ పనిచేస్తేనేమిటి, తగలడితేనేమేటి? ఆ దిక్కుమాలిన ప్రెసిడెంటు గిరీ, సెక్రటరీ గిరీ ఎందుకో? మళ్ళీ ఎప్పుడైనా చందాలూ అవీ వసూలు చేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తొస్తూంటారు!

   ఈ మధ్య ఓ పేద్ద సొసైటీలో ఓ బోర్డు చూశాను–Parking at Owner’s risk only... అని. మరి ఆ సెక్యూరిటీ వాడెందుకుట? లక్షలు పోసి ఓ కారు కొనుక్కుంటే, దాన్ని ఇంట్లో పెట్టుకోలేము కదా, కింద పార్కింగులోనే పెడతారాయె. బయటివాళ్ళు సొసైటీ లోపల పార్కు చేసికోకూడదు, అంతవరకూ బాగానే ఉంది, ఓనర్స్ కార్లకి రక్షణ తమ పూచీ కాదనడం ఎంతవరకూ భావ్యం? ఇలా రాసుకుంటూ పోతే, ఎపార్ట్మెంట్లలో ఉండే కష్టాలేమిటో తెలుస్తాయి. పోనీ అలాగని విడిగా ఉండే ఇల్లు కొందామా అంటే,కోట్లలో ఉంటుంది. అనుభవించడమే!

   ఈ సోదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, మేము అద్దెకుండే సొసైటీలో లిఫ్ట్ తగలడి, మూడు రోజులయింది. అదేదో కాయిల్ తగలడిందిట. దాన్ని బాగుచేయించడానికి ఆ ప్రెసిడెంటో ఎవడో ఓ మీటింగు పెట్టి చర్చించాలి, వాళ్ళందరూ సరే అనాలి, అలా అనవలసిన మీటింగుకి కోరం ఉండాలి, ఇన్నీ పూర్తయి ఆ లిఫ్టు వాడు రావాలి, అప్పుడు కరెంటుండాలి, ఎందుకంటే సింగరేణి ధర్మమా అని ఇక్కడ పూణె లో రోజుకి మూడుంపావు గంటలు లోడ్ షెడ్డింగోటి ! ఇదండీ సంగతి..
ఇంత డిప్రెషన్ లోనూ ఈవేళ శ్రీ వెంకటేశ్వరా భక్తి చానెల్ లో బ్రహ్మశ్రీ చాగంటి వారి మూడు గంటల ప్రవచనం ( లైవ్) ఒక్కటే ఓ సిల్వర్ లైనింగ్ ! ఇంకో రెండు రోజులొస్తుందిట !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అస్తమానూ కుదరమంటే కుదురుతుందా మరీ….

   చాలామంది అంటూంటే వింటూంటాం– ” అనుకున్నదేదో మొహం మీదే అనేస్తూంటాను. అదేమిటోనండీ, అసలు దాచుకోనేలేనూ… blah..blah..blaaaahh….”. ఏదో ఉద్యోగం లో ఉన్నప్పుడైతే సాగుతాయి ఈ వేషాలన్నీ, మన క్రింద, వినే బడుధ్ధాయోడుండం వల్ల. ఉద్యోగం పూర్తయిన తరువాత అనమనండి తెలుస్తుంది! కడుపులో ఏమీ దాచుకోకుండా చెప్పేయడం కొంతవరకూ సబబే, కానీ దానికీ ఓ సమయం, సందర్భం ఉండాలి. వినేవాళ్ళు కూడా కొంతవరకూ సహిస్తారు, ఆ లిమిట్ దాటిన తరువాత, they will show us our place! మరి అంతదాకా తెచ్చుకోడం అంత అవసరమా?

    అనుకున్నదేదో చెప్పేయడం ప్రతీసారీ ఓ virtue అని అపోహ పడ కూడదు! ఓ అణా ఎత్తు లౌక్యం కూడా నేర్చుకోవాలి. ఈ లౌక్యం, మగాళ్ళకంటే, ఆడవారికే ఎక్కువుంటుంది. ఇదిగో ఇక్కడే, వాళ్ళు ( అంటే ఇంటావిళ్ళూ) భర్త మీద పాయింట్స్ స్కోర్ చేసేస్తూంటారు! మేము ఎప్పుడైనా మా స్నేహితుల ఇళ్ళకి వెళ్దామనుకున్నప్పుడు, అదీ, అప్పటికి మేమే వాళ్ళింటికి రెండు మూడు సార్లు వెళ్ళి వెళ్ళి, ఇంక వెళ్ళకూడదూ వాళ్ళొచ్చేదాకా అనేసికుని, తీరా అనుకున్న తరువాత వాళ్ళు, మా ఇంటికి ఓ సారి వచ్చిన తరువాతే. వామ్మోయ్ ఎంత పేద్ద ” వాక్యం” అయిపోయిందో కదూ ! మళ్ళీ ఇక్కడ కూడా అదే గొడవ- అనుకున్నదేదో చెప్పేయడం!. రాసిందేదో చదివేవాళ్ళకి అర్ధం అయిందో లేదో చూసుకోనఖ్ఖర్లేదూ ( ఇంటావిడ ఉవాచ!). పోనిద్దురూ, మీకర్ధం అయే ఉంటుందనుకుంటా.

   ఆ సోదంతా వదిలేయండి. In simple words, ఎవరింటికైనా వెళ్దామనుకుంటే, అక్కడే దగ్గర ఇంకో పని కూడా పెట్టుకుంటాను. కలిసొస్తాయని! ఏదో పచారీ కొట్టుకి వెళ్ళడమో, లేక ఇస్త్రీకిచ్చిన బట్టలు తెచ్చుకోడమో,లాటివన్నమాట. అందరిలాగా, మాకు కార్లూ, స్కూటర్లూ, బైక్కులూ ఉన్నాయా ఏమిటీ? ఏదో ఈవెనింగ్ వాక్ పేరెట్టి, మా ఇంటావిడతో బయలుదేరి, వెళ్ళడం, ఈ చిల్లర మల్లర పనులన్నీ చక్కబెట్టడమూనూ. ఏదో వెళ్ళినవాళ్ళింటికి వెళ్ళి నోరుమూసుక్కూర్చుని, వాళ్ళిచ్చే కాఫీయో,చాయో, వేసంకాలం లో అయితే ఈ జ్యూసో, నిమ్మకాయ నీళ్ళో పుచ్చేసుకుని ఊరుకోవచ్చా, అబ్బే, మన సో కాల్డ్ “virtue” ( అదేనండీ, ఉన్నమాటేదో చెప్పేయడం), రంగం లోకి వచ్చేస్తుంది. దానికీ పనీ పాటూ ఉండదు, వీణ్ణి ఎప్పుడు వీధిలో పెడదామా అని చూస్తూ ఉంటుంది. ” ఎదురుగుండా లాండ్రీలో బట్టలు పుచ్చుకుందామని ఇటువైపు వచ్చామూ, దగ్గరలోనే ఉన్నారు కదా అని ఇలా వచ్చామూ…” అనేయడం! ఆ మాటనేయడం తో, అప్పటిదాకా, ఏ చాయ్ కోసమో స్టవ్ మేద నీళ్ళెడదామని అనుకున్నావిడ ( మన hostess), ఆ ఉద్దేశ్యం మార్చేసికుని, కిచెన్ లోకి వెళ్ళి ఓ ట్రే లో, రెండు గ్లాసుల్తో కాసిన్ని మంచినీళ్ళు తెచ్చేసి ఊరుకుంటుంది! ఏదో సాయంత్రం పూటా వేడి వేడిగా ఓ చాయ్ తాగే సదవకాశం, ఇదిగో మన అసందర్భపు virtue ధర్మమా అని చక్కాపోయింది!

    ఇలాటివే అసందర్భపు ప్రేలాపనలంటే! వాళ్ళతో అలా, అదేనండి ” లాండ్రీ బట్టలూ etc etc…” ప్రస్తావించకపోతే వచ్చే నష్టం ఉందా? లేదు. అయినా సరే నోటి దురద. ఇంక వాళ్ళూ, పేట్రేగిపోతారు- ” ఔనులెండి, ప్రత్యేకంగా మా ఇంటికే రావాలనేముందిలెండి…”– అలాగే, మా ఇంటావిడ ఒకసారి మా స్నేహితులింటికి వెళ్ళింది. తనొక్కత్తే లెండి, “ఓ గంట పోయిన తరువాత మీరూ రండి, ఓ అరగంట సేపుండి ఇద్దరం కలిసి వచ్చేద్దామూ” అని standing instruction ఇచ్చేసి. నేను ఇలాటి వ్యవహారాల్లో yours obediently లెండి. సరే అని, నా అలవాటు ప్రకారం, ఇంకో పనెట్టుకుని, వాళ్ళింటికి వెళ్ళాను. ఆ ఇంటాయన మాత్రం ఊరుకోవచ్చా, అబ్బే ఎంతైనా మొగాడూ, ” అర్రే ఫణిబాబుగారూ, మొత్తానికి మా ఇంటికి రావడానికి టైము కుదిరిందన్నమాట…” అని కెలికాడు! నేనా తక్కువ తిన్నదీ, పైగా ఆ దిక్కుమాలిన virtue ఓటుందాయే. “అబ్బే మీ ఇంటికని రాలేదండీ, ఏదో మా ఇంటావిడిక్కడుంది కదా, తిరిగి వెళ్ళేటప్పుడు తోడుండొచ్చూ…” అన్నాను. మళ్ళీ వాళ్ళూ మా ఇంటికి రాలేదు! ఆడాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉంటారనుకోండి. ఊరికే చెప్పా సందర్భం వచ్చింది కదా అని!

   ఇలా ఉంటాయి……

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Good old gripewater…..

   కనీసం గత మూడు నాలుగు తరాలనుండి ప్రతీ ఇంటిలోనూ, చిన్న పిల్లలు ఎప్పుడు ఏడ్చినా, ఇదిగో ఇలా చేసేవారు! మరి ఆ గ్రైపువాటరు ఎక్కడ మాయం అయిపోయిందో ఆ భగవంతుడికే ఎరుక! ఎవడో ఏ లాబీ వాళ్ళో రంగం లోకి దిగుంటారు. ఈరోజుల్లో గ్రైపు వాటర్ తీసికుంటే, ఫలానా రోగం వస్తుందీ, లేకపోతే ఇంకోటేదో వస్తుందీ అని భయపెట్టేసుంటారు. డాక్టర్ల్కి ఫ్రీబీలు ఇవ్వడం కూడా మానేసుంటారు. దానితో వాళ్ళుకూడా రికమెండు చేయడం మానేసుంటారు. 1980 దశకం దాకా మన దేశం లో గ్రైపు వాటర్ ఓ చుక్కేనా వేసికోకుండా పెరిగిన పిల్లో పిల్లాడో ఉన్నాడంటే నమ్మడం కష్టం !

   అదేదో త్రాగితే నష్టం వచ్చేస్తుందీ, addiction అయిపోతుందీ, వగైరా వగైరా చెప్పి భయపెట్టేశారు. త్రాగినవాళ్ళందరూ గుండ్రాయిల్లా ఉన్నారు. ఒక విషయం నిజమే, దానిలో alcohol content కొంచం ఎక్కువే! అయితే ఏమిటిట? ఇప్పుడు తల్లి పాలు త్రాగడం మానేసినప్పటినుండీ చిన్న పిల్లలు తినే, త్రాగే వస్తువులకంటే, addictive అనుకోను!

   ప్రొద్దుటే లేవడం తోటే అవేవోహనీ లూప్పులుట, అవి కాకపోతే చాకోలుట. ఆకలేసిందంటే, నూడుల్స్ ఉండనే ఉన్నాయి! ఇవన్నీ కాకుండా ఫూడుల్సోటిట ! వీటికంటే అన్యాయమంటారా ఆ గ్రైపు వాటరూ? పైగా, ఓ వయస్సొచ్చేసరికి, గ్రైపు వాటర్ పిల్లల చేతికందకుండా పెట్టేవారు. పెద్దాళ్ళు అటొచ్చీ, ఇటొచ్చీ ఎవరూ చూడకుండా ఓ చుక్కేసికునేవారనుకోండి. అందులో ఉన్న కిక్కు, ఓ గ్లాసుడు బీరు తాగినా ఉండేది కాదు, పైగా ఆ రోజుల్లో ప్రొహిబిషనోటీ !!

    ఏ శనాదివారాలో వచ్చాయంటే, పిజ్జాలూ, బర్గర్లూ ఉండనే ఉన్నాయి. ఇంక పెద్దాళ్ళకైతే పానీ పూరీలూ వగైరాలు. అవన్నీ తీసికోకూడదనడం లేదు, కానీ దేనికైనా ఓ హద్దూ పద్దూ ఉంటే బాగుంటుంది. హాయిగా ఓ పండు ఏదో తీసికుని రసం తీసికుంటే పోయే దానికి, రియల్ జ్యూసులూ వగైరా. అవన్నీ పీకలదాకా త్రాగడమూ, మర్నాటినుంచి దగ్గు ప్రారంభం అయి డాక్టర్ల దగ్గరకి పరిగెత్తడమూనూ.

    అసలు ఈ వేలం వెర్రేమిటో తెలియడం లేదు. పైగా ఈ రోజుల్లో ఏ మాల్ కి వెళ్ళినా, రకరకాల తిళ్ళు. పైగా చిన్న పిల్లల ఏ చానెల్, ఓ పోగో అనండి, ఓ డిస్నీ అనండి, ఓ కార్టూన్ నెట్ వర్కనండి దేంట్లో చూసినా వీటి సంబంధిత యాడ్లే! మొన్నెక్కడో కొట్టుకి వెళ్తే, ఒకావిడ అడుగుతోంది– బోర్న్ వీటా విత్ అదేదో మెమొరీ బ్లాస్టో సింగినాదమో కావాలని. ఆవిణ్ణడిగాను, మీ పిల్లాడికోసమా అని. ఏం చేయనూ అది లేకపోతే హోం వర్క్ చేయనంటున్నాడూ అన్నారు. Kids are holding parents for a ransom !! ఏమీ చేయలేని పరిస్థితి! Absolutely helpless!

   ఏదో ఒకళ్ళో ఇద్దరో తల్లితండ్రులు, ఈ పధ్ధతి మార్చాలని చూసినా, పిల్లలకి మళ్ళీ స్కూళ్ళల్లో అదేదో పీర్ ప్రెషరుట ! అక్కడికేదో ఇదివరకటి రోజుల్లో, చిరుతిళ్ళూ, ఫలహారాలూ లేకుండా పెరిగేరా పిల్లలూ? ఆరోజుల్లోనూ ఉండేవి మినప రొట్టె, మినప సున్ని, శనివారాలొచ్చాయంటే వాసిని పోళ్ళూ, సరదాగా నోట్లో వేసికోడానికి చేగోడీలూ, కారప్పూసా ఓహ్ ఎన్నెన్నుండేవో? ఇప్పుడు అలాటివన్నీ చేసికోడానికి టైమూ లేదూ, ఓపికా లేదూ. రైటే. ఏ దుకాణం లో చూసినా దొరుకుతాయిగా. మావాడికి ఇలాటి తిళ్ళు ఎక్కవండీ, వాడిదంతా పిజా కల్చరండీ అంటూ పోజులెట్టడం ! ఇంకేం చేస్తాం? తూర్పుకి తిరిగి దండం పెట్టడమే !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— చిల్లర…..

    నేను వ్రాస్తున్న విషయం, ప్రస్తుత యువతరానికి most irrelevant topic లా కనిపించొచ్చు. కానీ నూటికి డెభై మందికి మాత్రం ఈ “చిల్లర” అనేది most precious విషయం. ఎక్కడ పడితే అక్కడ క్రెడిట్ కార్డులు స్వాప్ చేసేవారికి ఈ కష్టాలెలా తెలుస్తాయి? చాలామందికి గుర్తుండే ఉంటుంది– ఇదివరకటి రోజుల్లో, మీ తండ్రుల వద్ద ఉండే “మనీ పర్సుల” లో, చిల్లర కోసం ఓ అర విడిగా ఉండేది. మరి ఇప్పుడో, walletటో ఏదో అంటారుట, దానినిండా క్రెడిట్ కార్డులూ, డెబిట్ కార్డులూ, అవేవో కూపన్లూ, గర్ల్ ఫ్రెండు ఫొటోలూ, పెళ్ళైనవారి దాంట్లో పెళ్ళాం, పిల్లల ఫుటోలూ కనిపిస్తాయి. చిల్లర అనే మాటే విన్నవారు కాదు. అంతా కాల మహిమ!

   అప్పుడెప్పుడో ప్రభుత్వం వారు, పావలా కాసుల్ని demonitize చేసేస్తున్నామని ఓ ఆరునెలల నోటీసిచ్చేసి, కావలిసినవాళ్ళు తమ దగ్గరున్న పావలాల్ని, ఏ బ్యాంకు వారి దగ్గరకైనా తీసికెళ్ళి మార్చుకోవచ్చని చేతులు దులిపేసికున్నారు. మార్చుకోడం అంత ఈజీయా బాబులూ, ఏ బ్యాంకుకెళ్ళండి, ” ఇక్కడ ఇవ్వలేమండీ, హెడ్డాఫీసుకెళ్తే దొరుకుతాయీ..” అనేవారే. ఈ మాత్రం లక్ష్మీ కటాక్షానికి, మళ్ళీ అంత దూరం వెళ్ళడం ఎందుకూ, ఉన్న పావలా కాసుల్ని, తమ క్రియేటివిటీ ఉపయోగించి,ఫెవికాలో, తుమ్మ జిగురో అంటించి, ఏ శిల్ప కళా ఖంఢాలో తయారు చేసికుంటే పోదా అని ఊరుకున్నవారూ ఉన్నారు. ఏది ఏమైనా, ఆ పూర్ పావలా కాసులు చరిత్రలో ఓ భాగం అయిపోయాయి!

   పోనీ చిల్లర అవసరం లేకుండా ఉంటుందా అంటే అదీ లేదు- సాక్షి పేపరు వాణ్ణి చూడండి రెండున్నర ట. ఏ మూడో, రెండో చేస్తే వాళ్ళ సొమ్మేం పోయింది చెప్పండి? పైగా ఆ పేపరాయన కోటానుకోట్లు సంపాదించాడని జనం అందరూ చెప్తున్నారాయె. కొట్టువాడు అయిదురూపాయలిస్తే, రెండు రూపాయలు చేతిలో పెడతాడు. మిగిలిన అర్ధరూపాయేదిరా అంటే, చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వేసి చిల్లర లేదు సార్ అంటాడు. పోనీ ఆ మర్నాడు వెళ్ళినప్పుడు, ఓ అర్ధరూపాయ తగ్గించి ఇద్దామా అనుకుంటే, కొట్లో ఆ ముందురోజున్నవాడి అబ్బో, అన్నో, చెల్లెలో ఇంకోళ్ళెవరో ఉంటారు. మనం ఏం చెప్పినా వినరు, వాడితోనే తేల్చుకోండీ అంటారు. మళ్ళీ అదే యాక్షన్ రీప్లే! నెలా పూర్తయేసరికి, వాడికుటుంబం మనకి రోజుకీ అర్ధరూపాయి ( ఆదివారం సాక్షి మూడున్నరతో కలిపి) చొప్పునా, పదిహేను రూపాయలు బాకీ ఉంటారు. మనలాటి బక్రాలు ఇంకా చాలా మందే ఉంటారు. మళ్ళీ వెధవ బీదరుపులోటీ! ఆదివారం సాక్షీ, ఈనాడూ కలిపి తీసికుంటేనే కిట్టుబాటవుతుంది! లేకపోతే విడి విడిగా, కలిపి రూపాయి వట్టం!

    ఇంక కొన్ని వస్తువులు ప్రత్యేకంగా “బాటా” కంపెనీవి 199,399,699,1999….. వెధవ్వేషాలు కాపోతే, ముష్టెత్తేదేదో పబ్లిక్కుగానే చేయొచ్చుగా! నేను పుట్టినప్పటినుంచీ చూస్తున్నాను, ఈ “బాటా” వాడు మాత్రం వాడి strategy మార్చలేదు. కొట్టువాడు చచ్చినా ఆ రూపాయివ్వడు. అనుభవించడమే! కొన్ని కొట్లలో చూస్తూంటాము, అయిదు రూపాయలకి తక్కువైతే, అన్ని టాఫీలో, చాకొలెట్లో చేతిలో పెడతాడు. ఈ మధ్యన ఓ మాల్ లో నాకు ఇలాగే అయితే, సరే వీడి సంగతిలా ఉందా అనుకుని, బయటకి వెళ్ళి, ఓ అరగంటలో తిరిగొచ్చి, ఓ సరుకు తీసికుని, వాడి చేతిలో ఓ పది నోటూ, అంతకుముందు వాడిచ్చిన నాలుగు టాఫీలూ చేతిలో పెట్టాను. కుదరదన్నాడు, ఏం, నువ్విస్తే తీసికోలేదా, నేనిస్తే తీసికోడానికేం రోగం అన్నాను. కాదూ కూడదూ అంటే మేనేజర్ ని పిలవమన్నాను. ఆ పెద్దమనిషొచ్చి ఏమిటీ గొడవా అన్నాడు. నాకేమీ గొడవలేదూ, మీవాణ్ణే అడుగూ అంటే వాడు కథంతా చెప్పుకొచ్చాడు. ఇంతలో ఈ గొడవతో బిల్లింగు అగిపోయింది. చాలా మంది నన్ను సపోర్టు చేసినవాళ్ళే. కానీ అందులో ఉన్న హాఫ్ చెడ్డీల వాళ్ళూ, క్యాప్రీ లవాళ్ళూ మాత్రం, చిరాకు పడ్డం మొదలెట్టారు విషయం తెలిసి.” क्या इत्नीसी छॉठी चीजकेलियॅ इत्ना जगढा …” అంటూ. పైగా వారిలో ఒకతను, అంకుల్, I will pay that amount, settle the issue…, నా దగ్గర డబ్బులు లేకనా ఈ హడావిడంతా. ఇలా ఉంటుంది ఈ రోజుల్లో!

   ఎప్పుడో, ఉన్న ఆ అర్ధ రూపాయలకి కూడా ఆయుర్దాయం తీరిపోతుంది. బస్సుల్లో వెళ్ళినప్పుడు కండక్టరు ఛస్తే చిల్లరివ్వడు, పైగా డిపోకి వెళ్ళి తీసికోమంటాడు. ప్రతీ రోజూ ఎక్కడ చూసినా ఇదే గొడవ. ఇదివరకటి తోచిందిస్తే పుచ్చుకునేవారు అడుక్కునేవాళ్ళు. ఇప్పుడో, వాళ్ళ రేటూ మారిపోయింది. మినిమం రూపాయ! ఇంక హొటళ్ళల్లో కౌంటరు దగ్గరకి వెళ్ళి బిల్లులు పే చేయడం నామోషీ! ఆ స్టువార్డో, బేరరో, సర్వరో ఓ ఫోల్డరు లో ఓ బిల్లూ, పక్కనే పళ్ళుకుట్టుకునే పుల్లలూ, పటీ బెల్లం ముక్కలూ, సోంపో సింగినాదమో వేసి పక్కనే పెడతాడు. ఏ అయిదు వందల నోటో పెట్టడం, వాడు తిరిగి డబ్బిచ్చేటప్పుడు, పదిరూపాయల నోట్లు ఏమాత్రం లేకుండా చూస్తాడు. కనీసం ఓ యాభైయ్యో, వందో టిప్పు దొరక్కపోతుందా అని!

   మామూలు కూరల మార్కెట్టుకి వెళ్ళి చూడండి, చిల్లర విలువేమిటో తెలిసొస్తుంది !!!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    అమధ్యన ఒక సాహితీ మిత్రుడు , ప్రఖ్యాత రచయిత శ్రీ దాసరి అమరేంద్ర గారితో పరిచయం అయినట్లు వ్రాశాను. ఆయన ఆగస్టు లో రిటైరయ్యారు. మధ్యలో రెండు సార్లు మా ఇంటికి వచ్చారు. నిన్న ఫోను చేసి, తనకి వారుండే ప్రాంతం లోని తెలుగువారు ఫేర్ వెల్ ఇస్తున్నారనీ, ఆ కార్యక్రమానికి మమ్మల్ని కూడా రమ్మనీ ఫోను చేశారు. నేనన్నానూ, “మాస్టారూ, మీరు ఇచ్చే పార్టీ అయిఉంటే మేము తప్పకుండా వచ్చేవారమూ, ఎవరో ఇచ్చే పార్టీలో మేము వారిచే ఆహ్వానింపబడకుండా రావడం బాగుండదూ. ఎవరో ఒకరు అనొచ్చు, పార్టీ, డిన్నరూ అనేసరికి చెప్పా పెట్టకుండా, ఫామిలీ అందరినీ వేసుకొచ్చేశాడూ చూశారా…” అని. అందువలన మమ్మల్ని క్షమించేయండీ, మీరే మా ఇంటికి డిన్నరుకొచ్చేసేయండీ అని చెప్పాను.

   ఈవేళ సాయంత్రం శ్రీ అమరేంద్రగారి తల్లిగారు శ్రీమతి పరిపూర్ణ, అమరేంద్ర గారి భార్య శ్రీమతి లక్ష్మి గారినీ తీసికుని మా ఇంటికి వచ్చారు. మేముండే ఫ్లాట్ లో ఇంతమందికి డిన్నరూ అంటే కష్టమని, మా స్వంత ఫ్లాట్ కే రమ్మన్నాను. చెప్పినట్లుగా సాయంత్రం ఏడున్నరకల్లా వచ్చేశారు. బాగా కాలక్షేపం అయింది. శ్రీమతి పరిపూర్ణగారు కథకురాలు. చాలా కథలు వ్రాశారు. కబుర్లూ, భోజనాలూ అయిన తరువాత, శ్రీమతి పరిపూర్ణ గారు తను స్వయంగా వ్రాసి కంపోజ్ చేసిన పాటొకటీ, శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు వ్రాసి స్వర పరచిన పాటొకటీ అద్భుతంగా పాడి వినిపించారు.

   ఇంకో సంగతోటండోయ్, ఈవేళ సాక్షి పేపరులో శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు వ్రాసిన ” పన్ డిట్ వరదోక్తులు’ అనే పుస్తకంలోని కొన్ని భాగాలు ప్రచురించారు. అవి చదివి వెంటనే శ్రీమతి ఛాయాదేవి గారికి ఫోను చేసి ఓ అయిదునిముషాలు వారితో మాట్లాడాను. ఏమిటో ఈమధ్యన సాహితీ మిత్రులు ఎక్కువైపోయారు కదూ! ఆమధ్యన శ్రీరమణ గారూ, ఈవేళ శ్రీమతి ఛాయాదేవిగారూ, శ్రీ అమరేంద్ర, వారి తల్లిగారూ, ఏమైనా వారి సాంగత్య ఫలితంగా, నా భాషేమైనా బాగుపడుతుందేమో అన్న చిన్న ఆశ.…..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   మొన్నెప్పుడో ఒక టపా వ్రాశాను. మామూలుగా వివాస్పద విషయాల మీద వీలైనంతవరకూ వ్రాయను. అయినా ఇన్నాళ్ళూ ఓపిక పట్టి, మన రాష్ట్రం లో ప్రస్తుతం ఉన్న “వేడి” వాతావరణం గురించి, నా అభిప్రాయం వ్రాశాను. అక్కడికేదో పేద్ద గొప్పనుకుని కాదు. మనవైపు వెళ్ళడానికి త్వరలో వాతావరణం, పరిస్థులూ బాగుపడకపోతాయా అని మాత్రమే. ఆ టపా మీద ఎవరికి వారు వ్యాఖ్యల ద్వారా తమ అభిప్రాయాలు చెప్పారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఒకాయన ఉత్తిపుణ్యాన్న నాకో క్లాసు తీసేసికున్నారు! ఆయనకి నేనన్నదానిలో తప్పేం కనిపించిందో నాకైతే అర్ధం అవలేదు.

   నేను పూణే లో చూసిన ఒక ఊరేగింపు గురించీ, వారు పాటించిన క్రమశిక్షణ గురించీ మాత్రమే వ్రాశాను. షెత్కరీ సంఘఠన్ అన్నదానికి ” రైతు సంఘం” అని నాకు తెలిసిన అనువాదం వ్రాశాను.” మొన్నెప్పుడో స్టేషన్ కి వెళ్ళాను, తెలుగు పుస్తకాలకోసం, బస్సులోంచి కనిపించిందీ, ఓ ఊరేగింపు, చేతుల్లో placards పట్టుకుని, నినాదాలు చేస్తూ కలెక్టరాఫీసుకి ఊరేగింపుగా వెళ్తున్నారు. ఆ ఊరేగింపు కనీసం ఓ కిలోమీటరు పొడుగుండుంటుంది. అయినా సరే, వాళ్ళ దారిన వాళ్ళెడుతున్నారే తప్ప, సామాన్య ప్రజలకి ఎటువంటి సమస్యా ఇవ్వలేదు. ట్రాఫిక్కు కి ఆటంకం లేదు. ఏదో షేత్కరీ ( రైతు సంఘం లాటిదన్నమాట) ఊరేగింపనుకుంటా” ఆ మాత్రం దానికి,
“‘ఇదేదో రైతుల వూరేగింపూ’ అంటో కామెంట్ చేయటం కాదు. పావు ఎకరం దున్ని బియ్యం రాళ్ళు పండించు. తెలుస్తుంది అప్పుడు రైతులు రోడ్డు పైకొచ్చి వూరేగింపు కోసం ఎందుకొసం వస్తున్నారో ???”

ఇంక చేసేదేమీ లేదు. ఆయన వ్రాసిన వ్యాఖ్యకి స్పందించడం కూడా అనవసరం అనిపించింది. అర్ధం అవకపోతే చెప్పాలి, అంతేకానీ మరీ ఇలాగా?

   మనం ఏదో ఒక వృత్తిని గురించి ఓ అభిప్రాయం చెప్పాము కదా అని, అదేదో నువ్వు చేసి చూడూ అనడం ఎంత భావ్యం? అదికూడా ఎటువంటి విమర్శ కాదు. ఏమిటో వివిధ రకాలైన మనుష్యులు. అసలు నాకెందుకూ ఆ విషయాలన్నీ? పైగా ఉన్న భూములే ప్రభుత్వం వాళ్ళు సెజ్ ల పేరుతో ఎక్వైరు చేస్తూంటే వీలే కుదరదు. ఎవరి పనులు వాళ్ళు చేసికోవాలికానీ, ప్రతీ వాళ్ళూ ప్రతీ దానిలో వేలెడితే బావుంటుందా ?

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— ఇంటావిడతో సిణేమాకి….

    నేను బ్ల్లాగులు వ్రాయడం కొత్తగా మొదలెట్టినప్పుడు, నా శ్రీమతిని “ఇంటావిడ” అని సంబోధించినప్పుడు, ఒకాయన వ్యాఖ్య పెట్టారు- ” ఇంటావిడ అంటే ఇల్లుగలావిడా అని అర్ధం వస్తోందీ, భార్య అనో శ్రీమతి అనో అనొచ్చు కదా”. అదేమిటండి బాబూ , మావైపు ఇంటావిడ అంటే, భార్యనే అర్ధం, పైగా ఊళ్ళోవాళ్ళందరినీ అనడం లేదుగా, ఆవిడకి లేని అభ్యంతరం మీకెందుకూ అన్నాను. ఈ టపాకి అందుకే శీర్షిక పెట్టాను. అఛ్ఛంగా, నిఝంగా మా ఇంటావిడతోనే ఈవేళ సినిమాకి వెళ్ళాను “I swear in the name of God….”.

    ఏదో క్రిందటి వారం అంతా ఇంటావిడ ధ్యాసే. పోనీ కొసమెరుపుగా ఓ సిణేమా కూడా చూపించేస్తే బావుంటుందీ అనుకొని, నిన్న టిక్కెట్లు కొన్నాను. ఈమధ్యన ఎప్పుడైనా సినిమాకెళ్ళిన మొహమా నాదీ. ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంలో రాజమండ్రీలో ఓ సినిమా చూశాము. టిక్కెట్టు ధర 50 రూపాయలు. తీరా నిన్న టిక్కెట్టు కొన్నప్పుడు, రెండు టిక్కెట్లకీ కలిపి, ముక్కు పిండి, 250 రూపాయలు తీసికున్నాడు! వామ్మోయ్, ఎప్పుడో చిన్నప్పుడు అమలాపురం కమలేశ్వర లో బాల్కనీ కి టిక్కెట్టు ఒక రూపాయి, ఒక్క అణా ! టిక్కెట్టుకే గూబ గుయ్యిమంది కదా, ఈ మాత్రం దానికి మళ్ళీ ఆటో కూడా ఎందుకూ అనుకుని, నిన్న మా ఇంటావిడ ఏదో పనిలో ఉన్నప్పుడు, జనాంతికంగా టిక్కెట్ట్లు తీసికున్నానూ, బస్సులోనే వెళ్దామూ అన్నాను. అప్పటికీ గయ్యిమంది. ఇప్పుడు సినిమా ఏమిటండీ, పిల్లలేమనుకుంటారూ , ఏదో వేరే ఊళ్ళో ఉంటే ఫరవాలేదు కానీ, ఒకే ఊళ్ళో ఉంటూ, మనం సినిమాలంటూ తిరిగితే బావుంటుందా అని. ఎప్పుడు చూసినా పిల్లలూ పిల్లలూ అనడమే కానీ, మనకీ టైంపాసంటూ ఒకటుండాలి కదా అని ఆవిణ్ణి సముదాయించాను. మొత్తానికి ఒప్పుకుందండి.

    పొద్దుటే లేచి పనులన్నీ పూర్తిచేసింది. పాలు కాచేసి, ఆ గిన్నెని నీళ్ళల్లో పెట్టేస్తే హాయిగా అవి చల్లారేక ఫ్రిజ్ లో పెట్టేయొచ్చుకదా అంటే, మా ఇంటావిడకి ఈ cryogenic treatment నచ్చదు. పాలు సరీగ్గా తొరక పట్టవూ అంటుంది. ఏదో పూర్తి చేసి బయలుదేరాము. ఆటోలు ఉండే వైపు వెళ్ళబోతుంటే, కాదూ బస్సులోనూ అన్నాను, నిన్ననే చెప్పానుగా అంటే, నాతో ఎప్పుడన్నారూ అని, ఏదో మొత్తానికి బస్సులోనే ఎక్కడానికి ఒప్పుకుంది. అప్పుడప్పుడు, నాలాటి అర్భకులు బస్సుల్లో ఎలా ప్రయాణం చేస్తారో అన్నది కూడా తెలియాలి కదా. ఎప్పుడూ, ఆరోగ్యకరమైన పదార్ధాలే తింటూ, మినరల్ వాటరే తాగడం కాదు, అప్పుడప్పుడు రోడ్డు పక్కనుండే ” చెత్త” పదార్ధాలు కూడా తింటేనే, మన శరీరంలో anti bodies బయలుదేరి, రోగనిరోధ శక్తి పెరుగుతుందట! అప్పుడెప్పుడో ఎక్కడో చదివానులెండి, అవసరార్ధం ఉపయోగిస్తూంటాను.

   బస్సులో కూర్చోడానికి సీటు దొరకలేదు. వెనక్కి తిరిగి ఆవిణ్ణి చూసే ధైర్యం లేదు. పాపం, బస్సు సడెన్ బ్రేక్ వేసినప్పుడల్లా భరతనాట్యం చేసేస్తోంది. ఎలాగోలాగ నిలదొక్కుకుంటోంది, ఇంతలో ఎవరో ఒకతను, తన సీటు లోంచి లేచి, నన్ను కూర్చోమన్నాడు. మరీ బావుండదు కదా అని, మా ఇంటావిణ్ణి పిలిచి కూర్చోమన్నాను. నేను సీటు మీకు ఆఫర్ చేస్తే, మీరేమిటీ ఆవిడెవరికో ఇచ్చేశారూ అంటే, ఆవిడెవరో కాదుబాబూ, నా జీవిత భాగస్వామీ, నా హృదయ సామ్రాజ్ఞీ … వగైరా వగైరాలు చెప్పి ఊరుకోపెట్టాను!

   మొత్తానికి థియేటరు కి వెళ్ళి చూద్దుం కదా అందులో ఉన్నవారు అక్షరాలా “పరక” ( మా కోనసీమ లో పరక అంటే పదమూడు) ప్రాణులున్నారు. సినిమా ఏమిటీ “దూకుడు”. ఏదో బ్లాగుల్లోనూ, చానెళ్ళలోనూ హోరెత్తించేస్తున్నారు కదా, అదేమిటో మనమూ చూస్తే పుణ్యమైనా దక్కుతుందీ అనుకుని వెళ్తే అదండి విషయం!

    సినిమా విషయానికొస్తే, ఏదో బావున్నట్లే అనిపించింది. కథా వ్యవహారం పాతదే అయినా, కామెడీ బాగుంది. అప్పుడప్పుడు ఇలాటివి కూడా చేస్తేనే కదా రిలాక్సేషన్. కానీ మా ఇంటావిడ వీటినేమీ గుర్తించకుండా ఓ టపా పెట్టేసింది. చెప్పానుగా మంచివాళ్ళకి రోజులు కావండి బాబూ…..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- పాత సరుకుల్లో ఉండే నాణ్యం….

    సంసారం లోకి వస్తువులు సమకూర్చుకోడానికి ఇదివరకటి రోజుల్లో చాలా కాలం పట్టేది. కారణాలు అందరికీ తెలిసినవే. ఎన్నిసార్లు వ్రాసినా ఆ కారణాలు ( డబ్బు, ఎవైలబిలిటీ) తప్ప ఇంకోటి తట్టదు నాకైతే మాత్రం. ఈ రోజుల్లో అలా కాదు. మనస్సులోకి రావాలే కానీ, క్షణంలో వచ్చేస్తుంది రెక్కలు కట్టుకుని. ఇప్పటి పవర్ అలాటిది మరి. ఇంటి యజమానిక్కావొచ్చు, యజమానురాలిక్కావొచ్చు, లేదా వారి ” ఆంఖోం కా తారా” లకి కావొచ్చు, next moment లో మనింట్లో ఉండాలి అంతే! అవసరం ఉందా లేదా అన్నది వేరే విషయం ! ప్రతీ నిముషమూ హోరెత్తే యాడ్లలోది కావొచ్చు, లేక ఏ exhibition లోనో చూసుండొచ్చు, యదాలాపంగా పేపరులోనో, లేక ఏ mouthshut.com లోనో ఆ వస్తువుగురించి రివ్యూ చదివుండొచ్చు, కారణాలకేమిటీ, కావలిసినన్ని చెప్పొచ్చు. మనింట్లో ఉందా లేదా అదీ కొచ్చను !

సరుకు కొంపలోకి తేవడంలో ఉన్న ఉత్సాహం, దాన్ని working condition లో ఉంచడానికుండదు. ఏదో ఆ వస్తువుని ప్రతీ రోజు కాకపోయినా, నెలకోసారో, పదిహేను రోజులకోసారో దాని అతీ గతీ తెలుసుకుంటూండాలి. లేకపోతే ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు పనిచేయడం మానేస్తుంది. తూర్పుకి తిరిగి దండం పెట్టడం తప్ప ఇంకో గతుండదు. మనం exhibition లలో ఎన్నెన్నో వస్తువులు చూస్తాము. ప్రత్యేకం కిచెన్ కి సంబంధించినవి. ఆ కొట్టువాడు కూరలు ఓ special shape లో కట్ చేసి చూపిస్తాడు. చుట్టూ ఉన్న మనుష్యులు నోరెళ్ళబెట్టి వాహ్ .. వాహ్ అంటూ చూసేసి కొనేయడం, వాళ్ళని చూసి ఇంకో నలుగురూ. అసలు ఆ కూరలు special shape లోనే కట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని ఒక్కళ్ళూ ఆలోచించరు. పోనీ ఏదో సరదా పడి కొన్నారే, ఇంటికెళ్ళిన తరువాత ప్రయత్నిస్తే, ఛస్తే ఆ కొట్టువాడికొచ్చినట్లు రాదు. హాయిగా అలవాటుగా ఏ కత్తిపీటో దిక్కు. ఆ
exhibition లో కొన్నది ఏ పాత సామాన్లలోనో పడుంటుంది.

ఇదివరకటి రోజుల్లో చాలా కాలం ఇళ్ళల్లో భోజనం చేయాలంటే హాయిగా ఓ పీటేసుక్కూర్చునేవారు. తాహతుని బట్టి ఆ పీటలకి నాలుగువైపులా వెండి పువ్వులుండేవి. ఇంటి పెద్దకే ఆ ప్రివిలేజ్! కాలక్రమేణా, ఆధునిక ఫాషన్లొచ్చేటప్పటికి dining tables వచ్చాయి. కుటుంబ సంఖ్యని బట్టి నాలుక్కుర్చీలదో, ఆరు కుర్చీలదో సెట్లు. కుటుంబం అంతా నిర్ణీత సమయం లో దాని చుట్టూరా కూర్చుని భోజనం చేయడం. మంచి టేకు కర్రతో చేయించేవారు. తరువాత్తరువాత ఫోల్డింగు టైపువి వచ్చాయి. ఎలాటిదైనా dining tables ఓ స్టేటస్ సింబలు. కింద కూర్చోడానికి వళ్ళొంగడం లేదు, వయస్సుతో పనిలేకుండా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ దగ్గరనుండీ ఈ టేబిల్స్ కే అలవాటు పడిపోయారు. మోకాళ్ళనొప్పులతో నుంచుంటే కూర్చో లేరు, లేస్తే కూర్చో లేరూ, ఇదే హాయిగా ఉండేది.

ఒక్క భోజనానికే కాదు, పిల్లలు చదువుకునేటైములో వాళ్ళ హోం వర్కులూ, ప్రాజెక్టులూ, పసిబిడ్డకి స్నానం చేయించి, ఓ బొంతోటి వేసి దానిమీదే పొడుక్కోపెట్టడం దాకా అన్నీ ఆటేబుల్ మీదే! ఆ టేబుల్ మన జీవితంతో అంతగా పెనవేసుకుపోయింది. అందుకే, ఈనాటి ఎపార్ట్మెంటు కల్చర్ లో కూడా అది ఒక భాగం అయిపోయింది. ఎన్ని పాత సామాన్లు మార్చినా, ఈ టేబుల్ మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. పైగా సెంటిమెంటోటీ! రోజులు మారే కొద్దీ, చెక్కతో చేసిన టేబిళ్ళు ఫాషన్ కాదని, గ్లాసు టేబిళ్ళొచ్చాయి. వాటి కాళ్ళు చెక్కతో చెసినవే, కానీ టాప్ మాత్రం గ్లాసుది. చూడ్డానికి మహ స్టైలుగా ఉంటుంది. స్థలమూ తక్కువే ఆక్రమించుకుంటుంది. కానీ దానికి ఇదివరకటి చెక్క టేబిళ్ళకుండే ఓపికెక్కడిదీ?

ఓ ఏడాదో ఏణ్ణర్ధానికో ఆ కాళ్ళు కాస్తా ఊడుతాయి. కాలూడిపోయింది కదా అని బయట పారేయలేము కదా, మళ్ళీ దాన్నతికించుకోడానికి ఎవడిదగ్గరైతే కొన్నామో వాణ్ణే కాళ్ళా వేళ్ళా పడి బాగుచెయించుకోడం. పోనీ బాగుచేయించాము కదా అని జీవితాంతం ఉంటుందా అంటే అదీ లేదూ, వచ్చే ప్రాణం పోయే ప్రాణమూనూ.

ఈ గోలంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, మేము రాజమండ్రీలో కాపరం పెట్టినప్పుడు, అలాటిదే ఓ గ్లాస్ టాప్ టేబులు కొన్నాము. మా స్వంత ఇంట్లో మేము 1975 లో కొన్న చెక్క టేబుల్ గుండ్రాయిలా ఉంది. కొత్తగా కొన్నది మాత్రం ఇప్పటికి రెండు సార్లు రిపేరీకొచ్చింది. మా అమ్మాయి వాళ్ళింట్లో అయితే, ఓ రోజున దభేలు మని విరిగే పోయింది. ఇంకో మాటలేకుండా, హాయిగా చక్క టెబుల్ కొనేశారు. మాదగ్గరున్న టేబుల్ కి ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. మా అగస్థ్య వచ్చినప్పుడల్లా, దాని దగ్గరకి వెళ్ళకుండా, కాపలా కాయడంతోనే సరిపోతోంది. చెక్క టేబిలైతే, ఇంకో సదుపాయం ఉండేది,ఎప్పుడైనా కోపం వస్తే బల్ల గుద్ది మరీ చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలాటి పనిచేస్తే టుపుక్కున పగులుతుంది. హాయిగా బల్లమీద కొట్టడానికి కూడా వీల్లేని బతుకేం బతుకండీ?

కొత్తగా కొంప కొన్నప్పుడు, దానికి అలంకారాలు చేయడం ఓ అలవాటైపోయింది. మన సరుకులన్నీ అందరికీ కనిపించేలా ఉంచడానికి, ప్రతీ షెల్ఫుకీ గ్లాసు ఉపయోగించడం. ఇంట్లో చిన్న పిల్లలుంటే ఇంక ఆ గ్లాసు సంగతి దైవాధీనమే. ఎప్పుడు వాళ్ళు విసిరిన బాల్ తగిలి పగులుతుందో తెలియదు. ఎన్ని చెప్పండి పాత సరుకుల్లో ఉన్న నాణ్యం మాత్రం ఎక్కడా దొరకదు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   ఈ వీకెండు చాలా చాలా బిజీ అయిపోయాము. శుక్రవారం నాడు, అకస్మాత్తుగా మూడు ఫోన్లు. నా మిస్టరీ షాపింగు ఏజన్సీల దగ్గరనుంచి. ఒకటేమో మా ఇంటావిడకి, మిగిలినవి నాకు! ఇంటావిడకి Shopperstop చేయమని. అక్కడకది సరిపోదేమో అని, వాళ్ళే ఇంకో Shopperstop కూడా చేయమని నన్నూ. వాళ్ళతో మాట్లాడడం పూర్తయిందో లేదో, ఇంకో ఏజన్సీ నుంచి, మూడు- రెండు SOTC బ్రాంచీలూ, ఒక Lawrence & Mayo కళ్ళజోళ్ళ షాపు చేయమని. క్రిందటి వారమే Cox & Kings వాళ్ళది చేసి రిపోర్ట్ ఇచ్చాను.
మొత్తానికి శని ఆది సోమవారాల్లో ఈ అయిదూ పూర్తిచేసి వచ్చాము. ఇంతలో మళ్ళీ మెయిలూ, ఇంకో చోట ఓ Shopperstop ఉందిట, ఏడో తారీకు లోపల చేయమని! మొత్తం ఆరు ఆడిట్లు. కాలక్షేపం మాత్రం బలేగా అవుతోందిలెండి. ఇంత హడావిడిలోనూ, నిన్న( ఆదివారం) అల్లుడూ,అమ్మాయీ మనవడూ, మనవరాలూ మేముండే ఇంటికి వచ్చి భోజనం చేసి, ఓ మూడు గంటలు గడిపి వెళ్ళారు.

   మేమేం తక్కువా అని, అబ్బాయీ కోడలూ మనవరాలూ,మనవడూ ఈవేళ ప్రోగ్రాం పెట్టుకుని వచ్చారు. అసలు ఈ నాలుగు రోజులూ ఎలా గడచిపోయాయో తెలియలేదు! రెండు రిపోర్టులు వ్రాసేశాను. ఇంక మూడింటివి వ్రాయాలి. ఒక్కొప్పుడనిపిస్తూంటుంది, భగవంతుడు ఇలా చల్లగా చూస్తూ, మా కాలక్షేపం ఏదో మాకుంచి, రోజులు వెళ్ళగలిగేటట్లు చూస్తే చాలూ అని.

   మొన్నెప్పుడో స్టేషన్ కి వెళ్ళాను, తెలుగు పుస్తకాలకోసం, బస్సులోంచి కనిపించిందీ, ఓ ఊరేగింపు, చేతుల్లో placards పట్టుకుని, నినాదాలు చేస్తూ కలెక్టరాఫీసుకి ఊరేగింపుగా వెళ్తున్నారు. ఆ ఊరేగింపు కనీసం ఓ కిలోమీటరు పొడుగుండుంటుంది. అయినా సరే, వాళ్ళ దారిన వాళ్ళెడుతున్నారే తప్ప, సామాన్య ప్రజలకి ఎటువంటి సమస్యా ఇవ్వలేదు. ట్రాఫిక్కు కి ఆటంకం లేదు. ఏదో షేత్కరీ ( రైతు సంఘం లాటిదన్నమాట) ఊరేగింపనుకుంటా. చెప్పొచ్చేదేమిటంటే, మన తెలుగు చానెళ్ళు ఏరోజు చూసినా, భాగ్యనగరం లో బందులూ, ఊరేగింపులూ, పోలీసు లాఠీ చార్జీలూ, సామాన్య ప్రజానీకం ఒక్కరోజైనా తెరిపిగా ఉన్నారని అనుకోను. ఎక్కడో బయటి రాష్ట్రంలో ఉంటూ, ఆంధ్రదేశం గురించి, అక్కడి సమస్యల గురించీ, మీకేం తెలుసునూ అని అడగొచ్చు. సమస్యలనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ మహరాష్ట్రలో మాత్రం లేవా? ఛాన్సొస్తే విదర్భ విడిగా కావాలని అడిగేవాళ్ళు కావలిసినంత మందున్నారు. అలాగని రైళ్ళూ, బస్సులూ, బొగ్గూ, స్కూళ్ళూ, ఆఫీసులూ, దేవాలయాలూ ఆపేస్తున్నారా?

   ఇక్కడ గత యాభైఏళ్ళనుండీ ఉంటున్నాను. ఒక్కసారి కూడా, సామాన్యప్రజానీకం కష్టపడేటట్లు ఉద్యమాలు చూడలేదు. అక్కడికేదో ఇక్కడి రాజకీయనాయకులంతా మహా పతివ్రతలనడం లేదు. కల్మాడీలూ, పవార్లూ, పటేళ్ళు కావలిసినంతమందున్నారు. ఒకళ్ళనిమించినవాళ్ళొకరూ. గుడిని మింగేవాడోటైతే, గుళ్ళో లింగాన్ని మింగేవాడోడు. ఇప్పుడు మనరాష్ట్రం విభజిస్తే వచ్చే నష్టం ఏమిటో తెలియడం లేదు. చిన్న చిన్న రాష్ట్రాలు కావలిసినన్నున్నాయి. పైగా వాళ్ళూ ఒకేభాష మాట్లాడేవాళ్ళే ఉదాహరణకి తమిళనాడు, పుదుచ్చేరి. లేకపోతే యూ.పి, ఉత్తరాంచల్,ఇంకా కాకపోతే బీహార్, జార్ఖండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మరి సెపరేట్ చేయడానికి వస్తున్న సమస్యేమిటో?

   సామాన్య ప్రజానీకానికి, రాష్ట్రం విభజించడం వల్ల ఒరిగేదేమీ లేదు.కాదూ, విభజించమూ అన్నా వచ్చే నష్టమూ లేదు. మరీ వీసాలూ, పాస్పోర్టులూ కావాలనకుండా ఉంటే చాలు!
పోనీ విభజించారూ అనుకుందాము- ఏదైనా మాజిక్కు జరిగిపోయి, చదువుకున్నవాళ్ళందరికీ ఉద్యోగాలొచ్చేస్తాయా? ధరలు ఏమైనా రాత్రికి రాత్రి తగ్గిపోతాయా? గత ముఫై ఏళ్ళనుండీ, కలిసి కాపురాలు చేస్తున్నవాళ్ళేమైనా విడిపోతారా? ఏమీ అవదు. ఈ గొడవలన్నీ తగ్గి హాయిగా ఉంటారు. శుభ్రంగా ఉంటున్నవారిమధ్య ఉత్తిపుణ్యాన్న మనస్పర్ధలు కల్పిస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. అసలు చదువులేమన్నా జరుగుతున్నాయా? ఓవైపున బస్సులేమో బందూ. ఎప్పుడు మొదలెడతారో తెలియదు, తరువాత నష్టాలు పూడ్చడానికి రేట్లు పెంచితే, మళ్ళీ ఈ నాయకులే ధాం ధూం అంటారు. మనవైపు బయలుదేరదామంటే ఒణుకూ, దడానూ. అదృష్టం కొద్దీ, పిల్లలిద్దరూ ఇక్కడే ఉండడంతో హాయిగా ఉంది. ఇంకా రాజమండ్రీలోనే ఉండుంటే వామ్మోయ్, హైదరాబాద్ మీదుగా రావడానికే వీలుండేది కాదూ ప్రస్తుత వాతావరణం లో!

   రాష్ట్ర విభజన మంచిదా కాదా అనే విషయం లోకి వెళ్ళడం లేదు. నేనేమీ అంత అభిప్రాయం వ్యక్తపరిచేటంత intellectual కాదు. అధవా చెప్పినా వినేవాడెవడూ లేడు. అరవ్వాళ్ళ దగ్గరనుండి మనం విడిపోయాము కదా అని, మనవాళ్ళని మద్రాసునుండి తరిమేశారా ఏమిటీ? అలాగే, ఇప్పుడేదో రాష్ట్రం విభజిస్తే కొంపలేమీ అంటుకుపోవు. ఎందుకొచ్చిన గొడవ? ఏదో తొందరగా ఏదో ఒక నిర్ణయం వచ్చేసి, జనం అందరూ సుఖంగా ఉంటే చాలు .

%d bloggers like this: