బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– సొసైటీల్లో పడే కష్టాలు….

   ఇదివరకటి రోజుల్లో ఈ బహుళ అంతస్థుల భవనాలూ వగైరా లేకపోవడంతో, ఏదో ఉన్న ఇంటిలోనే సంతృప్తి పడి లాగించేసేవారం. ప్రభుత్వం వారిచ్చిన క్వార్టర్లు కూడా, మహ ఉంటే రెండస్థులుండేవి. వాటిలో ఉండే కష్టాలు వాటిలోనూ ఉండేవనుకోండి, ఉదాహరణకి, ఏ భారీ వర్షమైనా వస్తే, మెట్లక్రింద నీళ్ళతో నిండిపోయేది. కింద క్వార్టరు వాళ్ళని బ్రతిమాలో, బామాలో బయటకి వెళ్ళడం. ఒక్కోప్పుడు మరీ భారీ వర్షం అయితే, క్రింద పోర్షనులోని వాళ్ళింట్లోకీ నీళ్ళొచ్చేసేవి. అలాగని పైనున్నవాడు ఏదో సుఖపడిపోవడం లేదు, సీలింగంతా కారడం. ఎప్పుడో కట్టిన క్వార్టర్లూ, అయిదేళ్ళకోసారి maintainance అనోటి చేసేవారు. ఈ లోపులో ఏ సివిల్ వర్క్స్ వాడికైనా డబ్బులు ( దక్షిణ, తాంబుల రూపం లో) కిట్టాలంటే, ఈ క్వార్టర్స్ కి ముక్తి లభించేది.

   రిటైరయ్యే లోపులో ఏదో ఒక కొంప తయారుచేసికోవాలిగా, ఆ కారణంగా, ఎక్కడో అక్కడ మన తాహతు బట్టి ఓ 2BHK, లేక 3 BHK కొనేసుకోడం.అక్కడ నుండి ప్రారంభం అవుతాయి built-in కష్టాలు! ఎక్కడ చూసినా, నాలుగునుంచి, పది అంతస్థులదాకా బిల్డింగులు. ఏదో గాలొస్తుందనో, లెక మనం బుక్ చేసే టైముకే ఖాళీ లేకో మన అదృష్టం బాగోకో, ఏమైతేనేం, ఏ నాలుగో అంతస్థులోనో దొరుకుతుంది మనకి ఓ ఫ్లాట్. మినిమం నాలుగంతస్థులుంటేనే లిఫ్ట్ ట. ఆ బిల్డర్లూ మహా దుష్టులు. నాలుగుంటేనే Fire Equipment కంపల్సరీట. అంటే మూడంతుస్థుల్లో ఉండే వాళ్ళు చచ్చినా సరే ఎవడికీ పట్టదన్నమాట!

   ఇంక ఈ ఫ్లాట్లన్నిటికీ ఓ సొసైటీ ఫార్మ్ చేసి, ఎవడో ఒకడిని సెక్రెటరీ, ప్రెసిడెంటు చేస్తారు. వాళ్ళ కష్టాలు వారివి, ఉన్న నలభై యాభై ఫ్లాట్లలోనూ, కనీసం ఓ అరడజను పక్షులుంటారు, నెల నెలా ఇవ్వాల్సిన society charges ఎప్పుడూ నాగా యే ! మా స్వంతిల్లున్న సొసైటీ లో ఉన్నవి 12 ఫ్లాట్టులు, అందులోనే ఇద్దరున్నారీ టైపు పక్షులు. మనం ఇచ్చే డబ్బుల్లో,సెక్యూరిటీ వాడికిచ్చే జీతాలూ, కరెంటు ఛార్జీలూ, క్లీనింగ్ చేసే వాళ్ళూ, అప్పుడప్పుడు తెచ్చే వాటర్ టాంకర్ల ఛార్జీలూ, అన్నిటికంటే ముఖ్యం Lift Maintainance ఛార్జి. ఇదిటండి మనం కట్టే పైస పైసా ఖర్చూ.

   ఎంతంత పేద్ద పేద్ద బ్రాండువి పెట్టినా సరే, ఈ లిఫ్టులు నెలలో కనీసం మూణ్ణాల్రోజులు పడుక్కుంటాయి. ఇంక మన వింగులో ఉండేవాళ్ళు, కుర్రాళ్ళు, వాళ్ళకీ జన్మానికో శివరాత్రిలా మెట్లెక్కి రావడం ఓ excercise అనుకుంటారు. మన ఖర్మ కాలి మాలాటివాళ్ళు ఏ నాలుగో ఫ్లోర్ లోనో ఉంటారు. కిందికీ పైకీ వెళ్ళడానికి ఓపికుండదు. లిఫ్టు గురించి మాట్లాడే నాధుడుండడు. మేము ఎలాగైనా ” అద్దె” కి ఉండేవాళ్ళం. మా మాటపట్టించుకునేవాడెవ్వడూ? ఇంక ఆ ప్రెసిడెంటో,సెక్రటరీయో ఇంకో వింగులో ఉంటారు. వాళ్ళకేం పట్టిందీ, ఇంకో వింగువాడి లిఫ్ట్ పనిచేస్తేనేమిటి, తగలడితేనేమేటి? ఆ దిక్కుమాలిన ప్రెసిడెంటు గిరీ, సెక్రటరీ గిరీ ఎందుకో? మళ్ళీ ఎప్పుడైనా చందాలూ అవీ వసూలు చేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తొస్తూంటారు!

   ఈ మధ్య ఓ పేద్ద సొసైటీలో ఓ బోర్డు చూశాను–Parking at Owner’s risk only... అని. మరి ఆ సెక్యూరిటీ వాడెందుకుట? లక్షలు పోసి ఓ కారు కొనుక్కుంటే, దాన్ని ఇంట్లో పెట్టుకోలేము కదా, కింద పార్కింగులోనే పెడతారాయె. బయటివాళ్ళు సొసైటీ లోపల పార్కు చేసికోకూడదు, అంతవరకూ బాగానే ఉంది, ఓనర్స్ కార్లకి రక్షణ తమ పూచీ కాదనడం ఎంతవరకూ భావ్యం? ఇలా రాసుకుంటూ పోతే, ఎపార్ట్మెంట్లలో ఉండే కష్టాలేమిటో తెలుస్తాయి. పోనీ అలాగని విడిగా ఉండే ఇల్లు కొందామా అంటే,కోట్లలో ఉంటుంది. అనుభవించడమే!

   ఈ సోదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, మేము అద్దెకుండే సొసైటీలో లిఫ్ట్ తగలడి, మూడు రోజులయింది. అదేదో కాయిల్ తగలడిందిట. దాన్ని బాగుచేయించడానికి ఆ ప్రెసిడెంటో ఎవడో ఓ మీటింగు పెట్టి చర్చించాలి, వాళ్ళందరూ సరే అనాలి, అలా అనవలసిన మీటింగుకి కోరం ఉండాలి, ఇన్నీ పూర్తయి ఆ లిఫ్టు వాడు రావాలి, అప్పుడు కరెంటుండాలి, ఎందుకంటే సింగరేణి ధర్మమా అని ఇక్కడ పూణె లో రోజుకి మూడుంపావు గంటలు లోడ్ షెడ్డింగోటి ! ఇదండీ సంగతి..
ఇంత డిప్రెషన్ లోనూ ఈవేళ శ్రీ వెంకటేశ్వరా భక్తి చానెల్ లో బ్రహ్మశ్రీ చాగంటి వారి మూడు గంటల ప్రవచనం ( లైవ్) ఒక్కటే ఓ సిల్వర్ లైనింగ్ ! ఇంకో రెండు రోజులొస్తుందిట !

%d bloggers like this: