బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–something is missing somewhere….

   మా చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఇంట్లో ఉన్న అందరి మధ్యా సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండేవో? ఓ అన్నా చెల్లెలనండి, అక్కా తమ్ముడనండి, ఓ అక్కా చెల్లెలనండి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంట్లో ఉన్నవాళ్ళమధ్యా, బయటున్న చుట్టాల మధ్యా, అభిప్రాయ బేధాలుండొచ్చు, కానీ ఒకళ్ళనొకళ్ళు ద్వేషించేవారు కాదు. కానీ అదేమిటో ఈ రోజుల్లో
ఏదో ఇంటి పెద్ద ఉన్నన్నాళ్ళూ, ఒకళ్ళ యోగక్షేమాలొకళ్ళు తెలిసికుంటున్నారు. ఆ పెద్దాళ్ళు పైలోకాలకి వెళ్ళగానే ” ఎవరికి వారే యమునా తీరే..” అన్నట్లైపోతోంది. అంటే అభిమానాలు తగ్గాయా, లేక ప్రతీవారి బాధ్యతలూ పెరిగి, కుశలాలు తెలిసికోడానికే టైముండడం లేదా? ఏదో ఇంకో ఊళ్ళోనో, ఇంకో దేశం లోనో ఉండేవాళ్ళ సంగతైతే అర్ధం చేసికోవచ్చు, కానీ ఒకే ఊళ్ళో ఉంటున్నా ఇదే పరిస్థితి!

   పైగా చుట్టాలకంటే, ఫ్రెండ్సే ముఖ్యం అంటున్నారు. ఈ రిలేషన్లు ఇలా strain అయిపోవడానికి కారణాలు ఏమిటంటారు? ఎప్పుడో పున్నానికీ, అమావాస్య కీ కలుసుకున్నా, ఏదో ఫార్మాలిటీ గా మాట్లాడుకోడమే కానీ, ఇదివరకటి ఆత్మీయతలూ, అభిమానాలూ కనిపించడం లేదు! అలాగని సినిమాల్లోనూ, టి.వీ ల్లోనూ చూపించినట్టుగా, ఏవో పాటలు పాడమనీ, డ్యాన్సులు చేయమనీ కాదు. ఏదో మరీ మోనో సిలబుల్లలో కాకుండా మాట్టాడే మాటైనా నాభినుంచీ వస్తోందా? ఏదో పెద్దాళ్ళున్నారు కాబట్టి ఈ మాత్రమైనా కలుస్తున్నారు.

   ప్రతీవాడూ చెప్పేది ఒకటే మాట ఈమధ్యన టైమే ఉండడం లేదండీ, పిల్లల చదువులూ వాటితోనూ అనే. ఇదివరకుండేవి కావా ఈ సో కాల్డ్ చదువులూ బాధ్యతలూనూ. ఇంతకంటే ఎక్కువే ఉండేవి. పైగా రాబడి తక్కువా, ఖర్చులెక్కువా. అయినా ఎక్కడో అక్కడ అప్పో సొప్పో చెసి, బాధ్యతలు తీర్చుకునేవారు. ఏ సిటీలోనో ఉన్నాడా ,చుట్టాల బెడదా, ఎవడిదో చదువుకోసమో, వైద్యం కోసమో వచ్చే చుట్టాలోరు. పైగా ఎవరిని కాదన్నా వాళ్ళకే కోపాలూ. కాదూ అనే ధైర్యం ఎక్కడుండేది?

   ఈ మధ్యన ఒకరు ఫోను చేసి, ఎవరికో ఓ ఇల్లు చూడమన్నారు. కారణం వాళ్ళింటికి ఓ చుట్టం ఉద్యోగరీత్యా వచ్చాడుట, అప్పటికింకా కంపెనీ వాళ్ళిచ్చిన హొటల్లో కాలక్షేపం చేస్తున్నాడుట, ఆ హొటల్ ఫెసిలిటీ అయిపోగానే, వీళ్ళ నెత్తిమీద కూర్చుంటాడేమో అని భయం! ఇలా ఉంటాయి. అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ మాట దేముడెరుగు, తల్లికి కూడా కొడుకుతో మాట్లాడాలంటే భయమే. ఏం మాట్లాడితే ఏం గొడవో అని! తల్లితండ్రులూ, పిల్లలూ ఒకే ఊళ్ళో విడివిడిగానే ఉంటున్నా, ఎప్పుడో సడెన్ గా కొడుకొచ్చి, ” అమ్మా భోజనం పెట్టవే. ఎన్నో రోజులయిందీ నీ చేతి వంట రుచ్చూసి..” అంటే ఎంత సంతోషిస్తుందో కదా ఆ వెర్రి తల్లి? “ఏం ఇంట్లో నేను తిండి పెట్టడం లేదా, అమ్మ గుర్తొచ్చిందీ..” అంటుందేమో పెళ్ళాం అని భయం! మళ్ళీ ఎందుకొచ్చిన గొడవలే అని ఆ కొడుకూ నోరుమూసుక్కూర్చుంటాడు! అలాగే తమ్ముడో, అన్నో వస్తే ఎంత బావుంటుందీ?

    ఇదివరకటి రోజుల్లో వాళ్ళు వెళ్ళే ఊళ్ళల్లో చుట్టాలనేవారు ( దూరపు చుట్టమైనా సరే) ఉన్నారూ అని తెలిస్తే చాలు, వెళ్ళిపోడమే.కానీ ఈ రోజుల్లోనో, ఏ హొటల్లోనో దిగడం, ఏదొ ఫార్మాలిటీ కోసం ఓసారి పలకరించి వచ్చేయడమూ.

   All said and done, something is missing somewhere..

%d bloggers like this: