బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– నాకెందుకసలూ…..

    మామూలుగా ఈ మధ్యన వార్తల్లో చూస్తూంటాము, ఏదో ఓ సినిమా వస్తుంది, అదేమో రికార్డులు బద్దలుకొట్టేస్తుంది. ఎక్కడనుంచో, ఎవరో ఒకరొచ్చి, ఫలానా సినిమా కి మూల కథ నాదే, మక్కికి మక్కీ కాపీకొట్టేశారూ, ఓ నయా పైసాకానీ, కనీసం క్రెడిట్లలో నా పేరుకానీ ఇవ్వనే లేదూ అని. ఏదో కొంతమందైతే కోర్టులక్కూడా ఎక్కుతూంటారు. అప్పుడెప్పుడో అమెరికాలో భారతీయ సంతతికి చెందిన కావ్యా విశ్వనాథన్ వ్రాసిన ” How Opal Mehta Got Kissed, Got Wild, and Got a Life ” అనే పుస్తకాన్ని, అందులో, మరో నలుగురు ప్రఖ్యాత రచయితలు వ్రాసిన పుస్తకాల్లోంచి, కొన్ని భాగాలు యతాతథంగా కాపీ ( plagiarism. అనో ఏదో అంటారుట) కొట్టినందుకు, పేద్ద గొడవ జరిగింది. ఆ సందర్భం లో ప్రచురించిన ఒక వ్యాసం ఇక్కడ చదవండి.

    స్వంతంగా వ్రాసే ఓపిక లేకపోతే, ఏదో ఏ యాభై ఏళ్ళ క్రిందటిదో, దేంట్లోంచో చూసేయడం తమ పేరుతో వ్రాసేయడం. ఎవరికీ అంత పురాతన పుస్తకాలు చదివే ఓపికా ఉండదు. కానీ ఈ internet వచ్చిన తరువాత జనాలు ( ఈ కాపీ కొట్టిన వాళ్ళు) వీధిన పడిపోతున్నారు. మరీ ఇదేమిటీ అని అడిగితే, అవునూ రామాయణం, మహా భారతాలు లాటివి, ఎవరికి తోచిన పధ్ధతి లో వాళ్ళు రాయడం లేదా అని ఓ ఆర్గ్యుమెంటోటీ ! అవన్నీ పురాణాలు, ఎవరిదారిన వారు వాటిని intrepret చేసికుంటారు. కానీ కథల్ని కూడా చేస్తే ఇదిగో ఆ కావ్యా లా అవుతుంది !

    ప్రస్తుత విషయానికొస్తే, మా ఇంటావిడ ఈ మధ్యన పుస్తకాలు మరీ ఎక్కువ చదివేస్తోంది లెండి , ఇంకేం పని లేదా అని అడగడం తరవాయి, మీక్కావలిసినవన్నీ చేసి పెడుతున్నా కదా, ఇంకా నేనేదో సుఖపడిపోతున్నానని ఏడుపెందుకూ అంటుంది. పోనిద్దురూ ఎవరి గొడవ వాళ్ళది. చెప్పొచ్చేదేమిటంటే, ” స్త్రీల కథలు–1, 1901-1980 ” అనే పుస్తకం చదివి, అందులోని ఒక ఆసక్తి కరమైన విషయం కనిపెట్టింది.

    శ్రీమతి కె.విమలా దేవి అన్నావిడ ఓ కథ వ్రాశారు – శీర్షిక ” మా అమ్మ”–( పేజీ59 ). ఈ కథని “గృహలక్ష్మి” నవంబరు 1938 సంచికలో ప్రచురించారు (ట).
ఇక్కడ చిత్రం ఏమిటంటే అదే కథ ( పైన చెప్పానే మక్కికి మక్కీ) ని, ఇంకో అదనపు పేరా చేర్చి, శ్రీమతి సత్యవతి అన్నావిడ ” మా నాన్న”( పేజీ 65) అనే శీర్షికతో తిరిగి వ్రాశారు ఆ కథని భారతి” అక్టోబర్ 1938 సంచిక లో ప్రచురించారుట.

    పుస్తకం లో మొత్తం 30 కథలున్నాయి. ఇప్పుడు విషయం ఏమిటంటే, ఒకరి కథని ఒకరు కాపీ కొట్టారా, లేక ఒకే వ్యక్తి రెండు పేర్లతో వ్రాసి పంపారా, లేక, ఈ పుస్తకాన్ని ప్రచురించిన సంపాదకులు డా. కె. లక్ష్మీనారాయణ గారు, ఎవడు చూసొచ్చాడు లెద్దూ అని, అసలు ఆ విషయమే పట్టించుకోలేదా అని !

    అసలు ఇలాటివన్నీ మీకెందుకూ, మీదారిన మీరేదో “గాలి” కబుర్లు వ్రాసుకుంటూ కూర్చోక అంటారా నోరుమూసుక్కూర్చుంటాను …. అసలు వ్రతాలూ, నోములూ, స్త్రీల కథలూ మీకెందుకూ అనడక్కండి. పుస్తకం చదివి నా దృష్టికి తెచ్చింది, మా ఇంటావిడ !!

   ఇంకో సంగతండోయ్… ఈవేళ హారం లో “కళా గౌతమి” అనే పత్రిక గురించి చదివాను. రాజమండ్రీ అన్నా, గోదావరన్నా నాకైతే చాలా అభిమానం. అందులో, శ్రీ అంపశయ్య నవీన్ గారు వ్రాసిన ” కళా తపశ్వి చిట్టిబాబు” అనే వ్యాసం కనిపించింది. నా అభిమాన వీణా వాయిద్య శిఖామణి శ్రీ చిట్టిబాబు గారి గురించేమో అని చూస్తే, తీరా ఆ వ్యాసం ప్రఖ్యాత రచయిత శ్రీ బుచ్చిబాబు గారి గురించి
వెంటనే doubt clear చేసికోడానికి శ్రీ నవీన్ గారికి ఫోను చేశాను. ఈ వంకపెట్టి ఆయనతో ఓసారి మాట్లాడొచ్చు కదా అని! ఆయనేమో, నేను వ్రాసింది బుచ్చిబాబు గారి గురించండి బాబూ అన్నారు. వెంటనే, రాజమండ్రి ఫొను చేసి ఆ పత్రిక ఎడిటర్ గారికి చెప్పాను విషయం. పాపం ఆయనకూడా ఆ ” ముద్రారాక్షసానికి” విచారం వ్యక్తం చేశారు !

    ఇదిగో ఇలాటివే తిన్న తిండరక్క చేసే పనులంటే !!

%d bloggers like this: