బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Good old gripewater…..

   కనీసం గత మూడు నాలుగు తరాలనుండి ప్రతీ ఇంటిలోనూ, చిన్న పిల్లలు ఎప్పుడు ఏడ్చినా, ఇదిగో ఇలా చేసేవారు! మరి ఆ గ్రైపువాటరు ఎక్కడ మాయం అయిపోయిందో ఆ భగవంతుడికే ఎరుక! ఎవడో ఏ లాబీ వాళ్ళో రంగం లోకి దిగుంటారు. ఈరోజుల్లో గ్రైపు వాటర్ తీసికుంటే, ఫలానా రోగం వస్తుందీ, లేకపోతే ఇంకోటేదో వస్తుందీ అని భయపెట్టేసుంటారు. డాక్టర్ల్కి ఫ్రీబీలు ఇవ్వడం కూడా మానేసుంటారు. దానితో వాళ్ళుకూడా రికమెండు చేయడం మానేసుంటారు. 1980 దశకం దాకా మన దేశం లో గ్రైపు వాటర్ ఓ చుక్కేనా వేసికోకుండా పెరిగిన పిల్లో పిల్లాడో ఉన్నాడంటే నమ్మడం కష్టం !

   అదేదో త్రాగితే నష్టం వచ్చేస్తుందీ, addiction అయిపోతుందీ, వగైరా వగైరా చెప్పి భయపెట్టేశారు. త్రాగినవాళ్ళందరూ గుండ్రాయిల్లా ఉన్నారు. ఒక విషయం నిజమే, దానిలో alcohol content కొంచం ఎక్కువే! అయితే ఏమిటిట? ఇప్పుడు తల్లి పాలు త్రాగడం మానేసినప్పటినుండీ చిన్న పిల్లలు తినే, త్రాగే వస్తువులకంటే, addictive అనుకోను!

   ప్రొద్దుటే లేవడం తోటే అవేవోహనీ లూప్పులుట, అవి కాకపోతే చాకోలుట. ఆకలేసిందంటే, నూడుల్స్ ఉండనే ఉన్నాయి! ఇవన్నీ కాకుండా ఫూడుల్సోటిట ! వీటికంటే అన్యాయమంటారా ఆ గ్రైపు వాటరూ? పైగా, ఓ వయస్సొచ్చేసరికి, గ్రైపు వాటర్ పిల్లల చేతికందకుండా పెట్టేవారు. పెద్దాళ్ళు అటొచ్చీ, ఇటొచ్చీ ఎవరూ చూడకుండా ఓ చుక్కేసికునేవారనుకోండి. అందులో ఉన్న కిక్కు, ఓ గ్లాసుడు బీరు తాగినా ఉండేది కాదు, పైగా ఆ రోజుల్లో ప్రొహిబిషనోటీ !!

    ఏ శనాదివారాలో వచ్చాయంటే, పిజ్జాలూ, బర్గర్లూ ఉండనే ఉన్నాయి. ఇంక పెద్దాళ్ళకైతే పానీ పూరీలూ వగైరాలు. అవన్నీ తీసికోకూడదనడం లేదు, కానీ దేనికైనా ఓ హద్దూ పద్దూ ఉంటే బాగుంటుంది. హాయిగా ఓ పండు ఏదో తీసికుని రసం తీసికుంటే పోయే దానికి, రియల్ జ్యూసులూ వగైరా. అవన్నీ పీకలదాకా త్రాగడమూ, మర్నాటినుంచి దగ్గు ప్రారంభం అయి డాక్టర్ల దగ్గరకి పరిగెత్తడమూనూ.

    అసలు ఈ వేలం వెర్రేమిటో తెలియడం లేదు. పైగా ఈ రోజుల్లో ఏ మాల్ కి వెళ్ళినా, రకరకాల తిళ్ళు. పైగా చిన్న పిల్లల ఏ చానెల్, ఓ పోగో అనండి, ఓ డిస్నీ అనండి, ఓ కార్టూన్ నెట్ వర్కనండి దేంట్లో చూసినా వీటి సంబంధిత యాడ్లే! మొన్నెక్కడో కొట్టుకి వెళ్తే, ఒకావిడ అడుగుతోంది– బోర్న్ వీటా విత్ అదేదో మెమొరీ బ్లాస్టో సింగినాదమో కావాలని. ఆవిణ్ణడిగాను, మీ పిల్లాడికోసమా అని. ఏం చేయనూ అది లేకపోతే హోం వర్క్ చేయనంటున్నాడూ అన్నారు. Kids are holding parents for a ransom !! ఏమీ చేయలేని పరిస్థితి! Absolutely helpless!

   ఏదో ఒకళ్ళో ఇద్దరో తల్లితండ్రులు, ఈ పధ్ధతి మార్చాలని చూసినా, పిల్లలకి మళ్ళీ స్కూళ్ళల్లో అదేదో పీర్ ప్రెషరుట ! అక్కడికేదో ఇదివరకటి రోజుల్లో, చిరుతిళ్ళూ, ఫలహారాలూ లేకుండా పెరిగేరా పిల్లలూ? ఆరోజుల్లోనూ ఉండేవి మినప రొట్టె, మినప సున్ని, శనివారాలొచ్చాయంటే వాసిని పోళ్ళూ, సరదాగా నోట్లో వేసికోడానికి చేగోడీలూ, కారప్పూసా ఓహ్ ఎన్నెన్నుండేవో? ఇప్పుడు అలాటివన్నీ చేసికోడానికి టైమూ లేదూ, ఓపికా లేదూ. రైటే. ఏ దుకాణం లో చూసినా దొరుకుతాయిగా. మావాడికి ఇలాటి తిళ్ళు ఎక్కవండీ, వాడిదంతా పిజా కల్చరండీ అంటూ పోజులెట్టడం ! ఇంకేం చేస్తాం? తూర్పుకి తిరిగి దండం పెట్టడమే !!

%d bloggers like this: