బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అస్తమానూ కుదరమంటే కుదురుతుందా మరీ….

   చాలామంది అంటూంటే వింటూంటాం– ” అనుకున్నదేదో మొహం మీదే అనేస్తూంటాను. అదేమిటోనండీ, అసలు దాచుకోనేలేనూ… blah..blah..blaaaahh….”. ఏదో ఉద్యోగం లో ఉన్నప్పుడైతే సాగుతాయి ఈ వేషాలన్నీ, మన క్రింద, వినే బడుధ్ధాయోడుండం వల్ల. ఉద్యోగం పూర్తయిన తరువాత అనమనండి తెలుస్తుంది! కడుపులో ఏమీ దాచుకోకుండా చెప్పేయడం కొంతవరకూ సబబే, కానీ దానికీ ఓ సమయం, సందర్భం ఉండాలి. వినేవాళ్ళు కూడా కొంతవరకూ సహిస్తారు, ఆ లిమిట్ దాటిన తరువాత, they will show us our place! మరి అంతదాకా తెచ్చుకోడం అంత అవసరమా?

    అనుకున్నదేదో చెప్పేయడం ప్రతీసారీ ఓ virtue అని అపోహ పడ కూడదు! ఓ అణా ఎత్తు లౌక్యం కూడా నేర్చుకోవాలి. ఈ లౌక్యం, మగాళ్ళకంటే, ఆడవారికే ఎక్కువుంటుంది. ఇదిగో ఇక్కడే, వాళ్ళు ( అంటే ఇంటావిళ్ళూ) భర్త మీద పాయింట్స్ స్కోర్ చేసేస్తూంటారు! మేము ఎప్పుడైనా మా స్నేహితుల ఇళ్ళకి వెళ్దామనుకున్నప్పుడు, అదీ, అప్పటికి మేమే వాళ్ళింటికి రెండు మూడు సార్లు వెళ్ళి వెళ్ళి, ఇంక వెళ్ళకూడదూ వాళ్ళొచ్చేదాకా అనేసికుని, తీరా అనుకున్న తరువాత వాళ్ళు, మా ఇంటికి ఓ సారి వచ్చిన తరువాతే. వామ్మోయ్ ఎంత పేద్ద ” వాక్యం” అయిపోయిందో కదూ ! మళ్ళీ ఇక్కడ కూడా అదే గొడవ- అనుకున్నదేదో చెప్పేయడం!. రాసిందేదో చదివేవాళ్ళకి అర్ధం అయిందో లేదో చూసుకోనఖ్ఖర్లేదూ ( ఇంటావిడ ఉవాచ!). పోనిద్దురూ, మీకర్ధం అయే ఉంటుందనుకుంటా.

   ఆ సోదంతా వదిలేయండి. In simple words, ఎవరింటికైనా వెళ్దామనుకుంటే, అక్కడే దగ్గర ఇంకో పని కూడా పెట్టుకుంటాను. కలిసొస్తాయని! ఏదో పచారీ కొట్టుకి వెళ్ళడమో, లేక ఇస్త్రీకిచ్చిన బట్టలు తెచ్చుకోడమో,లాటివన్నమాట. అందరిలాగా, మాకు కార్లూ, స్కూటర్లూ, బైక్కులూ ఉన్నాయా ఏమిటీ? ఏదో ఈవెనింగ్ వాక్ పేరెట్టి, మా ఇంటావిడతో బయలుదేరి, వెళ్ళడం, ఈ చిల్లర మల్లర పనులన్నీ చక్కబెట్టడమూనూ. ఏదో వెళ్ళినవాళ్ళింటికి వెళ్ళి నోరుమూసుక్కూర్చుని, వాళ్ళిచ్చే కాఫీయో,చాయో, వేసంకాలం లో అయితే ఈ జ్యూసో, నిమ్మకాయ నీళ్ళో పుచ్చేసుకుని ఊరుకోవచ్చా, అబ్బే, మన సో కాల్డ్ “virtue” ( అదేనండీ, ఉన్నమాటేదో చెప్పేయడం), రంగం లోకి వచ్చేస్తుంది. దానికీ పనీ పాటూ ఉండదు, వీణ్ణి ఎప్పుడు వీధిలో పెడదామా అని చూస్తూ ఉంటుంది. ” ఎదురుగుండా లాండ్రీలో బట్టలు పుచ్చుకుందామని ఇటువైపు వచ్చామూ, దగ్గరలోనే ఉన్నారు కదా అని ఇలా వచ్చామూ…” అనేయడం! ఆ మాటనేయడం తో, అప్పటిదాకా, ఏ చాయ్ కోసమో స్టవ్ మేద నీళ్ళెడదామని అనుకున్నావిడ ( మన hostess), ఆ ఉద్దేశ్యం మార్చేసికుని, కిచెన్ లోకి వెళ్ళి ఓ ట్రే లో, రెండు గ్లాసుల్తో కాసిన్ని మంచినీళ్ళు తెచ్చేసి ఊరుకుంటుంది! ఏదో సాయంత్రం పూటా వేడి వేడిగా ఓ చాయ్ తాగే సదవకాశం, ఇదిగో మన అసందర్భపు virtue ధర్మమా అని చక్కాపోయింది!

    ఇలాటివే అసందర్భపు ప్రేలాపనలంటే! వాళ్ళతో అలా, అదేనండి ” లాండ్రీ బట్టలూ etc etc…” ప్రస్తావించకపోతే వచ్చే నష్టం ఉందా? లేదు. అయినా సరే నోటి దురద. ఇంక వాళ్ళూ, పేట్రేగిపోతారు- ” ఔనులెండి, ప్రత్యేకంగా మా ఇంటికే రావాలనేముందిలెండి…”– అలాగే, మా ఇంటావిడ ఒకసారి మా స్నేహితులింటికి వెళ్ళింది. తనొక్కత్తే లెండి, “ఓ గంట పోయిన తరువాత మీరూ రండి, ఓ అరగంట సేపుండి ఇద్దరం కలిసి వచ్చేద్దామూ” అని standing instruction ఇచ్చేసి. నేను ఇలాటి వ్యవహారాల్లో yours obediently లెండి. సరే అని, నా అలవాటు ప్రకారం, ఇంకో పనెట్టుకుని, వాళ్ళింటికి వెళ్ళాను. ఆ ఇంటాయన మాత్రం ఊరుకోవచ్చా, అబ్బే ఎంతైనా మొగాడూ, ” అర్రే ఫణిబాబుగారూ, మొత్తానికి మా ఇంటికి రావడానికి టైము కుదిరిందన్నమాట…” అని కెలికాడు! నేనా తక్కువ తిన్నదీ, పైగా ఆ దిక్కుమాలిన virtue ఓటుందాయే. “అబ్బే మీ ఇంటికని రాలేదండీ, ఏదో మా ఇంటావిడిక్కడుంది కదా, తిరిగి వెళ్ళేటప్పుడు తోడుండొచ్చూ…” అన్నాను. మళ్ళీ వాళ్ళూ మా ఇంటికి రాలేదు! ఆడాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉంటారనుకోండి. ఊరికే చెప్పా సందర్భం వచ్చింది కదా అని!

   ఇలా ఉంటాయి……

%d bloggers like this: