బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   మొన్నెప్పుడో ఒక టపా వ్రాశాను. మామూలుగా వివాస్పద విషయాల మీద వీలైనంతవరకూ వ్రాయను. అయినా ఇన్నాళ్ళూ ఓపిక పట్టి, మన రాష్ట్రం లో ప్రస్తుతం ఉన్న “వేడి” వాతావరణం గురించి, నా అభిప్రాయం వ్రాశాను. అక్కడికేదో పేద్ద గొప్పనుకుని కాదు. మనవైపు వెళ్ళడానికి త్వరలో వాతావరణం, పరిస్థులూ బాగుపడకపోతాయా అని మాత్రమే. ఆ టపా మీద ఎవరికి వారు వ్యాఖ్యల ద్వారా తమ అభిప్రాయాలు చెప్పారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఒకాయన ఉత్తిపుణ్యాన్న నాకో క్లాసు తీసేసికున్నారు! ఆయనకి నేనన్నదానిలో తప్పేం కనిపించిందో నాకైతే అర్ధం అవలేదు.

   నేను పూణే లో చూసిన ఒక ఊరేగింపు గురించీ, వారు పాటించిన క్రమశిక్షణ గురించీ మాత్రమే వ్రాశాను. షెత్కరీ సంఘఠన్ అన్నదానికి ” రైతు సంఘం” అని నాకు తెలిసిన అనువాదం వ్రాశాను.” మొన్నెప్పుడో స్టేషన్ కి వెళ్ళాను, తెలుగు పుస్తకాలకోసం, బస్సులోంచి కనిపించిందీ, ఓ ఊరేగింపు, చేతుల్లో placards పట్టుకుని, నినాదాలు చేస్తూ కలెక్టరాఫీసుకి ఊరేగింపుగా వెళ్తున్నారు. ఆ ఊరేగింపు కనీసం ఓ కిలోమీటరు పొడుగుండుంటుంది. అయినా సరే, వాళ్ళ దారిన వాళ్ళెడుతున్నారే తప్ప, సామాన్య ప్రజలకి ఎటువంటి సమస్యా ఇవ్వలేదు. ట్రాఫిక్కు కి ఆటంకం లేదు. ఏదో షేత్కరీ ( రైతు సంఘం లాటిదన్నమాట) ఊరేగింపనుకుంటా” ఆ మాత్రం దానికి,
“‘ఇదేదో రైతుల వూరేగింపూ’ అంటో కామెంట్ చేయటం కాదు. పావు ఎకరం దున్ని బియ్యం రాళ్ళు పండించు. తెలుస్తుంది అప్పుడు రైతులు రోడ్డు పైకొచ్చి వూరేగింపు కోసం ఎందుకొసం వస్తున్నారో ???”

ఇంక చేసేదేమీ లేదు. ఆయన వ్రాసిన వ్యాఖ్యకి స్పందించడం కూడా అనవసరం అనిపించింది. అర్ధం అవకపోతే చెప్పాలి, అంతేకానీ మరీ ఇలాగా?

   మనం ఏదో ఒక వృత్తిని గురించి ఓ అభిప్రాయం చెప్పాము కదా అని, అదేదో నువ్వు చేసి చూడూ అనడం ఎంత భావ్యం? అదికూడా ఎటువంటి విమర్శ కాదు. ఏమిటో వివిధ రకాలైన మనుష్యులు. అసలు నాకెందుకూ ఆ విషయాలన్నీ? పైగా ఉన్న భూములే ప్రభుత్వం వాళ్ళు సెజ్ ల పేరుతో ఎక్వైరు చేస్తూంటే వీలే కుదరదు. ఎవరి పనులు వాళ్ళు చేసికోవాలికానీ, ప్రతీ వాళ్ళూ ప్రతీ దానిలో వేలెడితే బావుంటుందా ?

%d bloggers like this: