బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– easier said than done….

    నా చిన్నప్పుడు, అమలాపురంలో మొట్టమొదటి సారిగా Electricity రావడం ఇప్పటికీ గుర్తు. మా నాన్నగారు, మా ఇంటికి పెట్టించారు. ఇప్పుడు ఇదేమిటీ ఈయన పాత సోదంతా మళ్ళీ మొదలెడతాడా అని ఖంగారు పడకండి! అలాటి దురుద్దేశ్యాలేమీ లేవు. ఆరోజులలో ఉండే పరిస్థితులూ, ఇప్పటి పరిస్థితుల గురించే ఈ టపా. ముందుగా ఓ వైరింగోటి చేయాలిగా, దానికోసం ఇంట్లో గోడవారే, సన్నటి చెక్క మేకులేసి కొట్టి, దాంట్లో అవేవో వైర్లు పెట్టి, మళ్ళీ దానిమీద ఇంకో సన్నటి చెక్కది వేసేసి మళ్ళీ దానిమీద మేకులు దిగ్గొట్టే వారు.
ఈ ఎలెట్రీ వైరింగు వలన ఓ సదుపాయం కూడా ఉండేది. ఎంతైనా ఆరోజుల్లో, ఇంటినిండా ఫుటోలే! ఆ గోడవారే, హాయిగా కావలిసినన్ని ఫొటోలు వేళ్ళాడదీయడానికి వీలుగా ఉండేది.
కావలిసొస్తే, గోడకేసిన రంగే, ఆ వైరింగు మీదా వేసేవారు, గోడ రంగుతో కలిసి పోయి అసలు అక్కడేదో ఉందా అనికూడా తెలిసేది కాదు.

   బయట దగ్గరగా ఉండే స్థంభం నుంచి, ఓ వైరోటి లాక్కుని, కనెక్షన్ తీసికునేవారు. ఇంటిముందర పోలు నుంచి వైరుందీ అంటే వాళ్ళింట్లో కరెంటున్నట్లే అని తెలిసేది. కాల క్రమేణా, జనాభా పెరిగిందీ, దానితో పాటు మిగిలినవన్నీ కూడా అభివృధ్ధి చెందాయి. వీటిలో మొట్టమొదటగా, వీధి దీపాల వైరింగు. ఇదివరకటి రోజుల్లో, రోడ్డు మీదనుంచి, ఏ బస్సో,లారీయో వెళ్తున్నప్పుడు, వాటిమీదుండే లగేజీకి ఈ వైర్లడ్డం వచ్చేవి. ఒక్కోప్పుడు, యాక్సిడెంట్లు కూడా జరిగేవి. దానితో underground cables వచ్చి, ఈ బైట వేళ్ళాడే వైర్ల గొడవ తగ్గింది. హై టెన్షన్ వాటికి బయటే ఉంటున్నాయనుకోండి.

   అలా క్రమంగా ఇళ్ళల్లో కూడా, concealed wiring చేయించుకోడం ఓ ఫాషనైపోయింది. ఎక్కడకక్కడ స్విచ్చిలు తప్ప వైరింగు కనిపించదు. చూడ్డానికి మహ బాగ్గా ఉంటుంది, కానీ ఎక్కడో ఎప్పుడో లోపల ఏ వైరో తగలడిందనుకోండి, ఉత్తి వాసనొస్తుంది తప్ప, ఎక్కడ పాడయిందో ఛస్తే తెలియదు. ఈ లోపులో మన అదృష్టం బాగో పోతే, కొంపంతా తగలడిపోయినా ఆశ్చర్యం లేదు. పేద్ద పేద్ద కాంప్లెక్సుల్లో ఎప్పుడైనా అగ్నిప్రమాదాలు జరిగినప్పుడల్లా నూటికి తొంభై పాళ్ళు, ఈ concealed wiring ధర్మమే! ఎందుకంటే బిల్డర్స్ అంత మంచి క్వాలిటీ వైరింగు ఛస్తే చేయరు. మనం ఏ ఫ్లాట్టో పుచ్చుకున్నప్పుడు, మరీ గోడంతా తవ్వి చూపించమనలేము కదా, ఇదిగో ఈ ఒక్క పాయింటూ ఆ బిల్డర్, exploit చేసి, ఏ నాసిరకం వైరో ఉపయోగించి, మన ప్రాణం తీస్తాడు. వాడి సొమ్మేం పోయిందీ, బయట కనిపించే స్విచ్చిలూ, ప్లగ్ పాయింట్లూ వాడు చెప్పినట్లు, బ్రాండెడ్ వే ఉపయోగిస్తాడు. వాడు సొమ్ము చేసికునేదల్లా ఈ concealed wiring లోనే.

    ఈ గొడవంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, కిందటి వారం లో మా ఫ్లాట్ ( స్వంతది) లో సడెన్ గా ఓ రోజు ఏదో కాలుతున్న వాసన రావడం మొదలెట్టిందిట, కోడలేమో, పిల్లలతో ఉంది, అబ్బాయేమో బయటకెళ్ళాడు, మొత్తానికి పక్కవాళ్ళ సహాయంతో, ఓ ఎలెట్రీ మెకానిక్కు ని రప్పించారు. వాడేమో, కొంపలో ఉండే వైరింగంతా పీకి పందిరేసి, మొత్తానికి లోపల వైరింగు సరీగ్గానే ఉందని తేల్చేశాట్ట. అయినా వాసన పోకపోయేసరికి, చూస్తే తేలిందేమిటయ్యా అంటే, ఓ ట్యూబ్ లైటు చోక్కు మాడిపోతూందట! ఏదో బాగుచేశారనుకోండి, కానీ ఈ concealed wiring వల్ల వచ్చే తిప్పలు చూశారా? లోపలేముందో తెలిసి చావదు. అలాగే, పైకి కనిపించకూడదని ప్లగ్ పాయింట్లూ, స్విచ్చిలూ బాగా కిందకి పెట్టించుకోడం. ఇంట్లో మా అగస్థ్య లాటి పిల్లాడుంటే, మళ్ళీ అదో గొడవా! పైగా ఈరోజుల్లో పిల్లలు చాలా హైపరాయె. వాళ్లకి ఏ వైరు కనిపించినా, ఏ ప్లగ్ పిన్ కనిపించినా, దాన్ని ఏ ప్లగ్ పాయింట్లోకో దోపేసి, స్విచ్చిలు వేసేస్తూంటారు. అలాటప్పుడు, నాలాటి వాళ్ళకి బి.పి. రైజైపోతుంది. పోనీ పిల్లలకి అందుబాటులో లేకుండా, లోపలెక్కడో పెట్టి తాళం వేయొచ్చుగా అంటే వినరూ. ఈ చిన్న పిల్లలకేమో ఇదో ఆటా !

   ఇవన్నీ, అబ్బో ఈ వయస్సులో మేము చేయలేనివన్నీ, ఏణ్నర్ధానికే నేర్చేసికున్నారూ అని సంతోషించాలా, లేక వీడు ఎప్పుడు పెద్దాడౌతాడా అనుకోవాలా? మేము అక్కడకి వెళ్ళినప్పుడల్లా ఇదే గొడవ. అల్లరి చూడ్డం వల్లే అసలింత భయపడిపోతున్నారూ, అసలు చూడ్డమే మానేస్తే? అలా ఎలా వీలౌతుందీ, వాణ్ణి చూడ్డానికే కదా, మమ్మల్ని రాజమండ్రీ నుంచి తెచ్చేసికున్నాడూ? ఏమిటో ఊరికే ఆలోచిస్తూ కూర్చుంటే, అన్నీ భయాలే. చూడ్డం మానేయడం కంటే, ఆలోచించడం మానేయడం హాయేమో.Easier said than done !!

%d bloggers like this: