బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    అమధ్యన ఒక సాహితీ మిత్రుడు , ప్రఖ్యాత రచయిత శ్రీ దాసరి అమరేంద్ర గారితో పరిచయం అయినట్లు వ్రాశాను. ఆయన ఆగస్టు లో రిటైరయ్యారు. మధ్యలో రెండు సార్లు మా ఇంటికి వచ్చారు. నిన్న ఫోను చేసి, తనకి వారుండే ప్రాంతం లోని తెలుగువారు ఫేర్ వెల్ ఇస్తున్నారనీ, ఆ కార్యక్రమానికి మమ్మల్ని కూడా రమ్మనీ ఫోను చేశారు. నేనన్నానూ, “మాస్టారూ, మీరు ఇచ్చే పార్టీ అయిఉంటే మేము తప్పకుండా వచ్చేవారమూ, ఎవరో ఇచ్చే పార్టీలో మేము వారిచే ఆహ్వానింపబడకుండా రావడం బాగుండదూ. ఎవరో ఒకరు అనొచ్చు, పార్టీ, డిన్నరూ అనేసరికి చెప్పా పెట్టకుండా, ఫామిలీ అందరినీ వేసుకొచ్చేశాడూ చూశారా…” అని. అందువలన మమ్మల్ని క్షమించేయండీ, మీరే మా ఇంటికి డిన్నరుకొచ్చేసేయండీ అని చెప్పాను.

   ఈవేళ సాయంత్రం శ్రీ అమరేంద్రగారి తల్లిగారు శ్రీమతి పరిపూర్ణ, అమరేంద్ర గారి భార్య శ్రీమతి లక్ష్మి గారినీ తీసికుని మా ఇంటికి వచ్చారు. మేముండే ఫ్లాట్ లో ఇంతమందికి డిన్నరూ అంటే కష్టమని, మా స్వంత ఫ్లాట్ కే రమ్మన్నాను. చెప్పినట్లుగా సాయంత్రం ఏడున్నరకల్లా వచ్చేశారు. బాగా కాలక్షేపం అయింది. శ్రీమతి పరిపూర్ణగారు కథకురాలు. చాలా కథలు వ్రాశారు. కబుర్లూ, భోజనాలూ అయిన తరువాత, శ్రీమతి పరిపూర్ణ గారు తను స్వయంగా వ్రాసి కంపోజ్ చేసిన పాటొకటీ, శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు వ్రాసి స్వర పరచిన పాటొకటీ అద్భుతంగా పాడి వినిపించారు.

   ఇంకో సంగతోటండోయ్, ఈవేళ సాక్షి పేపరులో శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు వ్రాసిన ” పన్ డిట్ వరదోక్తులు’ అనే పుస్తకంలోని కొన్ని భాగాలు ప్రచురించారు. అవి చదివి వెంటనే శ్రీమతి ఛాయాదేవి గారికి ఫోను చేసి ఓ అయిదునిముషాలు వారితో మాట్లాడాను. ఏమిటో ఈమధ్యన సాహితీ మిత్రులు ఎక్కువైపోయారు కదూ! ఆమధ్యన శ్రీరమణ గారూ, ఈవేళ శ్రీమతి ఛాయాదేవిగారూ, శ్రీ అమరేంద్ర, వారి తల్లిగారూ, ఏమైనా వారి సాంగత్య ఫలితంగా, నా భాషేమైనా బాగుపడుతుందేమో అన్న చిన్న ఆశ.…..

%d bloggers like this: