బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–of all the things… డయపర్ల గురించి…


    మా చిన్నప్పుడు, చిన్నపిల్లల్ని కింద ఏమీ వేయకుండా ఉంచినా , పేద్దగా అనుకునేవారు కాదు. కానీ, ఇప్పుడో తల్లి ఒడిలో ఉన్నప్పుడు తప్పిస్తే, పాకడం మొదలెట్టేటప్పటికి, వంటి మీద గుడ్డలేకుండా వదలరు. పైగా ఆ కిందేసీ చెడ్డీ లోపల డయపర్లోటి! వాళ్ళు చెడ్డీ చాలాసార్లు తడిపితే, అస్తమానూ మార్చలేక, ఓ లోపల ఓ డయపరోటి వేసేసి ఉంచేస్తారు. చెప్పొచ్చేదేమిటంటే, ఈ ప్రక్రియ పెద్దవారి convenience కోసం మాత్రమే. కానీ దీనివలన జరుగుతున్నదేమిటయ్యా అంటే, ఆ పిల్లో, పిల్లాడో, పాపం నిజంగా పాస్ కి వెళ్దామనుకున్నా, ఈ డయపర్ల ధర్మమా అని, వాటిలోనే పోసేసే అలవాటు అయిపోతోంది. ఇంతకంటే మంచి టాపిక్కే దొరకలేదా అనుకోకండి. ప్రస్తుత burning topic అదే మరి. ఇంట్లో ఏం ఉన్నా లేకపోయినా ఫరవా లేదు. కానీ ఈ డయపర్లు అయిపోతేమాత్రం, మనకి నిద్ర పట్టదు !!

    పైగా రాత్రి పక్కబట్టలు తడిసిపోతాయేమో అని, రాత్రిళ్ళు కూడా ఓ డయపరు వేసేసి పడుక్కోబెట్టడం! దీనితో ఏ స్నానం చేయించేటప్పుడో తప్ప, మిగిలిన ఇరవైమూడు గంటలూ ఆ డయపర్లతోనే ఉండిపోవలసివస్తోంది. మరి ఇంక ఓ టైముకి లేచి, పాస్ కి వెళ్ళడం అలవాటవమంటే ఎక్కడవుతుందీ? ఆ పిల్లనో పిల్లాడినో ఓ రాత్రివేళ లేపి, పోయించడానికి తల్లితండ్రులకి బధ్ధకం. బధ్ధకం అనడానికీ వీలులేదనుకోండి, పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అర్ధరాత్రివరకూ ఆఫీసు కాల్స్ తోనే సరిపోతుందాయే. ఏదో టైముందీ అనుకుంటే టి.వీ. లో ఏ సినిమాయో చూసి పడుక్కునేటప్పటికి, అర్ధరాత్రి దాటిపోతుంది, ఇంక మధ్యలో పిల్లనో పిల్లాడినో లేపే ఓపికెక్కడ? ఈ గొడవంతా భరించలెక, ఓ డయపర్ చుట్టబెట్టేస్తే సరి!

    ఆమధ్య ఓ యాడ్ కూడా వచ్చింది, ఓ డాక్టరమ్మ గారు, పక్కావిడతో అంటూంటుంది ‘అరే బాబు రాత్రంతా నిద్రపోలెదా అయ్యో ఫలానా డయపరు వేసేస్తే హాయిగా నిద్రపోయేవాడే…’
ఈ డాక్టర్లు, వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇలాటి సలహాలిస్తారేమో అని నాకో అనుమానం! ఆ నిద్రలో ఉన్న పిల్లో పిల్లాడో కూడా ఓ పధ్ధతికి అలవాటు పడిపోతారు, అధవా మధ్యలో మెళుకువ వచ్చినా, పోన్లెద్దూ డయపరుందిగా, దాంట్లోనే పోసేస్తే ఓ గొడవొదిలిపోతుందీ అని! ఓ వయస్సు దాటిన తరువాత పాపం వారికి సరిపోయే డయపర్లు దొరకవాయె, అలాగని ఆ వచ్చేదేదో రాక మానుతుందా, తెల్లారేటప్పటికి పాపం పక్కబట్టలు తడిసిపోతాయి. మళ్ళీ దాక్టరు దగ్గరకు పరిగెత్తడం. ” డాక్టర్, మా పిల్ల/పిల్లాడు ఇంతవయస్సొచ్చినా ఇంకా bed wetting చేస్తున్నాడూ, (అదేనండి పక్క తడపడానికి కొంచం గ్లామరస్ టర్మ్), ఏం చేయమంటారూ” ఆయనదేం పోయిందీ, అంతకుముందే ఏ మెడికల్ రిప్రజెంటేటివో ఇచ్చిన ఫ్రీబీస్, కాంప్లిమెంటరీల ధర్మమా అని, ఇంకో మందు చెప్పేస్తారు! అక్కడికి వాళ్ళ వృత్తిధర్మం పాటించినట్లూ ఉంటుందీ, మార్కెట్ లోకి వచ్చిన ఆ కొత్త’మందు’ కి బేరం వచ్చినట్లూ ఉంటుంది. ఉభయతారకం! ఈ డాక్టర్లే కాకుండా, పేపర్లలో యాడ్లు కూడా చూస్తూంటాము–” మీ బిడ్డ ఇంకా పక్క తడుపుతున్నాడా? అయితే వెంటనే ఈ క్రింది నెంబర్లని సంప్రతించండి” అంటూ.

    ఇదివరకు రోజుల్లో అయితే, ఈ టి.వీ లూ, ఇంటర్నెట్టులూ లేకపోవడంతో, పిల్లలు ఓ పధ్ధతిలో పెరిగేవారు. ఓ టైముకి భోజనం, ఓ టైముకి నిద్రా. నాకు బాగా గుర్తు- మా అబ్బాయి అటుసూర్యుడిటు ఉదయించినా సరే, రాత్రి ఎనిమిదిన్నరా అయేసరికి పక్కెక్కేసేవాడు. రాత్రి పదకొండూ అయే సరికి, ఆ నిద్రలోనే నడిచి, బాత్ రూం కి వెళ్ళి పనికానిచ్చేసేవాడు, ఇదంతా వాళ్ళమ్మ చేసిన అలవాటు. దానితో మాకు పరుపులూ, పక్కబట్టలూ ప్రతీ రోజూ ఎండలో వేసే బాధ తప్పింది!Ofcourse, ఇప్పటివాళ్ళూ అంటారు, మేం మాత్రం ఎండలో వేస్తున్నామా అని, కానీ ఇప్పుడు డయపర్లువేసి, అంతే తేడా!

   ఇంకో చిత్రం ఏమిటంటే, ఇదివరకటి రోజుల్లో, చిన్న పిల్లో పిల్లాడినో బట్టలు లేకుండా చూడ్డం ఓ పేద్ద విషయం లా ఉండేది కాదు. కానీ ఇప్పుడో, modesty. ఇదంతా మన చేతుల్లో ఉన్నంతకాలమే, పెద్దయిన తరువాత to hell with modesty. చూడ్దం లేదూ? ఎంత తక్కువ బట్ట కడితే అంత గొప్ప! మన సౌకర్యం కోసం చిన్నపిల్లలకి ఈ డయపర్లేసి హింసించకుండా, ఓ డిసిప్లీన్ నేర్పిస్తే బావుంటుందేమో. మీకేమిటీ, ఓ చిన్నపిల్లనో పిల్లాడినో పెంచాలా ఏమిటీ, కబుర్లు మాత్రం చెప్తారూ అనకండి, మా ఇంటావిడ, మా మనవణ్ణి చూడాల్సినప్పుడు, డయపరు మాత్రం వేయదు. వాణ్ణి ఎదో ఫిక్సెడ్ టైముకి తీసికెళ్తే వాడే oblige చేస్తూంటాడు. వాడితో ఎక్కడదాకా వచ్చిందంటే, అవసరం వచ్చినప్పుడు, వాళ్ళ నాన్నమ్మని చెయ్యి పట్టుకుని తీసికెళ్ళేదాకా. వాళ్ళ అవసరం గమనించే ఓపికా, టైమూ మనకుండాలి. మీకేమండీ, ఓ పనా పాటా, కావలిసింత టైమూ అనొచ్చు. నిజమే, కానీ కన్నతరువాత పిల్లల బాగోగులు చూసుకోవాల్సింది తల్లితండ్రులే కదా! Buy one get one స్కీంలో నాలుగేసి డయపరు ప్యాకెట్లు కొనేసి పడేస్తే సరిపోదు.

18 Responses

 1. అబ్బో! భలే వ్రాశారండీ!

  నా జీవితంలో రెండు సార్లు అర్థరాత్రి ఆటో లో వెళ్లి (అసలు వస్తువు ఖరీదుకి దాదాపు రెట్టింపు ఆటోకి చెల్లించి, తెచ్చుకోవలసి వచ్చినవి రెండే రెండు–ఒకటి నా సిగరెట్లు–ఓ సారి హైదరాబాదులో; రెండోది మా మనవడి డయపర్లు–బెంగుళురులో! యేం చేస్తాం!

  Like

 2. మా మేనల్లుడుకి diapers వెయ్యకుండా వదిలేవారు.మంచిదేగా అనకండి..వాడు ఎక్కడపడితే అక్కడ చెసేవాడు.no cleaning..ఎప్పుడు ఎక్కడ తొక్కుతామొ అని tension.అడిగితే కోపాలు..నువ్వు కంటావుగా అప్పుడు చూస్తా అని..diapers ఖర్చు దండగ అని ప్రగాడాభిప్రాయం కాని అది ఒప్పుకోరు..ఇక ఇప్పుడు నాకు diapers వెయ్యకుండా వదలాలన్నా కుదరని పరిస్తితి…

  Like

 3. పూర్తిగా కాదనలేను. అవుననీ అనలేను. కార్పెట్ నేలల మీద బతుకులు వెళ్ళించే మాలాంటి వారి విషయం కొంచెం వేరు. మళ్ళీ ఆ తడిసిన కార్పెట్ మీదే పిల్లాడు పాకితే చూడలేం. కార్పెట్ పూర్తిగా శుభ్రం చెయ్యలేం. ఇదో కోణం. మన నేలమీద డయిపర్లు కొంచెం విడ్డూరమే! కాలంతో , సరిపోని సమయంతో పడుతున్న పాట్లని అనుకోవాలంతే!

  చాలా రోజులయింది ఇటువైపు వచ్చి. మీ మార్కు చెణుకు మెరిపించారుగా!
  << ఇప్పటివాళ్ళూ అంటారు, మేం మాత్రం ఎండలో వేస్తున్నామా అని, కానీ ఇప్పుడు డయపర్లువేసి, అంతే తేడా! 🙂

  Like

 4. ఏమోనండీ, నా పాప మాత్రం అచ్చంగా అచ్చతెలుగు మధ్యతరగతి ఇంట్లో లాగే పెరిగింది. వాంపాలు తాగింది. వారానికోసారి వస పొంగించిన ఆవదం కూడా తాగింది పాపం పిచ్చి తల్లి! నేలమీద పాకింది,పడింది,లేచింది, అలాగే నడక నేర్చుకుంది. ఇంట్లో ఉన్నంత సేపూ డయపర్లే వేయలేదు నేను. రాత్రుళ్ళు కూడాను!

  బయటికెళ్ళినపుడు మాత్రం వేసే దాన్ని. (అసలు దానికి ఏడాది నిండేదాకా దాని డాక్టర్ దగ్గరికి తప్ప ఇంకెక్కడికీ వెళ్ళలేదు నేను)

  రాత్రి ఏడింటికి పడుకుని పొద్దున్నే ఏడింటికి లేచేది డయపర్ వేయకపోయినా!

  ఈ విషయంలో నా వోటు మీకే!

  కానీ పాపం కొత్తావకాయ లాంటి కార్పెట్ల మీద బతుకు సాగించాల్సి వస్తే ఏం చేస్తాం? మా పిల్ల ఇండియాకొచ్చాక పుట్టింది కానీ అమెరికాలో ఉన్నపుడు పుట్టి ఉంటే నేనూ ఆమె కామెంట్ కి డిటో కొట్టేదాన్ని!

  Like

 5. డైపర్ వాడినా డిసిప్లిన్ నేర్పించోచ్చండి మనకి ఓపిక తీరిక వుంటే. మీరన్నట్లు అర్ధరాత్రిదాకా ఆఫీస్ కాల్స్ వుంటే ఇక ఒపికేం ఉంటుంది పాపం. కాని పిల్లల కోసం రోజూ అన్నం వండాల్సి వస్తుందని సంవత్సరం దాకా గేర్బెర్ ఫూడ్స్ పెట్టే తల్లిదండ్రులను చూస్తే మాత్రం …..

  Like

 6. మీరెంతైనా భలే రాస్తారు సుమండీ! కీలెరిగి వాత పెట్టడం అంటారే అలా. చాలా మంది తల్లులు ఈ టపా చదివి భుజాలు తడుముకోవాలి మరి – నాతో సహా.
  నా పదిహేను నెలల కూతురికి రాత్రిళ్ళు నేను డయపర్లు వాడతాను. పగలు ఇంట్లో వున్నప్పుడు మాత్రం, చెడ్డీలే. దానికి ఓ మూడు నెల్లు నిండినప్పటి నుండీ ఇలాగే, అప్పటి వరకు మాత్రం, నాపీ గుడ్డలు కట్టేవాళ్ళం (పాత చీరలూ, డాడీ లుంగీలు ఇలాంటివి చింపేసి). హైదరాబాద్ లో రోజూ పక్క బట్టలు ఆరబెట్టుకోవాలంటే కష్టం మరి. ఏ రోజు వాన పడుతుందో ఏ రోజు ఎండకాస్తుందో తెలీదు కదా. అలాగే, మాకు బయట తిరుగుడెక్కువే అందుకని కూడా డయపర్ వాడవలసి వస్తుంది. ఇంకా, డే కేర్ లో పాపని పెట్టక పోవడానికి ఒక కారణం మాత్రం ఇదే, మరీ చంటి పిల్లని రోజంతా డయపర్లో పెట్టాల్సి వస్తుందని.
  హ్మ్మ్మ్…. ఏంటొ మోడరన్ తల్లి కష్టాలు !!!

  Like

 7. అరణ్య రోదన మాష్టారూ .

  అయినా డైపర్లే దొరికాయా మీకు టపా కి. … దహా

  Like

 8. బాబాయ్ గారూ.
  భలే మంచి టాపిక్కూ.. అదిరింది టపా ఎప్పటిలాగే.
  మా పిల్లలడాక్టరు చాలా మంచావిడ. పిల్లాడికి డైపర్ వేస్తుంటే ఒకసారి చెప్పింది ఇది వాడకండి.. ఇవి మన ఇండియన్ క్లైమెట్ కోసం తయారుచేసినవి కావు అని. అలాగే ఫేరక్సులు సెరిలాకులు గురించి కూడా.. పెద్ద క్లాసు ఇచ్చారావిడ.. అవి పెట్టకుండానే పెంచాల్సొచ్చింది. కానీబయటికెళ్ళినప్పుడూ.. రాత్రిళ్ళూ ఈ డైపర్లే దిక్కూ. ఎవడు కనిపెట్టాడోగానీ అద్బుతం. కానీ ఏదైనా ఒక పద్దతిలోవాడుకుంటే బాగానేవుంటుంది. కన్వీనెంటుగా వుంది అని అస్తమానూవేస్తే వాళ్ళ అలవాట్లు అలానే వుంటాయిగా మరి. లేటుగా ఆఫీసుకు వెళితే మేనేజరొప్పుకోడనో.. లేక ఉద్యోగం సాగటంలేదనో అనుకుంటే పిల్లల్నెందుకు కనటం.. అలా ఉద్యోగాలెందుకు చెయ్యటం. మన పిల్లలకు సరైన అలవాట్లివ్వని మన సంపాదన ఎంత సంపాదించి ఏం లాభం అనిపిస్తుందండీ నాకైతే.. 🙂

  Like

 9. డయపర్లు,శానిటరీ నేప్కిన్లు, ఇయర్ బుడ్స్, బాండ్ ఎయిడ్ ప్లాస్టర్లు ఇవన్నీ మనకు నిత్య జీవితావసరాలయ్యాంటే, మనం పాశ్చాత్య సంస్కృతికి బాగా అలవాటు పడినట్లు లెక్క. వీటిమీద టర్నోవరు లాభాలు కోట్లలో వుంటాయంటె ఆలోచించవచ్చు. వీటి అవసరం వాడకం మన పెద్దవాళ్ళు చేయలేదా? చేసారు. శౌచానికి పెద్దపీట వేశారు. కాని లిమిటులోవాడుకోడం మానేస్తే తిప్పలే తప్పవు.

  Like

 10. రూత్, బయటి తిరుగుడు పెట్టుకునే సరికి పిల్లలు పెద్దాళ్ళయిపోతే బాగుంటుంది కదూ(నాలాగా)!

  కనీసం ఇంట్లో ఉన్నపుడు పాత నూలు చీరలు(అమ్మమ్మల చీరలైతే మరీ) సుఖంగా ఉంటాయి పిల్లలకు! ఒళ్ళు మరిచి నిద్రపోతారు. నాకో అనుమానం ఉండేది, డైపర్లు వేస్తే పిల్లలకు అసౌకర్యంగా ఉండి నిద్ర పోలేరేమో అని! అందుకని రబ్బరు షీట్లు విరివిగా కొని, మా పాపకి ఆర్నెల్లు వచ్చేదాకా అంతా అమ్మమ్మ(మా అమ్మ) చీరల మీదే నడిపించా!

  కానీ హైద్రాబాదు లాంటి చోట్ల ఎంత నూలు చీరలైనా ఆరకపోతే నరకమే వాటిని భరించడం..డెట్టాలు వెయ్యండి, మరేదైనా వెయ్యండి కాక!

  పిల్లని మీరు డే కేర్ లో పెట్టలేదంటే నాకు ఆనందంతో కన్నీళ్ళొస్తున్నాయి!

  Like

 11. నేను మా పిల్లలకి అసలు ఒక్కసారి కూడా ఇవి వాడలేదు. రాత్రిపూట కానీ..ప్రయాణాలల్లో కానీ ఎప్పుడూ వాడలేదు.

  పాత కాటన్ చీరలతో పిల్లలకోసం ఓ బుల్లి పరుపు..దానిపైన మా నాయనమ్మఖద్దరు చీర..తాతయ్య పంచలు… ఆ పైన కాటన్ లుంగీలతో కుట్టిన షీటుల లాంటివి..మెత్తటి తెల్లటి వస్త్రంతో కుట్టిన లంగోటీలు..

  నాలుగో నెల దాటగానే పిల్లల్ని గంటకొకసారి బయట నిలబెట్టి పట్తుకునే దాన్ని..అలా వాళ్లకి టాయ్‍లెట్ ట్రైనింగ్ అయిపోయింది.

  ఆరునెలలు దాటాకా రాత్రిపూట మధ్యలో ఒక్కసారి పాస్ పోయిస్తే సరిపోయేది. ఆరో నెల తర్వాత రాత్రిపూట కూడా మా పిల్లలు ఎప్పుడూ పక్క తడిపిన గుర్తే లేదు నాకు.

  ఏదైనా మనం అలవాటు చేయటంలోనే ఉంటుంది.

  ఇంకా చిరాకు కలిగించే విషయమేమిటంటే ఆధునికత..తల్లులకి వెసులుబాటు నెపంతో పిల్లలకి 3-5 సంవత్సరాలా దాకా డైపర్సు వాడటం. సంవత్సరం లోపు అంటే అర్థం చేసుకోవచ్చు. పిల్లలకి ఎంత అసౌకర్యమో అర్థం చేసుకోరనుకుంటాను. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అమెరికా వాళ్లని చూసి మన వాళ్లూ నేర్చుకుంటున్నారు.

  ఈ డైపర్సు అలవాటు మూలాన పిల్లలకి టాయ్‍లెట్టు ట్రైనింగు కూడా ఆలస్యం అవుతుంది.

  Like

 12. @ సుజాత గారు, అవును, చాలామంది స్నేహితులు డేకేర్ లో పెట్టమని సలహా ఇచ్చినా, పెట్టలేకపోయాను. వాళ్ళ ఇంకో లాజిక్కేమిటంటే డేకేర్ లో పెడితే పిల్లలకి అన్నీ త్వరగా వచ్చేస్తాయిట ! హుం !
  @ సిరి సిరి గారు, మీ పిల్లలు కాలేజికెళ్ళ్తున్నారనుకుంటా కద? ఆ టైముకు ఇవ్వన్నీ అంత లేవులెండి. మా అక్క పిల్లలకి(ఇప్పుడు పదేళ్ళు వాళ్ళకి)కూడా మేం డయపర్స్ పెద్దగా వాడినట్టు నాకు గుర్తు లేదు. కాని, డయపర్స్ వల్ల టాయ్‍లెట్టు ట్రైనింగు ఆలస్యం అవ్వటం మాత్రం నిజం. ఇంకా, వాటి వల్ల పర్యావరణానికి హాని కూడాను. నేను చాలా రకాల రీ యుసబుల్ డయపర్స్ ట్రై చెసాను కాని ఏదీ సరిగ్గా కుదరలేదు.

  Like

 13. @ ఫణి గారు, క్షమించాలి, మీ కామెంట్ స్పేస్ ఇలా వాడుతున్ననదుకు. మీరు రాసిన టపా అలాంటిది మరి !

  Like

 14. రూత్ గారూ..అప్పటికే ఉన్నాయండి..కానీ ఇంత విచ్చలవిడిగా వాడేవారు కాదు..మరీ ఇన్ని రకాలు దొరేకేవి కాదులేండి.. ఇప్పటి వాళ్ళు కూడా అలా క్లాత్ తో ఇంట్లో చేసుకున్న డైపర్సు వాడవచ్చు కదా అని!

  అయినా ఏదో సౌలభ్యం కోసం మొదటి సంవత్సరం వాడటం వరకు పర్లేదు కానీ..మరీ పెద్ద పిల్లలకు కూడా వాడటం నాకు అసలు నచ్చని విషయం.

  డైపర్సు వాడటంతో పిల్లలకి టాయ్ లెట్ ట్రైనింగ్ ఎంత లేట్ అవుతుందో చెప్పటమే నా ఉద్దేశ్యం.

  Like

 15. @కృష్ణశ్రీ గారూ,

  ధన్యవాదాలు.

  @నిరుపమా,కొత్తావకాయ,సుజాత,జ్యోతిర్మయి,రూత్, సుబ్రహ్మణ్యం గారూ,శ్రీనివాసా,సిరిసిరిమువ్వా,

  ఒకటి మాత్రం బావుంది. ఎవరికి వారు తమ అభిప్రాయాలూ, అనుభవాలూ చెప్పడం! మా ఇంటావిడచేత చివాట్లు తిన్నాను. ఊరికే కూర్చుని ఇలాటి టాపిక్కుమీదే టపా వ్రాయాలా అని! ఏం చేస్తాను చెప్పండి? మళ్ళీ ఎప్పుడో అందరూ ఇన్వాల్వయ్యే టాపిక్కు వ్రాస్తే, కావలిసినంత సందడిగా ఉంటుంది.

  @రూత్, అదేదో మా ఇంటికి వచ్చి నా స్పేసేదో వాడేసికున్నట్లనుకుంటే ఎలా? చూశారా , బజ్జుల్లో బిజీ అయిపోయి, మేము ఉన్నామో లేదో చూసే తీరికకూడా లేని సుజాత తో సహా, అందరూ రావడం చాలా బావుంది!

  Like

 16. మా పిల్లకి డైపరు పడదు. కానీ బైటికెళ్ళాసి వచ్చినపుడు తప్పట్లేదు. నేను వీలయినంత వెయ్యకుండానే గడిపెయ్యడానికి చూస్తాను. కానీ మా ఇంట్లో నేను తప్ప అందరూ ఆధునికులే. అదే నా సమస్య ! నేనూన్నీ పిల్లని డే కేర్ లో వెయ్యడానికి ఇస్టపడట్లేదు. చూడాలి.. ఎన్నాళ్ళు ఇంట్లో వుంచుకోగల్నో ! Very nice post.

  Like

 17. డైపర్లు, డైపర్లు అని వూకే ఎంద్కు పరెషాన్ చేస్తరు? గబ్బూగలీజ్ బాతె చోడ్, బదుబూ ఆరా

  Like

 18. @సుజాతా,

  నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు.

  @అస్లం మియ్యా,

  మరీ అలా అనేస్తే ఎలా? ప్రపంచంలో మనకి నచ్చనివి చాలా ఉంటాయి. ఎవరో ఒకరు వ్రాయాలికదా !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: