బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Pennywise Poundfoolish….

   చాలామందిని చూస్తూంటాము, డబ్బులు ఖర్చు పెట్టడం లో చాలా లిబరల్/లావిష్ గా ఉంటూంటారు. కానీ ఎక్కడో ఎప్పుడో ఓ భూతం పట్టేస్తుంది వాళ్ళని, ప్రతీ పైసకీ చూసుకుంటారు. అలాగని వాళ్ళు పిసినిగొట్టా అంటే అదీ కాదు. ఆ పరిస్థితిలో అక్కడ డబ్బు పెట్టకూడదూ అంతే! పోనీ అలాగని వాళ్ళేమీ డబ్బులు ఖర్చుపెట్టరా అంటే అదీ కాదూ. ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది, అరే ఈయనకేమైనా పిచ్చి పట్టిందా, ఓ రూపాయికి వచ్చే సరుక్కి అంతంత డబ్బులేసి కొంటున్నాడూ అని!

    ఈ సందర్భం లో నా అనుభవాన్ని చెప్తాను. మా నాన్నగారు జనరల్ గా ధారాళంగా ఖర్చుపెట్టేవారు. ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలీ అనుకుని అడిగితే చాలు, కావల్సింది బీరువాలోంచి తీసికోరా అనేవారు. ఆరోజుల్లో మేము మిడిల్ క్లాసులోకే వచ్చేవారమనుకోండి, అయినా ఆయన పెట్టే ఖర్చులు చూస్తే, వామ్మోయ్, మనం అంత ధనవంతులమా అనిపించేది. ఇంట్లో ఎప్పుడూ అతిథులే, స్కూలుకి సంబంధించినవారో, లేక మా ఇంట్లో ఉండి చదువుకుంటున్నవారో, ఎప్పుడూ సందడిగా ఉండేది. ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే, అంతా జమిందారీ లెవెల్లో ఉండేది!

   అంత లిబరల్ గా ఖర్చుపెట్టే పెద్దమనిషీ, నా పెళ్ళి టైములో, ఎవడో రిక్షావాడితో ఓ రూపాయ తేడా వచ్చేటప్పటికి కాకినాడ బస్ స్టాండులో వాడితో గొడవెట్టేసికున్నారు, వీళ్ళ దెబ్బలాట చూసి, మిగిలిన రిక్షావాళ్ళందరూ మమ్మల్ని కొడతారేమో అన్నంత భయం వేసింది. ఇదేమిటిరాబాబూ, అవక అవక ఏదో నాకూ పెళ్ళి కుదిరిందనుకుంటే, ఈయనేమిటీ ఈ రిక్షావాళ్ళతో గొడవెట్టుకుని ముహూర్తం దాటబెట్టేట్లున్నారూ అనికూడా భయం వేసింది! పోనీ నేను ఇన్వాల్వ్ అయి సర్ది చెబ్తామా అంటే అదీ కుదరదు, ఇజ్జత్ కా సవాలాయే. అటు ఆ రిక్షావాడూ తగ్గడూ, ఇక్కడ ఈయనో మొండి మనిషీ, ఇదెక్కడ గొడవరా దేముడోయ్ అనుకున్నాను. మా ఇంటావిడతో నాకు రాసిపెట్టుండడంతో, మొత్తానికి ఆగొడవంతా సద్దుమణిగి, అన్నారం చేరామూ, కథ సుఖాంతం !

   ఏదో అప్పటికి ఉద్యోగం చేస్తున్నా కాబట్టి, ఆ రిక్షావాడికి ఏదో సద్దిచెప్పేసి సెటిల్ చేద్దామనుకున్నా, కానీ అంతకు ముందర జరిగిన అనుభవం, పూనా మొట్టమొదటిసారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు. అప్పటికి ఏగాణీ సంపాదనకూడా లేదు. చాయ్ తాగాలన్నా ” నాన్నా డబ్బులూ..” అనడమే! ఆరోజు ప్రొద్దుటే నా ఇంటర్వ్యూ జరిగింది, ఏదో వయస్సుతక్కువై ఓ రెండు నెలల తరువాత జాయిన్ అవమన్నారు అంతా సజావుగానే జరిగింది. అలా పిలిచి ఉద్యోగం ఇచ్చినాయన్ని వెళ్ళేముందర కలిసి, థాంక్స్ చెప్పుకోడం పెద్దమనిషి లక్షణం. అంతదాకా బాగానే ఉంది. మేము దిగిన, మా కజిన్ చదువుకునే AFMC Hostel నుంచి, మా ఫాక్టరీ ఉండే Kirkee ప్రాంతానికి వచ్చి, అక్కడనుండి, మేము కలియవలసిన ఆయన బంగళాకి డైరెక్టు బస్సుంది. అది ఆ ఎస్టేట్ మీదుగా పూనా స్టేషన్ కి వెళ్తుంది. మేము అక్కడకి వచ్చేటప్పుడు, బస్సువాడు పావలాయో ఎంతో తీసికున్నాడు, ఆరోజుల్లో అలాగే ఉండేవి, ఆశ్ఛర్యపడిపోకండి బంగారం తులం అరవై రూపాయలున్న రోజులు అవి, మాకు ఆ రూట్ లో వెళ్ళేందుకు, ఖర్మకాలి ఆ కండక్టరు ఇంకో అయిదు పైసలెక్కువా అన్నపాపానికి,
ఠాఠ్ అని బస్సు దింపేశారు
. నీకెందుకివ్వాలీ అయిదు పైసలెక్కువా అని వాడితో దెబ్బలాట. పాపం వాడేం చేస్తాడూ, బస్సు మామూలుగా వెళ్ళే రూట్ లో కాకుండా, చుట్టూ తిరిగి వెళ్ళడం వల్ల ఆ అయిదు పైసలూ extra. వాడడిగిన ఆ అయిదుపైసలూ ఇచ్చి వెళ్తే హాయిగా మేము కలియవలసినాయన బంగళా దగ్గర దిగేవాళ్ళం. అంతదృష్టం కూడానా, ఆరోజున మానాన్నగారి మూడ్ ధర్మమా అని, బస్సుదిగేసి, ఆయన బంగళా పట్టుకోడానికి మూడు గంటలు నడిచాం! పోనీ మా కజిన్నేనా సద్దిచెప్తాడా అంటే, వాడూ ఆరోజుల్లో ఇంకా స్టూడెంటే!

   పైగా అలా ఏమైనా చేసేడంటే, మా నాన్నగారు, మా పెద్దనాన్నగారితో ‘మీవాడు చేసే ఖర్చుకి ఐపూ అదుపూ లేదూ…” అని చెప్పినా చెప్పొచ్చు. ఎందుకొచ్చిన గొడవలే అని వాడూ ఊరుకున్నాడు!

   అక్కడికేదో ఆయన్నే ఆడిపోసుకోకూడదు, నేనూ ఆ “జాతి పక్షినే” కదా. ఎంతచెప్పినా వంశపారంపర్యం! ఏం అబ్బినా లేకపోయినా ఇలాటివి మాత్రం ఠక్కున వచ్చేస్తాయి! అప్పుడెప్పుడో రాజమండ్రీలో ఉన్నప్పుడు, ఓ చోట న్యూస్ పేపరు తీసికున్నాను, వాడు చిల్లరిస్తూ, ఓ అర్ధరూపాయ తక్కువిచ్చి చిల్లర్లేదన్నాడు. అంతే వాడితో చడామడా దెబ్బలాటేసేసికుని, ఓ రెండు మైళ్ళు నడిచి మరీ ఇంకోచోట పేపరు కొనుక్కున్నా! అసలిలా ఎందుకు ప్రవర్తిస్తామో తెలియదు. అలాగని డబ్బుల దగ్గర కక్కూర్తా అంటే అదీ లేదూ, లక్షల్లక్షలు ఖర్చుపెట్టి, ఉపయోగించేవీ, ఉపయోగించనివీ కొంటూనే ఉంటాం.అయినా సరే, ఎప్పుడో ఎక్కడో ఇలాటి దరిద్రప్పన్లు చేస్తూంటాం. Thats life !!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఊరికే సరదాకి నోట్ చేసేసికుంటే సరిపోతుందా…

   నాకున్న ‘వ్యసనాల్లో’ ఒకటేమిటంటే, తెలుగు మాట్లాడితే పాపం, వాళ్ళని ఆపేసి వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా పరిచయం చేసేసికోడం, ఏవో కబుర్లు చెప్పి, వెళ్ళేముందర, ఇదివరకైతే ఓ నోట్ బుక్కులో వాళ్ళ ఎడ్రసు వ్రాసుకోడం. ఈమధ్యన పాత డైరీలు చూస్తూంటే, ఇలా నోట్ చేసికున్న చాలా ఎడ్రసులు దొరికాయిలెండి. అంటే ఈ అలవాటు చాలా పాతది. ఇలా ఎడ్రసులు వ్రాసుకోవడం వలన లాభం ఓటుంది, కనీసం ఆ ఎడ్రసాయనది ఏ ఊరో తెలుస్తుంది. ఎప్పుడో చూసినప్పుడు, సడెన్ గా గుర్తొస్తుంది. ఓహో ఇది ఫలానా ఆయన ఎడ్రసా అని. ఎప్పుడైనా ఆ ఊరువెళ్తే కలియడానికి ప్రయత్నిస్తాం లేదా తీరిక చిక్కినప్పుడు ఓ ఉత్తరం పోస్టు చేస్తాం. ఇష్టం ఉందా జవాబిస్తారు లేదా, అక్కడితో సరి.

ఈ సెల్ ఫోన్లొచ్చినప్పటినుండీ, జేబులో డైరీలు పెట్టుకోడం తగ్గింది, పైగా నామోషీ ఓటీ! ఆమధ్య ఎప్పుడో, మా ఇంటావిడ ఓ digital diary ఇచ్చింది. ఉద్యోగంలో ఉన్నప్పుడు దానిలో ఎడ్రసులూ, ఫోను నెంబర్లూ వగైరా వ్రాసుకునేవాడిని. అది నేర్చుకోడానికి ఎన్ని తిప్పలు పడ్డానో చెప్పాలంటే ఓ పేద్ద కథవుతుంది. ఉద్యోగంలోంచి రిటైరయ్యే టైముకి, మళ్ళీ మా ఇంటావిడే, మరీ ప్రతీవాడూ సెల్ ఫోన్లతోనే కనిపిస్తున్నాడూ, నా ప్రాణనాధుడుకి లేకపోతే ఎలాగా అని, ఓ సెల్ ఫోనోటికూడా కొనిపెట్టింది. ఇప్పుడర్ధమయిందా నా అస్థిత్వమంతా మా ఇంటావిడ ధర్మమే! ఇంతలా పబ్లిక్కుగా చెప్పుకుంటున్నా, కనిపించినవాళ్ళందరితోనూ, మావారు అసలు నన్ను కేరే చెయ్యరు, ఆయన గొడవేదొ ఆయనదే అని అడిగినవాడికీ అడగనివాడికీ చెప్తూంటుంది. ఏం చేస్తాం లెండి అంతా కలియుగం, మంచి వాళ్ళకీ అమాయకులకీ రోజులు కావు. ఎక్కడో మొదలెట్టి ఎక్కడకో వెళ్ళాను.

ప్రస్తుతానికి వస్తే, ఈ సెల్ ఫోన్ల ధర్మమా అని చెప్పానుగా, డైరీలూ, digital diaryలూ మానేసి, సెల్ ఫోన్లతోనే కాలక్షేపం చేసేస్తున్నాను. జేబులుకూడా తేలిగ్గా ఉంటాయి.కనిపించిన తెలుగు మాట్లాడే ప్రతీ ప్రాణినీ పలకరించేసి, వెళ్ళే ముందర ఆ పెద్దమనిషి సెల్ నెంబరడగడం, నోట్ చేసేసికోడం. అప్పుడప్పుడు నాకు దొరికేవాళ్ళు కూడా గమ్మత్తుగా ఉంటారు. ముందుగా మన ఫోను నెంబరడిగేస్తారు, ఏదొ తిప్పలు పడి దాన్ని నోటైతే చేసికుంటారు, దాన్ని సేవ్ చేసి దానికి నా పేరుపెట్టొద్దూ, అక్కడికొచ్చేసరికి వస్తుంది అసలు గొడవంతా. దాన్ని నోట్ చేసికోడానికి కుదరదని చెప్పడానికి మళ్ళీ సిగ్గూ. నాకూ మొదట్లో అలాగే అయ్యేదిలెండి, అవతలివాడి నెంబరు సేవ్ చేయడం తెలిసేది కాదు, ఏదో ఇంట్లో పిల్లల్నడిగేసి మొత్తానికి నేర్చేసికున్నాను. పైగా అదీ LG సెట్ లోనే. ఆ సెట్ మారిస్తే మళ్ళీ నేనూ వీధిన పడతాను. అందుకనే ఇప్పటిదాకా ఎన్నిసెట్లు మార్చినా LG మాత్రం మార్చను! మా ఇంటావిడది అదేదో NOKIA ట. బయటకు వెళ్ళినప్పుడు నా జేబులో పడేయమంటుంది, దాన్ని లాక్ చేయడం నాకు తెలియదూ, మా మనవణ్ణి ఎత్తుకున్నప్పుడో ఎప్పుడో, ఆ ఫోను కాస్తా “కాల్” చేసేస్తుంది. అలా “కాల్” చేయబడిన వారెవరో, ఎవరో ఏమిటిలెండి, నూటికి తొంభై సార్లు మా అత్తగారే, ఆవిడ నెంబరోసారి నొక్కబడి ఆగిపోతుంది. పాపం ఎక్కడో తణుకులో ఉంటున్నారూ, ఇలాటి మిస్డ్ కాల్ రాగానే, ” అయ్యో పాపం, పిల్లకేం కష్టం వచ్చిందో ఏమిటో, మిస్డ్ కాల్ ఇచ్చిందీ..” అనుకుని, ఆవిడ తిరిగి కాల్ చేస్తూంటారు. అలా ఆవిడ కాల్ చేసినప్పుడల్లా, మా ఇంటావిడది ఓ standard dialogue- ” అరే నేనేమీ కాల్ చేయలేదమ్మా, మీ అల్లుడిగారి జేబులో పెట్టుకోమంటే, పొరపాటున నొక్కేసుంటారు, ఆయనకి ఫోను లాక్ చేయడం రాదుకదా పాపం…”. వేషాలు కాపోతే ఈ విషయం ఊరంతా టముకేయాలా? ఆ సెల్ ఫోన్ని మోయడమే కాకుండా, ఇలాటి అపవాదులుకూడా వినాల్సొస్తూంటుంది.

ఇంక అలా కాదని, తన ఫోను లాక్ చేసేసిస్తూంటుంది. అందులో తన స్వార్ధం కూడా ఉందిలెండి. నేనేదో ఆవిడ ఫోన్నుంచి కాల్స్ చేసేయకుండా ఓటి. లాక్ చేయడమే రానప్పుడు, అన్ లాక్ చేయడం కూడానా సంబరం! అయినా అప్పటికీ ఓసారి ట్రై చేశాను. Now press* అనొస్తుంది. నాకు ఛస్తే అలా చేయడం రాదు, ఆ మాయదారి ఫోను అన్ లాక్కూ అవదు. ఎప్పుడైనా ఆవిడ ఫోను రింగయినప్పుడు, ఆవిడ చేతిలో ఫోను పెట్టేపి.ఏ. డ్యూటీ మాత్రమే చేస్తున్నాను!

అలా.. కనిపించినవారి సెల్ ఫోను నెంబరు నోట్ చేసికున్న అభియాన్ లో, ఎప్పుడో ఒకసారి ఎవరిదో నెంబరు నోట్ చేసికున్నట్లున్నాను. ఏదో ఓ పేరు రాసేసి వదిలెస్తాం కానీ, మరీ వాళ్ళ ప్రవర అంతా రాసుకోం కదా. రాసుకుందామనుకున్నా, ఓ అరడజను అక్షరాలు వ్రాసేటప్పటికి Sorry no more space.. అని ఓ మెసేజ్ వచ్చేస్తుంది. పోనీ దాన్ని ఎడిట్ చేసికోవచ్చుగా, అబ్బే మళ్ళీ బధ్ధకం. ఎప్పుడో చేద్దాములే అని మర్చిపోతాం. ఆ నెంబరూ , తోక తెగిన పేరూ మాత్రం అలాగే ఉంటాయి. ఈవేళ సాయంత్రం, మా ఇంటావిడతో వాక్ కి వెళ్తూ, ఆవిణ్ణి ముందరకి పంపించేసి, నేనోచోట సెటిలైపోయాను. ఆవిళ్ళా అంతంతేసి దూరాలు నడిచే ఓపిక లేదమ్మా. అలా కూర్చున్నప్పుడు, నా ఫోను ఎడ్రస్ బుక్కు తెరిచి, ఓ నెంబరుకి ఫోను చేసి, మీరు ఫలానాయేనా అన్నాను.ఆయనన్నారూ, నేను ఫలానాయే, మీ ఏ.సి. ఏ బ్రాండూ అన్నారు. ఎక్కడో తేడా వచ్చిందనిపించింది. మేస్టారూ మీరు పూణె లోనే కదా ఉండేదీ అన్నాను. లేదండీ, నేనెప్పుడూ పూనా రాలేదూ అన్నారు. అయితే మీరెక్కణ్ణించి మాట్లాడుతున్నారూ అంటే, ఆయ్ అమలాపురమండి, అనడంతోటే, నా ప్రాణం లేచొచ్చింది! ఏం చేస్తూంటారూ అంటే , ఏ.సి. మెకానిక్కునండీ అన్నారు. ఓహొ అదా సంగతీ పాపం అందుకే అడిగుంటారు, మీదే బ్రాండూ అని. ఎంతచెప్పినా, నా పుట్టింటి వాడూ, మరీ ఇలాటివి పట్టించుకుంటామా ఏమిటీ,అనుకుని, పోన్లెద్దురూ, మీదీ నాదీ కూడా అమలాపురమే, ప్రస్తుత వాయు/ధ్వని తరంగాలు మన కోనసీమనుండే కదా వస్తున్నాయీ, కాస్సేపు కబుర్లు చెప్పుకుందాంలెండి, అని ఆయనతో ఓ పదినిముషాలు కబుర్లు చెప్పాను! ఆయనా సంతోషించినట్లే ధ్వనించారు! ఇంకా నాకు మిస్టరీయే, అసలా నెంబరెలాగొచ్చిందో నా ఫోనులోకీ అని. మా ఇంటావిడతో ఈ గొడవంతా చెప్తే, “అందుకనే ప్రతీవాళ్ళతోనూ ఊరికే కబుర్లు చెప్పేయకండీ అంటాను” అంది.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-కాలక్షేపం..

    గత రెండురోజులూ ఇన్వర్టర్ డ్యూటీ ,అదేనండి మా మనవడూ, మనవరాలితో ఉండడం, అక్కడ డెస్క్ టాప్ లేకపోవడం, కోడలూ,అబ్బాయిల లాప్ టాప్ మీదేమో, నాకు టైపు చేయడం రాకపోవడం ధర్మమా అని, సైలెంటుగా ఉండిపోవలిసివచ్చింది. అయితేనేం కావలిసినంత కాలక్షేపం. దానికేం లోటులేదు. నా మిస్టరీ షాపింగు పరంపరలో, ఇంకో ఏజన్సీ ( నాలుగోది!) వాళ్ళు ఫోను చేస్తే, ఇదిగో ఇప్పుడే యాత్రా.కాం వాళ్ళది చేసొచ్చాను. మన ఖర్చేమీలెదు, ఓ 700 ఇస్తామన్నారు! ఊరికే పిలిచి ఎవడిస్తాడు మన మొహాలకి? ఆమధ్యనొకాయన మా రిటైర్డ్ పక్షే లెండి, అస్తమానూ ఊరంతా తిరుగుతూంటావూ, ఏమిటి లాభం వీటివల్ల అన్నాడు. మాస్టారూ, మిమ్మల్నడిగితే, నెలకీ ఎసైన్ మెంటుకి 700-1000 చొప్పున ఇస్తూ, నేను కొన్నదేదో నేనే ఉంచుకుంటే ఊరుకుంటావా, అన్నాను. నాకు అవి నచ్చాయీ, చేస్తున్నానూ, ఎవడినీ దోచేసుకోడంలెదు కదా, నీకేమైనా నష్టమా, అన్నాను. అలా అనడం ఆ పెద్దమనిషికి నచ్చలేదనుకోండి, అది వేరే విషయం. నాకోటి అర్ధం అవదు- ఎవరి గొడవా పట్టించుకోకుండా నా దారిన నేనేదో ఎంజాయ్ చేస్తూంటే, అసలు వీళ్ళకెందుకూ అంట! అప్పటికీ, నాకు తెలిసినవారందరికీ చెప్తూంటాను, బ్లాగుల్లోకూడా వివరాలు పెట్టాను, ఎవరికిష్టం అయితే వాళ్ళు చేసికుంటారు.అంతే !

   రిటైరయినవాళ్ళ మొహం చూసేదెవడండీ? ఏదో ఎవరో మనమీద నమ్మకం ఉంచి, ఓ పని చెప్పారూ, మనకి ఓపికుందీ చేస్తున్నాము, మనకీ కాలక్షేపం, వాళ్ళకీ పనైపోతోంది. win win situation! నగరాల్లో ఉండే మన బ్లాగు చదువరులఏమైనా ఇంటరెస్టుంటే చెప్పండి, మీ మెయిల్ ఐడి పంపితే, నేనే వాళ్ళకి రిఫర్ చేస్తాను. ఇందులో నాకొచ్చేదేమీ లేదండోయ్, జస్ట్ ఆ ఏజన్సీ వాళ్ళకి ఇంకొంతమంది ఇవాల్యుఏటర్లు దొరుకుతారు, మీకూ కాలక్షేపం.

   మొన్న శనివారం వెళ్ళి, కొడుకూ, మనవడూ మనవరాలూ ముగ్గురిదీ ఆధార్ చేయించేశాము. కోడలు మిగిలింది. శుక్రవారం అమ్మాయీ, మనవరాలూ, మనవడూ రాత్రి వచ్చి భోంచేసి, ఓ నాలుగ్గంటలు గడిపి వెళ్ళారు. విడిగా ఉన్నప్పుడు ఇదే మరి సదుపాయం! మా ఇంటికి రావలిసివస్తే, అక్కడ, కొడుకూ,కోడలూ, మనవడూ మనవరాలూనూ, మరి ఇంతమందుంటే, మాతో క్వాలిటీ టైము గడిపేదెట్లా?ఇక్కడైతే ఫుల్ ఎటెన్షన్ ! మాకూ బావుంటుంది, అమ్మమ్మ తాతయ్యలతో గడపడం వాళ్ళకీ బావుంటుంది. అవును కదూ?

    మొన్న మా ఇంటికెదురుగా ఉండే గణపతి గుడికి వెళ్ళాను. అప్పటికింకా గణేశ్ విసర్జన అవలేదు, భజనలూ, పాటలూ పేద్ద సౌండుతో వినిపిస్తున్నాయి. లోపల దండం పెట్టుకుంటూంటే, బయటెవరిదో హడావిడి వినిపించింది. ఒకావిడ, ఆ పాటలు పెట్టేవాడితో గొడవ పడుతోంది– మా పిల్లాడి పరీక్షలూ, ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద సౌండుతో పాటలు పెట్టేస్తుంటే చదువులు సాగడం లేదూ అని. ఈవిడదారిన ఈవిడా, వాడిదారిన వాడూ ఒకళ్ళమీదొకళ్ళు అరుచుకుంటున్నారు. ఈ విషయంలో ఏదొ కొద్దిగా ఆవిడకి చెప్దామూ అనిపించి,- ఈవేళొక్కరోజే కదా, రేపెలాగూ గణపతి నిమజ్జనం జరిగిపోతుందీ ఏదో ఒక్కరోజోపిక పడితే గొడవుండదుగా అన్నాను.అలా కాదంకుల్, పదిరోజులనుండీ ఇదే గొడవా తెల్లారిందగ్గరనుంచీ, అర్ధరాత్రిదాకా ఒకటే రొద, ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదూ అని.

   చూడు తల్లీ, మనకి వీళ్లతో చెప్పే చనువుందికాబట్టి, ఈమాత్రమైనా వింటున్నారూ, ప్రతీ చౌక్ దగ్గరా ఏడాదిలోనూ, ఏదో వంకబెట్టి, ఏదో ఒక వర్ధంతో, జయంతో పేరుచెప్పి ఊరేగింపులూ, గులాళ్ళూ డాల్బీ సౌండుతో పాటలూ పెట్టి ఇరవైనాలుగ్గంటలూ హింసించే, ఆ ఏరియా సోకాల్డ్ యూత్ లీడర్లకి చెప్పి చూడు. తెలుస్తుంది. ఒకసారి వాళ్ళ దృష్టిలో మార్క్ అయ్యావా, ఇంక మీకు పీస్ ఫుల్ గా బ్రతకడం కష్టం అయిపోతుంది. ఆ చుట్టుపక్కలుండే మనలాటి వాళ్ళు అంత సహనంగా ఉంటున్నారూ అంటే, అదేదో ఇష్టమయ్యీ కాదు, ఆ జయంతి/ వర్ధంతి చేయించుకుంటున్న దేశనాయకులమీద అభిమానమూ కాదు. ఈ గల్లీ ఛోటా నాయకుల తో గొడవ పడే ధైర్యం లేక.!

   ఊరుకి చివర్లో కావలిసినన్ని ఎపార్టుమెంట్లు , పైగా అతి తక్కువ ధరకే వస్తాయి. అయినా ఊరి మధ్యలో ఒకటికి నాలిగింతలు ఖరీదెక్కువైనా, కొంపలు కొనుక్కుంటున్నాము, కారణం అన్నిటికీ దగ్గరగా ఉంటుందని, స్కూలు బస్సొస్తుందనీ, ఆటోలు దొరుకుతాయనీ,మనవైపునుంచి ఎవరైనా వస్తే, స్టేషనుకి మరీ దూరం కాదనీ,ఆఖరికి ప్రాణం మీదకొస్తే హాస్పిటల్ కి వెళ్ళొచ్చనీ, మన ప్రాణం పోతే, ఓ నలుగురైనా రావడానికి దగ్గరగా ఉంటుందనీ. మరి ఇన్ని సదుపాయాలూ, సౌకర్యాలూ ఉన్నప్పుడు, ఏదో ఏడాది లోనూ ఇలాటి సౌండు పొల్యూషన్లున్నప్పుడు, భరించాలి మరి. మేమిదివరకుండే ఇంటికి దగ్గరలో ఓ చర్చుండేది, శనాదివారాలొచ్చాయంటే చాలు ప్రార్ధనలతో హోరెత్తించేసేవారు. అలాగే మసీదులూనూ, తెల్లారేటప్పటికి నమాజు మైక్కుల్లో చెప్తారు. రంజాను నెలైతే ఇంకానూ. These are all occupational hazards. అన్నిటినీ భరించాలికానీ, ఊరికే దెబ్బలాడితే రోజులెళతాయా ?

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–డెజిగ్నేషన్లు…..

   నేను ఉద్యోగంలో చేరినప్పుడు, మా ఫాక్టరీలు Ammunition Factory, High Explosives Factory రెండిటికీ కలిపి ఒకే జనరల్ మేనేజరుండేవారు.In fact, మాది ఒక స్వతంత్ర ఫాక్టరీ అయినా, ఒకే డిపార్ట్మెంటులోవి కాబట్టి రెండింటికీ ఒకే జి.ఎం. ఉండేవారు. కాలక్రమేణా, మా ఫాక్టరీకీ ఓ గుర్తింపు రావడంతో, మా పెద్దాయన్ని కూడా జి.ఎం. అని ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు నేను వ్రాసేది, వారి ప్రవర కాదు, ఆరోజుల్లో ప్రభుత్వవిభాగాల్లో, అధికారుల పదనామం (designation) ఎలా ఉండేదో చెప్పడానికి. ఆరోజుల్లో ఫాక్టరీ అంతటికీ ఓ మేనేజర్ అని ఉండేవారు, మహ అయితే ఇంకో ఇద్దరు. పే కమిషన్లొచ్చాయి, జీతాలకంటే, వీళ్ళ designation లు గ్లామరైజు చేసేద్దామని, ప్రతీ చోటా పుంఖానుపుంఖాలుగా, ఉన్న 39 ఫాక్టరీల్లోనూ, ఎక్కడ చూసినా మేనేజర్లే. అలా ప్రారంభించిన కార్యక్రమం, Additionla GMs దాకా వచ్చింది. మా డిపార్టుమెంటు హెడ్డుని Chairman అనేదాకా వచ్చింది. చెప్పొచ్చేదేమిటంటే, ఆ పొజిషన్ కి, ఆ వ్యక్తి, అన్నిరకాల పొజిషన్లలోనూ, వాటి ఆనుపాన్లూ, కష్టాలూ నష్టాలూ రూల్సూ, రెగ్యులేషన్లూ వగైరా వగైరా నేర్చుకున్న తరువాతే కదావచ్చిందీ

   ప్రభుత్వం వారు ప్రతీ పే కమీషను లోనూ, ఏదో డెజిగ్నేషన్ల పేర్లు మార్చేసినంతమాత్రాన, వారి అనుభవం, పనిచేసే సామర్ధ్యం పెరగాలని రూలేమీ లేదుగా. నేను 42 ఏళ్ళు పనిచేసినా, చివరి ఎనిమిదేళ్ళకి మాత్రమే ఓ గెజిటెడ్ ర్యాంకొచ్చింది, అదీ గ్రూప్ బి ! కారణాలనేకం. వాటిల్లోకి వెళ్ళి ఉపయోగం లేదు. ఇష్టం అయితే పనిచేయడం, లేదా ఇప్పటి వారిలాగ ఇంకో ఉద్యోగం చూసుకోడం. అంత ధైర్యమూ ఉండేదికాదు. డెజిగ్నేషన్ ఏమైతే మాత్రం, నేను పనిచేసే పధ్ధతి మీదా, నామీదా నా పైవారికి నమ్మకం ఉందా లేదా అనేదే విషయం. దానికెప్పుడూ సందేహం ఉండేది కాదు. మొదటి రెండేళ్ళూ తప్పించి, నలభై ఏళ్ళూ మహరాజులాగే బ్రతికాను. I enjoyed my job. నేను రిటైరయ్యేనాటికి మా ఫాక్టరీలో అంతా కలిపి నా “జాతి” ( గ్రూప్ బి) వాళ్ళు ఓ నలభై మందుండేవారు. మిగిలినవాళ్ళందరూ గ్రూప్ 3, గ్రూప్ 4. మాకో ప్రత్యేక గుర్తింపూ, గౌరవం, ఓ accountability ఉండేవి. పోనిద్దూ, చివరి రోజుల్లోనైనా గెజెటెడ్ ఆఫీసర్ అయ్యానూ అనే ఓ ego satisfaction ఉండేది! నెలకోసారి డ్యూటీ ఉండేది 24 గంటలు ఆర్డర్లీ ఆఫీసరని,ఫాక్టరీలో రాత్రిపూట ఏం జరిగినా బాధ్యత అంతా తనదే. దేనికైనా అతని డెసిషనే ఫైనల్! కావాలంటే, ఓ ప్రాసెస్ ఆపేయొచ్చు. అంటే సర్వాధికారాలూ తనవే! మళ్ళీ అదో ego satisfaction! మా క్యాంటీన్ లో మాకు ఓ రోజు విడిగా ఉండేది. ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే, దాని గ్లామర్ దానికుండేది!

   ఈ సోదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, మొన్నో రోజున చాలా రోజుల తరువాత, స్నేహితుల్ని కలుద్దామని ఫాక్టరీకి వెళ్తే, ఎక్కడ చూసినా ఈ గ్రూప్ బి గెజెటెడ్ ఆఫీసర్లే! అర్రే ఇంతమందికి ఒకేసారి ప్రమోషన్లొచ్చాయా అని ఆశ్చర్యపడ్డాను. అప్పుడు తెలిసింది, పదేళ్ళ సర్వీసున్న ప్రతీవాడినీ గ్రూప్ బి గెజెటెడ్ గా రిడెజిగ్నేట్ చేశారుట! వారిలో చాలామంది ఈ కొత్తగా వచ్చిన ” పదోన్నతి” లో ఉండే ఒత్తిళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. నిజమేకదా, మామూలుగా ఓ పాతికేళ్ళకి రావలిసిన పొజిషన్ పదేళ్ళకే వచ్చేస్తే కష్టం కాదూ? ఓ అరటి పండు చూడండి, రంగు రావడానికి ఏవో కెమికల్స్ వాడి, “పండి” నట్లు మార్కెట్ లో అమ్ముతూంటారు. వాటికీ, సహజసిధ్ధంగా “పండి” న వాటికీ తేడాలేదు మరీ? అక్కడికేదో మేము ఏదో “ఉధ్ధరించేశామని” కాదు.విషయం వచ్చిందికాబట్టి వ్రాశాను. ఊరికే ప్రతీదీ మార్చుకుంటూ పోతే పన్లవుతాయా, వాళ్ళ రాతలు కూడా మార్చాలిగా!

   మా శాఖలే కాదు, పోలీసుశాఖలో మొత్తం రాష్ట్రానికి ఓ Inspector General ఉండేవారు, దాన్ని మళ్ళీ Director General అన్నారు. ఒక్కో రాష్ట్రానికీ ఓ డజనుమందిదాకా ఉంటారు. బాంకు వాళ్ళేమైనా తక్కువా, ప్రతీ బాంకుకీ ఓ పాతికో పరకో వైస్ ప్రెసిడెంట్లు ! ఊరికే డెజిగ్నేషన్లు మార్చేస్తే సరిపోతుందా? అదృష్టం ఏమిటంటే, ఇంకా ముఖ్యమంత్రికీ, ప్రధానమంత్రికీ ఈ Joint, Aditional, Vice అని చేర్చలేదు! ఎవరేమిటో తెలియక చచ్చేవాళ్ళం!

   ఇంక ఆర్మీ సంగతికొస్తే, మేజర్ జనరల్ అయినప్పటినుండీ ఆయన్ని జనరల్ సాబ్ అనే అంటారు! పోన్లెండి Field Marshal అని ఓ డజనుమందిని పెట్టలేదు! ఎక్కడికక్కడే!

   దేనికైనా ఓ వరసా వావీ ఉండాలి. Chief Justice అనేవారొక్కరే ఉంటేనే ఆ పదవికి ఓ గౌరవం ఉంటుంది. అంతేకానీ Deputy Chief Justice, Assistant Chief Justice, Additional Chief Justice అంటే ఉంటుందాండీ?. అక్కడికేదో నాకు రానిది ఇప్పుడు ప్రతీవారికీ వచ్చేస్తోందని ఈర్ష్య, అసూయలతో వ్రాసింది కాదు. ఒక “పదవి” ని డివాల్యూ చేస్తే, దాంట్లో వచ్చే కష్టనష్టాలగురించి. ఓ సింహాన్ని కానీ ఏనుగుని కానీ ఆ పేరుతోనే పిలవాలి. అంతే కానీ ఓ కుక్కనో, నక్కనో సింహం అంటే బావుంటుందా?

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   మా రోజుల్లో నల్ల కళ్ళద్దాలు, ఏదో వయస్సుపైబడ్డవారు, ఏ కంటి ఆపరేషనో చేయించుకున్నప్పుడు పెట్టుకోగా చూసేవారం. తరువాత జాతీయ, అంతర్జాతీయ, ప్రముఖులు ఓ రాజాజీ అనండి, ఓ స్టాలిన్ అనండి, ఓ కరుణానిధనండి– వాళ్ళు ధరించగా చూశాము. చెప్పొచ్చేదేమిటంటే, ఆ నల్లకళ్ళద్దాలు వారితో రిలేట్ చేసికునేవారం. ఎవరైనా పత్రికల్లో కార్టూన్లు వేసినా, ఈ నల్లకళ్ళద్దాలకి ప్రాముఖ్యత ఇచ్చేవారు.

   కాలక్రమేణా చూస్తున్నదేమిటయ్యా అంటే, ప్రతీవాడికీ ఇదో స్టైలయిపోయింది. ఎక్కడ చూసినా ఈ నల్లకళ్ళద్దాలే. పోన్లే పాపం క్యాటరాక్టాపరేషన్ చేయించుకున్నాడేమోలే అనుకోడానికీ వీల్లేదూ. just for the heck of it వేసికోడం. ఫుట్పాత్ లమీదకూడా దొరుకుతున్నాయి. అప్పుడెప్పుడో, ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్క్ వా అనుకుంటా మొదలెట్టాడు, ఆడేటప్పుడుకూడా వేసికోడం. అంతే ఇప్పుడు ప్రతీవాడూ రాత్రయినా పగలైనా ఈ నల్లకళ్ళద్దాలతోనే ఆడ్డం. మరి అంత వెలుగు భరించలేనివాళ్ళు అలా ఆడ్డం ఎందుకో? ఈమధ్యన ఇంగ్లాండ్ తో ఆడుతూ, చాలాసార్లు మనవాళ్ళు క్యాచ్ లు వదిలెయడానికి కారణం, ఈ నల్లకళ్ళజోళ్ళవలన బాలు కనిపించకేనేమో అని నా అనుమానం! వెధవ్వేషాలు కాపోతే, శుభ్రంగా ఆడొచ్చుగా!

    ఇంక రోడ్డుమీద బైక్కులమీద దూసుకుంటూ పోయే ప్రతీ హీరోకి ఈ నల్లకళ్ళజోడే! పోనీ పగలూ, ఎండా అదీ ఎక్కువగా ఉంటోందీ, వేసికోనిద్దూ అనుకోవచ్చు. మరి రాత్రిళ్ళు ఎందుకు వేసికుంటారో తెలియదు. చెవిలో ఇయర్ ఫోన్లూ, కళ్ళకి నల్లద్దాలూ వెనక్కాల వీప్మీద ఓ బాక్ పాక్కూ ఈరోజుల్లో కర్ణుడి సహజకవచకుండలాల్లా ఉన్నాయి. మరి మనం కూడా move with times కదా! అందుకే కాబోలు ట్రాఫిక్ సిగ్నళ్ళు కనిపించి చావవు. ఇప్పుడర్ధం అవుతోంది, అన్నన్ని యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయో.

   అప్పుడెప్పుడో ఓ టపాలో వ్రాశాను- నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో ఓసారి, అప్పుడే ఫుట్పాత్ మీద కొనుక్కున్న నల్లకళ్ళజోడు పెట్టుకుని, వర్షం వస్తోందని చేతిలో ఓ గొడుగు ( ఆరోజుల్లో ఇప్పటిలాగ ఫోల్డింగువి కూడా కాదు) చేతిలో పట్టుకుని, ట్రాఫిక్ క్లియర్ అయేదాకా ఆగేసరికి ఓ దయామయుడు, నా “దుస్థితి” చూసి, రెక్క పట్టుకుని రోడ్దు దాటించబోయాడు. మళ్ళీ నల్లకళ్ళజోడు పెట్టుకుంటే ఒట్టూ !! ఇదేదో visually challenged వారిని, అగౌరవపరచడానికి వ్రాయలేదు, ఒక్కోప్పుడు ఎలాటి అపొహలు కలుగుతాయో చెప్పడానికి మాత్రమే .

ఈవేళ చదివిన(విన్న) బ్లాగుల్లో ఇది అద్భుతం.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పేరైనా శుభ్రంగా పెడితే బాగుండును……

   మొన్నెప్పుడో ఓ ఫ్రెండింటికి వెళ్తే, పాపం ఆయన,పరోపకార బుధ్ధితో, తనదగ్గరున్న ఓ ఫారం ఇచ్చి,దీన్ని ఫొటోకాపీలు తీసి, మీ ఇంట్లో ఉన్నవారందరి పేర్లూ ఒక్కోరికి విడిగా నింపి,వాళ్ళందరినీ, అక్కడెక్కడో ఉన్న పోస్టాఫీసుకి తీసికెళ్ళినా సరే, వెళ్ళమన్నా సరే అన్నారు. నేను పక్కన పెట్టేసినా, మా ఇంటావిడ ఊరుకుంటుందా, ప్రతీ రోజూ ఒకటే సణుగుడు, పాపం అయనచెప్పారుగా ఓసారి ఆ పనేదో పూర్తిచేసేస్తే మీకు నష్టం ఏమిటీ? ఎలాగూ పనీ పాటులేకుండా తిరుగుతూనే ఉంటారు, అనే అర్ధం వచ్చేటట్లు ! ఏమిటోనండీ, రిటైరయితే, మనకి పనులే ఉండవా? ఎందుకొచ్చిన గొడవా అనుకుని, ఆ ఫారాన్ని పది కాపీలు (ఉన్నారుగా నాకు నవరత్నాలూనూ), ఓ నాలుగు అబ్బాయికీ, ఓనాలుగు అమ్మాయికీ ఇచ్చి ఊరుకున్నాను.ఓ రెండు మాకోసం ఉంచాను. ఆయన చెప్పిన చోటు, మాకు కొంచం దూరం లెండి, నేనైతే ఏ బస్సో పట్టుకుని పోతాను, ఆవిడేమో ఆటోలు తప్ప ఎక్కదు,పోనీ పిల్లలతో కార్లో వెళదామా అనుకుంటే, వాళ్ళకి టైముండదాయె.మరి ఊరుకోకేంచెస్తానూ? ఇంతలో, నిన్న మా ఇంకో ఫ్రెండు ఫోను చేశాడు, ఫలానా పనైయిందా అంటూ, పైగా మాకు ఆటోలు సుళువుగా దొరికే రోడ్డుమీదుండే పోస్టాఫీసుకి ప్రొద్దుటే ఎనిమిదిన్నరకి వెళ్తే, పని తొందరగా అవుతుందని మరీ చెప్పాడు. రైఠో, అయితే రేప్పొద్దుటే వెళ్ళి మనిద్దరిదీ పూర్తిచేసికుందాముటోయ్ అని ప్రకటించేశాను.

   ఈ గొడవంతా దేనికీ అంటారా, దేశం అంతా సుఖపడిపోతోందే అనుకుని, ఆ శ్రీ నందన్ నిలెకానీ గారు మొదలెట్టిన, Unique Identification Authority of India వాళ్ళిచ్చే కార్డుకోసం. అసలా పేరే ఎంత stylish గా, ఎంత glamourous గా ఉందీ, దాన్నేమో మన సర్కారు వారు ” ఆధార్” అని ఓ దిక్కుమాలిన పేరెట్టారు. అసలా పేరు వినడంతోనే depression లోకి వెళ్ళిపోతాం! అంతకంటే మంచిపేరే దొరకలేదా? అదేమిటో ఆధార్ నెంబరూ అనగానే, ఇంకోళ్ళమీద ఆధారపడ్డట్లుగా వినిపిస్తుంది. పైగా ఇది మన జీవితాంతం పెర్మనెంటుట, ఇదోటీ.UID నెంబరేమిటీ అంటే ఫలానా అనిచెప్పడానికి ఎంత బావుంటుందీ, మాయదారి ” ఆధార్” నెంబరెంతా అని అడిగితే,అదేదో ఇంకోళ్ళమీద ఆధారపడినట్లుగా సౌండొస్తుంది! పోనీ వాటివల్ల మనకేమైనా ఒరుగుతుందా అంటే అదీ లేదు. మనరోగం కుదర్చడానికి భవిష్యత్తులో ఈ “ఆధార్” నెంబరు లేకపోతే, మన ఖానా పానీ బంధ్ ట! అందుకోసం, పేరు ఎంత దరిద్రంగా ఉన్నా, చచ్చినట్లు తీసికోవాలీ అనుకుని బయలుదేరాము! ఈ మధ్యన,టివీ. లో దినఫలాలు చూస్తున్నాలెండి, ప్రొద్దుటే అదేదో చానెల్ లో వృశ్చిక రాసివారికి, తల పెట్టిన పని ఒక్కటీ సవ్యంగా జరగదూ అని చెప్పారు! దరిద్రుడి నెత్తిమీద వడగళ్ళవాన లా. మనం వెళ్ళేదే బీదరుపులు లా ఉంది, దీనికి సాయం మళ్ళీ ఇదోటా!కానీ ఆ చానెల్ లోనే చెప్పారు తోపురంగు డ్రెస్ వేసికుంటే, పని జరిగితే జరగొచ్చుట! ఇదీ బాగానే ఉందీ అనుకుంటూ, కబ్బోర్డ్ లో ఉన్న నాపాత షర్టోటి తీశాను. ఇంక మా ఇంటావిడూరుకుంటుందా, అదేమిటండీ ఈమధ్యన మిస్టరీ షాపింగులో ఎడా పెడా, బ్రాండెడ్ షర్టులు కొనుక్కుంటూ మళ్ళీ ఈ పాత షర్టెక్కడ దొరికిందీ అంటూ.మళ్ళీ ఆవిడకేం చెప్పనూ, పోనిద్దూ ఏదో ఒకటీ, మరీ పంచా ధోవతీ కాదుకదా అని బయలుదేరతీశాను.

   ట్రాఫిక్కు జాం ధర్మమా అని, మేము వెళ్ళేసరికే ఓ పేద్ద క్యూ ఉంది. ఓ చోటేమో ఫారాలిస్తున్నారు, రెండో క్యూ ఫారాలు నింపినవాళ్ళకిట.మొత్తానికి, మా పేరు రిజిస్టరులో వ్రాయించుకుని, ఆ “గుడి” తలుపులు తెరిచిన తరువాత లోపలకి చేరాము.ఈ బాపతు జనాలు ఓ పదిహేనుమంది.అక్కడే ఉన్న సగం సగం విరిగిన బెంచీలమీద కూలబడ్డాం.మా ముందర వాళ్ళెవరిదో చేస్తూంటే, ఆ సిస్టం కాస్తా హ్యాంగయింది. అంతా గ్రహబలం అనుకుంటూనే ఉన్నాను. మొత్తానికి, మా ఇద్దరి పేర్లూ పిలిచి, పెళ్ళిపీటలమీద కూర్చోబెట్టినట్లు, ఆ రెండు సిస్టాలముందరా, చెరో కుర్చీలోనూ సెటిలయ్యాము.అక్కడున్న పిల్ల, ముందుగా, నా కళ్ళజోడు తీయించేసి, ఓ ఫొటో తీసింది.అదేదో ఇచ్చి, దాంట్లోకి చూస్తూ కళ్ళు పెద్దగా చెయ్యమంది. అసలే నా కళ్ళేమైనా “విశాలనేత్రాలా” ఏమిటీ, చిన్నవీ దానికి నేనేం చేయనూ, ఉహూ అలాక్కాదు ఇంకా పేద్దగా అంటుంది, చూడు తల్లీ ఇంతకంటే బలవంతం చేశావంటే, ఆ గుడ్లు కాస్తా బయటకొచ్చేస్తాయి, ఏదో ఒకటి కానిచ్చేయ్ అన్నాను. ఏమనుకుందో సణుక్కుంటూ ఆ “కళ్ళ” కార్యక్రమం పూర్తిచేసి, అదేదో రాంగోపాల్ వర్మ సినిమాల్లో లాగ, అదేదో దానిమీద, రెండరచేతులూ వేసి నొక్కమంది. ఎంత నొక్కినా ఇంకా ఇంకా అంటూ తనూ ఓ చేయేసింది!( ఆ పదినిమిషాల్లోనూ బావున్నదల్లా ఇదోటే !!). మొత్తానికి ఆ కార్యక్రమం అంతా పూర్తిచేసి, మా పేరూ,ఊరూ సరీగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసికుని, ఆ పిల్ల ఇచ్చిన కౌంటర్ ఫాయిల్ తీసికుని, మా ఇంటావిడ వివరాలు కూడా చెక్ చేసి, ఆవిడ కాగితం కూడా తీసికుని,కొంపకి చేరాము.

   అవ్విధంబుగా, నేనూ, మా ఇంటావిడా భారత రిపబ్లిక్కు వారిమీద జీవితాంతం ఆధారపడేటట్లుగా “నాతిచరామి” అనుకుని బయట పడ్డాము.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– దేశం లోని ఉపాధ్యాయులందరికీ వందనాలు…

    ఉపాధ్యాయ దినోత్సవం అంటూ విడిగా వ్రాసేదేమిటిలెండి? పుట్టినప్పటినుండీ నా జీవితం అంతా ఈ ఉపాధ్యాయులతోనే గడిచిందీ, ఇంకా గడుస్తూంది కూడా ! మా ఇంటావిడ కూడా ఒకప్పుడు, అత్తిలిలో టీచర్ గా పనిచేసిందిట. ఈ విషయం ముందుగా తెలిసుంటే ఎంత బాగుండేదో కదా!! ప్రతీ రోజూ క్లాసులైనా తప్పేవీ ! ఏమిటో అనుకుంటాము కానీ, ఘటనండి బాబూ! బ్రహ్మ వ్రాసింది తప్పించుకోడమే? చిత్రం ఏమిటంటే, ఇంతమంది టీచర్ల మధ్యలో ఉంటూ కూడా, పొట్టకోస్తే అక్షరం ముక్క వంటబట్టలేదు! అదీ నా గొప్పతనం !

    Leave aside jokes, ఉపాధ్యాయులంటే నాకు అమితమైన గౌరవం, కారణం మరేమీ లేదు చదివిందేమీ పేద్ద పెద్ద చదువులేమీ కావు, ఉన్నవాళ్ళా, ఓ యాభైమంది, అందరి పేర్లూ గుర్తులేవుకానీ, చాలామంది జీవితాంతం గుర్తుండిపోతారు. కారణం వారు చెప్పేపధ్ధతీ, పాపం వాళ్ళప్రయత్నాలేవో వారు చేశారు, ఎంతోకొంత నా బుర్రలోకెక్కిద్దామని. వాళ్ళననేం ప్రయోజనం?

   మొట్టమొదట అంటే సరస్వతీనమస్థుబ్యం చెప్పించి, అమలాపురం భూపయ్యగ్రహారం లో ఓ పాకబడుండేది, అక్కడ మాస్టారు శ్రీ వీర్రాఘవులు గారు- మీసాల మాస్టారనేవాళ్ళం. చేతిలో బెత్తం, పేద్దపెద్ద మీసాలతో ఉండేవారు. ఎప్పుడూ బెత్తం ఉపయోగించిన గుర్తులేదు. అవసరంలేకనో, లేక ఉపయోగంలేదనో అని మాత్రం అడక్కండి.ఆ తరువాత, 1951-52 లలో మానేపల్లి లో శ్రీరాములు మాస్టారని ఉండేవారు. ఎప్పుడు చూసినా లెఖ్ఖలో లెఖ్ఖలనే వారు, దాంతో లెఖ్ఖలంటే అదేదో భయం వచ్చేసి వాటి జోలికెళ్ళలేదు!

   ఎంతైనా ఇంటినిండా టీచర్లే అవడంతో, దానికి సాయం నాన్నగారూ, పెదనాన్నగారూ, అన్నయ్యా టీచర్లే అవడంతో, ఎలాగోలాగ హైస్కూల్లోవేయించేశారు. ఏదో హెడ్మాస్టారి కొడుకును కదా అని, ప్రతీ క్లాసూ పాసైపోతూ ఎస్.ఎస్.ఎల్ సీ దాకా వచ్చేశాను. ఈ ప్రయాణంలో మాకు డ్రాయింగు నేర్పే శ్రీ గంటి భాస్కర్రావుగారూ, శ్రీ చావలి సత్యన్నారాయణగారూ(ఇంగ్లీషు),శ్రీ తణికెళ్ళ సుబ్బారావుగారూ( క్రాఫ్ట్), శ్రీ పి.కృష్ణమూర్తిగారూ (డ్రిల్లు),మండపేటలో చదివినప్పుడు శ్రీ చీమలకొండ పార్వతీశ్వర శాస్త్రిగారూ, శ్రీ బ్రహ్మన్న శాస్త్రిగారూ, శ్రీ దర్భా గణేశ శాస్త్రిగారూ, శ్రీ ప్రయాగ రవణమూర్తిగారూ, వీళ్ళందరివద్దా చదువుకుని మొత్తానికి కాలేజీకి వచ్చాను. పాస్ అవడానికి ధోకా ఎప్పుడూ ఉండేదికాదనుకోండి, హెడ్మాస్టారి కొడుకు ఫెయిల్ అయితే, నాకేం, వాళ్ళకే అప్రదిష్ట!

   ఇంక కాలేజీకి వచ్చిన తరువాత, మా ప్రిన్సిపాల్ శ్రీ పెద్దాడ రామచంద్రరావుగారు, శ్రీ జి.పి.రమేశం గారూ, శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారూ, శ్రీ జి.వి.ఎస్ రామారావుగారూ, శ్రీ చిదంబరంగారూ, శ్రీ రామకోటేశ్వర్రావుగారూ,శ్రీ ఆర్.ఆర్.కే గారూ, మా అక్కయ్యగారు కందా భాస్కరం గారూ, శ్రీ గొల్లకోట వెంకటరత్నంగారూ, శ్రీ పారుపూడి వెంకట్రావుగారూ,Last but not least శ్రీ GKM గారూ.

    ఆరోజుల్లో పాఠాలు చెప్పే గురువుల ఇంటీపేర్లేమిటో తెలిసికునేటంత ధైర్యం ఎక్కడుండేదీ? పైన కొన్ని చోట్ల ఇచ్చిన ఇంటిపేర్లు, ఏదో ఇంట్లో పెద్దాళ్ళు చెప్పుకునే కబుర్లద్వారా తెలిసి గుర్తున్నవి. మాకు ఇంగ్లీషు చెప్పే మాస్టారు శ్రీ GKM గారిని నా చివరి శ్వాస వరకూ గుర్తెట్టుకోదగ్గ పేరు.ఏదో నాలుగు ఇంగ్లీషు ముక్కలు వంటపట్టాయీ అంటే అంతా ఆయన చలవే! అరటిపండు వలిచి నోట్లో పెట్టేంత సులభంగా చెప్పేవారు. ఓస్ ఇంగ్లీషంటే ఇంతేనా అనేట్లుగా. ఇప్పుడంటే కాన్వెంట్లూ, సందుకో స్పోకెనింగ్లీషు కొట్టూ వచ్చేయి కానీ, ఆ రోజుల్లో ఇవేమీ ఉండేవి కావుగా, పైగా మా అమలాపురం ఆరోజుల్లో ఓ ద్వీపం, ఎక్కడికెళ్ళాలన్నా గోదావరి దాటాల్సొచ్చేది. ఇప్పుడంటే బ్రిడ్జీలూ అవీ వచ్చాయి, ఇంటర్నెట్టులూ గోలానూ! కానీ ఆరోజుల్లో నేర్చుకున్న ఇంగ్లీషు ధర్మమే, ఇప్పటికీ, నలుగురితో మాట్లాడ కలిగే ధైర్యం ఇచ్చింది. అదంతా మా శ్రీ GKM గారి ధర్మమే.

   జీవితంలో అంతగా మర్చిపోలేని శ్రీ GKM గారి ఇంటిపేరు ఎప్పుడూ తెలిసికునే ప్రయత్నం కానీ, ధైర్యం కానీ చేయలేదు. దానితో జరిగిన నష్టం ఏమిటయ్యా అంటే, శ్రీ GKM గారిగురించి తెలిసికోడానికి 50 ఏళ్ళు పట్టింది! ఎప్పటిమాటండీ, 1959-60 ల్లో మా అమలాపురం కాలేజీలో ఏ ఒక్క క్లాసూ మిస్ అవకుండా ఎటండయిన రోజులే తక్కువ, వాటిలో శ్రీ GKM గారి క్లాసోటి.

   రెండుమూడు వారాల క్రితం “నవ్య” వారపత్రికలో, డాక్తరు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఓ వ్యాసం వ్రాశారు. అందులో గత 50 సంవత్సరాలనుండీ, లండన్ లో ఉంటూన్న తెలుగుతేజం డాక్టరు గూటాల కృష్ణమూర్తి గారి గురించి. ఆయన వివరాలు ప్రస్తావిస్తూ శ్రీ కృష్ణమూర్తిగారు అమలాపురం కాలేజీలో పనిచేసిన విషయంకూడా వ్రాశారు. ఆయనఫొటో కూడా పెట్టడంతో, మబ్బులన్నీ తొలగిపోయి, నా ఆరాధ్య మాస్టారు శ్రీ GKM గారి గురించి తెలిసింది. ఇంక ఆగడం నా తరం కాలేదు. ఎలాగోలాగ, మా మాస్టారి పోస్టల్ ఎడ్రస్ సంపాదించేయాలీ, ఆయనకి ఓ ఉత్తరం వ్రాసేయాలీ, ఎలాగ ఎలాగ ఎలాగ… నెట్ అంతా వెదికేశాను. ఆయన ఎడ్రస్ తప్ప మిగిలినవన్నీ తెలిశాయి. గురువుగారి గురించి ఇదివరకే చాలా చదివాను, కానీ ఆయనే నా గురువుగారూ అని అప్పుడు నాకేం తెలుసూ? ఇప్పుడు తెలిసీ ఏమీ చేయలేని అసహాయత, ఏదో ఓ ఉత్తరం ద్వారా, నా tributes ఆయనకు చెబదామని, అదీ 50 ఏళ్ళ తరువాత!

   క్రిందటివారం అంతర్జాలం లో “పొద్దు” చదువుతూంటే ( నేను కాదు మా ఇంటావిడ) అందులో శ్రీరమణ గారు శ్రీ ఆరుద్ర గారిమీద వ్రాసిన వ్యాసంలో, గూటాల కృష్ణమూర్తి గారి ప్రస్తావన వచ్చింది. మా ఇంటావిడ, ” ఏవండోయ్, మీ మాస్టారిగురించి శ్రీరమణ గారు వ్రాశారూ,ఆయన ఎడ్రస్ ఆయనకేమైనా తెలుసునేమో కనుక్కోండీ” అంది. ఇదిగో ఇలాటప్పుడే ఇంటావిళ్ళ వాల్యూ తెలిసొస్తుంది–JUST IN TIME ! సెల్ తీసికుని శ్రీరమణగారికి ఫోను చేసేశాను. సార్ నేను ఫలానా , మిమ్మల్ని నాలుగేళ్ళ క్రితం, హైదరాబాద్ లో కలిసి, మూడుగంటలపాటు బోరు కొట్టేశానూ, నాకో ఉపకారం కావాలీ, గూటాల కృష్ణమూర్తిగారి పోస్టల్ ఎడ్రస్ కావాలీ, విషయం ఇదీ ని చెప్పాను.దానికి ఆయనా సంతోషించి, ఇంట్లో ఉందీ, రాత్రి ఫోను చేయండీ అని చెప్పారు. నేనా ఇలాటి అవకాశం వదిలేదీ? రాత్రిఫోను చేస్తే, శ్రీరమణ గారు ఎడ్రస్ ఇస్తూ, ఓ పావుగంట ఆయనతో మాట్లాడనిచ్చారు. ఫోను కట్ చేయొచ్చూ, లేకపోతే నేనడిగినది తెలియదూ అనొచ్చు. కానీ నిండుకుండలు తొణకవంటారే అలాగ, శ్రీరమణగారి ధర్మమా అని డాక్టరు గూటాల కృష్ణమూర్తి ( My favourite teacher, Sri GKM) గారికి ఓ ఉత్తరం ( ఓ అరఠావు నిండుగా) తెలుగులో వ్రాసి పోస్ట్ చేసేశాను.ఇంగ్లీషు మాస్టారికి తెలుగులోనా అని అనుకోకండి, మా మాస్టారికి తెలుగంటే చాలా అభిమానం . ఈ విషయం ఎప్పుడో శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శాస్త్రిగారి “ఇల్లాలి ముచ్చట్లు” లో చదివాను.

    ఇదండీ విషయం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, మా మంచి మాస్టారి గురించి గుర్తుచేసికోడం కంటే ఆనందం ఇంకోటుండదు — Long live all Teachers.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–బస్సులో ఓరోజు…

   మొన్నోరోజున నా మిస్టరీషాపింగుకి వెళదామని బస్సెక్కుదామని ప్రయత్నిస్తూంటే, దారికడ్డంగా, ఓ కుర్రాడు, వీప్మీద ఓ సిమెంటుబస్తా అదేనండీ back pack ఏదో అంటారుట, వేళ్ళాడేసికుని నుంచున్నాడు. బయటకీ రాడూ, ముందరకీ వెళ్ళడూ, చేస్తున్న ఘనకార్యం ఏమిటంటే, ఎంట్రెన్స్ దగ్గర సీట్లో కూర్చున్న ఓ అమ్మాయితో కబుర్లు! అదేం ఖర్మమో. బస్సుల్లో ఈ సిమెంటుబస్తాల్లాటివేసికుని, ఇంకోళ్ళ ప్రాణం ఎందుకుతీస్తారో? ఓ స్పర్శాజ్ఞానం ఉండదూ, రోడ్డుకడ్డంగా ఉంటూంటాయీ ఎద్దులూ, దున్నపోతులూ అవే గుర్తొస్తాయి! వెనక్కాల కాకుండా, పోనీ ఓ పక్కగానైనా వేళ్ళాడేసుకోవచ్చుగా, అమ్మో తనకి కష్టం అయిపోదూ,ఊళ్ళోవాళ్ళకేమైనా ఫరవాలేదు.మనం సుఖంగా ఉంటే చాలు!ఎవడో, అ బ్యాగ్గుకాస్తా కోసేసో, జిప్పుతెరిచేసో ఉన్నవన్నీ ఖాళీ చేసేస్తే వదులుతుంది రోగం!

   నాదారిన నేను,ఎలాగో చోటుచేసికుని, నా శక్తంతా ( ఉన్నదెంతా!) ఉపయోగించి, వాణ్ణీ, వాడి బస్తానీ తోసుకుంటూ, మొత్తానికి ఏదో కొద్దిగా సేఫ్ గా ఉండే చోటకి చేరుకున్నాను. లేకపోతే ఆ ఫుట్ బోర్డ్ మీదే నుంచోవాల్సొస్తే, ఏ బ్రేకెసినప్పుడో కిందపడతాను.ఇక్కడ బస్సుల్లో, ఏ పదిశాతమో తప్పించి, Senior Citizens కి రిజర్వ్ చేసిన సీట్లలో, ఏ కుర్రగాళ్ళో,లెక మధ్యవయస్కులైన ఆడవారో కూర్చుంటారు. పక్కనే, ఓ Senior Citizens నుంచున్నా సరే, వాళ్ళని కాదన్నట్లు ఎటో చూస్తూ! అమ్మాయిలలాకాదు, నాలాటివారినెవరైనా చూడ్డం చాలు, అంకుల్, ప్లీజ్ బి సీటెడ్ అని ఆఫర్ చేస్తారు.నేనూ ఓసారి గాడ్ బ్లెస్ యూ అని ,ఆ సీటులో కూలబడతాను.

   ఆరోజు, మామూలుగానే, నుంచున్నాను, కారణం రిజర్వ్ చేసిన సీట్లలో ఓ ఇద్దరు ఆడవాళ్ళూ, వెనక్కాలి సీటులో వారి సంబంధితవ్యక్తే కాబోలు ఒకాయనా కూర్చున్నారు.ఇంతలో, నేను నుంచున్న చోటుకి పక్కనుండే సీట్లోంచి, ఆ ముందరివాళ్ళ సంబంధితవ్యక్తి కండక్టరునుంచి చిల్లరో ఏదో తీసికోవాలనుకుంటా, లేచాడు. ఇంతలో ఆ ముందరావిడ, ఆ ఖాళీ అయిన సీటులో, ఓ జేబురుమ్మాలూ, ఓ క్యారీబ్యాగ్గూ వేసేసి, ఊరుకోవచ్చా, పైగా నన్నుద్దేశించి, ఆప్ మత్ బైఠో, ఉన్కా సీట్ హై, అభీ ఆయేగా.అంది. నాకైతే నషాళానికెక్కెసింది,పెద్దాళ్ళకి రిజర్వ్ చేసిన సీట్లో కూర్చోడమే తప్పు, పైగా ఖాళీ అయినసీటు గురించి జ్ఞానబోధ చేయడం ఓటీ!నేను మాత్రం తక్కువతిన్నానా, ‘ఆప్ లోగ్ సే జాదా అక్కల్ హై హంకో, ముఝే మాలూం హై ఏ సీట్ కా ఆద్మీ వాపస్ ఆయేగా. అని. తగలవల్సిన చోటే తగిలింది అక్కల్ అనేసరికి!మళ్ళీ ఈ అక్కల్ అంటే ఏమిటీ అనడక్కండి,మ్యానర్స్ లాటిదన్నమాట!

   ఇంతలో పక్కనే ఓ సీట్ ఖాళీ అయితే, అక్కడ ఒకావిడ పక్కన సెటిల్ అయ్యాను.మీరు గమనించండి, ఎప్పుడైనా అలా మధ్యవ్యస్కులైన స్త్రీల పక్కన కూర్చోవలసివచ్చినప్పుడు, ఒక్కోప్పుడు చిత్రాతిచిత్రాలు జరుగుతూంటాయి! మరీ ఏ చెయ్యో కాలో తగిలితే ఏం గొడవో అని భయ పడుతూ కూర్చోవలసివస్తుంది, ఆ కూర్చున్నావిడ మామూలు మనిషైతే ఫరవాలేదు. కానీ కొందరు ఎబ్నార్మల్ వాళ్ళుంటూంటారు, మనం కూర్చోగానే, ఠక్కున లేచిపోతూంటారు, అదేమిటో మన “శీలం” శంకిస్తున్నారా అనిపిస్తూంటుంది! బస్సుల్లో అంత రష్షులోనూ, పక్కవాడూ ముందరవాడూ, తొక్కేస్తూ, నొక్కేస్తూంటే వీళ్ళకి పట్టింపుండదు, పక్కన ఓ మగాడు కూర్చునేటప్పటికి వచ్చేస్తూంటుంది వీళ్ళకి మాడెస్టీ! అలాటప్పుడు బస్సుల్లో వాళ్ళకి రిజర్వ్ చేసిన సీట్లోనే కూర్చోవచ్చుగా, అక్కడెవడైనా మొగాడు కూర్చుంటే, చమడాలెక్కతీసి, లేవదీసేయాలి. అలాటి సంఘటనలూ చూస్తూంటాను. పనేమీ లేదుగా, బస్సుల్లోనే వెళ్తూంటాను, ఇదిగో ఇలాటివి చూడ్డానికి! అలాగని dont doubt my integrity !!

   అక్కడితో అవలేదు ఆరోజు వింత సంఘటనలు– బస్సు ఎగ్జిట్ దగ్గర ఒకతను నుంచున్నాడు. ఇంతలో కండక్టర్ గంట కొట్టీ కొట్టడంతోనే, ఆ తాడో ఇంకేదో, నలిగి నలిగుంటుంది, అది కాస్తా టుపుక్కున తెగి, ఆ గంట ఇతని నుదిటిమిద పడింది! అదృష్టం కొద్దీ పేద్ద దెబ్బేమీ తగల్లెదు! ఇంత హడావిడీ పూర్తయి దిగుతూంటే చూశాను- ఓ పెద్దమనిషి ఓ సిమెంటు బస్తా అదేనండీ, back pack ని అందరిలాగా వీప్మీద కాకుండా, ముందరకి, అప్పుడప్పుడు ఈ రోజుల్లో “అమ్మలు” తమ బేబీలని పెట్టుకుంటూంటారూ అలాగన్నమాట, పెట్టుకుని దిగడం. ఓసారి అతన్ని పలకరించి, అలాటి ఇంగితజ్ఞానం ఉన్నందుకు అభినందించాలనిపించింది!హలో బాస్ మీరు అలా ఎందుకు పెట్టుకున్నారూ అనడగ్గానే, నేనాశించిన సమాధానమే వచ్చింది.– వెనక్కాల పెట్టుకుంటే అందరికీ న్యూసెన్సూ, పైగా మన సరుకులు ఉన్నాయో ఊడేయో చూసుకుంటూండొచ్చూ- అని!

   అప్పుడు తెలిసింది, ప్రపంచంలో అందరూ తమ సుఖమే చూసుకునేవారు కాదూ, పక్కవాళ్ళ కన్వీనియెన్సూ, కంఫర్టూ కూడా గమనిస్తూంటారూ అని. వెదకాలేకానీ,అలాటివాళ్ళూ ఉంటారు! సర్వేజనాసుఖినోభవంతూ !!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్…

   ప్రొద్దుటే వినాయకచవితి పూజ చేసికుని, భోజనం చేసి, కొంతసేపు రిలాక్స్ అయి, ఇప్పుడే మేముండే ఇంటికి చేరాము. చెప్పేనుగా, మేముండే ఇంటికి వచ్చేస్తే, నాదారిన నేను టపాలు వ్రాసుకోవచ్చు, ప్రొద్దుటే ఎప్పుడు లేచినా అడిగేవాడులేడు!మా ఇంట్లో అయితే, కనీసం నవ్య స్కూలుకి వెళ్ళేలోపునైనా లేచి రెడీ అవకపోతే, చూసేవాళ్ళకి బావుండదు.
రేపు పేపర్లుండవుట. అయినా ఉన్నా లేకపోయినా మహ తేడా ఏమీ ఉండదనుకోండి. ఎప్పుడూ ఒకటే గోల! ప్రతీవాడూ ప్రతీదానికీ, ఏదో వాళ్ళ చేతుల్లో ఉన్నట్లు, deadline లు పెట్టేవాళ్ళే!

    ఒకరేమో ఆగస్టు 30 లోపులో అదేదో జనలోక్పాలో ఇంకోటో, పార్లమెంటులో పాస్ అవకపోతే అసలు ముద్దే ముట్టనన్నారు. ఆగస్టు ముఫైయ్యీ వెళ్ళింది, రంజానూ వెళ్ళిందీ, విఘ్నేశ్వర పూజ కూడా పూర్తీ అయింది. తూతూ మంత్రం లా ఓ పేద్ద “చర్చ” జరిపించేసి, ఇదిగో ఫలానా అదిగో ఫలానా అని వాగేసి, వోటింగైనా లేకుండా, ఓ తాయిలం చూపించేశారు. అందరూ ఆహా ఓహో అనేసికుని టపాకాయలు పేల్చేసి, స్వీట్స్ ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు కుక్కేసికుని, ఆ పెద్దాయనకి, ఓ ఇద్దరు చిన్న పిల్లలచేత జ్యూస్ తాగించేశారు. మళ్ళీ అక్కడా సెక్యూలరిజం !! ఈ లోపులో పెద్దాయన టీం లో వాళ్ళ మీద ఒకళ్ళపైన ఒకళ్ళు విసుర్లు వేశారు, ఓ రోజంతా పేపర్లకీ, టీవీ లకీ కాలక్షేపం, మర్నాడు మళ్ళీ వాళ్ళే, అబ్బే అసలు నేనలాగననే లేదూ, I was quoted out of context అని ఓ స్టేట్మెంటూ! ఇదో వేళాకోళం అయిపోయింది ప్రతీవాడికీనూ, మనల్ని అంటే ఆంఆద్మీలని వెర్రివెంగళప్పలు చేసి ఆడిస్తున్నారు! మనం ఆడుతున్నాము. ఒకసంగతి చెప్పండి, పెద్దాయనకి ఉపోషం మొదలెట్టిన రోజే చెప్పారు- మీ ముసాయిదా అదేదో కమెటీ ముందర పెడతామూ, ఓ మూణ్ణాలుగు నెలల్లో ఏదో ఒకటి తేలుతుందీ అని. పధ్నాలుగు రోజుల తరువాత జరిగిందేమిటీ, అదే కదా! మన రాజకీయనాయకులు జమాజెట్టీలండి బాబూ, వాళ్ళా అంత తొందరలో తేల్చేది? It was all question of egos. ఆ పెద్దాయనకి తెలుసు అందుకే సగం విజయం అన్నారు. మిగిలిన సగానికి, ఆ మిగిలినవాళ్ళని కూర్చోబెడితే సరి, వదిలిపోతుంది రోగం! కరప్షన్ ఉండాలని ఎవరూ అనరు.

   ఈ మధ్యలో, మన గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రిగారిని, పక్క ఊళ్ళో గవర్నర్ గా వేసేశారు. ఆ ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన ఆయన చుట్టాల్ని, ఎవరూ కేర్ చేయలేదూ అని ఈవేళ ఓ న్యూసూ. ఇక్కడే పట్టించుకోపోతే, బయటివాళ్ళేం పట్టించుకుంటారు? అసలు ఈ గవర్నర్ గారు ఏం చేస్తారుట? తమిళనాడులో ఉండే దేవాలయాలన్నీ, ఫుకట్ గా చూడ్డం తప్పించి, ఇదివరకో గవర్నర్ ని చూళ్ళేదూ మనం, 75 ఏళ్ళు దాటినా హాయిగా సోమాజీగూడాలో వయస్సులో ఉన్న వాళ్ళతో జల్సా చేశాడన్నారు! పైగా ఎప్పుడో చేసిన ” వెధవ పనికి” వాడెవడో కోర్టులో కేసుకూడా వేశాడు. అదేదో DNA Test చేయించుకోరా పోనీ ఆంటే ఠాఠ్ అంటాడు. మన మా.ము. గారుమాత్రం తక్కువేమిటీ, అదేదో భూపంపకాల్లో ఏదో లాగించేశారూ అన్నారు. వీళ్ళండీ మన రాజ్యపాళ్ళు అదే గవర్నర్లు!

    ఈలోపులో మన ప్రభుత్వం వారు ఓ Sports Bill అనోటి పెడదామని, క్యాబినెట్ ముందర చర్చించడం మొదలెట్టేటప్పటికి, ఓరి నాయనో ఇదేదో మన పొట్టలమీద కొట్టేదిరా బాబూ అనుకుని, మన అతిరథ మహారథులు పవారూ, ఫ్రఫుల్లూ వగైరాలందరూ ఠాఠ్ వద్దనేశారు! BCCI కి గవర్నమెంటు aid లేదుట, అందుకోసం వాళ్ళకి RTI వర్తించదుట! ఇంతకంటే దౌర్భాగ్యపు ఆర్గ్యుమెంటు ఎక్కడైనా విన్నారా? అదేదో Government of the People,by the People and for the People అంటారుకదా, మరి వీళ్ళకి డబ్బులు తగలేసి ఇచ్చేది ఎవరు బాబూ? ప్రతీ దౌర్భాగ్య రాజకీయనాయకుడూ, ఏదో ఒక Sports Body లో పడితింటున్నవాడే. ఏం తింటున్నావు నాయనా అని అడక్కూడదుట.ఇంతమంది దరిద్రుల్ని వదిలేసి, వీళ్ళందరినీ “దేముళ్ళు” చేసిన మీడియాని వదిలేసి, ప్రభుత్వోద్యోగులూ అంటూ ఏడుస్తారేమిటో తెలియదు.

   ఆదికేశవనాయుడి దరిద్రం వదిలి అదేదో specified authority అని పెట్టారూ బాగానేఉందీ అనుకున్నంతసేపు పట్టలేదు, ఇంకోకాయనొచ్చేశాడు! ఆయనేమో అప్పుడెప్పుడో, ” జంబూద్వీపే భరత ఖండే” రోజుల్లో, ఏదో స్కాం లో ఇరుక్కుని మంత్రిపదవికి నీళ్ళొదులుకున్నాడుట. మన ప్రభుత్వం వారికి ఈయనే దొరికాడు, శ్రీవెంకటేశ్వరుడిని కాపాడ్డానికి! ఈయనేం వెలగబెడతాడో చూడాలి.

   ఒక్కవిషయం మాత్రం తమాషాగా ఉంది అటు కేంద్రప్రభుత్వం అనండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనండి, అదేం ఖర్మమో , ప్రతీ ముఖ్యమైన పోస్టుకీ minimum qualification- ఎప్పుడో అప్పుడు ఏదో ఒక స్కాం లో ఉంటేనే, అలాటి అభ్యర్ధులే eligible అనుకుంటా.ఇదేదో బాగానే ఉందే! పాపం ఆ పెద్దాయన ఇంకా ఎన్నెన్ని ఉపోషాలు చేయాలో …..

మేరా భారత్ మహాన్..

%d bloggers like this: