బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పేరైనా శుభ్రంగా పెడితే బాగుండును……

   మొన్నెప్పుడో ఓ ఫ్రెండింటికి వెళ్తే, పాపం ఆయన,పరోపకార బుధ్ధితో, తనదగ్గరున్న ఓ ఫారం ఇచ్చి,దీన్ని ఫొటోకాపీలు తీసి, మీ ఇంట్లో ఉన్నవారందరి పేర్లూ ఒక్కోరికి విడిగా నింపి,వాళ్ళందరినీ, అక్కడెక్కడో ఉన్న పోస్టాఫీసుకి తీసికెళ్ళినా సరే, వెళ్ళమన్నా సరే అన్నారు. నేను పక్కన పెట్టేసినా, మా ఇంటావిడ ఊరుకుంటుందా, ప్రతీ రోజూ ఒకటే సణుగుడు, పాపం అయనచెప్పారుగా ఓసారి ఆ పనేదో పూర్తిచేసేస్తే మీకు నష్టం ఏమిటీ? ఎలాగూ పనీ పాటులేకుండా తిరుగుతూనే ఉంటారు, అనే అర్ధం వచ్చేటట్లు ! ఏమిటోనండీ, రిటైరయితే, మనకి పనులే ఉండవా? ఎందుకొచ్చిన గొడవా అనుకుని, ఆ ఫారాన్ని పది కాపీలు (ఉన్నారుగా నాకు నవరత్నాలూనూ), ఓ నాలుగు అబ్బాయికీ, ఓనాలుగు అమ్మాయికీ ఇచ్చి ఊరుకున్నాను.ఓ రెండు మాకోసం ఉంచాను. ఆయన చెప్పిన చోటు, మాకు కొంచం దూరం లెండి, నేనైతే ఏ బస్సో పట్టుకుని పోతాను, ఆవిడేమో ఆటోలు తప్ప ఎక్కదు,పోనీ పిల్లలతో కార్లో వెళదామా అనుకుంటే, వాళ్ళకి టైముండదాయె.మరి ఊరుకోకేంచెస్తానూ? ఇంతలో, నిన్న మా ఇంకో ఫ్రెండు ఫోను చేశాడు, ఫలానా పనైయిందా అంటూ, పైగా మాకు ఆటోలు సుళువుగా దొరికే రోడ్డుమీదుండే పోస్టాఫీసుకి ప్రొద్దుటే ఎనిమిదిన్నరకి వెళ్తే, పని తొందరగా అవుతుందని మరీ చెప్పాడు. రైఠో, అయితే రేప్పొద్దుటే వెళ్ళి మనిద్దరిదీ పూర్తిచేసికుందాముటోయ్ అని ప్రకటించేశాను.

   ఈ గొడవంతా దేనికీ అంటారా, దేశం అంతా సుఖపడిపోతోందే అనుకుని, ఆ శ్రీ నందన్ నిలెకానీ గారు మొదలెట్టిన, Unique Identification Authority of India వాళ్ళిచ్చే కార్డుకోసం. అసలా పేరే ఎంత stylish గా, ఎంత glamourous గా ఉందీ, దాన్నేమో మన సర్కారు వారు ” ఆధార్” అని ఓ దిక్కుమాలిన పేరెట్టారు. అసలా పేరు వినడంతోనే depression లోకి వెళ్ళిపోతాం! అంతకంటే మంచిపేరే దొరకలేదా? అదేమిటో ఆధార్ నెంబరూ అనగానే, ఇంకోళ్ళమీద ఆధారపడ్డట్లుగా వినిపిస్తుంది. పైగా ఇది మన జీవితాంతం పెర్మనెంటుట, ఇదోటీ.UID నెంబరేమిటీ అంటే ఫలానా అనిచెప్పడానికి ఎంత బావుంటుందీ, మాయదారి ” ఆధార్” నెంబరెంతా అని అడిగితే,అదేదో ఇంకోళ్ళమీద ఆధారపడినట్లుగా సౌండొస్తుంది! పోనీ వాటివల్ల మనకేమైనా ఒరుగుతుందా అంటే అదీ లేదు. మనరోగం కుదర్చడానికి భవిష్యత్తులో ఈ “ఆధార్” నెంబరు లేకపోతే, మన ఖానా పానీ బంధ్ ట! అందుకోసం, పేరు ఎంత దరిద్రంగా ఉన్నా, చచ్చినట్లు తీసికోవాలీ అనుకుని బయలుదేరాము! ఈ మధ్యన,టివీ. లో దినఫలాలు చూస్తున్నాలెండి, ప్రొద్దుటే అదేదో చానెల్ లో వృశ్చిక రాసివారికి, తల పెట్టిన పని ఒక్కటీ సవ్యంగా జరగదూ అని చెప్పారు! దరిద్రుడి నెత్తిమీద వడగళ్ళవాన లా. మనం వెళ్ళేదే బీదరుపులు లా ఉంది, దీనికి సాయం మళ్ళీ ఇదోటా!కానీ ఆ చానెల్ లోనే చెప్పారు తోపురంగు డ్రెస్ వేసికుంటే, పని జరిగితే జరగొచ్చుట! ఇదీ బాగానే ఉందీ అనుకుంటూ, కబ్బోర్డ్ లో ఉన్న నాపాత షర్టోటి తీశాను. ఇంక మా ఇంటావిడూరుకుంటుందా, అదేమిటండీ ఈమధ్యన మిస్టరీ షాపింగులో ఎడా పెడా, బ్రాండెడ్ షర్టులు కొనుక్కుంటూ మళ్ళీ ఈ పాత షర్టెక్కడ దొరికిందీ అంటూ.మళ్ళీ ఆవిడకేం చెప్పనూ, పోనిద్దూ ఏదో ఒకటీ, మరీ పంచా ధోవతీ కాదుకదా అని బయలుదేరతీశాను.

   ట్రాఫిక్కు జాం ధర్మమా అని, మేము వెళ్ళేసరికే ఓ పేద్ద క్యూ ఉంది. ఓ చోటేమో ఫారాలిస్తున్నారు, రెండో క్యూ ఫారాలు నింపినవాళ్ళకిట.మొత్తానికి, మా పేరు రిజిస్టరులో వ్రాయించుకుని, ఆ “గుడి” తలుపులు తెరిచిన తరువాత లోపలకి చేరాము.ఈ బాపతు జనాలు ఓ పదిహేనుమంది.అక్కడే ఉన్న సగం సగం విరిగిన బెంచీలమీద కూలబడ్డాం.మా ముందర వాళ్ళెవరిదో చేస్తూంటే, ఆ సిస్టం కాస్తా హ్యాంగయింది. అంతా గ్రహబలం అనుకుంటూనే ఉన్నాను. మొత్తానికి, మా ఇద్దరి పేర్లూ పిలిచి, పెళ్ళిపీటలమీద కూర్చోబెట్టినట్లు, ఆ రెండు సిస్టాలముందరా, చెరో కుర్చీలోనూ సెటిలయ్యాము.అక్కడున్న పిల్ల, ముందుగా, నా కళ్ళజోడు తీయించేసి, ఓ ఫొటో తీసింది.అదేదో ఇచ్చి, దాంట్లోకి చూస్తూ కళ్ళు పెద్దగా చెయ్యమంది. అసలే నా కళ్ళేమైనా “విశాలనేత్రాలా” ఏమిటీ, చిన్నవీ దానికి నేనేం చేయనూ, ఉహూ అలాక్కాదు ఇంకా పేద్దగా అంటుంది, చూడు తల్లీ ఇంతకంటే బలవంతం చేశావంటే, ఆ గుడ్లు కాస్తా బయటకొచ్చేస్తాయి, ఏదో ఒకటి కానిచ్చేయ్ అన్నాను. ఏమనుకుందో సణుక్కుంటూ ఆ “కళ్ళ” కార్యక్రమం పూర్తిచేసి, అదేదో రాంగోపాల్ వర్మ సినిమాల్లో లాగ, అదేదో దానిమీద, రెండరచేతులూ వేసి నొక్కమంది. ఎంత నొక్కినా ఇంకా ఇంకా అంటూ తనూ ఓ చేయేసింది!( ఆ పదినిమిషాల్లోనూ బావున్నదల్లా ఇదోటే !!). మొత్తానికి ఆ కార్యక్రమం అంతా పూర్తిచేసి, మా పేరూ,ఊరూ సరీగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసికుని, ఆ పిల్ల ఇచ్చిన కౌంటర్ ఫాయిల్ తీసికుని, మా ఇంటావిడ వివరాలు కూడా చెక్ చేసి, ఆవిడ కాగితం కూడా తీసికుని,కొంపకి చేరాము.

   అవ్విధంబుగా, నేనూ, మా ఇంటావిడా భారత రిపబ్లిక్కు వారిమీద జీవితాంతం ఆధారపడేటట్లుగా “నాతిచరామి” అనుకుని బయట పడ్డాము.

%d bloggers like this: