బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఊరికే సరదాకి నోట్ చేసేసికుంటే సరిపోతుందా…

   నాకున్న ‘వ్యసనాల్లో’ ఒకటేమిటంటే, తెలుగు మాట్లాడితే పాపం, వాళ్ళని ఆపేసి వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా పరిచయం చేసేసికోడం, ఏవో కబుర్లు చెప్పి, వెళ్ళేముందర, ఇదివరకైతే ఓ నోట్ బుక్కులో వాళ్ళ ఎడ్రసు వ్రాసుకోడం. ఈమధ్యన పాత డైరీలు చూస్తూంటే, ఇలా నోట్ చేసికున్న చాలా ఎడ్రసులు దొరికాయిలెండి. అంటే ఈ అలవాటు చాలా పాతది. ఇలా ఎడ్రసులు వ్రాసుకోవడం వలన లాభం ఓటుంది, కనీసం ఆ ఎడ్రసాయనది ఏ ఊరో తెలుస్తుంది. ఎప్పుడో చూసినప్పుడు, సడెన్ గా గుర్తొస్తుంది. ఓహో ఇది ఫలానా ఆయన ఎడ్రసా అని. ఎప్పుడైనా ఆ ఊరువెళ్తే కలియడానికి ప్రయత్నిస్తాం లేదా తీరిక చిక్కినప్పుడు ఓ ఉత్తరం పోస్టు చేస్తాం. ఇష్టం ఉందా జవాబిస్తారు లేదా, అక్కడితో సరి.

ఈ సెల్ ఫోన్లొచ్చినప్పటినుండీ, జేబులో డైరీలు పెట్టుకోడం తగ్గింది, పైగా నామోషీ ఓటీ! ఆమధ్య ఎప్పుడో, మా ఇంటావిడ ఓ digital diary ఇచ్చింది. ఉద్యోగంలో ఉన్నప్పుడు దానిలో ఎడ్రసులూ, ఫోను నెంబర్లూ వగైరా వ్రాసుకునేవాడిని. అది నేర్చుకోడానికి ఎన్ని తిప్పలు పడ్డానో చెప్పాలంటే ఓ పేద్ద కథవుతుంది. ఉద్యోగంలోంచి రిటైరయ్యే టైముకి, మళ్ళీ మా ఇంటావిడే, మరీ ప్రతీవాడూ సెల్ ఫోన్లతోనే కనిపిస్తున్నాడూ, నా ప్రాణనాధుడుకి లేకపోతే ఎలాగా అని, ఓ సెల్ ఫోనోటికూడా కొనిపెట్టింది. ఇప్పుడర్ధమయిందా నా అస్థిత్వమంతా మా ఇంటావిడ ధర్మమే! ఇంతలా పబ్లిక్కుగా చెప్పుకుంటున్నా, కనిపించినవాళ్ళందరితోనూ, మావారు అసలు నన్ను కేరే చెయ్యరు, ఆయన గొడవేదొ ఆయనదే అని అడిగినవాడికీ అడగనివాడికీ చెప్తూంటుంది. ఏం చేస్తాం లెండి అంతా కలియుగం, మంచి వాళ్ళకీ అమాయకులకీ రోజులు కావు. ఎక్కడో మొదలెట్టి ఎక్కడకో వెళ్ళాను.

ప్రస్తుతానికి వస్తే, ఈ సెల్ ఫోన్ల ధర్మమా అని చెప్పానుగా, డైరీలూ, digital diaryలూ మానేసి, సెల్ ఫోన్లతోనే కాలక్షేపం చేసేస్తున్నాను. జేబులుకూడా తేలిగ్గా ఉంటాయి.కనిపించిన తెలుగు మాట్లాడే ప్రతీ ప్రాణినీ పలకరించేసి, వెళ్ళే ముందర ఆ పెద్దమనిషి సెల్ నెంబరడగడం, నోట్ చేసేసికోడం. అప్పుడప్పుడు నాకు దొరికేవాళ్ళు కూడా గమ్మత్తుగా ఉంటారు. ముందుగా మన ఫోను నెంబరడిగేస్తారు, ఏదొ తిప్పలు పడి దాన్ని నోటైతే చేసికుంటారు, దాన్ని సేవ్ చేసి దానికి నా పేరుపెట్టొద్దూ, అక్కడికొచ్చేసరికి వస్తుంది అసలు గొడవంతా. దాన్ని నోట్ చేసికోడానికి కుదరదని చెప్పడానికి మళ్ళీ సిగ్గూ. నాకూ మొదట్లో అలాగే అయ్యేదిలెండి, అవతలివాడి నెంబరు సేవ్ చేయడం తెలిసేది కాదు, ఏదో ఇంట్లో పిల్లల్నడిగేసి మొత్తానికి నేర్చేసికున్నాను. పైగా అదీ LG సెట్ లోనే. ఆ సెట్ మారిస్తే మళ్ళీ నేనూ వీధిన పడతాను. అందుకనే ఇప్పటిదాకా ఎన్నిసెట్లు మార్చినా LG మాత్రం మార్చను! మా ఇంటావిడది అదేదో NOKIA ట. బయటకు వెళ్ళినప్పుడు నా జేబులో పడేయమంటుంది, దాన్ని లాక్ చేయడం నాకు తెలియదూ, మా మనవణ్ణి ఎత్తుకున్నప్పుడో ఎప్పుడో, ఆ ఫోను కాస్తా “కాల్” చేసేస్తుంది. అలా “కాల్” చేయబడిన వారెవరో, ఎవరో ఏమిటిలెండి, నూటికి తొంభై సార్లు మా అత్తగారే, ఆవిడ నెంబరోసారి నొక్కబడి ఆగిపోతుంది. పాపం ఎక్కడో తణుకులో ఉంటున్నారూ, ఇలాటి మిస్డ్ కాల్ రాగానే, ” అయ్యో పాపం, పిల్లకేం కష్టం వచ్చిందో ఏమిటో, మిస్డ్ కాల్ ఇచ్చిందీ..” అనుకుని, ఆవిడ తిరిగి కాల్ చేస్తూంటారు. అలా ఆవిడ కాల్ చేసినప్పుడల్లా, మా ఇంటావిడది ఓ standard dialogue- ” అరే నేనేమీ కాల్ చేయలేదమ్మా, మీ అల్లుడిగారి జేబులో పెట్టుకోమంటే, పొరపాటున నొక్కేసుంటారు, ఆయనకి ఫోను లాక్ చేయడం రాదుకదా పాపం…”. వేషాలు కాపోతే ఈ విషయం ఊరంతా టముకేయాలా? ఆ సెల్ ఫోన్ని మోయడమే కాకుండా, ఇలాటి అపవాదులుకూడా వినాల్సొస్తూంటుంది.

ఇంక అలా కాదని, తన ఫోను లాక్ చేసేసిస్తూంటుంది. అందులో తన స్వార్ధం కూడా ఉందిలెండి. నేనేదో ఆవిడ ఫోన్నుంచి కాల్స్ చేసేయకుండా ఓటి. లాక్ చేయడమే రానప్పుడు, అన్ లాక్ చేయడం కూడానా సంబరం! అయినా అప్పటికీ ఓసారి ట్రై చేశాను. Now press* అనొస్తుంది. నాకు ఛస్తే అలా చేయడం రాదు, ఆ మాయదారి ఫోను అన్ లాక్కూ అవదు. ఎప్పుడైనా ఆవిడ ఫోను రింగయినప్పుడు, ఆవిడ చేతిలో ఫోను పెట్టేపి.ఏ. డ్యూటీ మాత్రమే చేస్తున్నాను!

అలా.. కనిపించినవారి సెల్ ఫోను నెంబరు నోట్ చేసికున్న అభియాన్ లో, ఎప్పుడో ఒకసారి ఎవరిదో నెంబరు నోట్ చేసికున్నట్లున్నాను. ఏదో ఓ పేరు రాసేసి వదిలెస్తాం కానీ, మరీ వాళ్ళ ప్రవర అంతా రాసుకోం కదా. రాసుకుందామనుకున్నా, ఓ అరడజను అక్షరాలు వ్రాసేటప్పటికి Sorry no more space.. అని ఓ మెసేజ్ వచ్చేస్తుంది. పోనీ దాన్ని ఎడిట్ చేసికోవచ్చుగా, అబ్బే మళ్ళీ బధ్ధకం. ఎప్పుడో చేద్దాములే అని మర్చిపోతాం. ఆ నెంబరూ , తోక తెగిన పేరూ మాత్రం అలాగే ఉంటాయి. ఈవేళ సాయంత్రం, మా ఇంటావిడతో వాక్ కి వెళ్తూ, ఆవిణ్ణి ముందరకి పంపించేసి, నేనోచోట సెటిలైపోయాను. ఆవిళ్ళా అంతంతేసి దూరాలు నడిచే ఓపిక లేదమ్మా. అలా కూర్చున్నప్పుడు, నా ఫోను ఎడ్రస్ బుక్కు తెరిచి, ఓ నెంబరుకి ఫోను చేసి, మీరు ఫలానాయేనా అన్నాను.ఆయనన్నారూ, నేను ఫలానాయే, మీ ఏ.సి. ఏ బ్రాండూ అన్నారు. ఎక్కడో తేడా వచ్చిందనిపించింది. మేస్టారూ మీరు పూణె లోనే కదా ఉండేదీ అన్నాను. లేదండీ, నేనెప్పుడూ పూనా రాలేదూ అన్నారు. అయితే మీరెక్కణ్ణించి మాట్లాడుతున్నారూ అంటే, ఆయ్ అమలాపురమండి, అనడంతోటే, నా ప్రాణం లేచొచ్చింది! ఏం చేస్తూంటారూ అంటే , ఏ.సి. మెకానిక్కునండీ అన్నారు. ఓహొ అదా సంగతీ పాపం అందుకే అడిగుంటారు, మీదే బ్రాండూ అని. ఎంతచెప్పినా, నా పుట్టింటి వాడూ, మరీ ఇలాటివి పట్టించుకుంటామా ఏమిటీ,అనుకుని, పోన్లెద్దురూ, మీదీ నాదీ కూడా అమలాపురమే, ప్రస్తుత వాయు/ధ్వని తరంగాలు మన కోనసీమనుండే కదా వస్తున్నాయీ, కాస్సేపు కబుర్లు చెప్పుకుందాంలెండి, అని ఆయనతో ఓ పదినిముషాలు కబుర్లు చెప్పాను! ఆయనా సంతోషించినట్లే ధ్వనించారు! ఇంకా నాకు మిస్టరీయే, అసలా నెంబరెలాగొచ్చిందో నా ఫోనులోకీ అని. మా ఇంటావిడతో ఈ గొడవంతా చెప్తే, “అందుకనే ప్రతీవాళ్ళతోనూ ఊరికే కబుర్లు చెప్పేయకండీ అంటాను” అంది.

%d bloggers like this: