బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఉన్నమాట చెప్పుకోకూడదుట….


   వామ్మోయ్ కడుపులో ఇంత దాచుకుందన్నమాట మా ఇంటావిడ ! ఏమిటో అమాయకురాలూ, చెప్పిందేదో చేసేయడం అనుకునేవాడిని. ఏదో బ్లాగులువ్రాయడం వచ్చేసింది కదా అని, అలా వ్రాసేయడమే? పెద్దా చిన్నా అంతరం ఉండొద్దూ? అసలు నా టపాలో , ఉన్నమాటేదో ఒప్పుకోవాలికదా అని “నా అస్థిత్వానికి మూల కారణం, మా ఇంటావిడే” అని వ్రాసుకున్నాను. నిజం చెప్పడం కూడా తప్పే అని, ఆవిడ వ్రాసిన టపా ధర్మమా అని తెలిసింది. ఔనులెండి, ఈ రోజుల్లో ఉన్నదున్నట్లు ఒప్పుకునేవాళ్ళే కనిపించడం లేదూ, ఏదో నూటికీ కోటికీ నాలాటివాడు తప్ప! అదికూడా తప్పంటే ఇంక నోరుమూసుక్కూర్చుంటాను.

   నేను పడే తిప్పలెవరితో చెప్పుకోనూ? పోనీ నా సింపతైజర్లెవరితోనైనా చెప్పుకుంటేనైనా కొద్దిగా ఉపశమనం పొందుదామూ అంటే ఈవిడేమో గయ్యిమంటుంది. ఈవేళ్టికీవేళ, అప్పుడెప్పుడో చెప్పిందిలెండి, ఆవిడకి బ్రాండెడ్ గోధుంపిండి బావుండడం లేదూ, గోధుమలు కొని, మర పట్టించి తీసుకురండీ అని. ఆవిడ చెప్పెయగానే చేసే అలవాటు లేదు నాకు, చూద్దాంలే అని ఊరుకుని, ఈవేళ బయటకి వెళ్ళే కార్యక్రమం ఏమీ లేకపోవడంతో, ఆ గోధుంపిండి కార్యక్రమానికి ఇవ్వాళ ముహూర్తం పెట్టాను. అబ్బాయేమో, తను ఎక్కడికో వెళ్ళాలిట, నవ్య స్కూలునుంచి వచ్చే బస్సు దిగినప్పుడు, తీసికోడానికి సాయంత్రం రమ్మన్నాడు. పోనీ ప్రొద్దుటే, మా అమ్మాయిదగ్గరకి వెళ్ళి, వాళ్ళమ్మ పెట్టిన నిమ్మకాయ పచ్చడి ఇచ్చేసొద్దామా అనుకుంటే, ఈవేళ చాలా బిజీ డాడీ, రేపు రండీ అని చెప్పేయడం తో, ఇంకే పనీ లేక గోధుంపిండి కార్యక్రమం పెట్టుకున్నాను.

   మేము సరుకులు తెచ్చుకునే కొట్లో వాడిని అడిగి, బాగుచేసిన గోధుమలు ఓ అయిదు కిలోలు, పక్కనే ఉందికదా కదా అని ఓ చక్కీ కి వెళ్ళాను. మళ్ళీ చక్కీ అంటే ఏమిటీ అని అడక్కండి, చక్కీ అనగా పిండిమర, (Flour mill). మరీ అంత ప్రొద్దుటే, నా ఒక్కడికోసం, వాడు ఆ మర ఎందుకు స్టార్ట్ చేస్తాడూ? ఓ ముగ్గురు నలుగురు గిరాకీలు వస్తేనే కానీ చేయనన్నాడు. అదేమిటో ప్రతీవాడికీ లోకువే నన్ను చూస్తే! ఏం చేస్తానూ, మళ్ళీ అక్కడకి వెళ్ళే ఓపిక లేక, అక్కడే చెతిలో ఓ పేపరు పుచ్చుకుని సెటిలయ్యాను, వచ్చేపోయేవాళ్ళని చూస్తూ, ఎవడి చేతులోనైనా ఓ సంచీ కానీ, స్టీల్ డబ్బాకానీ ఉందేమో, ఆ మరవాడు నాకు ముక్తి కల్పిస్తాడూ అని. అబ్బే, రావడం చాలామందే వచ్చారు, కానీ వాళ్ళందరూ, నిన్న గోధుమలిచ్చి, పిండి చేయించుకుని ఈవేళ కలెక్టు చేసికునే బాపతన్నమాట. ప్రపంచంలో అందరూ నాలాటివాళ్ళే ఉంటారా ఏమిటీ, పనీ పాటూ లేకుండా? ఎవరి పనులు వాళ్ళకుంటాయి.

   కొంచంసేపట్లో మొత్తానికి ఓ నాలుగు రెడీ అయ్యాయి, రెండు డబ్బాలూ, ఓ పేద్ద సంచీనూ. నాదేమో నాజూగ్గా ఆ గోధుమలకొట్టువాడిచ్చిన పాలిథిన్ సంచీ. అప్పుడు మొదలెట్టాడు ఆ మిల్లువాడు, ముందర ఓ సిగరెట్టు కాల్చుకున్నాడు. పోనీ దాన్ని కూడా ఓ నాలుగైదు దమ్ములు పీల్చేసి పడేయొచ్చుగా, అబ్బే, ఓ దమ్ములాగడం, పక్కనే పెట్టడం, ఓ చేత్తో, ఓ చీపురేసి అక్కడ ఉన్న గోధుంపిండి దుమ్మంతా తుడవడం. ఈ కార్యక్రమం పూర్తిచేసి, దేముడికో దండ వేసి అగరొత్తెలిగించడం. ఆ పనేదో, ఆ మాయదారి సిగరెట్టు వెలిగించే ముందర చేసికోవచ్చుగా. అలాటి టైములో ఆ మిల్లు దగ్గరుండడమంత మహాపాపం ఇంకోటుండదు. ఆ దుమ్మంతా మనమీదే! అందుకే కాబోలు, పిండి మరలదగ్గర, ఎవరూ వెయిట్ చేయరు, ఏదో నాలాటి అజ్ఞానులు తప్ప. నేను వేసికున్నదే నీలం రంగు చొక్కా, ఓ అరగంటసేపు ఆ చక్కీ దగ్గర నుల్చోడంతో, నేనూ నా అవతారం ఎలా అయిఉంటుందో ఊహించుకోండి. మొత్తానికి నా పని పూర్తిచేసి ఇచ్చాడండి. నాకెమైనా స్కూటరా, కారా, లేక బైక్కా ఏమిటీ, స్టైలిష్ గా డిక్కీలో పెట్టేసి తీసుకుపోడానికి, అలాగని ఆటోలో వెళ్ళే దూరమూ కాదూ, flyover కి ఈ మిల్లిక్కడా, మేముండే ఫ్లాటక్కడా. అదేదో దూరం అయితే ఆటో ఎక్కుతానని కాదూ, ఊరికే మాటవరసకి చెప్పే కబుర్లంతే !

   ఆ అయిదుకిలోల గోధుంపిండీ, close to the chest పట్టుకుని, షర్టు మరీ దుమ్ముకొట్టేయకుండా, నాకూ, ఆ ప్యాకెట్టుకీ మధ్యలో ఓ న్యూస్ పేపరడ్డేసికుని, మొత్తానికి కొంపచేరాను. అయిదుకిలొల ప్యాకెట్టు పట్టుకున్నప్పుడు, షర్టుకి ఆమాత్రం అంటుకోదా ఏమిటీ? పైగా ఆ మిల్లువాడిచే తుడవబడిన దుమ్మోటీ! నన్నూ నా అవతారాన్నీ చూసి , వెంటనే మా ఇంటావిడ, ఆ చొక్కా విప్పేసి వాషింగ్ మెషీన్ లో పడేయండి ముందరా అంది. పైగా, నా దువ్వెన్నేమైనా చూశారా అంటూ ఓ ఇన్వెస్టిగేషనోటి. నాకెందుకండి బాబూ ఆవిడ దువ్వెన్న? నాకున్నవా ఓ పదో పరకో వెంట్రుకలూ, వాటికో దువ్వెన్నోటా? నాకు తెలియదు మొర్రో అంటే వినదే, కాదు మీరే చూడండీ అంటూ, మంచం కిందా, టేబిల్ కిందా ఒంగుని చూడవలసివచ్చి, మొత్తానికి పట్టుకున్నాను.

   మధ్యమధ్యలో నామీద జోక్కులేస్తూంటుంది. ప్రొద్దుటే నేను లేచిన తరువాత, “పళ్ళుతోముకున్నారా కాఫీ తెస్తానూ..” అని. నా మొహానికి పళ్ళుకూడానా? ఏదో నన్నేడిపించాలనే దురుద్దేశ్యం కాపోతే మరేమిటీ? ఏమిటో వెళ్ళిపోతోంది……

9 Responses

 1. మీరు నిజంగానే చెల్లాయిని ఆట పట్టిస్తున్నారు. మిల్లుకెళ్ళి పిండి ఆడించుకురమ్మంటే ఇన్ని కబుర్లా.మళ్ళీ పూరీలు బాగోకపోతే దానికో టపానా. అన్నా! దువ్వెన్న కోసం ఇద్దరున్న ఇంటిలో మిమ్మలిని తప్పించి ఎవరిని అడుగుతారండీ. మరీను.

  Like

 2. మీ కబుర్లు వింటుంటే నాకో అనుబంధాల పొదరిల్లు కనిపించి౦ద౦డీ. మీ టపా ‘కాంతం కథల్లా’ వు౦ది.

  Like

 3. సర్వజనుల సమ్మె. కరంటు లేదండి బాబూ. రోజుకి ఆరు గంటలు కట్టు. ఉదయం ఐదు గంటలకి నెట్లో కూచోడం. మళ్ళీ సాయంతరం మూడు తరవాతే. ఇదీ మా అవస్త్థ. ఆరుకి కరంటు పోతుంది. తెలంగాణా మాట దేవుడెరుగు, వున్నవాళ్ళం అవస్థలు పడుతున్నాం. ఎప్పుడు పోతుందో, యమధర్మరాజు ప్రాణం పట్టుకుపోయినట్లు లటుక్కున తీసేస్తాడు. ఇంతే సంగతులు.
  జీవితం ప్రతి క్షణం కష్ట సుఖాలలో అస్వాదించడం వీటిని జీవిత భాగాలుగా చూడటం అలవాటు చేసుకుంటే హాయి. మీరు దీనిని కొంత సాధించారని అనిపిస్తుంది.

  Like

 4. మరో సాగుతున్న “మిథునం”

  Like

 5. ఫణి గారు…
  దంపుడు బియ్యం ప్రాశస్త్యాన్ని అక్కయ్యగారికి చెప్పాలని వుంది. 🙂
  ‘సువ్వి.. కస్తూరి రంగ సువ్వి ..
  కావేటి రంగ సువ్వీలాలో..
  సువ్వీ .. ఆహూఁ .. సువ్వీ .. ఆహూఁ ..’
  అని దంచిన దంపుడు బియ్యం రుచే కుచ్ అలగ్ హై. పైగా బి-విటమిన్, ఫైబరు, ఒహటేమిటి అన్నీ వుంటాయట.

  Like

 6. once again, hilarious!!
  పళ్ళు తోముకోడం అంటే బాపు పాతకార్టూనొహటి గుర్తొస్తోంది.
  ఒక పెద్దాయన దవడ నొక్కుకుంటూ హబ్బ పళ్ళు ఒకటే నొప్పి అంటే పక్కనే అర్ధాంగి, పోదురూ బడాయి, బహువచనం కూడానూ! అని దీర్ఘం తీసింది! 🙂

  Like

 7. >>>ఔనులెండి, ఈ రోజుల్లో ఉన్నదున్నట్లు ఒప్పుకునేవాళ్ళే కనిపించడం లేదూ, ఏదో నూటికీ కోటికీ నాలాటివాడు తప్ప!

  అబ్బో ప్రశంసా పత్రం మీరే ఇచ్చేసుకుంటారా? ఒప్పుకోము.

  టెస్టిమోనియల్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలి.

  Like

 8. @శర్మగారూ,

  ఆట పట్టించేటంత ధైర్యం ఎక్కడిదండి బాబూ? గొంతుకలోకి ముద్ద దిగొద్దూ? ఊరికే అప్పుడప్పుడు, నా అస్థిత్వాన్ని గురించి గుర్తుచేసికోవడం తప్ప ఇంకో దురుద్దేశ్యం లేదు!

  @రాజేష్,
  థాంక్స్ !!

  @జ్యోతిర్మయీ,

  నా టపా నచ్చినందుకు సంతొషమమ్మా.మరీ అంత మునగ చెట్టెక్కేయించొద్దు!

  @మొహన్ గారూ,

  ధన్యవాదాలు.

  @snkr,
  ఈ గోధుంపిండి ధర్మమా అని, నాకు బ్రేక్ ఫాస్టు లో అప్పుడప్పుడు, చపాతీలూ, పరోఠాలూ దొరుకుతూంటాయి. ప్రతీ రోజూ ఇడ్లీలే అంటే బోరుకదా!

  @కొత్తపాళీ గారూ,

  థాంక్స్.కనీసం బాపు గారి కార్టూన్ లో ఆ పెద్దాయనకి ” పన్నేనా” ఉంది. నాకు అదీ లేదు మాస్టారూ !!!

  @సుబ్రహ్మణ్యం గారూ,

  ఎవరూ ఇవ్వకపోతే ఏం చేస్తాను? అదేదో self attestation లాగ నాకు నేనే చెప్పేసుకుంటే పోలే ?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: