బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   మొన్న ఓ టపా వ్రాశాను ‘పేర్లతో పిలుచుకోడం’ అని. దానిలో ప్రస్తావించిన విషయాలే ఈవేళ ప్రొద్దుట, ప్రత్యక్షంగా వినడం/చూడ్డం తో, అబ్బో ఫరవాలేదూ, నేనూ ఏదో విషయాన్ని గురించి వ్రాయకలనూ అనిపించింది. అదేదో ” live show” లా అనిపించింది. ఈవేళ మా “ఇన్వర్టర్ డ్యూటీ ” ( గుర్తుండే ఉంటుంది, కొడుకూ,కోడలూ బిజీగా ఉండడంతో, మనవడికీ, మనవరాలికీ తోడు అన్నమాట!). మరీ అలాటి మధుర క్షణాల్ని అలా పిలుస్తారేమిటీ అని కోప్పడకండి. ఎంత ఆనందం, మధురమైనా సరే నేనలాగే అంటాను. ప్రపంచం లో ప్రతీ తాతా, నానమ్మా, అమ్మమ్మా చేసేదిదే కదా. కొంతమంది ఇళ్ళల్లో పిల్లల్తో ఉండి చేస్తారు, కొంతమంది విడిగా ఉండి చేస్తారు. కానీ బాటం లైను మాత్రం ఒకటే! అది enjoy చేస్తున్నారా లేదా అన్నది పరిస్థితులని బట్టుంటుంది. ఉదాహరణకి ఒంట్లో ఓపిక లేదనుకోండి, అది డ్యూటీ లాగే అనిపిస్తుంది. మరీ మనమీదే వదిలేసి కాకుండా, పిల్లలు ( ఆ చిన్న పిల్లల తల్లితంద్రులు) కూడా ఇంట్లో ఉంటే ఇంకోలా అనిపిస్తుంది. ఎందుకంటే షేర్ చేసికోడానికి ఇంకోళ్ళు కూడా ఉంటారు కాబట్టి. అందుకే అన్నాను “పరిస్థితుల బట్టి ఉంటుంది”అని.హిపోక్రిటికల్ గా ఉండకూడదు!

    కానీ వచ్చిన గొడవేమిటంటే, ఊళ్ళో వాళ్ళకనిపిస్తుంది, ఇదేమిటీ రోగమా, హాయిగా మనవలతోనూ, మనవరాళ్ళతోనూ ఉండడానికి అని. చిన్న చిన్న పిల్లలతో ఇరవైనాలుగ్గంటలూ “ఆడుకుని” చూడండి.మనం వాళ్ళతో ఆడ్డం కాదు, వాళ్ళు నానమ్మ/అమ్మమ్మలతో కబడ్డీ ఆడేసికుంటారు! తాతయ్యలు మాత్రం ” వయస్సు, ఓపికా అడ్డం పెట్టేసికుని” తప్పించేసికుంటారు( నాలాగ!). మరీ ఇరవైనాల్లుగ్గంటలూ కాకపోవడం తో ఏదో వెల్తి పడకుండా కాలక్షేపం చేసేస్తున్నాం. అక్కడికేదో మనవలూ, మనవరాళ్ళూ లతో ఆడుకోడం ఇష్తం లేదని కాదు. ఓపిగ్గూడా ఉండాలిబాబూ! మా మనవడు మాత్రం పాపం నా ‘కష్టం” అర్ధం చేసికుంటాడు లెండి.నానమ్మని మాత్రం వదలడు. అప్పుడప్పుడు మా కోడలితో అంటూంటాను– ఎప్పుడో మా ముత్తాతగారో, ఆయనకంటే ముందువారో ఎవరికో ఒకరికి ఋణ పడిఉంటామూ, ఇదిగో ఇప్పుడు పూర్తిగా వసూలు చేస్తున్నాడూ అని! వాడికి ఎదురుగుండా ఉండే గణపతి గుడినుండి పంచదార క్యూబ్బులు ప్రసాదం గా ఇస్తూంటారు, అవి తెచ్చి ఆరారగా ఇస్తూండాలి. పాపం అంతకంటె ఎక్కువ expectations లేవులెండి!

   ఆ సందర్భం లో ఎదురుగుండా ఉండే గుడికి వెళ్ళి బయటకొస్తుంటే, ఒకతను పలకరించాడు. ‘ఫణిబాబుగారూ గుర్తున్నానా ” అంటూ. నాకున్న పేద్ద shortcoming ఇదే! అదేమిటో ఎవరిని చూసినా ఎక్కడో చూసినట్లుంటుంది కానీ ఎక్కడో ఎప్పుడో మాత్రం ఛస్తే గుర్తుకు రాదు. మా ఇంటావిడ అలా కాదు, ఎవరినైనా ఒకసారి చూస్తే, మళ్ళీ వాళ్ళ గురించి మర్చిపోదు. పైగా కనిపించగానే, వాళ్ళ ప్రవరంతా చెప్పేస్తూ, నన్నుకూడా చివాట్లేస్తూంటుంది, ” ఏమిటండీ, అప్పుడే మర్చిపోయారా, ఫలానా టైములో ఫలానా చోట కలిశామూ…” అని. మరీ వాళ్ళెదురుగానే కోప్పడాలా చిత్రం కాపోతే? అక్కడికేదో నేనే మర్చిపోతానూ, తనకి మాత్రం ప్రతీదీ గుర్తుండేటట్లు. ఏమిటో వెళ్ళిపోతున్నాయి రోజులు. ప్రస్తుతానికి వస్తే, అలా పలకరించిన పెద్దమనిషి తను ఫలానా అని చెప్పగానే, అర్రే మీరు ఫలానా చోట పనిచేస్తున్నారు కదూ, మీ రింగ్ టోన్ ( సెల్లుది) చాలా బావుంటుందీ అనేశాను. మొహం అంటే గుర్తులేదు కానీ, పేరూ, ఉద్యోగం గుర్తున్నాయి. అతనుకూడా పాపం అర్ధం చేసికున్నాడు, అవునులెండి ఎప్పుడో ఒక్కసారి కలుసుకున్నామూ అని.

   ఇంతలో అతని భార్యా భుజం మీద ఓ ఆరునెలల పిల్లాడినేసికుని గుడినుంచి బయటకు వచ్చింది. ఏకవచనంలోనే సంబోధిస్తున్నాను ఏమీ అనుకోకండి, మరీ మా అబ్బాయి వయస్సువాళ్ళని ఏమండీ, మీరూ అని పిలవడానికి బాగోదు. ఆమాట కూడా చెప్పేస్తాను. వాళ్ళూ మొహమ్మాటానికి అదేమిటి మాస్టారూ మీరు వయస్సులో పెద్దవారూ, ఎలా పిలిచినా ఫరవాలేదూ వగైరా వగైరా… పాపం వాళ్ళుమాత్రం ఏం చేస్తారులెండి, నాలాటివాడి పాలబడ్డాక! అదేమిటో నాకు తటస్థపడేవాళ్ళుకూడా ఇలాటివాళ్ళే.అతను గవర్నమెంటులోనూ, ఆమె ప్రెవేట్ లోనూ ( software) లోనూ పనిచేస్తున్నారు. నేను టపాలో వ్రాసిన విషయం ప్రస్తావించగానే, ఆ అమ్మాయందీ ‘ నిజమే అంకుల్, ఆఫీసులో ప్రతీవాడినీ పెరెట్టే పిలవాలంటారూ, మరీ వయస్సులో పెద్దవారిని అలా పిలిస్తే అదోలా ఉంటుందీ” అని. మీదే ఊరమ్మా అని అడిగాను, అప్పుడు చెప్పారు, ఇద్దరూ దగ్గర చుట్టాలమే అని. అంటే మేనత్త కొడుకా, అయితే ” బావా అనే పిలుస్తావన్నమాట” అన్నాను. పైగా ఇంకో built in advantage ఓటుంది. ఎప్పుడైనా మరీ కోపం వచ్చినప్పుడు, ఒకళ్ళమీదొకళ్ళు free గా అరుచుకోవచ్చు! మరీ ఎక్కువైతే, ఇద్దరి తల్లితండ్రులూ ఎలాగూ ఉన్నారు సద్దిచెప్పడానికి! ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుని, ఓ అరగంట వాళ్ళని బోరుకొట్టేసి వదిలాను. మేముండే ఇంటికి దగ్గరలోనే ఉండేది వాళ్ళు, ఎప్పుడో వీలుచూసికుని రమ్మన్నాను. ఏదో ఫోన్లో కబుర్లు చెప్పుకుంటేనే బావుంటుందీ అని రాకపోయినా రాకపోవచ్చు !!

%d bloggers like this: