బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పేర్లతో పిలుచుకోడం….


   ఇదివరకటి రోజుల్లో ఏదో పెళ్ళిసంబరాల్లో భాగంగా, కొత్తపెళ్ళికూతురూ, పెళ్ళికొడుకులచేత, గడప దగ్గర ఒకళ్ళపేర్లొకళ్ళు చెప్పడం అదో ముచ్చట. అప్పుడు కూడా, పెళ్ళికూతురు మహ సిగ్గు పడిపోయి, చెప్పేది. ఒక్కొక్కప్పుడైతే, అతని పేరు అర్ధం వచ్చేటట్లుగా, సరదాగా ఓ పద్యమో, పొడుపుకథో చెప్పేది. అవన్నీ ఇప్పుడు పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడో, అసలా ముచ్చట అవసరమే ఉన్నట్లు లేదు. అక్కడికేదో ఒకరి పేరొకరికి తెలియదని కాదూ, పెళ్ళిలో అదో తంతు. అయినా ఈ రోజుల్లో సుముహూర్తం, వధూవరుల మధ్యలో ఓ తెరా లాటివి బొత్తిగా reduntant అనిపిస్తుంది. అందరికీ సౌకర్యంగా ఉండేటట్లు ఓ వీకెండులో ముహూర్తం, పెళ్ళికి ముందురోజో, లేక ఏ అర్ధరాత్రో ముహూర్తం అయితే, అదే రోజు సాయంత్రం రిసెప్షనూ, రాత్రి పెళ్ళీ, మరి ఈ ముచ్చట్లకన్నిటికీ టైమెక్కడిదీ? అవన్నీ చేయడానికి మనుష్యులుండాలికదా, ముహూర్తం అవగానే, ఎక్కడివాళ్ళక్కడే గప్ ఛుప్!

ఇదివరకటి రోజుల్లో, భార్యాభర్తల మధ్య వయస్సు కూడా అయిదునుండి, పది సంవత్సరాలదాకా తేడా ఉండేది. ఇప్పుడో, మరీ పెళ్ళికూతురు, పెళ్ళికొడుక్కంటే పెద్దగా ఉండకపోతే చాలు. కొండొకచో అలాటివీ చూస్తున్నాము.ఎవరిష్టం వారిది. మరీ భార్య, భర్తని పేరుపెట్టి పిలిచే అలవాటుండేది కాదు. ఎట్లీస్ట్ పబ్లిగ్గా! పడగ్గదిలో వాళ్ళు ఏం పిల్చుకుంటే మనకెందుకూ? ఏదో ” ఏమండీ..”, ” మిమ్మల్నే..” లాటివాటితో జరిగిపోయేది, అదే అలవాటు కంటిన్యూ అవుతోంది. ఏ మేనత్తకొడుకో అయితే, “బావా” అని పిలిచేవారు. మరీ అతికి వెళ్ళి ” బావగారూ ..” అంటే, భర్తగారి ఏ అన్నయ్యో పరిగెత్తుకొస్తే మళ్ళీ అదో గొడవా! అదే కాకుండా, పేర్లుకూడా మరీ పాతచింతకాయ పచ్చడిలాగ ఉండడం ఓ కారణం అయుండొచ్చు. భార్య ఏదో ముచ్చటకోసం పేరు పెట్టి పిలుద్దామన్నా మరీ ” సోమనాధం, వెంకట్రామయ్యా, రామారావూ, యాజ్ఞ్యవల్క్యం …” అంటూ పిలిస్తే మరీ అన్ రొమాంటిక్ గా ఉంటుంది!

ఇప్పుడెక్కడచూసినా స్టైలిష్, మోడరన్ పేర్లే. పిలవడానిక్కూడా ఈజీ! రమేష్, యోగేష్, లాటివి. మళ్ళీ వీటికి షార్ట్ కట్లూ రమ్మీ, యోగీ అంటూ, పేకాడదామని పిలుస్తోందో, లేక భర్తని ప్రేమగా పిలుస్తోందొ అర్ధమై చావదు వినేవాళ్ళకి. అలాగే అమ్మాయిలపేర్లు కూడా స్వీట్ గానే ఉంటున్నాయి. పెళ్ళాం ఎప్పుడూ బెల్లం ముక్కేలెండి, దానికి సాయం పేరుకూడా స్వీట్ అయితే సోనే పే సుహాగా !! మేము ఉద్యోగంలో చేరినప్పుడు, మన పై ఉద్యోగిని ( వాడు ఎంత దౌర్భాగ్యుడైనా) “సర్ ” అనే పిలవ్వల్సొచ్చేది. Ofcourse మన కిందవాడు మనల్నీ అలాగే ఎడ్రస్ చేసేవాడు ( మనం ఎంత బడుధ్ధాయిలమైనా!). అటెండెన్స్ రిజిస్టర్ లోనో, పే బిల్లు లోనో చూస్తేకానీ తెలిసేది కాదు మన పైవాడి పేరు. ఓ నేం బోర్డుండేదీ అనుకోండి. చెప్పొచ్చేదేమిటంటే, మన పైవారిని ఎవరినీ పేరుపెట్టి పిలిచే అదృష్టం ఉండేది కాదు.

ఈ రోజుల్లో అంతా Corporate Culture ధర్మమా అని ఎవరినైనా సరే పేరుపెట్టే పిలవాలిట! పైగా మిస్టరూ, మిస్సూ,మిస్సెస్సూ అనికూడా అనకూడదుట. సర్వమానవసౌభ్రాత్వుత్వం. రోజంతా ఆఫీసుల్లో పెర్లుపెట్టి పిలవడంతో ఇంట్లోనూ అదే అలవాటైపోయింది. అదేమీ తప్పనడం లేదు. కానీ ఇప్పటికీ గవర్నమెంటాఫీసుల్లో పాతలవాట్లే. వాళ్ళు పుటం వేసినా మారరు. ఎంతైనా బ్రిటిష్ లెగసీ!

ఇదివరకటి రోజుల్లో, స్కూల్లోనూ, కాలేజీల్లోనూ ఏవేవో పేర్లుపెట్టి ఏడిపించేవారు. కానీ ఇప్పుడో, ఎంత విలక్షణ పేరుంటే అంత గొప్ప! ప్రపంచం లో ఎక్కడా వినని పేర్లు ఇప్పుడు ఫాషనైపోయాయి. ఇంక కొంతమందికి అవేవో పెన్నేమ్ములో, పెన్సిల్నేమ్ములో ! శుభ్రంగా అమ్మానాన్నలు పెట్టిన పేర్లొదిలేసి ఈ తిప్పలెందుకో అర్ధం కాదు. ఆరోజుల్లో మహాభారతం లో పాండవులు మారు పేర్లెట్టుకున్నారంటే,వాళ్ళేదో అజ్ఞాతవాసం లో ఉండబట్టీ. మనకేం ఖర్మండి బాబూ? ఈవేళ అదేదో చానెల్లో “మాఊరి వంట” అని ఓ కార్యక్రమం చూశాను. జరిగిందెక్కడా అమలాపురం లో. ఆవిడెవరో అరటికాయలతోబజ్జీల్లాటివి తయారుచేస్తూ, దానికి ‘అరటి 65’అని పేరెట్టింది! అరటి 65 ఏమిటీ నా నెత్తీ? అసలర్ధం ఉందా ఆ పేరుకి? అక్కడే చిర్రెత్తుకొస్తుంది, అర్ధం పర్ధం లేని పేర్లెట్టేస్తే సరిపోతుందా? పోనీ అలా ఎందుకు పేరెట్టిందో చెప్తుందా అంటే, అదీ తెలీదుట, ఉత్తిత్తినే సరదాగాట. ఇలాటి వేలంవెర్రిలు చూస్తూంటేనే చిరాకేస్తుంది.
.

ఇంక ఈ రోజుల్లో ఇంటి పేరుతో సహా చెప్పుకోడం చాలా బాగుంది. నా ఉద్దేశ్యంలో మనకొచ్చే గౌరవం ఇంటిపేరువల్లే అని. ఏదో అదృష్టంకొద్దీ ఆ ఇంటిపేరున్న ఇంట్లో పుట్టాం, అలాటప్పుడు, పుట్టినింటి/మెట్టినింటి పేరుతో పిలిపించుకోడానికి అంత నామోషీ ఎందుకో అర్ధం అవదు. చాలామంది ఒఠ్థి ఇనీషియల్సే పెట్టుకుంటారు. ఈ దౌర్భాగ్యం మనకే అనుకుంటా, దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా పూర్తిపేరు, కొన్నిచోట్ల తండ్రి పేరుతో సహా ఉంటుంది.
गर्व सॅ कहॉ మాఇంటి పేరు ఫలానా है అని !!!!!!!

17 Responses

 1. పెద్దవారినైతే అన్నయ్యా, బావా, వదినా అనీ..చిన్న వారినైతే పేర్లతోనూ పిలుస్తాం. ఇక భార్యనో/భర్తనో పిలవాలంటే. మీ అన్నయ్యను పిలువు, మీ అబ్బాయిని పిలుస్తారా ఇలా ఈ వ్యక్తి నాకు మాత్రమే సొంతం కాదు. మీ మనిషి కూడా అన్న ఇంటర్నల్ సందేశం వినబడుతూ౦టు౦ది. ఇలా మాకు మేమే… మీకు మీరే… అన్నట్టుగా వుండదు వ్యవహారం. పేరు పెట్టి పిలవడం తప్పని కాదు నాకెందుకో అలా అనిపిస్తుంది.
  ప్రపంచంలోని ఒకే ఒక్క పేరు పలకలేకపోవడంలోని మొహమాటం (లోని మాధుర్యం) పేరు పెట్టి పిలవడంలో లేదనిపిస్తు౦ది.

  Like

 2. > అవేవో పెన్నేమ్ములో, పెన్సిల్నేమ్ములో
  ఇప్పుడు మీరు నన్ను టిట్టారా? పొగిడారా?

  Like

 3. ఊ ఊ హే ఆ ఆ ఫణి! అలా అంటావేమిటి? 🙂

  Like

 4. నాదీ ‘పానీపూరీ’ గారి మాటే! కలం పేరున్న వారిని కలంతోనే పొడవటం అన్యాయం అని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా…!

  Like

 5. పెళ్ళి తంతు గురించి మీరలా చెబుతుంటే ఆ ముచ్చట్లేవి మా తరానికి తెలీకుండా పోతున్నందుకు బాధగా ఉంది. అఫ్‌కోర్స్ పెళ్లి అంటేనే బాధ అనుకోండి అది వేరే విషయం 🙂

  Like

 6. హ హ హ. భలే.
  తెలుగువాళ్ళకి హలంతపు (సో కాల్డ్ మాడ్రన్) పేర్లమీద మోజుని శ్రీపాద వారు శుభికే శిర ఆరోహ అనే కథలో కడిగి ఎండేశారు.

  Like

 7. హహహ చాలా బాగా ఉతికారేసారండీ! ఇక్కడ మా ప్రొఫెసరు పేరు పెట్టి పిలువమ్మా అంటారు నాకేమో మనసొప్పదు! నా కన్నా 36 ఏళ్ల పెద్దాయనని పట్టుకుని అలా పిలవలేం కదండీ! ఎవరేమనుకున్నా నేను మాత్రం సార్ అనే పిలుస్తాను!
  ఇప్పుడెక్కడచూసినా స్టైలిష్, మోడరన్ పేర్లే.
  ఇది మాత్రం నాకు వర్తించదు కదా! నాది పాత పేరే బాబు! నాకు సంబంధం లేదు.

  Like

 8. బాగా చెప్పేరు. ఉన్నపేరు చెప్పుకోడానికి సిగ్గెందుకు.
  భార్యని ముద్దుపేరుతో పిలుచుకోడంలో అందం ఆనందం ఇప్పటివాళ్ళకి అర్ధం అవుతుందా? నేటి కల్చరుని తప్పుపట్టను కాని వారు ఆనందం కోల్పోతున్నందుకు బాధగా ఉంది. మనదైన సంస్కృతిని వదిలేస్తే బాధ కదా!

  Like

 9. శర్మ గారూ_______ఉన్న పేరు చెప్పుకోడానికి సిగ్గెందుకు?________బాహా అడిగేరు సుమండీ! చాలా ఉన్న పేరు చెప్పుకోరు. (పెన్ నేములకు నా అభ్యంతరమేమీ లేదు)! అదేదో సినిమాలో ఎమ్మెస్ నారాయణ చెప్పినట్టు జ్యోతి లక్ష్మి డాన్స్ లాగా కనిపించీ కనిపించనట్టుగా, స్ఫురించిఈ స్ఫురించనట్టు, తెలిసీ తెలియనట్టు పేర్లు వాడుతుంటారు. పూర్తి పేరు చెప్పుకోరు. అలాగని నిష్కామ కరంగా ఉండరు. అంతా మెచ్చుకోవాలి,ఆకాశానికెత్తాలి! తనెవరో మాత్రం లోకానికి పూర్తిగా తెలీకూడదు. ఇంతా చేసి రాతల్లో పస ఏమైనా ఉంటుందా అంటే అలాటి ఏడుపేదీ ఉండదు.

  పేపర్లోంచి కరెంట్ అఫైర్స్ పట్టుకొచ్చి విస్తరించి రాసేస్తుంటారు. లేదా కళ పేరుతోనో సాహితీ సేవతోనో నాలుగు పోసుకోలు కబుర్లు(అవీ అందరికీ తెల్సినవే)

  ఏవిటో,వెర్రి వెయ్యి విధాలనీ!

  Like

 10. మరోసారి చదివాను. చివరలో “ఏదో అదృష్టంకొద్దీ ఆఇంటిపేరున్న ఇంటిలో పుట్టాము, అలాటపుడు,పుట్టినింటి/మెట్టినింటి పేరుతో పిలిపించుకోడానికి అంత నామోషీఎందుకో అర్ధంఅవదు” ఇది ఎవరిమీద విసురు మాస్టారూ? కర్ంటు పోతుందనే తొందరలో మీ విసురు చూడలేక పోయాం. హన్నా ! మీ విసురు కనిపెట్టలేమనుకున్నారా? మా చెల్లాయికి చెప్పేస్తాను.

  మూర్తిగారూ నిజంగా ఉన్నపేరు పకీరయ్య అనుకోండి ఏమనిచెప్పుకుంటారు ? పకీరయ్య అనేచెప్పుకోవాలిగాని ఫణీంద్ర అనిచెప్పుకుంటే కుదరదు కదా. ఉన్నపేరు చెప్పుకోడానికి సిగ్గెందుకూ!

  Like

 11. శర్మ గారూ ఇంతకీ ఫణి బాబు గారు పేరు మార్చుకున్నారని అనటం లేదు కదా ?

  తెలుగు, సంస్కృతి, నాగరికత అంటూ ఉపన్యాసాలు ఇచ్చేవాళ్లు కూడా తెలుగు పేర్లు ఎవరూ పెట్టడం, పెట్టుకోవడం లేదు. తెలుగు తనం లేని పేర్ల వాళ్ళు ఎవరెలా పిలుచుకుంటే ఏమి పోయింది ట.

  Like

 12. హహహ “అరటి 65″….అంటే ఆ అరటికాయ 65 రోజులకు ముందు మొగ్గేసిందేమోనండీ…హిహిహిహిహి

  Like

 13. బులుసువారికి
  అయ్యా! పేరు మార్చుకున్నది నేనుగాని ఫణిబాబుగారు కాదండి.
  ప్రవర చెప్పుకుంటాను
  ౧.జనక ప్రవర
  భార్గవ, చ్యవన, ఆప్నవాన, ఔరవ, జామదగ్ని పంచా ఋషీయప్రవరాన్విత శ్రీవత్ససగోత్రస్య భాస్కరశర్మ నామ ధేయస్య అహంభో అభివాదయేత్.మా ఇంటి పేరు చిర్రావూరి
  నా తల్లి గారి పుట్టింటివారు ముసునూరి
  ౨దత్తత ప్రవర
  .ఆత్రేయ, ఆర్చనానస, శ్యావాస్య త్రయాఋషీయ ప్రవరాన్విత ఆత్రేయసగోత్రస్య వేంకటదీక్షిత శర్మ అహంభో అభివాదయేత్.
  మా ఇంటి పేరు మాచనవఝుల. నా దత్తత తల్లిగారి పుట్టింటివారు బులుసువారు.
  ఇప్పుడు చెప్పండి నేను నిజంగా ఫణిబాబుగారిని పేరు మార్చుకున్నారని ఆన్నానా ? నిజంగా నా పేర్లు విష్ణు, లలితా సహస్రనామాల్లోవే.
  నా పేర్లలో ఊష్, హాష్ లేవండి. నిజం. నేను అసలు సిసలు ప.గో.జి.లోపుట్టి.తూ.గో.జిలో పెరిగినవాణ్ణి.తూ.గో.జిలోవున్నవాణ్ణి.

  Like

 14. శర్మ గారూ,

  ప్రవర చెప్పుకుందామంటే ఋషులు గుర్తు లేరు. అందుకని ధైర్యం చేయను. మీరు ఇంతలా తల అంటిన తరువాత ఇంకేమి చెప్పగలను.

  >>>> ఇప్పుడు చెప్పండి నేను నిజంగా ఫణిబాబుగారిని పేరు మార్చుకున్నారని ఆన్నానా ?

  మీరు అనలేదు. మీరు అనలేదు. మీరు అనలేదు.

  ముమ్మారు నొక్కి మరీ వక్కాణించాను.

  Nice meeting you.

  Like

 15. హ హ హ మన తెలుగు గ్యాంగ్ లో కూడా పేర్లకి ఇంత సీన్ ఉందా? నేను మెట్టిన అరవ ఇంట్లోనే అనుకున్నా. నా పుట్టింట్లో ఎవరికీ పిల్లలు పుడ్తే వాళ్ళే డిసైడ్ అయిపోతారు పేరేంటో. మా అమ్మ పుట్టింట్లో అక్కడక్కడా పేర్ల యుద్ధాలు చూసా నేను (ఎ మాట కా మాటే చెప్పాలి, అత్తగార్లె సాధించారు మనవరాళ్ళకి వాళ్ళ పేర్లు పెట్టమని). ఇంక మా అత్తగారింట్లో రూల్. పెద్ద కొడుకుకి ఇటు తాతగారి పేరు, చిన్న మనవడికి అటు తాతగారి పేరు, పెద్ద మనవరాలికి నాయనమ్మ పేరు, చిన్న మనవరాలికి అమ్మమ్మ పేరు. మళ్లి మిడిల్ నేమ్ దేవుడి పేర్లు (లేదా రేర్ కేసుల్లో అమ్మ, నాన్న కిష్టమయిన పేర్లు). ఉన్న పేర్లే మళ్లి మళ్లి రిపీట్ అవ్వటం. ఇప్పుడు మా అతగారు మా ఆయన్ని తిట్టలనుకోండి. చాలా జాగర్తగా ఉండాలి. ఎందుకంటే పేరుతో తిడితే ఆవిడ మావగార్నే కాదు చాల మంది పూర్వికుల్ని తిట్టినట్టే. అందుకని ఇంట్లో ముద్దు పేరు. ముద్దు పేరుకి అసలు పేరుకి సంబంధం ఉండదు. అసలూ……… ఉండండి దీని గురించి ఓ పోస్ట్ వేసేస్తాను.

  Like

 16. పెద్దలందరికి నమస్కారాలు చిన్నలందరికీ దీవెనలు. మనపేర్లు మన సంస్కృతికి చిహ్నాలు. పెద్దలు పెట్టిన పేర్లలో అర్ధం పరమార్ధం ఉంది. దైవాన్ని తలచు కోవడానికి ఇది ఒక మార్గంగా పెద్దలు తలచారు. అందుకే పెద్దలపేర్లు పిల్లలికి పెట్టి వాళ్ళని పిలిచే నెపంతో దేవుని స్మరించేవారు. ఇంకోక విశేషం కొన్ని పేర్లలో బీజాక్షరాలు ఉండి నిత్యమననానికి దారి చూపేవి. మిమ్మల్ని అందరిని కలిసే భాగ్యం కల్గ చేసిన ఫణిబాబుగారికి కృతఙతలు.బాబుగారి బ్లాగుని యధేచ్చగా రచ్చబండ చేసాను.మన్నించగలరు. దేవునికి వందనములు. వ్రాయడంలో తప్పులన్ని నావే.

  Like

 17. @జ్యోతిర్మయీ,

  ఏమో నాకూ తెలియదు, దేనిలో మాధుర్యం ఉందో? మా ఇంటావిడా, నేనూ ఒకళ్ళనొకళ్ళు పేర్లతో పిలుచుకోము !!

  @పానీపూరీ,

  ” ఈ టపాలోని విషయాలు ఎవరినీ ఉద్దేశించి వ్రాసినవి కావూ…” అని ఓ disclaimer పెడితే బావుండేదనుకుంటా !!

  @మాధురీ,
  నాకు మీలా స్మైలీలు పెట్టడం రాదు!

  @అచంత,

  మీకూ ఆయనకిచ్చిన సమాధానమే !!!!

  @నాగార్జునా,

  మరీ పెళ్ళంటే బాధంటే ఎలా?

  @కొత్తపాళీ గారూ,

  ఆ కథ ఏ పుస్తకంలో ఉంది ?

  @రసజ్ఞ,

  నీ పేరు పాత పేరంటే మేమందరం ఎక్కడకి వెళ్ళం తల్లీ ?

  @శర్మ గారూ,
  ఏమో ఇప్పటివాళ్ళకి ఎవరి పేర్లతో వాళ్ళు పిలుచుకోడం లోనే ఉందేమో ఆనందం.
  @మూర్తి గారూ,
  పెన్ నేమ్ముల గురించి ప్రస్తావించానని పైన అప్పుడే నన్ను ఇద్దరు కోప్పడేశారు !!
  @సౌమ్యా,
  ఆ పేరు చూసి తిన్నదరక్క పెట్టిన పేరులా అనిపించింది !!
  @కిరణ్మయీ,

  ఆ టపా ఏదో త్వరగా వేసేసి పుణ్యం కట్టుకోండి !!

  @సుబ్రహ్మణ్యం గారూ,
  ఎవరూ ఎవరినీ ఏమీ అనలేదండి బాబూ!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: