బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏం చేస్తారు, భరించాలి.. తప్పదు మరి….

   ఏమిటో గత నాలుగు రోజులనుండి, టపా వ్రాయడానికి మూడ్డే రావడం లేదు. ఏదైనా ఎక్కువ అయితే అలాగే ఉంటుందేమో? ఇంకా రెండున్నరేళ్ళు పూర్తవలేదు, మరీ 675 టపాలు కొంచం ఎక్కువైపోలేదూ? ఏదో అభిమానం కొద్దీ చదువుతున్నారు కదా అని, మిమ్మల్నందరినీ ప్రతీ రోజూ బోరుకొట్టేయడం భావ్యం కాదని, నోరుమూసుక్కూర్చున్నాను. కానీ ఈ వ్యసనం లోంచి బయటపడ్డం అంత సులభం కాదని తెలిసింది. ఇదిగో మళ్ళీ ప్రారంభం! ఏదైనా సరే “అతి” అయితే, చిరాకేసికొస్తుంది.ఒక్కొక్కప్పుడు, అది నెగెటివ్ గా కూడా రూపాంతరం చెందొచ్చు, కదూ?

   ఉదాహరణకి మన టి.వి.చానెల్స్ లో వచ్చే యాడ్ల సంగతి తీసికోండి. చానెళ్ళవాళ్ళకి వచ్చే ఆదాయం అంతా, ఈ యాడ్లవల్లే అంటారు మీరు. నిజమే కాదనం. కానీ మరీ ఇంతలా బోరు కొట్టేయాలా? పైగా ఒకే యాడ్డు, వాళ్ళు వేసే పధ్ధతి చూస్తే, మళ్ళీ జీవితం లో ఏ యాడ్డు వేశారో ఆ సరుకు ఛస్తే కొనకూడదని నిశ్చయించేసికుంటాము.One is put off after watchng the same ad so many times. ఆవిషయం ఆ కంపెనీల మార్కెటింగు వాళ్ళకి తెలియడం లేదా? లేక తెలిసినా, కంపెనీ యాజమాన్యం వారు ఏదో యాడ్ బడ్జెట్ ఎలాట్ చేశారూ, దాన్ని ఖర్చుపెట్టడమే మన ధ్యేయమూ అనుకుంటున్నారా? ఏది ఎమైనా, మనకి చిత్రహింస మాత్రం తప్పడం లేదు.

   ఏ కార్యక్రమం తీసికోండి, ఓ సీరియల్లవచ్చు, ఓ సినిమా కావొచ్చు, చివరకి ప్రతీ రోజూ ఉదయం వచ్చే ప్రవచనాల్ని కూడా వీళ్ళు వదలడం లేదు. న్యూస్సుల్లో కూడా ఇవే. అందుకే, కార్యక్రమం మధ్యలో, ఈ యాడ్లగోల భరించలెక, హాయిగా మ్యూట్ చేసేసికుంటే ఉన్నంత సుఖం ఇంకోటి లేదు. అరగంట సేపు వచ్చే తెలుగు సీరియల్ ని నెట్ లో చూడండి, అంతా చేసి అయిదు నిముషాలుంటుంది. ఆ అయిదునిమిషాలకోసమూ మనం అరగంట టైము వేస్టు చేయాలి! అలాగే హిందీ సీరియల్సు వ్యవహారమూనూ. సినిమా విషయం అడక్కండి.

   ఆ మధ్యన Tata Crucible Quiz కి వెళ్ళినప్పుడు, ఓ గంట సేపు ఎలిమినేషన్ల రౌండు ముందర కూర్చోవలసి వచ్చింది. ఆ గంటలోనూ, Tata Nano గురించి యాడ్ వేసిందే, వేసి హోరెత్తించేశారు! పైగా పేద్ద సౌండోటీ. అంతసేపు ఆ చిత్రహింస భరించేటప్పటికి, మళ్ళీ Tata Nano మొహం చూడకూడదనిపించింది. అంత వెగటూ, అసహ్యం కలిగింది. మరి ఇలాటి Ad campaign లని ఏమంటారో తెలియదు. మన చానెళ్ళలో యాడ్లేసే వస్తువులని మార్క్ చేసికుని, జీవితంలో ఆ వస్తువు కొనకూడదూ అని నిశ్చయించేసికున్నాను. ఓ పాతిక దాకా తేలాయి. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ధర్మమా అని, చాలా భాగం సుఖపడ్డట్ట్లే! పైగా ఒక్కో యాడ్డూ, టోకున ప్రతీ చానెల్వాళ్ళకీ ఇస్తారనుకుంటా. ఒకచోట వదిలిందనుకుంటే, ఇంకో చానెల్ లో ప్రత్యక్షం. ఏ చానెల్ కా భాషోటీ పైగా.

   ఇవి కాకుండా, మన చానెళ్ళలో వచ్చే సంగీత పోటీలు– ఏదో మొహమ్మాటానికి, ఎస్.పి.బాలు , ‘పాడుతా తీయగా’ మొదలెట్టినప్పుడు, ఎలిజిబిలిటీ క్రైటీరియా లో, ” ఇప్పటివరకూ ఏ పోటీలోనూ పాల్గొనని పిల్లలే ఈ పోటీకి అర్హులూ” అన్నారు. అమ్మయ్య కొద్దిగా వెరైటీ గా ఉంటుందీ, అనుకున్నంత సేపు పట్టలేదు, గత మూడేళ్ళనుండీ, ఏ కార్యక్రమం( సంగీత) చూసినా, అదే పిల్లలు, అదే వ్యాఖ్యలు, చివరాఖరికి అదే ఆడియెన్సూనూ! పిల్లల సంగీత కార్యక్రమాలు బావుండడం లేదనడం లేదు, ఆంధ్రదేశం లో ఇంక పిల్లలే లేరా? ఉన్నా రానీయరా? పాటలూ మహ అయితే ఓ యాభై ఉంటాయి. వాటినే వినాలి. ఇంక జడ్జీల సంగతి, ఎక్కడ చూసినా వీళ్ళ మొహాలే.

   ఇదివరకటి రోజుల్లో సినిమాల్లో especially black & white era యుధ్ధాల సీన్లూ, గాలివాన వరద భీభత్సం సీన్లూ, ఏరో ప్లేన్ నుంచి బాంబులు వేసే సీన్లూ, బయటి సినిమాల్లోంచో, డాక్యుమెంటరీల్లోంచో stock scenes ఉండేవి, వాటినే copy, paste చేసేసేవారు. వీణ్ణెక్కడో చూసినట్లుందే అనిపించేది! ఈ రోజుల్లో తాజకీయనాయకులు చేసే, ఊరేగింపులూ, ధర్నాలూ చూస్తూనే ఉంటారు, ఏ ఊరేగింపు చూసినా అవే మొహాలు! ఇదో వ్యాపారం అనుకుంటా. ఏ పార్టీ వాడు డబ్బులిస్తే వాడి జెండా పట్టుకుని, అరవడం పోలీసుల చేతిలో నాలుగు లాఠీదెబ్బలు తినడం!

   ఇంత జరుగుతున్నా, మనం టి.వి. సీరియళ్ళు చూడ్డం మానలేమూ, రాజకీయనాయకుల ఊరేగింపులూ ధర్నాలూ ఆగవూ, యాడ్లవాళ్ళు మనల్నిbombard చేయడమూ మానరూ, నేను బ్లాగులు రాయడమూ మాననూ! వాళ్ళనెలా భరిస్తున్నారో నన్నూ అలాగే భరించండి !!!

%d bloggers like this: