బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టీ.వీ ల్లోనూ కొన్ని మంచి కార్యక్రమాలు !!


    నేను ప్రతీ రోజూ తప్పకుండా చూసే ఒకే ఒక్క సీరియల్ జీ హిందీ చానెల్ లో రాత్రి 8.00 గంటలకు ప్రసారమయ్యే “ఝాన్సీ కీ రాణి”.చాలా బాగుంటోంది.ఆ మధ్యన జీ తెలుగు లో ఈ సీరియల్ తెలుగు వెర్షన్ ప్రారంభించారు. కానీ దీనిలో హిందీ లో ఉన్న గాంభీర్యం లేదు.పైగా ఒకసారి హిందీ వెర్షన్ చూసేక, తెలుగులో చాలా ఫీకా ఫీకా గా ఉంటోంది.అందువలన దాని జోలికే పోవడం లేదు.

    మిగిలిన సీరియల్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఇదివరకంతా ఏక్తా కపూర్ ధర్మమా అని, భారతీయ కుటుంబ వ్యవస్థ అంతా అకలా వికలం అయిపోయింది.సాస్ సీరియల్స్ మొత్తానికి పూర్తి అయ్యాయి అనుకుంటూంటే, ఇప్పుడు ఏ సీరియల్ (హిందీ, తెలుగు) చూసినా అంతా గందరగోళంగా ఉంటోంది.హాయిగా ఏదో ఒక సంగీతం ప్రోగ్రాం చూద్దామనుకుంటే,
వాటిలో పార్టిసిపెంట్లూ, వాళ్ళ తల్లితండ్రులూ ‘అభినయించే’ ఇమోషనల్ ఏడుపులూ, రాగాలూ చూళ్ళేకపోతున్నాము.

    సోమవారం రాత్రి 9.30 కి ఈ టీ.వీ లో వచ్చే ‘పాడుతా తీయగా’ ఒక్కటీ వీటన్నిటికీ భిన్నంగా ఉంటోంది.ఆయన ఎటువంటి వెర్రి వెర్రి వేషాలూ వేయకుండా, పిల్లలు పాడిన ప్రతీ పాట తరువాతా, ఆ పాటకు సంబంధించిన విశేషాలు చెప్పడం బాగుంటోంది. ప్రతీ రోజూ రాత్రి ఈ.టి.వీ లో ఒక పాత సినిమా వేస్తున్నారు. పోనీ వాటిని చూసి ఆనందిద్దామంటే, ఓ ప్రతీ పావుగంటకీ బ్రేక్ లు. యాడ్లు ఉండకూడదని ఎవరూ అనరు, కానీ మరీ అన్నిసార్లా? ఇంతకంటె, ‘మోసే బేయర్’ వాళ్ళు రిలీజ్ చేసిన సీ.డీ లు కొనుక్కుని, అలనాటి చలన చిత్రాలు చూడ్డం హాయి.

    క్రికెట్టు తో మొత్తం క్రిందటి నెలంతా బోరు కొట్టేశారు.చాలా మట్టుకు మాచ్చిలు ‘ఫిక్స్’ అయినవే అయినా, ప్రేక్షకులు మాత్రం చూస్తూనే ఉన్నారు.అదృష్టం కొద్దీ, నేను ఒక్క ఫైనల్ తప్ప ఏ మాచ్చీ చూడలేదు!అంతకంటె, అర్ధ రాత్రి వచ్చినా సరే,’ఛాంపియన్స్ లీగ్’ ఫుట్ బాల్, లేక ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ మాచ్చిలు చూసి ఆనందించాను.

    సోనీ హిందీ చానెల్ లో ‘సి.ఐ.డి’ అనే సీరియల్ కొన్ని సంవత్సరాలనుండీ ( అంటె కేబుల్ చానెల్స్ ప్రారంభం అయినప్పటినుండీ) వస్తోంది, దానిలో నటులు ముందునుండీ ఒకరిద్దరు తప్ప మారలేదు,చాలా బాగుంటుంది.

    ఇంక తెలుగు న్యూస్ చానెల్స్ లో ‘ సాక్షి’ అంతా ఎప్పుడు వీలుంటే అప్పుడు రోశయ్య గారిని తక్కువ చేసి, జగన్ ని పొగడడంతోటే సరిపోతూంది! మొన్న అనుకుంటా, టి.వి-5 లో ‘రోడ్ల మీద ప్రమాదాలు’ అని ఒక కార్యక్రమం చూశాను. అప్పుడు తెలిసిందేమిటంటే, నా పుట్టిన రాష్ట్రం రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానం లో ఉందిట. నేను మెట్టిన రాష్ట్రం మహారాష్ట్ర రెండో స్థానం ట !

    ఎన్.డి.టి.వి ఇండియా( హిందీ) లో ప్రతీ రోజూ రాత్రి 9.30 కి ఒక అరగంట పాటు ఓ మంచి న్యూస్ కార్యక్రమం వస్తుంది. వీలుంటే తప్పకుండా చూడండి శ్రీ వినోద్ దువా చేసేది.ఆయన హిందీ, ఇంగ్లీషూ ఉచ్చారణ ఎంత బాగుంటుందో ఒకసారి చూడాల్సిందే. ఒక్కొక్క విషయాన్ని తీసికొని, దానిమీద విశ్లేషణ, ఏ రాజకీయ పార్టీనీ సపోర్ట్ చేయరు. కార్యక్రమం చివరలో ఓ హిందీ పాట ( పాత సినిమాలోది).

6 Responses

  1. ఈ మధ్య కాలంలో అందరూ దూరదర్శన్ ని చూడడం మానేసి నట్లున్నారు. నేను కేబుల్ కనెక్షన్ తీయించి 3 సం.లు అవుతోంది. కావలసిన సినిమాలన్నీ తెచ్చి అమ్మకు చూపెడుతుంటాను. ఇక కేబుల్ తో నాకు పెద్ద ఉపయోగం కనిపించలేదు.

    సప్తగిరిలో వచ్చే మువ్వల సవ్వడి చాలా బాగుంటుంది. భారతీయ నాట్యం చేయడానికి అనేక రాష్ట్రాల నుండి కూడా వచ్చి ప్రదర్శనలిస్తున్నారు కళాకారులు. ఉదయం 8 గం.లకు వచ్చే సంజీవనిలో ఎన్నో ఆయుర్వేద చిట్కాలు చెప్తున్నారు. అప్పుడప్పుడు వచ్చే హిందీ డాక్యుమెంటరీ ఫిలింమ్స్ చాలా ఆసక్తిగా ఉంటాయి.

    Like

  2. వినోద్ దువా, ప్రణయ్ రాయ్..వీళ్ళంతా నా చిన్నప్పుడు దూరదర్శన్ ని ఏలుతుండే వారు లక్ష్మి గారూ!

    పాడుతా తీయగా లో ఒకపాప ఏడిస్తే బాలూ స్పష్టంగా చెప్పాడు.”బాల సుబ్రహ్మణ్యం నిర్వహించే కార్యక్రమాల్లో ఇలాంటివి ఉండటానికి వీల్లేదు”అని! ఆయన అలా చెప్పడం నాకు చాలా నచ్చింది. ఎప్పటి క్వాలిటీతోనే చక్కగా ఉంటోంది ఈ ప్రోగ్రాం!

    అసలు సాక్షి అనే ఛానెల్ ఒకటుందని ఎప్పుడో మర్చిపోయాం!

    ఇదివరకంతా ఏక్తా కపూర్ ధర్మమా అని, భారతీయ కుటుంబ వ్యవస్థ అంతా అకలా వికలం అయిపోయింది….బాగా చెప్పారు. ఇంట్లో అంతంత మేకప్పులు నార్త్ వాళ్ళైతే మాత్రం ధరిస్తారా అని నాకో డౌట్ వస్తుండేది.

    విజయ్ శర్మ గారూ,
    దూరదర్శన్ నేను చూస్తానండీ! మువ్వల సవ్వడి చాలా చాలా బావుంటున్నది.అంతే కాదు రాత్రి పదిన్నరకు ధర్మ వరపు సుబ్రహ్మణ్యం “ఆనందోబ్రహ్మ” వేశారు మొన్నటివరకూ!

    గానగంధర్వం కూడా చాలా బావుంటోంది.

    Like

  3. తెలుగు టీవీల్లో సినిమాలు కాక నేను చూసే ఒకే ఒక కార్యక్రమం పాడుతా తీయగా.
    హుందాగా నడుపుతున్నందుకు బాలు గారిని అభినందించాలి.

    Like

  4. శ్రీ శర్మా,

    దురదృష్టంకొద్దీ, డి.టి.ఎచ్ వాళ్ళు సప్తగిరి చానెల్ ఇవ్వడం లేదు. రాజమండ్రీ లో ఉన్నప్పుడు చూసేవాడిని. మీరు చెప్పిన కార్యక్రమాలు చూసేవాడిని.

    Like

  5. సుజాతా,

    ఈ వేళ కసాబ్ ఉరిశిక్ష మీద వినోద్ దువా వ్యాఖ్య అద్బుతం. కసాబ్ కేసు ‘ఓపెన్ ఎండ్ షట్ కేసు, వాడిని ఎప్పుడైతే పట్టుకున్నారో అప్పుడే తెలుసు అందరికీ, వాడికి ఉరి శిక్ష పడుతుందని, దీనిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, తను ఏదో సాధించేసినట్లు చంకలెగరేసుకోవడం ఎందుకో తెలియదు!!!”

    Like

  6. బోనగిరీ,
    నేనూ అంతే. అప్పుడప్పుడు మన రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలిసికోవడానికి తెలుగు న్యూస్ చానెల్స్ చూస్తూంటాను.

    Like

Leave a comment