బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Pest control….


   మా చిన్నప్పుడు ఇళ్ళల్లో పుస్తకాలున్న చోట “చెద” అని ఒకటి పట్టేది. ఏవర్షాలకైనా తేమ ఎక్కువైతే,ముందుగా ఈ చెదపురుగులు పుస్తకాల్ని ఎటాక్ చేసేవి. పైగా తెలిసేది కాదుకూడానూ. ఏదో వెదకడానికి ఏ పుస్తకాల ర్యాక్కు దగ్గరో చూసేటప్పటికి తెలిసేది- అడుగు అర అంతా చెదపట్టేసిందని. అదేం ఖర్మమో కానీ, చదువుకునే క్లాసు పుస్తకాలకి పట్టేది కాదు! కనీసం ఆ కారణం చేతైనా క్లాసుపుస్తకాలు రోజూ బట్టీపట్టే గొడవొదిలేది. అబ్బే మనకంత అదృష్టం కూడానా? అలా చెద పట్టిన పాతపుస్తకాలూ, న్యూసుపేపర్లూ ఎండలో పడేసి, salvage చేయకలిగినవేవో చేసేసి, ఎక్కదైతే చెదపట్టేదో, అక్కడంతా, కిరసనాయిలు గుడ్డలో ముంచి, ఆ గుడ్డతో శుభ్రపరిచేసి తిరిగి పుస్తకాలూ, ఏమైనా మిగిలితే ఆ పేపర్లూ మళ్ళీ అక్కడ “బొత్తి” గా పెట్టేయడం. ఆరోజుల్లో చాలాభాగం పెంకుటిళ్ళే కాబట్టి, భూమిలోని తేమ కూడా తోడై, ఏ గోడమూలలోంచో మొదలై గోడమీదుగా ఇల్లంతా పాకేసేవి ఈ చెదపురుగులుకూడా. ఆరోజుల్లో “చెద” పట్టని మధ్యతరగతి ఇల్లుండేదనుకోను. పెద్దపెద్దవాళ్ళ సంగతి వేరనుకోండి. ఏదో ఆ కిరసనాయిలు గుడ్డతో తుడిచేస్తే మిగిలిన పురుగులు- బొద్దింకలూ, నల్లులూ వగైరాలుకూడా, ఎవరిదారిన అవి పడుండేవి. ఆరోజుల్లో మరీ తెలివిమీరలేదు అవికూడా, ఏదో చెప్పిన మాట వినేవి !

నగరజీవితాలకి వచ్చేటప్పటికి ఆ చెదపురుగులు కూడా urbanization కి తట్టుకోలేక, మనవైపే ఉండిపోయాయి! తణుకులో 1989 లో ఇల్లు కట్టుకున్నప్పుడు బాగానే ఉండేది టీచర్స్ కాలనీలో, కాలక్రమేణా అక్కడ నేలలోమహాత్మ్యం ఏమిటో కానీ, ఏడాది తిరిగేసరికల్లా, తలుపులూ, ద్వారబంధాలూ చెదపట్టేసి, డొల్లల్లా తయారైపోయేవి. ఏడాది పొడుగునా వచ్చిన అద్దె డబ్బులు కాస్తా ఈ చెదల Treatment కే సరిపోయేది. ఈమాత్రందానికి అక్కడ ఇల్లెందుకూ అనేసికుని అమ్మిపారేశాము.కారణాలు ఇంకొన్ని ఉన్నా, ఇదో వంక పెట్టాము!

తరవాత్తర్వాత నగరాలకొచ్చేటప్పటికి చెదల మాటెలా ఉన్నా బొద్దింకల గొడవ ఎక్కువైపోయింది.పైగా వాటిని సరైన సమయంలో అంటే చిన్నగా ఉన్నప్పుడే control చేయకపోతే, అవిపెరిగి పెద్దయి గరుడ పక్షుల్లా ఎగురుతాయికూడానూ.ఎవరైనా ఇంటికొచ్చేసరికి, ఇవి బయటకి వచ్చేసి, మన “పరువు” వీధినపెట్టేసేవి.అదేదో “ఫ్లిట్” అనేదుండేది. ఓ డబ్బా, దానికో పంపూ, ఆ డబ్బాలో కిరసనాయిలూ, బొద్దింకలమందూ కలిపి ఇల్లంతా ఆ పంపుతో కొట్టుకోడం. మనం ఇంటిని శుభ్రంగా ఉంచితే సరిపోదు, ఇంకో ఎపార్టుమెంటులో వాళ్ళు, ఏ క్లీనింగైనా చేస్తే, అక్కడుండే బొద్దింకలన్నీ మనింట్లోకి వచ్చేసేవి. ఇదో గొడవా!అదేదో మార్కెట్ లోకి “లక్ష్మణ రేఖ” లో ఏవో వచ్చేవి. రాత్రి పడుక్కునేముందు దానితో ముగ్గులు పెట్టేస్తే, ప్రొద్దుటికి ఎక్కడలేని బొద్దింకలూ చచ్చిపడుండేవి, కొన్నైతే గిలగిలా కొట్టుకుంటూ ఉండేవి. ఇంటిముందు ముగ్గు వేసినా వేయకపోయినా “లక్ష్మణరేఖ” ముగ్గులు మాత్రం తప్పేవి కావు ! ఆ స్టిక్ ఖరీదుకూడా, మరీ ఎక్కువ కాకుండా, ఏదో మనకొచ్చే జీతంలో కొనగలిగేదిగానే ఉండేది. వీడికొచ్చే జీతానికి, అంతకంటే ఎక్కువ ఖర్చుపెడతాడూ, అనేసికుని ఆ బొద్దింకలు కూడా మనతో సహకరించి ప్రాణత్యాగం చేసేవి.

మొన్నమొన్నటి వరకూ ఇంకోచోట ఉండేవాళ్ళం కదూ, అక్కడ ఈ “లక్ష్మణరేఖ” లతో పని కానిచ్చేసేవాళ్ళం. రోజులన్నీ ఒకలా ఉండవుగా, ఇప్పుడుంటున్న ఏరియా కొద్దిగా posh అని చెప్పానుకదూ, ఎక్కడ చూసినా ఐటీ వాళ్ళే. వాళ్ళకి తగ్గట్టే ప్రతీదీ ఖరీదే– కూరలు ఖరీదు, బట్టల ఇస్త్రీ ఖరీదు, అన్నీ ఖరీదే. ఇంక బొద్దింకలు మాత్రం తక్కువ తిన్నాయా, అవికూడా “లక్ష్మణరేఖ”, ముగ్గు లకి లొంగడం మానేశాయి.అప్పటికీ మా ఇంటావిడ, క్రమం తప్పకుండగా ప్రతీరోజూ కిచెన్ ప్లాట్ఫారమంతా ముగ్గులు గీసేసేది. పైగా వాటికో డిజైనోటీ.. బొద్దింకలు ఈవిడమాటవినడం మానేసి, యథారాజ్యంగా తిరగడం మొదలెట్టేశాయి.పోనీ మా ఇంటావిడేమైనా ఇల్లు శుభ్రంగా ఉంచదనడానికీ లేదు. రోజంతా ఫినాయిలు గుడ్డా, చీపురూ తోనే ఉంటుంది. తుడిచిందే తుడవడం. అయినా ఈ బొద్దింకలుమాత్రం వదలవు.

ఇంక ఇలా కాదని వాడెవడో pest control వాడికి ఫోనుచేస్తే, మొత్తానికి వాడొచ్చి ఈవేళ అదేదో herbal దిట, ఆ పేస్టు ఇంట్లో చాలాచోట్ల కార్నర్స్ లో అద్దేశాడు.అదేమిట్రా, ఫలానా చోట పెట్టలేదూ అని అడిగితే, మీరేమీ వర్రీ అవకండీ, బొద్దింకలన్నీ ఓ వారంరోజుల్లో వాహ్యాళికి ఈ మందుపెట్టిన చోటుకి వచ్చి చచ్చూరుకుంటాయీ,మళ్ళీ ఆరునెలలదాకా ఫరవాలేదూ అని ఓ assurance ఇచ్చి వెళ్ళాడు ! ఈలోపులో ఒక్క బొద్దింక కనిపించినా సరే, ఫోను చేయండీ ఊరికే మందెడతామూ అని ఓ ఆరువందలు పట్టికెళ్ళాడు.

ఈ మందుతో దోమలు పోవుట, అలాగే నల్లులకీ, బల్లులకీ ఇంకో మందు వాడాలిట. ఏమిటో, మనరోగాలకి రకరకాలైన స్పెషలిస్టుల్లాగ ఈ పురుగులక్కూడా రకరకాల మందులు…

సందర్భం కాదనుకోండి… మొన్న నేను వ్రాసిన మిథునం మీద నా అభిప్రాయం టపా చదివి, పాపం మా ఇంటావిడ నిన్న ఓ టపా పెట్టింది.చదివేవాళ్ళందరికీ కోపం వచ్చుంటుందీ, ఆ కోపం కొద్దిగా పలచబరిచే ఉద్దేశ్యంతో, అసలు నాకు “మిథునం” పుస్తకం మీద ఎంత అభిమానమో, సినిమా చూసి నేనెందుకంతగా disappoint అవ్వాల్సొచ్చిందో, వగైరా.. వగైరా లతో. పోనీ తనమాటెందుకు కాదనాలీ, కావలిస్తే రాసుకో అన్నాను.ఆ టపా చదివినవారినుంచి ఒక వ్యాఖ్య చదివాను-” చదవడానికి బాగుండేవి చూడ్దానికి బాగోవూ..ఎబ్బెట్టుగా కూడా ఉంటాయీ..” అని. నాకైతే నవ్వొచ్చింది ఆ వ్యాఖ్య చదివి. బర్త్ డే ఫంక్షన్లలో కేక్కులు కోసి ఓ ముక్క మొగుడునోట్లో భార్యా, అదే ముక్కని భార్య నోట్లో మొగుడూ, పైగా వీలుంటే పక్కనున్నవాళ్ళ నోళ్ళలో పెట్టినప్పుడు లేని “ఎబ్బెట్టు తనం”, అప్పదాసు గారు బుచ్చిలక్ష్మిగారి నోట్లో జామకాయ గుజ్జు పెడితే ఎబ్బెట్టెలా అవుతుందో నాకైతే అర్ధం అవలేదు!

వారిద్దరి అనుబంధమూ బాపూగారి దృష్టి లో ఎలా ఉంటుందో, ఆ కథకి ఆయన వేసిన ముఖచిత్రంలోనే తెలుస్తుంది. అర్ధనారీశ్వర తత్వం.
Mithunam

మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది ఏదైనా.

3 Responses

 1. మిథునం-2
  శ్రీ రమణ గారి మిథునంలో బుచ్చి లక్ష్మిగారికి పళ్ళు లేవండి,
  కాబట్టి అప్పలదాసుగారి కాకిఎంగిలి ని రసించుకొని జామ కాయ తిన్నారు.
  నటీ మణి లక్ష్మి గారిని పళ్ళు లేకుండా నటించమంటే , చాలా కష్టం మరి.
  ఫణి గారికి సినిమా ఎందుకు నచ్చ లేదో ఇప్పుడు బాగా అర్థం అయ్యింది.
  మీ ఆవిడ మిమ్మలిని ఎలా చూసుకుంటారో ఎంత బాగా చూసుకుంటారో,
  నాకు కళ్ళకు కనిపించింది. అందుకే మిథునం -2 అని ఎప్పుడో వ్యాఖ్యానించాను .
  మీ ఇద్దరికీ నా శుభాభినందనాలు !

  Like

 2. మేమెప్పుడో మరిచిపోయామండీ. మీ అభిప్రాయం మీరు చెప్పేరు తప్పేముందీ. ఏమయినా అర్ధనారీశ్వర తత్వం వంటబట్టించుకున్నారు. 🙂

  Like

 3. డాక్టరుగారూ,

  Thanks..

  శర్మగారూ,

  ధన్యవాదాలు..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: