బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏం జరిగినా మన మంచికే… అని ఊరికే అనరు…


    ఎప్పుడైనా మనం ఊహించినది జరక్కపోతే అయ్యో అని నిరుత్సాహపడిపోతాం.కానీ దేవుడిమీద నమ్మకం ఉన్నవారు,positive గా ఆలోచించి,గత అనుభవాలు దృష్టి లో పెట్టుకుని, అలా జరగడం కూడా మనమంచికేనేమో అనుకుంటారు.అలాగని ప్రతీదీ అదే దృష్టి చూడలేమనుకోండి.నూటికి తొంభై పాళ్ళు అలా అనుకునే పరిస్థితులుంటాయి.

    మాకు ఈ ఊళ్ళో చాలామట్టుకు తెలుగు సినిమాలు, మన రాష్ట్రంలో రిలీజైన రోజే ఇక్కడా రిలీజవుతూంటాయి. ఏదో ఏ రెండు నెలలకో వెళ్తూంటాము. ఆ సందర్భంలోనే శ్రీరామరాజ్యం, షిరిడీ సాయీ, దూకుడూ, సీతమ్మవాకిట్లో… లాటి సినిమాలూ చూడకలిగాము. ఒక్కో సినిమా కెళ్ళాలంటే ఓ అయిదువందలనోటు అవుతూంటుంది ఇద్దరికి టిక్కెట్టూ+రానూపోనూ ఆటో ఖర్చూ.మరీ పెన్షనర్లం కదా, ఆచి తూచి వెళ్తూంటాం.ఎట్టాగూ ఇదివరకటి రోజుల్లోలా కాకుండా, త్వరగానే టీవీ లో వచ్చేస్తున్నాయీ, అప్పుడే చూడొచ్చులే అనే ఓ కారణం ఒకటీ. ఆమధ్యన వచ్చిన ” మిథునం” ఇక్కడ రిలీజవలేదాయె. ఇక్కడేమిటిలెండి, ఆంధ్రదేశంలోనే చాలా ప్రదేశాల్లో అవలేదు. కానీ ప్రతీవాడూ అడిగేవాడే–” మిథునం” చూశారా అంటూ. ఏం చేస్తాం ప్రాప్తంలేదూ అని సమాధానం చెప్పేయడం.ఈమధ్యనే ఆ సినిమా డివీడీ కూడా వచ్చేసిందీ అని ఊరించేవారు కొందరూ.చివరకి ఎలా తయారయిందంటే ” మిథునం” సినిమా చూడనివాడు కూడా మనిషేనా, వాడిదీ ఓ బతుకా అన్నంతగా. భాగ్యనగరంలో ఉండేవారిని కాళ్ళట్టుకుని, ఎలాగోలాగ ఆ డీవీడీ ఏదో తెప్పించుకుంటేనే కానీ, మన బతుక్కో అర్ధంలేదూ అన్నంతగా. మొన్న భాగ్యనగరం వచ్చినప్పుడు, నిజం చెప్పాలంటే ప్రయత్నమూ చేయలేదూ, టైమూ లేదూ. ఓ గొడవొదిలిందిలే అనుకున్నాను.

   తెలుగు డీవీడీలు పూణే లోకూడా త్వరగానే వస్తూంటాయి. పోనీ ఆ షాపుకెళ్ళి అదేదో చూద్దామా అనుకుని, నిన్న సోమవారం కొట్లుండవూ అనేసికుని, మానేశాను.తీరా ఇంటికొచ్చేసరికి తెలిసింది వరూధిని(జిలేబీ) గారు, ఆ సినిమాని నెట్ లో పెట్టారూ అని.చూశారా ఆవిడధర్మమా అని నయాపైస ఖర్చుపెట్టఖ్ఖర్లేకుండా,మేమూ ఆ “మిథునం” చూసేసి, తరించిపోయి, మా జీవితాలకి ఓ అర్ధం అంటూ ఏర్పరిచేసికున్నాము..ఈఊళ్ళో ఆ సినిమా వచ్చినా, నాకు డీవీడీ దొరికినా అయిదారువందలు చమురు వదిలేదికదూ..నాకు ఈ సినిమామీద ఒక్కపైసా కూడా ఖర్చుపెట్టఖ్ఖర్లేదని రాసున్నప్పుడు పై చెప్పిన ఏదో ఒకటి జరిగేదే.అందుకే అన్నాను, “ఏం జరిగినా మన మంచికోసమే” అని.

    ఇంక సినిమా సంగతంటారా, అందరూ పొగిడేస్తున్నంత అద్భుతంగా ఏమీ లేదు. శ్రీరమణగారు తొంభైల్లో వ్రాసినప్పుడు, అప్పదాసు గారంటే, అందరూ “ ఓ రూపానికి” ప్రాణం పోసేసికున్నారు. అలాగే బుచ్చిలక్ష్మి గారూనూ. వారిలో మన తాతయ్యలనీ, అమ్మమ్మా/నానమ్మ లనీ ఊహించేసికున్నాము.అలాటిది సినిమాలో బాలసుబ్రహ్మణ్యం ఆ పాత్రకి misfit అని నా అభిప్రాయం.మొదట్లో మిథునం చదివినప్పుడు, చివరి ఘట్టానికి వచ్చేటప్పటికి, కళ్ళంట జలజలా కన్నీళ్ళొచ్చేసి, నోట్లో కొంతసేపటిదాకా మాటే రాలేదు. శ్రీరమణ గారికి 1998 లో నా అభిప్రాయం తెలియచేస్తూ ఉత్తరం వ్రాసినప్పుడు కూడా, ఆ ఇన్లాండ్ కవరు మీద నా కళ్ళనుండి జారిన కన్నీళ్ళు పడ్డట్టు గుర్తు. కథలో పటుత్వం అంతలా ఉంచారు శ్రీరమణ గారు.అలాగే తరువాత సరసభారతి శ్రీ గబ్బిట ప్రసాద్ గారు కూడా “మిథునం” కథ చదివి ఆడియో ద్వారా బ్లాగులో పెట్టారు. అక్కడకూడా చివరి ఘట్టానికొచ్చేసరికి, ఆయన గొంతుక గద్గదమయిపోయింది. నేను చెప్పేదేమిటంటే, ఒక పాత్రని రచయిత సృష్టించినప్పుడు, ఆ పాత్రలో మనమూ లీనమయ్యేదెప్పుడంటే ఇదిగో నాకూ, శ్రీ ప్రసాద్ గారికీ జరిగినట్టు. అలాగని మేమొక్కళ్ళమే కాదు, మిథునం చదివిన ప్రతీపాఠకుడికీ ఇదే అనుభవం కలిగుండాలి. అప్పదాసుగారి పాత్రను అంత అద్భుతంగా చెక్కారు శ్రీరమణ గారు.ఈ సినిమాలో అసలు అలాటి అనుభూతే కలగలేదు. మామూలుగా కొన్ని దృశ్యకావ్యాల్లో చూసినప్పుడు, అనుకోకుండానే పాత్ర చితీకరణ చూడగానే వహ్వా..వహ్వా.. అనడానికికూడా గొంతుక్కి ఏదో “అడ్డం” వస్తుంది.అలాటిది ఇక్కడ రాలేదంటే పాత్ర ఎంత “ఫీకా” గా ఉందో తెలుస్తుంది.

    అలాటప్పుడు ఆ కథని చలనచిత్రంగా రూపొందిస్తున్నప్పుడు, మనకీ కొన్ని expectations ఉండడంలో తప్పులేదు. కానీ అప్పదాసు పాత్రకీ, బాలూకీ అసలు పోలికే లేదు.శ్రీరమణ గారు అప్పదాసుగారిలో చిత్రీకరించిన గంభీరమే లేదు.ఏదో రెండే పాత్రలతో చిత్రంతీసేద్దామనే తొందరే తప్ప, మిగిలిన పాత్రలు ఉదాహరణకి కథ చెప్తూన్న మేనల్లుడూ, అతని తల్లితండ్రులూ,శ్రావణ పేరంటమూ వగైరా ..వగైరాలు కూడా పెడితే ఇంకా నిండుతనం వచ్చేదేమో. అలాగే,ఏదో మూలకథ చదివి తాదాత్మ్యం చెందిన పాఠకులు ఏదో బాధపడతారేమో అని అక్కడక్కడ కొన్నిసంఘటనలు ఇరికించినట్టు కనిపించింది కానీ, అప్పదాసూ, బుచ్చిలక్ష్మీ ల character build up ఎక్కడా కనిపించలేదు.ఏదో మనల్ని మెప్పించడానికి “పుష్పవిలాపం” వినిపిస్తేనే ఆ సినిమా కళాఖండం అయిపోతుందా? ఏమో మరి భరణి గారికే తెలియాలి. ఇంక దూదేకడం, కుండలు చేయడం అవసరమంటారా?
బుచ్చిలక్ష్మి గారి పాత్రలో లక్ష్మి అమోఘంగా నటించారు. అందులో సందేహానికి చోటులేదు.

    2000 సంవత్సరంలో శ్రీ వాసుదేవన్ నాయర్ గారు ” మిథునం” కథ విని, దానిని మొట్టమొదటగా చలనచిత్రంగా నిర్మించారు. పోలికలు చూస్తారేమో అని “ఒరు చెరు పుంచిరి”, నెట్ అంతా వెదికి పట్టుకున్నాను. Sub Titles(11 clip లుంటాయి) ఉన్నాయి, ఒకసారి చూడండి.అప్పుదాసు పాత్రకి ఆయన ఇచ్చిన నిర్వచనమూ, తనికెళ్ళవారి నిర్వచనమూ తెలుస్తుంది.“పొరుగింటి పుల్లకూరా” అని అనుకోకుండగా,మనవాళ్ళకంటే పరాయివాళ్ళవే నచ్చుతాయి మీకూ అని తిట్టకుండగా, నేను చెప్పినదానిలో అతిశయోక్తి ఏమైనా ఉందేమో మీరూ చెప్పండి. ఆ చిత్రంలో కూడా, మూలకథలో లేని ఎన్నెన్నో సంఘటనలు చొప్పించారు, కానీ అవన్నీ character build up సంబందితమే. అందుకేనేమో ఆ సినిమా అన్నన్ని International Film Festivals లో చూపించారు. మరి భరణిగారి “మిథునం” ఆ స్థాయికి చేరుకోలేక,అన్నన్ని గౌరవాలు, ప్రశంసలూ సంపాదించలేకపోతే, ఇంక ప్రతీవారి నోటా ” అవునండీ తెలుగువాడంటేనే అసలు పడదూ ఎవరికీ, మనకేమైనా lobby లున్నాయా ఏమిటీ..” లాటి విమర్శలు వినాల్సొస్తుంది. కొంచం వినడానికి బాగోపోవచ్చుగానీ, శ్రీ తణికెళ్ళ భరణి గారి “మిథునం” నాకైతే ఓ పేద్ద disappointment. ఆ మళయాళం సినిమా చూసిన తరువాతైతే మరీనూ..మీరు తిట్టినా సరే, అప్పదాసుగారన్నట్టు “నిరక్షర కుక్షీ..” అన్నా సరే మీ ఇష్టం…

   ఆ సినిమా చుసిన తరువాత బాధ భరించలేక, మూల కథని మళ్ళీ ఇంకో సారి( ఇప్పటికి కొన్ని వందలసార్లు చదివాను) చదివి శ్రీరమణ గారు సృష్టించిన అప్పదాసు గారినీ,బుచ్చిలక్ష్మిగారినీ చదివి తరించాను.

10 Responses

 1. Hats off ఫణిబాబు గారూ, అనుకున్నది అనుకున్నట్లుగా, యే మొహమాటలకీ లోను కాకుండా ఢంకా బజాయించినట్లుగా రాశారు.
  నిజానికి నాకూ సినిమా చూశాక అసంతృప్తి గా అనిపించినా “ఎలా వుంది?” అని అడిగినవారికి ” బానే వుంది “అని సమాధానం ఇచ్చానంటే దానికి జనాలకి నా వాదనని వినిపించి convince చేయలేని అశక్తత మాత్రమే కాకుండా, ఎక్కడ ‘ ఉలిపికట్టె ‘ గా భావిస్తారో ననే జంకు కూడా కారణం.

  Like

 2. వామ్మో, వామ్మో,

  ఇంతగా చిత్రాన్ని ఏకితే ఎత్లాగండీ హరే ‘ఫలానా’ గారు !

  తెలుగలో ‘చిత్రాలే’ తగ్గి పోతున్నాయి ! వచ్చిన వాటిని ఇట్లా ఎడా పెడా వాయిస్తే మరి ఎట్లా ?!!

  ఇక ఆ చిత్రం లింకు మాత్రమే జిలేబీ సహకారం! క్రెడిట్ గోస్ టు వోల్గా వీడియో యుజర్ కర్టసీ !

  TMP వారి లింకు మీరూ పట్టే సే రన్న మాట !

  చీర్స్
  జిలేబి.

  Like

 3. naadi kuda same feeling.
  i feel very disappointed after watching the movie.

  Like

 4. అందరూ నెట్ పుణ్యమా అని ఉచితంగా సినిమాలు చూస్తున్నాం అంటున్నారు. నాకైతే ఇలా నెట్‌లో యెలా చూడాలో ఇప్పటికీ‌తెలియదు. అదీకాక నెట్‌లో చూస్తే బండ్‌విడ్త్ ఖర్చుకాదా దానికి డబ్బులు కావా? అర్థం‌కావటం లేదు. ఎవరైనా విజ్ఞులు నాకీ విషయంలో సహాయం చేయవలసినదిగా విన్నపం.

  నేనూ‌ మిధునం సినిమా చూడలేదు. నిజానికి సినిమాలు చూడటంపై ఆసక్తి కూడా ఆట్టే లేదు. పైగా ఈ కాలంలో మంచి(డబ్బులు తెచ్చే)సినిమా తీయాలనే యావతో నానా కంగాళీగానూ తీస్తున్నారు, యెంత మంచి సబ్జెక్టులను తీసుకున్నా కూడా. పైగా ప్రతిసినిమాకూ యెంత కష్టపడి తీసారో యెంత గొప్ప(కళాఖండం)గా వచ్చిందో నని డప్పులొకటి – తలనొప్పి వస్తోంది.

  Like

 5. లోకో భిన్న రుచిః మీ మాటెందుకు కాదనాలిగాని

  Like

 6. శ్రీ రమణ గారి కథ, మిథునం ,
  తనికెళ్ళ గారి సినిమా మిథునమోకటిగా అను కొని చూస్తే,
  కొద్దిగా కథ ముందు సినిమా తేలి పోయే మాట నిజం,
  మీరు కొంచం ఘాటుగానే వ్రాసారు.
  కానీ విడిగా చూస్తే ఆముదం చెట్టు చందా న బాగానే ఉంది.
  నాకేమో నచ్చేసింది.

  Like

 7. అంతర్జాలం లో ఉచితంగా సినిమా చూడడం మంచిది కాదండి .
  ఉచితంగా వచ్చేవి , చులకనకు గురి అవుతాయి.
  ప్రభుత్వ హాస్పిటల్ లో మూడున్నర దశాబ్దాలుగా పని చేసి,
  ఆ వినియోగ దారుల మాటలు విన్నప్పుడు, అపాత్ర సేవ చేసినందుకు
  ఎంతో బాధ పడ్డ సందర్భాలు ఎన్నో!!
  అయినా ఇప్పటికీ ఎప్పటికీ ఎవ్వరి దగ్గరా చేసిన సేవకు ప్రతిగా
  జీతం తప్ప గీతం ఆశించని నా లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు.

  Like

 8. సాహితీ,

  థాంక్స్..ఎవరో ఏదో అనుకుంటారని మన అభిప్రాయాలు చెప్పకపోవడం అంత మంచిదికాదేమో.. సినిమా బాగోలేదని నేను ఎక్కడా అన్నట్టులేదు. అందులో నాకు కనిపించిన లోటుపాట్లు వ్యక్తపరిచాను. అలాగని నేను పేద్ద విమర్సకుడనని చెప్పడంలేదు. ఏదైనా చూసినప్పుడు మన అభిప్రాయం చెప్పడంలో తప్పేమీ లేదనుకుంటాను.

  జిలేబీ,

  మీరు మిథునం లింకు పెట్టారు కదా అని, నేను ఆ మలయాళం సినిమా లింకు కూడా పెట్టాను. ఒకదానితో ఒకటి పోలిస్తేనే కదా, తేడాలు తెలిసేది?

  శ్రావ్యా,

  నా అభిప్రాయంతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు… కానీ చాలామందికి కోపం వచ్చుండొచ్చు…

  శర్మగారూ,

  అవును కదూ…

  శ్యామలరావుగారూ,

  BSNL వారి unlimited pack ధర్మమా అని నెలకి 600 రూపాయల ఖర్చుతో కావలిసినవన్నీ చూస్తున్నాను. ఒక్కో సినిమాకీ అయిదేసివందలు ఖర్చుపెట్టడంకంటే ఇదే చవకేమో. కొన్నిసార్లు మనం బయట చూడాలనిఉన్నా, చూడలేని కొన్ని పాతతరంలోని అద్బుత చిత్రాలు అన్ని భాషలలోవీ చూడకలుగుతాము.

  డాక్టరుగారూ,

  I think you got me wrong. ఏదో “ఉచితం” గా చూడకలిగానని చేసిన వ్యాఖ్య కాదండీ. సినిమా బాగాలేదన్నది కాదు. ప్రస్తుతం వస్తూన్న ఎన్నో సినిమాలకంటే ఇది చాలా బావుంది. నేను చెప్పిందల్లా ఏమిటంటే, శ్రీరమణ గారు తెచ్చినంత గొప్పతనం సినిమాలోని పాత్రలకి సాధించలేకపోయారూ అని మాత్రమే. ఏతా వాతా చాలా disappointing గా ఉందనీ.

  Like

 9. మీ పోస్ట్ చదివాక నాకు “ఒరు చెరు పుంచిరి” చూడాలన్న ఆసక్తి కలిగిందండీ. లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

  Like

 10. వేణూ శ్రీకాంత్,

  ఆ సినిమాతో పోలిస్తే మరి మీ అభిప్రాయమేమిటీ?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: