బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మేరా భారత్ మహాన్…

    ఇదివరకటి రొజుల్లో కోర్టులు ఏదైనా జడ్జిమెంటనేది ఇస్తే, దానికో విలువుండేది.ప్రస్తుత పరిస్థితి ఎలాఉందంటే, ఎవడి నోటికొచ్చిన సలహా ఇచ్చేవాడే ప్రతీవాడూనూ. ఉదాహరణకి సినీనటుడు సంజయ్ దత్ కేసే తీసికోండి. 1993 లో ముంబాయి లో జరిగిన అల్లర్లలో, దావూద్ ఇబ్రహీం లాటివాళ్ళకి సహాయం చేసినట్టు నిరూపింపబడ్డం వల్లనే కదా, జైల్లో పెట్టారూ. అసలు TADA కిందే బుక్ అవవలసినవాడు, దానిలోంచి ఎలా తప్పించుకున్నాడో ఇక్కడ చదవండి.వాళ్ళనాన్న సునిల్ దత్ ధర్మమా అని బయటపడి, Arms Act లో బుక్ అయ్యాడు. ఆ కేసు 20 ఏళ్ళకి సుప్రీంకోర్టులో విచారణకొచ్చి, శిక్షపడ్డ అయిదేళ్ళ, మిగతా కాలానికి జైలుకెళ్ళమన్నారు.

    ప్రతీవాడూ అయ్యో..అయ్యో.. పాపం పసిబిడ్డ, అమాయకుడు, నోట్లో వేలెడితే కొరకలేడు కూడానూ, ఇద్దరు బిడ్డల తండ్రీ, వాళ్ళ నాన్న ఫలానా.. వాళ్ళ అమ్మ ఫలానా.. గాంధీ గారి గురించి ప్రచారం చేశాడూ, ఒకటేమిటి ఎక్కళ్ళేని సద్గుణాలూ కనిపించిపోయాయి మన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ కట్జూ గారికి! ఈయనొక్కడూ చాలదన్నట్టు ప్రతీ రాజకీయపార్టీలోని వాడూ మాట్టాడేవాడే.సంజయ్ దత్ అసలు ఉగ్రవాది కాదుట, ఉత్తిత్తినే అవేవో గన్నులూ, గ్రెనేడ్లూ ఎలా ఉంటాయో ఓసారి చూద్దామని అట్టేపెట్టుకున్నాడుట. సరదాగా చూడ్డానికి బావుందని ఒక్కటంటే ఒక్కటే గన్నోటి ఇంట్లో పెట్టుకున్నాడుట. మిగిలినవన్నీ అప్పుడే తీసికెళ్ళిపొమ్మన్నాడుట.. పాపం అలాటి అమాయకుణ్ణి క్షమించేయండీ అని గవర్నరుగారికి ఉత్తరం వ్రాసెవాడొకడూ, ఏకంగా కలిసేవాడింకొకడూ. వీళ్ళందరినీ చూసే ఓ పేపరువాడు సల్మాన్ ఖాన్ మీదకూడా కేసునడుస్తోందిగా, అతనేం చేద్దామనుకుంటున్నాడో సరదాగా ఓ వ్యాసం వ్రాశాడు. చదివే ఉంటారు అయినా మళ్ళీ ఇంకోసారి ఇక్కడ చదవండి.మన మాజీ న్యాయమూర్తులు, హాయిగా ఏదో పదవి ఇచ్చారుగా, హాయిగా కూర్చోక ఎందుకొచ్చిన దిక్కుమాలిన సలహాలండీ ఇవీ?

    మాజీ విమానదళాధిపతి గారి విన్యాసాల గురించి చదివే ఉంటారు.ఆయనెవడో ఒడీషా మాజీ డీజీపీ ట, ఆయనగారి కొడుకు అయిదేళ్ళపాటు, ఈయనగారి సహకార సౌజన్యాలతో మాయమైపోయి అయిదేళ్ళకి దొరికాడు.

    అప్పుడెప్పుడో శివసేనా బాలాసాహెబ్ థాక్రే గారు, పాకిస్తానీ క్రికెట్ ఆటగాళ్ళని ముంబైలో అడుగెట్టనీయనన్నాడు. పోనిద్దూ పెద్దాయనా వద్దంటున్నాడూ, అనేసికుని మనవాళ్ళు పాకిస్థాన్ తో ఆడ్డమే మానేశారు ! నేనుమాత్రం తక్కువా అనుకుందేమో ఏమో కానీ, జయలలిత గారు శ్రీలంక ఆటగాళ్ళు చెన్నైలో అడుగెడితే కాళ్ళిరక్కొడతానంది. రిజల్ట్-IPL Circus లో చెన్నైలో ఆడే గేమ్స్ లో శ్రీలంక ఆటగాళ్ళు నో..నో..

%d bloggers like this: