బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ఒక్కొక్కళ్ళది ఒక్కో పధ్ధతి…….

    మా అబ్బాయి తన కంపెనీ కి consultancy సందర్భంలో ఒకరిని హైదరాబాదు నుంచి ఆహ్వానించి, ఆ విషయం మాతో చెప్పాడు. ఆయన పేరేమిటీ అని అడగ్గా, ఫలానా అని చెప్పి, వారింటి పేరు Y తో ప్రారంభం అవుతుందీ అన్నాడు. ఏ యనమండ్రో. యర్రమిల్లో, యద్దనపూడో అయిఉంటుందనుకున్నాము. కాదూ “ఏనుగు” అన్నాడు. మాకు వెంటనే చిన్నపుడు చదువుకున్న ఏనుగు లక్ష్మణ కవి గారు గుర్తొచ్చారు. “కరెక్టు..” అదే అన్నాడు. పైగా ఆయన మా అబ్బాయిని మా వివరాలు అడిగి. మీ పేరెంట్స్ కి తెలుస్తుందీ, మా ఇంటిపేరు చెప్పగానే అని కూడా చెప్పారుట. అవునుకదండీ, ఎంతైనా ఆ ఇంటిపేరున్న వారి, భర్తృహరి సంస్కృతంలో వ్రాయగా, వాటిని తెలుగులోకి అనువదించిన శ్రీ ఏనుగు లక్ష్మణ కవిగారి సుభాషితాలు చదివే పెరిగిపెద్దయాము కదా! ఈ రోజుల్లో వారికి అంతగా తెలియకపోవచ్చు.

    ఎప్పుడో చిన్నప్పుడు భర్తృహరి సుభాషితాలు బట్టీపట్టిన గుర్తైతే ఉంది.కానీ అప్పుడే అరవై సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయన్ని కలిసినప్పుడు, మరీ వెర్రిమొహం పెడితే బావుండదుగా, అందుకోసం వెంటనే వికీపీడియా తెరిచి, శ్రీ ఏనుగులక్ష్మణ కవిగారి వివరాలు చదివేశాను.ఆ విషయం ఆయన్ని మర్నాడు కలిసినప్పుడు ఆయనతో చెప్పానుకూడానూ.ఆయనా సంతోషించినట్టే కనిపించారు.ఎవరైనా మా ఇంటిపేరు “భమిడిపాటి” అని తెలిసి, నా సంగతెలా ఉన్నా, మా ఇంటిపేరున్న ప్రముఖుల వివరాలు తెలిసికుంటే నాకు సంతోషంగా ఉండదూ మరి?అలాటి పెద్దల ఆశీర్వచనాలతోనే కదా మనం బతుకుతున్నదీ?

    ఇంక ప్రస్తుతానికి వస్తే ఈ కొత్తగా పరిచయం అయిన వారి పేరు శ్రీ ఏనుగు కృష్ణమూర్తిగారు. ఈయనకి ఒక ఆసక్తికరమైన హాబీ ఉంది.మామూలుగా ఈ హాబీల్లాటివున్నవారు, ఏవో స్టాంపులూ, నాణాలూ, అలాటివి సేకరిస్తూండడం చూస్తూంటాము. కానీ ఈయనది బొత్తిగా చిత్రమైన హాబీ ! మన చిన్నప్పుటి విషయాలు గుర్తుండే ఉంటాయి అందరికీ.ఆరోజుల్లో అన్నీ గ్రామాలే.ఆ గ్రామీణ వాతావరణంలో నిత్యకృత్యంలో ఎన్నెన్నో వస్తువులు వాడేవారం. చాలా భాగం ఇత్తడితో చేసినవే.కాలక్రమాన అవన్నీ మాయమైపోయి ఈరోజుల్లో ప్లాస్టిక్ వస్తువులలోకి వచ్చేశాయి.ప్లాస్టిక్ వాడొద్దు మొర్రో అని ఒకవైపున చెప్తూనే, ఇల్లంతా ప్లాస్టిక్కు మయం చేసేశాము. ఇత్తడి గురించి మాట్టాడడమే నామోషీగా భావిస్తున్నాము.పైగా use and throw ఒకటీ. ఎక్కడచూసినా ప్లాస్టిక్కే.కుర్చీలు, సోఫాలు, గిన్నెలు, పువ్వులు, ఫలాలు , దేవుడికి వేసే దండలు, ఒకటేమిటి మనం నవ్వే నవ్వుకూడా ప్లాస్టిక్కే. హృదయపూర్వకంగా నవ్వే నవ్వెక్కడండి బాబూ. ఏదో మొహమ్మాటానికి నవ్వడంకానీ..

    అప్పటికీ, ఇంకా పాతవాసనలు పోని కొంతమంది సహృదయులు పాత సెంటిమెంట్లు వదులుకోలేక, ఇంకా ఆ పాతవస్తువులు పట్టుకుని వేళ్ళాడుతున్నారు.ఇదివరకటి రొజుల్లో పెద్ద పెద్ద ఇళ్ళుండేవి కాబట్టి, ఈ ఇత్తడి సామాన్లు జాగ్రత్త పెట్టుకోడానికి విడిగా ఓ రూమ్ముండేది. కానీ ఈ కాంక్రీటు జంగిళ్ళలో, మనం విడిగా పడుక్కోడానికే జాగా దొరకని ఈరోజుల్లో ఆ ఇత్తడిసామాన్లకెక్కడ స్థలం దొరుకుతుందీ? ఈ కారణం చేత చాలా భాగం పాత ఇత్తడి సామాన్లకి కాళ్ళొచ్చేశాయి. ఇదివరకటి రొజుల్లో ఏ శ్రీరామనవమైనా వచ్చిందంటే పానకం కలపడానికి “గంగాళం” అని ఒకటుండేది.అలాగే ఏ “సంతర్పణ” లాటిది జరిగితే, అక్కడ నేతి “జారీలూ”, పదార్ధాలు వడ్డించడానికి పాత్రలూ ఎన్నెన్నో ఉండేవి.ఎవరింట్లోనో ఇలాటివి ఉన్నాయని తెలిస్తే వారింటికి వెళ్ళి తెచ్చుకునేవారు. పని అయిపోగానే వాటిని శుభ్రంగా తోమించి తిరిగి ఇచ్చేసేవారు.ఇళ్ళల్లో అన్నం వండుకోడానికి వివిధరకాలైన గిన్నెలూ, సోల, అడ్డ,మానెడు లాటివి ఉండేవి. ఇద్దరికి ఓ సోలడుబీపన్నం పెడితే సరిపోయేది. నలుగురొస్తే తవ్వెడు, ఇలా వచ్చినవారినిబట్టి ఉండేవి కొలతగిన్నెలు.

    ఈ విషయాలన్నీ ఏవో పుస్తకాల్లోనూ, సినిమాల్లోనూ(పాతవి) చూసే పరిస్థితికి వచ్చేసింది, మన so called నాగరికత. ఇంకొన్ని సంవత్సరాల్లో అసలు ఇలాటివి ఉండేవన్న విషయంకూడా మర్చిపోవచ్చు. అలా జరిగి మన సంస్కృతి మరుగున పడిపోతుందేమో అన్న ఆవేదనతో, శ్రీఏనుగు కృష్ణమూర్తిగారు ఓ మహత్కర కార్యానికి నడుం కట్టారు.దాని పరిణామమే ఈయనగారి హాబీ. ఎక్కడో ఏదో ఊళ్ళో ఫలానా గుళ్ళో ఫలానా వస్తువుందని తెలిసికోడం, వెంటనే అక్కడకి వెళ్ళిపోవడం, వారితో బ్రతిమాలో, బామాలో, ఖరీదిస్తానని చెప్పో, కాదూకూడదూ అనుకుంటే, వారిదగ్గర తీసికున్న వస్తువుకి మారుగా, వారికి ఉపయోగించే వస్తువిచ్చో, మొత్తాని ఏదైతేనేం “పాత సామాన్లు” చాలానే సేకరించారు. వాటిని పాతసామాన్లన్నాని వాటి విలువ dilute చేశాననుకోకండి. ఓ ఇరవై ఏళ్ళు గడిచాయంటే వాటి విలువ అంతర్జాతీయ మార్కెట్ లో లక్షల్లోకి వెళ్తుంది.

   డబ్బుమాట ఎలాఉన్నా, మన సంస్కృతి కాలగర్భంలో కలిసిపోకముందే, తనవంతు సహాయం చేయకలుగుతున్న కృష్ణమూర్తిగారు ఈ సామాన్లన్నీ ఎక్కడ పెడుతున్నారో తెలుసా, వారి ఇంట్లో ! ఇప్పటిదాకా ఆయన సేకరించిన సామాన్ల వివరాలు అన్నీ పొందుపరిచి ykantiques.com పెట్టారు.ఆ ఫొటోలు ఒక్కోటీ చూస్తూంటేనే కడుపునిండిపోతోంది. ఇంక ప్రత్యక్షంగా చూస్తేనా… అక్కడుంచిన వస్తువులకి ఇంగ్లీషులో కాకుండా తెలుగు లో వివరిస్తే ఇంకా అందంగా ఉండేదని వారికి సూచించాను. అదే ప్రయత్నంలో ఉన్నారు. గంగాళం, గోకర్ణం, జారీ అంటే ఉన్న సొగసు gangaalam, gokarnam, jaaree అంటే ఉంటుందా?

   మామూలుగా antiques సేకరించి భద్ర పరిచే museums చూశాము కానీ, ఒక గృహస్థుకి ఇలాటి వ్యాపకం ఉండడం చాలా చిత్రం కదూ..పైగా వీటన్నిటినీ ఉంటున్న ఇంట్లోనే భద్రపరచడానికి కొంత స్థలం కేటాయించడమంటే ఇంకా చిత్రం ! ఈ సామాన్లన్నిటికీ ఇల్లు ఇరుకైపోతుందని అనుకోకుండా, ఆ వస్తువులని తమాషాగా వినియోగంలోకి తేవడమైతే simply అద్భుతం.గంగాళమంటే సైజెంతుంటుందో తెలుసుగా, అలాటిదానిమీద ఓ చెక్క ఏర్పాటుచేసేసి, దానినే dining table గా ఉపయోగిస్తున్నారంటే ఆయన ingenuity ఎలాటిదో ఊహించుకోండి !! ఇలాటివాటికి ఇంటి ఇల్లాలి సహకారం కూడా ఉండాలి. మరి ఆవిడనికూడా అభినందించాలిగా,ఇలాటి వారిని “భరిస్తున్నందుకూ” !!!

    అలాటి ఓ గొప్ప వ్యక్తితో నాకు పరిచయం అవడం నా అదృష్టం… ఈ టపా చదివి, ఆ సైటు చూశాక, ఎక్కడైనా మీకు తెలిసి, ఎవరింట్లోనైనా అలాటి అపురూపర వస్తువులు లభిస్తాయని ఆయనకి తెలిపితే ఎంతో సంతోషిస్తారు..

%d bloggers like this: