బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-పుణ్యం.. పురుషార్ధం..

   ఈమధ్యన కొద్దిగా “రాముడు మంచిబాలుడు” లా తయారవుదామనే సదుద్దేశ్యంతో, మా స్నేహితులు ప్రముఖ తెలుగు రచయిత శ్రీ దాసరి అమరేంద్ర గారు ఢిల్లీ వస్తారేమిటీ, సరదాగా చుట్టుపక్కల ఒకసారి తిరుగుదాం అని అడగడమేమిటి, సరే అనేశాను. పుణ్యం పురుషార్ధం ఉంటాయని ఒక ఆధ్యాత్మిక యాత్రా,ఇంకో సరదాగాఉండే ప్రదేశమూ చూపించమని అడగడమేమిటి, ఆయన ఓకే అనడమేమిటి, నేనూ, మా ఇంటావిడా ఛల్ మోహనరంగా అంటూ పాడుకుంటూ,పుణె-నిజాముద్దీన్ దురంతోలో ( అదేమిటో అసలు ఆపేరెందుకు పెట్టారో అర్ధం అవదు) ఎవడైనా అల్లరి చేస్తే “వాడికేం దురంతం..” అని పెద్దలు అనగా విన్నట్టు గుర్తూ. దీంట్లో ఏం అల్లరవుతుందో అనుకుంటూనే బయలుదేరాము.

    ఇంకో సంగతండోయ్.. మొన్న 28 వ తారీకున, మా “మిథునం” 41 సంవత్సరాలు పూర్తయిన శుభసందర్భంలో, ఇంటావిణ్ణి సరదాగా ఉత్తరభారతప్రాంతానికి వెళ్తే బావుంటుందేమో అనే ఉద్దేశ్యం కూడానూ. ఉద్యోగంలో ఉన్నంతకాలం, ఎల్.టి.సీ మీద ప్రతీసారీ తిరుపతి, ఆవిడ పుట్టిల్లూ తప్పించి ఎక్కడకూ తీసికెళ్ళినపాపానికి పొలేదు.ఏదో, పిల్లల ధర్మమా అని నా షష్ఠిపూర్తికి తిరుపతీలో కల్యాణం, తరువాత తమిళనాడు టూరిజం వారితో ఎనిమిది రోజుల ట్రిప్పూ.ఎప్పుడూ కలిసివెళ్లని మాలాటి ప్రాణులు ఇల్లు కదిలేసరికి, మేము వెళ్ళివచ్చిన ప్రాంతాలన్నీ సునామీ లో కొట్టుకుపోయాయి.

   వారం రోజుల ట్రిప్పు గురించి ఎలా వ్రాసి మిమ్మల్నందరినీ “బోరు” కొట్టాలా అని ఆలోచిస్తూంటే అప్పుడే మూడు రోజులు గడిచిపోయాయి.నా మామూలు “గోల” ఒకటుందిగా, మిస్టరీ షాపింగు ఒకటి చేశాను ఈవేళే. మళ్ళీ రేపొకటి. ఇలా ప్రతీరోజూ టైముండడంలేదని, నా టపా పోస్టు చేయకపోతే, మీరందరూ సుఖపడిపోరూ మరి? హాయిగా నా గొడవలేకుండా హాయిగా ఉన్నారు కదూ ఈ వారంరోజులూ? మా adventures ఎవరో ఒకరితో చెప్పుకోపోతే ఎలాగా? నూటికి తొంభై మంది ఇప్పటికే ఈ ప్రదేశాలన్నీ చూసేఉంటారు. కానీ, జన్మానికో శివరాత్రి అన్నట్టు, మాలాటివారు ఎప్పుడు వెళ్ళాలని రాసిపెట్టుంటే అప్పుడే వెళ్తారు. ఏం చేస్తాం కొంతమంది తలవ్రాతలు అలాగే ఉంటాయి…

    “దురంతం”Express లో హజ్రత్ నిజాముద్దీన్ స్టేషను లో దిగీదిగగానే, మా ఫ్రెండున్నారుకబట్టి సరిపోయింది, లేకపోతే ఎక్కడకు వెళ్ళాలో తెలిసేదికాదు.ఆయనుండే ద్వారకా ఏరియాకి వెళ్ళి, భోజనం తరువాత, “అక్షరధాం” కి తీసికెళ్ళారు. మిగిలినవన్నీ ఇదివరకే అంటే అల్లుడూ, అమ్మాయీ అక్కడ ఉండే రోజుల్లో చూసేశాము.

    రాత్రికి “కాల్కా మెయిల్” లో, బయలుదేరి, మర్నాటి ప్రొద్దుటికి కాల్కా చేరాము.అక్కణ్ణించి అదేదో Toy Train ట దాంట్లో ఎక్కి సిమ్లా చేరాము. మా ఇంటావిడా, మా ఫ్రెండూ మొదట్లోనే చెప్పారు లెండి, మనం మేఘాల్లో వెళ్తామూ అని.ఆయనేమో ఇదివరకు చాలా సార్లు వెళ్ళడం వల్లా, మా ఇంటావిడ నెట్ లో చూడడంవల్లా, నాకంటే కొంచం ఎక్కువే తెలిసున్నట్టు కబుర్లు చెప్పేసారు, ఎవడో ఒక “బక్రా” దొరికాడుకదా మరి. సరే నేనుమాత్రం తక్కువ తిన్నానా అనుకుని, అక్కడెక్కడో దూరంగా, అవేవో తెల్లగా కనిపించేసరికి ఆహా మేఘాలంటే ఇలా ఉంటాయా అని అనుకున్నంతసేపు పట్టలేదు, అవి మూఘాలు కావుట, వాళ్ళెవరో పెట్టిన మంట తాలూకు “పొగ” ట అది ! ఇలా ఉన్నాయి నా తెలివితేటలు ! ఇంక నోరుమూసుక్కూర్చుంటేనే ఇంటికీ వంటికీ మంచిదని ఆ పనే చేసేశాను. మళ్ళీ నోరెత్తితే ఒట్టు !

    నోరంటే మూసుక్కూర్చున్నా కానీ, చేతులూరుకోవుగా, కెమేరా పట్టుకుని ఎడాపెడా ఫొటోలు తీస్తూ కూరున్నాను.ఓహో మేఘమాలా..మేఘాల్లో..

    సిమ్లా లో అడుగెట్టేసరికే వళ్ళంతా కొయ్యబారిపోయింది. అంతకుముందురోజు హిమపాతం ఎక్కువగానే ఉందట. అసలు అదేదో చూద్దామనే కదా ఈ ప్రయాణం ! ఇంక మా ఇంటావిడైతే నన్ను “గంగిరెద్దు” లా అలంకరించేసింది.తీసికెళ్ళిన బట్టలన్నీ నామీద వేసేసి ! నాకంటే నేను వేసికున్న బట్టలే బరువుగా ఉన్నాయి. పైగా ఏదైనా “అవసరం” వస్తే ఆ బట్టలన్నీ తీయడం ఓ గొడవాయిరి ! ఓ టాక్సీ వాడిని మాట్టాడుకుని, అవేవో snow ఉన్న ప్రాంతాలకి తీసికెళ్ళమన్నాము. దారిపొడుగునా మంచే మంచు. అదేదో రోడ్డుపక్కన మన ఊళ్ళల్లో చెత్త తుడిచేసి పక్కకు తోసేసినట్టు, ఎక్కడ చూసినా “మంచు” కుప్పలే !!స్నో2
పై ఫొటోల్లో ఎక్కడా ఈయనా, వాళ్ళావిడా కనిపించనేలేదూ అంటారేమో అని photographic evidence ఈ కింద ఇస్తున్నాను.నేనూ, మా ఇంటావిడామంచే.. మంచు

    అక్కడికి వెళ్ళేటప్పటికి ఫొటోలు తీసేవాళ్ళు వెనక్కాలపడ్డారు.అవేవో వేషాలు వేసి తీసికోమన్నారు.ఈ చలిలో మళ్ళీ బట్టలన్నీ తీయమంటారేమో అని భయపడ్డాను. అలా కాకుండగా మళ్ళీ అవేవో సూదిపిన్నీసులు వళ్ళంతా గుచ్చేసి బట్ట కప్పేశాడు. మరీ బావుండదేమో వద్దండీ అంటుంది మా ఇంటావిడ. పోనిద్దూ, మళ్ళీమళ్ళీ వస్తామా ఏమిటీ, ఎలాగూ ఇంకో రెండు రోజుల్లో 41 ఏళ్ళు పూర్తిచేస్తామూ, పెళ్ళయిన తరువాత హనీమూన్లూ సింగినాదాలూ ఎలాగూ వెళ్ళలేదూ, ఒకళ్ళుండి ఇంకోరు పోతే ఈ ఫొటోలేనా చూసి సంతోషించొచ్చూ, అయినా ఎవరో నవ్వుతారని మన సరదాలు మానెస్తామా ఏమిటీ అని సద్దిచెప్పేసి ఆ ఫొటోలకి దిగిపోయామండీ…హనీమూన్..

    అదండీ విషయం రెండురోజులు ముందుగా అరవైతొమ్మిదో ఏట నలభైఒకటో వార్షికోత్సవం మొత్తానికి ఓ వెరైటీ గా జరుపుకున్నాము. నెత్తిమీదికి ఇన్నేళ్లొచ్చి ఈ సరదాలేమిటీ అనిమాత్రం అనుకోకండి. మిగిలిన విశేషాలు తరువాతి టపాలో…

%d bloggers like this: