బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఇంకొన్ని రొజులు పోతే….


    అప్పుడెప్పుడో ఒక టపా పెట్టాను. మన culture కనుమరగైపోతోందేమో అన్న భయంతో పాత సామాన్లు దొరికినన్ని సేకరించి భద్రపరుస్తున్న ఒక వ్యక్తి గురించి. ఆలోచించి చూస్తే, వస్తువులనే కాదు, ఇంకా ఎన్నెన్నో కనుమరగైపోయే అవకాశం ఉందేమో అని నా అభిప్రాయం.

తెలుగు భాష గురించి చాలామందే బాధపడుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా, విన్నా ఇంగ్లీషూ, హిందీయే. తెలుగులో మాట్టాడడం చిన్నతనంగా భావిస్తున్నారు చాలామంది.అడిగినా అడక్కపోయినా, కనీసం పెళ్ళయేవరకూ, కడుపు నింపడానికి అమ్మ కావాలి, కానీ భాష దగ్గరకొచ్చేసరికి ఆవిషయం మర్చిపోతున్నారు చాలామంది.అసలు మాట్లాడడమే తక్కువ. ఎక్కడ మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అనే భయం. ఈ పేమెంట్ల ధర్మమా అని ఎక్కడో ఏ ఆఫీసుకో వెళ్ళి వివరాలు అడగవలసిన పరిస్థితి లేదు.ఎయిర్, రైల్ రిజర్వేషన్ల దగ్గరనుంచి ప్రతీదీ ఓ మీట నొక్కితే అయిపోతోంది. ఇదివరకటి రోజుల్లో తల్లితండ్రులు కనీసం ఇళ్ళల్లో వాళ్ళ పిల్లలతోనూ, తల్లితండ్రులతోనూ మాట్టాడేవారు. ఇప్పుడు అసలా అవకాశమే కలగడమేలేదాయె. ఎప్పుడు చూసినా చెవిలో ఓ”పువ్వు”, మెడవంచేసి ఏదో క్లయంటుతో కాల్స్ అంటూ. రోడ్డు మీద నడుస్తూంటే కాల్స్, కార్లు డ్రైవు చేస్తూ కాల్స్, ప్రొద్దుటే ఫలహారం చేస్తూ కాల్స్, టాయిలెట్లలోకి వెళ్తే కాల్స్, చివరాఖరికి భార్యాభర్తలు రాత్రెప్పుడో పడకెక్కినా, పక్కనే ఆ మాయదారి సెల్ ఫోన్ లేకుండా గడవదు. ఈ కాల్స్ ధర్మమా అని బయటివారితో రాకపోకలూ తగ్గిపోతున్నాయి. ఖర్మ కాలి ఎవరైనా వచ్చినా, నోరెత్తకూడదు, ఒకళ్ళమొహం ఒకళ్ళు చూసుకుంటూ సైగలతోనే కాలక్షేపం.అదేదో “Silent valley” చూడ్డానికి ఎక్కడికో వెళ్ళఖ్ఖర్లేదు. ఇదివరకటి రొజుల్లో తెలుగు బ్లాగులు వచ్చిన కొత్తరోజుల్లో, చదవడానికి కొన్నైనా తెలుగు బ్లాగులుండేవి. వారుకూడా ఫేస్ బుక్, ట్విట్టర్, ప్లస్ ల్లోకి వెళ్ళిపోయారు. పోనీ అక్కడైనా తెలుగులో వ్రాస్తారా అంటే అక్కడా ఇంగ్లీషే, ప్రపంచం అంతా చదవొద్దు మరీ? పోనీ ప్రసారమాధ్యమాల్లో ఏమైనా ఉధ్ధరిస్తున్నారా అంటే అక్కడ ఉండే యాంకర్లు వాక్యానికి కనీసం నాలుగైనా ఇంగ్లీషు పదాల్లేకుండా మాట్లాడలేరు. ఇంక సినిమాలంటారా, ఏదో తెలుగులో పేరు పెడితే చూడరేమో అని భయం. అధవా పెట్టినా , వాళ్ళు పెట్టే పేర్లు చూసి ఆ సినిమాహాలు దరిదాపులకే వెళ్ళరూ. తెలుగు వార్తాపత్రికలు ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. తెలుగులో మాట్లాడమంటే అదేదో గ్రాంధికంగా మాట్లాడమనికాదు, అలాగని పాతరోజుల్లోని పద్యాలూ అవీ పాడమనీ కాదూ,మామూలు జనసామాన్యభాషలో మాట్లాడినా చాలు. అదే కరువైపోతోంది.

ఇంక ఇళ్ళల్లోకి వద్దాం.భోజనం చేసేటప్పుడు అన్నంలోకి పప్పూ, దాంట్లోకి నెయ్యి వేసితింటే ఎంతబావుంటుందో. అదేం ఖర్మమో నెయ్యి అంటేనే ఆమడ దూరం పరిగెడుతున్నారు ఈరోజుల్లో. ఎవరో చెప్పారుట, నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందనీ, గుండె జబ్బులొస్తాయనీ, శరీరం పెరిగిపోతుందనీ. వాళ్ళ మొహమేమీ కాదూ, నెయ్యితింటే కాదు వళ్ళొచ్చేది, బయట బర్గర్లూ, సబ్ వేలూ, కుర్కురేలూ చెత్తా చెదారమూ తినీ.ఇదివరకటి రొజుల్లో ఇంట్లో నేతిచుక్క వేయకుండా తిండి పెట్టారంటే చిన్నబుచ్చుకునేవారు. ఇప్పుడు ఇంట్లో నెయ్యుందంటే నామోషీ. పోనీ నెయ్యి మానేయడం మూలాన రోగాలు తగ్గాయా అంటే,అదీ లేదూ, వచ్చే రోగాలొస్తూనే ఉన్నాయి.

ఇలాటిదే పంచదార.హయిగా బతికున్నంతకాలమూ తినేదేదో త్రాగేదేదో త్రాగేసి బతక్క, ఎందుకొచ్చిన గొడవలండి బాబూ ఇవి? ఇదివరకటి రోజుల్లో క్షేమసమాచారాలు ఎలా అడిగేవారో అలాగ, ఎవరింటికైనా వెళ్తే మొదటి ప్రశ్న– ఏదో కాఫీయో, చాయో ఇవ్వాలిగా — సుగరాండీ అని! అలాటిదే ఉప్పొకటి. రుచీపచీ లేకుండా తినే తిళ్ళు ఇళ్ళల్లో దొరక్కే అసలు అందరూ బయటి తిళ్ళకి అలవాటుపడ్డారేమో!

ఇదివరకటి రొజుల్లో “పిచికలు” అనేవుండేవి. గుర్తుందా? నగరాల్లోనూ, పట్టణాల్లోనూ అసలు వీటి మాటే లేదు.శుభ్రమైన నీళ్ళ సంగతి అసలు అడగఖ్ఖర్లేదు.ఎక్కడ చూసినా , ఏ నదిచూసినా కలుషిత నీళ్ళే. ఇలా చెప్పుకుంటూ పోతే,posterity కోసం భద్రపరచవలసిన వస్తువుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అలాగని నేను కూడా తెలుగుభాషని ఉధ్ధరించేస్తున్నాన కాదూ, ఈ టపా కూడా పూర్తిగా తెలుగులో ఎక్కడ వ్రాసి ఏడ్చానూ, పూర్తిగా అర్ధం అవడానికి, అక్కడక్కడ ఇంగ్లీషు పదాలు వాడవలసొచ్చినందుకు క్షమించండి.

2 Responses

 1. తెలుగు భాష ఇంత వరకు ఇతర భాషలనుండి
  పదాలను తనలో కలుపుకొని సుసం పన్నమైయ్యింది
  ఇప్పుడు ఆంగ్ల భాష వెల్లువలో చిక్కి శల్య ప్రాయమౌతుంది.

  Like

 2. డాక్టరుగారూ,

  శల్యమేమిటీ, పూర్తిగా అంతర్ధానమైనా ఆశ్చర్యపడఖ్ఖర్లేదు…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: