బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏం జరిగినా మన మంచికే… అని ఊరికే అనరు…

    ఎప్పుడైనా మనం ఊహించినది జరక్కపోతే అయ్యో అని నిరుత్సాహపడిపోతాం.కానీ దేవుడిమీద నమ్మకం ఉన్నవారు,positive గా ఆలోచించి,గత అనుభవాలు దృష్టి లో పెట్టుకుని, అలా జరగడం కూడా మనమంచికేనేమో అనుకుంటారు.అలాగని ప్రతీదీ అదే దృష్టి చూడలేమనుకోండి.నూటికి తొంభై పాళ్ళు అలా అనుకునే పరిస్థితులుంటాయి.

    మాకు ఈ ఊళ్ళో చాలామట్టుకు తెలుగు సినిమాలు, మన రాష్ట్రంలో రిలీజైన రోజే ఇక్కడా రిలీజవుతూంటాయి. ఏదో ఏ రెండు నెలలకో వెళ్తూంటాము. ఆ సందర్భంలోనే శ్రీరామరాజ్యం, షిరిడీ సాయీ, దూకుడూ, సీతమ్మవాకిట్లో… లాటి సినిమాలూ చూడకలిగాము. ఒక్కో సినిమా కెళ్ళాలంటే ఓ అయిదువందలనోటు అవుతూంటుంది ఇద్దరికి టిక్కెట్టూ+రానూపోనూ ఆటో ఖర్చూ.మరీ పెన్షనర్లం కదా, ఆచి తూచి వెళ్తూంటాం.ఎట్టాగూ ఇదివరకటి రోజుల్లోలా కాకుండా, త్వరగానే టీవీ లో వచ్చేస్తున్నాయీ, అప్పుడే చూడొచ్చులే అనే ఓ కారణం ఒకటీ. ఆమధ్యన వచ్చిన ” మిథునం” ఇక్కడ రిలీజవలేదాయె. ఇక్కడేమిటిలెండి, ఆంధ్రదేశంలోనే చాలా ప్రదేశాల్లో అవలేదు. కానీ ప్రతీవాడూ అడిగేవాడే–” మిథునం” చూశారా అంటూ. ఏం చేస్తాం ప్రాప్తంలేదూ అని సమాధానం చెప్పేయడం.ఈమధ్యనే ఆ సినిమా డివీడీ కూడా వచ్చేసిందీ అని ఊరించేవారు కొందరూ.చివరకి ఎలా తయారయిందంటే ” మిథునం” సినిమా చూడనివాడు కూడా మనిషేనా, వాడిదీ ఓ బతుకా అన్నంతగా. భాగ్యనగరంలో ఉండేవారిని కాళ్ళట్టుకుని, ఎలాగోలాగ ఆ డీవీడీ ఏదో తెప్పించుకుంటేనే కానీ, మన బతుక్కో అర్ధంలేదూ అన్నంతగా. మొన్న భాగ్యనగరం వచ్చినప్పుడు, నిజం చెప్పాలంటే ప్రయత్నమూ చేయలేదూ, టైమూ లేదూ. ఓ గొడవొదిలిందిలే అనుకున్నాను.

   తెలుగు డీవీడీలు పూణే లోకూడా త్వరగానే వస్తూంటాయి. పోనీ ఆ షాపుకెళ్ళి అదేదో చూద్దామా అనుకుని, నిన్న సోమవారం కొట్లుండవూ అనేసికుని, మానేశాను.తీరా ఇంటికొచ్చేసరికి తెలిసింది వరూధిని(జిలేబీ) గారు, ఆ సినిమాని నెట్ లో పెట్టారూ అని.చూశారా ఆవిడధర్మమా అని నయాపైస ఖర్చుపెట్టఖ్ఖర్లేకుండా,మేమూ ఆ “మిథునం” చూసేసి, తరించిపోయి, మా జీవితాలకి ఓ అర్ధం అంటూ ఏర్పరిచేసికున్నాము..ఈఊళ్ళో ఆ సినిమా వచ్చినా, నాకు డీవీడీ దొరికినా అయిదారువందలు చమురు వదిలేదికదూ..నాకు ఈ సినిమామీద ఒక్కపైసా కూడా ఖర్చుపెట్టఖ్ఖర్లేదని రాసున్నప్పుడు పై చెప్పిన ఏదో ఒకటి జరిగేదే.అందుకే అన్నాను, “ఏం జరిగినా మన మంచికోసమే” అని.

    ఇంక సినిమా సంగతంటారా, అందరూ పొగిడేస్తున్నంత అద్భుతంగా ఏమీ లేదు. శ్రీరమణగారు తొంభైల్లో వ్రాసినప్పుడు, అప్పదాసు గారంటే, అందరూ “ ఓ రూపానికి” ప్రాణం పోసేసికున్నారు. అలాగే బుచ్చిలక్ష్మి గారూనూ. వారిలో మన తాతయ్యలనీ, అమ్మమ్మా/నానమ్మ లనీ ఊహించేసికున్నాము.అలాటిది సినిమాలో బాలసుబ్రహ్మణ్యం ఆ పాత్రకి misfit అని నా అభిప్రాయం.మొదట్లో మిథునం చదివినప్పుడు, చివరి ఘట్టానికి వచ్చేటప్పటికి, కళ్ళంట జలజలా కన్నీళ్ళొచ్చేసి, నోట్లో కొంతసేపటిదాకా మాటే రాలేదు. శ్రీరమణ గారికి 1998 లో నా అభిప్రాయం తెలియచేస్తూ ఉత్తరం వ్రాసినప్పుడు కూడా, ఆ ఇన్లాండ్ కవరు మీద నా కళ్ళనుండి జారిన కన్నీళ్ళు పడ్డట్టు గుర్తు. కథలో పటుత్వం అంతలా ఉంచారు శ్రీరమణ గారు.అలాగే తరువాత సరసభారతి శ్రీ గబ్బిట ప్రసాద్ గారు కూడా “మిథునం” కథ చదివి ఆడియో ద్వారా బ్లాగులో పెట్టారు. అక్కడకూడా చివరి ఘట్టానికొచ్చేసరికి, ఆయన గొంతుక గద్గదమయిపోయింది. నేను చెప్పేదేమిటంటే, ఒక పాత్రని రచయిత సృష్టించినప్పుడు, ఆ పాత్రలో మనమూ లీనమయ్యేదెప్పుడంటే ఇదిగో నాకూ, శ్రీ ప్రసాద్ గారికీ జరిగినట్టు. అలాగని మేమొక్కళ్ళమే కాదు, మిథునం చదివిన ప్రతీపాఠకుడికీ ఇదే అనుభవం కలిగుండాలి. అప్పదాసుగారి పాత్రను అంత అద్భుతంగా చెక్కారు శ్రీరమణ గారు.ఈ సినిమాలో అసలు అలాటి అనుభూతే కలగలేదు. మామూలుగా కొన్ని దృశ్యకావ్యాల్లో చూసినప్పుడు, అనుకోకుండానే పాత్ర చితీకరణ చూడగానే వహ్వా..వహ్వా.. అనడానికికూడా గొంతుక్కి ఏదో “అడ్డం” వస్తుంది.అలాటిది ఇక్కడ రాలేదంటే పాత్ర ఎంత “ఫీకా” గా ఉందో తెలుస్తుంది.

    అలాటప్పుడు ఆ కథని చలనచిత్రంగా రూపొందిస్తున్నప్పుడు, మనకీ కొన్ని expectations ఉండడంలో తప్పులేదు. కానీ అప్పదాసు పాత్రకీ, బాలూకీ అసలు పోలికే లేదు.శ్రీరమణ గారు అప్పదాసుగారిలో చిత్రీకరించిన గంభీరమే లేదు.ఏదో రెండే పాత్రలతో చిత్రంతీసేద్దామనే తొందరే తప్ప, మిగిలిన పాత్రలు ఉదాహరణకి కథ చెప్తూన్న మేనల్లుడూ, అతని తల్లితండ్రులూ,శ్రావణ పేరంటమూ వగైరా ..వగైరాలు కూడా పెడితే ఇంకా నిండుతనం వచ్చేదేమో. అలాగే,ఏదో మూలకథ చదివి తాదాత్మ్యం చెందిన పాఠకులు ఏదో బాధపడతారేమో అని అక్కడక్కడ కొన్నిసంఘటనలు ఇరికించినట్టు కనిపించింది కానీ, అప్పదాసూ, బుచ్చిలక్ష్మీ ల character build up ఎక్కడా కనిపించలేదు.ఏదో మనల్ని మెప్పించడానికి “పుష్పవిలాపం” వినిపిస్తేనే ఆ సినిమా కళాఖండం అయిపోతుందా? ఏమో మరి భరణి గారికే తెలియాలి. ఇంక దూదేకడం, కుండలు చేయడం అవసరమంటారా?
బుచ్చిలక్ష్మి గారి పాత్రలో లక్ష్మి అమోఘంగా నటించారు. అందులో సందేహానికి చోటులేదు.

    2000 సంవత్సరంలో శ్రీ వాసుదేవన్ నాయర్ గారు ” మిథునం” కథ విని, దానిని మొట్టమొదటగా చలనచిత్రంగా నిర్మించారు. పోలికలు చూస్తారేమో అని “ఒరు చెరు పుంచిరి”, నెట్ అంతా వెదికి పట్టుకున్నాను. Sub Titles(11 clip లుంటాయి) ఉన్నాయి, ఒకసారి చూడండి.అప్పుదాసు పాత్రకి ఆయన ఇచ్చిన నిర్వచనమూ, తనికెళ్ళవారి నిర్వచనమూ తెలుస్తుంది.“పొరుగింటి పుల్లకూరా” అని అనుకోకుండగా,మనవాళ్ళకంటే పరాయివాళ్ళవే నచ్చుతాయి మీకూ అని తిట్టకుండగా, నేను చెప్పినదానిలో అతిశయోక్తి ఏమైనా ఉందేమో మీరూ చెప్పండి. ఆ చిత్రంలో కూడా, మూలకథలో లేని ఎన్నెన్నో సంఘటనలు చొప్పించారు, కానీ అవన్నీ character build up సంబందితమే. అందుకేనేమో ఆ సినిమా అన్నన్ని International Film Festivals లో చూపించారు. మరి భరణిగారి “మిథునం” ఆ స్థాయికి చేరుకోలేక,అన్నన్ని గౌరవాలు, ప్రశంసలూ సంపాదించలేకపోతే, ఇంక ప్రతీవారి నోటా ” అవునండీ తెలుగువాడంటేనే అసలు పడదూ ఎవరికీ, మనకేమైనా lobby లున్నాయా ఏమిటీ..” లాటి విమర్శలు వినాల్సొస్తుంది. కొంచం వినడానికి బాగోపోవచ్చుగానీ, శ్రీ తణికెళ్ళ భరణి గారి “మిథునం” నాకైతే ఓ పేద్ద disappointment. ఆ మళయాళం సినిమా చూసిన తరువాతైతే మరీనూ..మీరు తిట్టినా సరే, అప్పదాసుగారన్నట్టు “నిరక్షర కుక్షీ..” అన్నా సరే మీ ఇష్టం…

   ఆ సినిమా చుసిన తరువాత బాధ భరించలేక, మూల కథని మళ్ళీ ఇంకో సారి( ఇప్పటికి కొన్ని వందలసార్లు చదివాను) చదివి శ్రీరమణ గారు సృష్టించిన అప్పదాసు గారినీ,బుచ్చిలక్ష్మిగారినీ చదివి తరించాను.

%d bloggers like this: