బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- పాత సరుకుల్లో ఉండే నాణ్యం….


    సంసారం లోకి వస్తువులు సమకూర్చుకోడానికి ఇదివరకటి రోజుల్లో చాలా కాలం పట్టేది. కారణాలు అందరికీ తెలిసినవే. ఎన్నిసార్లు వ్రాసినా ఆ కారణాలు ( డబ్బు, ఎవైలబిలిటీ) తప్ప ఇంకోటి తట్టదు నాకైతే మాత్రం. ఈ రోజుల్లో అలా కాదు. మనస్సులోకి రావాలే కానీ, క్షణంలో వచ్చేస్తుంది రెక్కలు కట్టుకుని. ఇప్పటి పవర్ అలాటిది మరి. ఇంటి యజమానిక్కావొచ్చు, యజమానురాలిక్కావొచ్చు, లేదా వారి ” ఆంఖోం కా తారా” లకి కావొచ్చు, next moment లో మనింట్లో ఉండాలి అంతే! అవసరం ఉందా లేదా అన్నది వేరే విషయం ! ప్రతీ నిముషమూ హోరెత్తే యాడ్లలోది కావొచ్చు, లేక ఏ exhibition లోనో చూసుండొచ్చు, యదాలాపంగా పేపరులోనో, లేక ఏ mouthshut.com లోనో ఆ వస్తువుగురించి రివ్యూ చదివుండొచ్చు, కారణాలకేమిటీ, కావలిసినన్ని చెప్పొచ్చు. మనింట్లో ఉందా లేదా అదీ కొచ్చను !

సరుకు కొంపలోకి తేవడంలో ఉన్న ఉత్సాహం, దాన్ని working condition లో ఉంచడానికుండదు. ఏదో ఆ వస్తువుని ప్రతీ రోజు కాకపోయినా, నెలకోసారో, పదిహేను రోజులకోసారో దాని అతీ గతీ తెలుసుకుంటూండాలి. లేకపోతే ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు పనిచేయడం మానేస్తుంది. తూర్పుకి తిరిగి దండం పెట్టడం తప్ప ఇంకో గతుండదు. మనం exhibition లలో ఎన్నెన్నో వస్తువులు చూస్తాము. ప్రత్యేకం కిచెన్ కి సంబంధించినవి. ఆ కొట్టువాడు కూరలు ఓ special shape లో కట్ చేసి చూపిస్తాడు. చుట్టూ ఉన్న మనుష్యులు నోరెళ్ళబెట్టి వాహ్ .. వాహ్ అంటూ చూసేసి కొనేయడం, వాళ్ళని చూసి ఇంకో నలుగురూ. అసలు ఆ కూరలు special shape లోనే కట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని ఒక్కళ్ళూ ఆలోచించరు. పోనీ ఏదో సరదా పడి కొన్నారే, ఇంటికెళ్ళిన తరువాత ప్రయత్నిస్తే, ఛస్తే ఆ కొట్టువాడికొచ్చినట్లు రాదు. హాయిగా అలవాటుగా ఏ కత్తిపీటో దిక్కు. ఆ
exhibition లో కొన్నది ఏ పాత సామాన్లలోనో పడుంటుంది.

ఇదివరకటి రోజుల్లో చాలా కాలం ఇళ్ళల్లో భోజనం చేయాలంటే హాయిగా ఓ పీటేసుక్కూర్చునేవారు. తాహతుని బట్టి ఆ పీటలకి నాలుగువైపులా వెండి పువ్వులుండేవి. ఇంటి పెద్దకే ఆ ప్రివిలేజ్! కాలక్రమేణా, ఆధునిక ఫాషన్లొచ్చేటప్పటికి dining tables వచ్చాయి. కుటుంబ సంఖ్యని బట్టి నాలుక్కుర్చీలదో, ఆరు కుర్చీలదో సెట్లు. కుటుంబం అంతా నిర్ణీత సమయం లో దాని చుట్టూరా కూర్చుని భోజనం చేయడం. మంచి టేకు కర్రతో చేయించేవారు. తరువాత్తరువాత ఫోల్డింగు టైపువి వచ్చాయి. ఎలాటిదైనా dining tables ఓ స్టేటస్ సింబలు. కింద కూర్చోడానికి వళ్ళొంగడం లేదు, వయస్సుతో పనిలేకుండా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ దగ్గరనుండీ ఈ టేబిల్స్ కే అలవాటు పడిపోయారు. మోకాళ్ళనొప్పులతో నుంచుంటే కూర్చో లేరు, లేస్తే కూర్చో లేరూ, ఇదే హాయిగా ఉండేది.

ఒక్క భోజనానికే కాదు, పిల్లలు చదువుకునేటైములో వాళ్ళ హోం వర్కులూ, ప్రాజెక్టులూ, పసిబిడ్డకి స్నానం చేయించి, ఓ బొంతోటి వేసి దానిమీదే పొడుక్కోపెట్టడం దాకా అన్నీ ఆటేబుల్ మీదే! ఆ టేబుల్ మన జీవితంతో అంతగా పెనవేసుకుపోయింది. అందుకే, ఈనాటి ఎపార్ట్మెంటు కల్చర్ లో కూడా అది ఒక భాగం అయిపోయింది. ఎన్ని పాత సామాన్లు మార్చినా, ఈ టేబుల్ మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. పైగా సెంటిమెంటోటీ! రోజులు మారే కొద్దీ, చెక్కతో చేసిన టేబిళ్ళు ఫాషన్ కాదని, గ్లాసు టేబిళ్ళొచ్చాయి. వాటి కాళ్ళు చెక్కతో చెసినవే, కానీ టాప్ మాత్రం గ్లాసుది. చూడ్డానికి మహ స్టైలుగా ఉంటుంది. స్థలమూ తక్కువే ఆక్రమించుకుంటుంది. కానీ దానికి ఇదివరకటి చెక్క టేబిళ్ళకుండే ఓపికెక్కడిదీ?

ఓ ఏడాదో ఏణ్ణర్ధానికో ఆ కాళ్ళు కాస్తా ఊడుతాయి. కాలూడిపోయింది కదా అని బయట పారేయలేము కదా, మళ్ళీ దాన్నతికించుకోడానికి ఎవడిదగ్గరైతే కొన్నామో వాణ్ణే కాళ్ళా వేళ్ళా పడి బాగుచెయించుకోడం. పోనీ బాగుచేయించాము కదా అని జీవితాంతం ఉంటుందా అంటే అదీ లేదూ, వచ్చే ప్రాణం పోయే ప్రాణమూనూ.

ఈ గోలంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, మేము రాజమండ్రీలో కాపరం పెట్టినప్పుడు, అలాటిదే ఓ గ్లాస్ టాప్ టేబులు కొన్నాము. మా స్వంత ఇంట్లో మేము 1975 లో కొన్న చెక్క టేబుల్ గుండ్రాయిలా ఉంది. కొత్తగా కొన్నది మాత్రం ఇప్పటికి రెండు సార్లు రిపేరీకొచ్చింది. మా అమ్మాయి వాళ్ళింట్లో అయితే, ఓ రోజున దభేలు మని విరిగే పోయింది. ఇంకో మాటలేకుండా, హాయిగా చక్క టెబుల్ కొనేశారు. మాదగ్గరున్న టేబుల్ కి ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. మా అగస్థ్య వచ్చినప్పుడల్లా, దాని దగ్గరకి వెళ్ళకుండా, కాపలా కాయడంతోనే సరిపోతోంది. చెక్క టేబిలైతే, ఇంకో సదుపాయం ఉండేది,ఎప్పుడైనా కోపం వస్తే బల్ల గుద్ది మరీ చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలాటి పనిచేస్తే టుపుక్కున పగులుతుంది. హాయిగా బల్లమీద కొట్టడానికి కూడా వీల్లేని బతుకేం బతుకండీ?

కొత్తగా కొంప కొన్నప్పుడు, దానికి అలంకారాలు చేయడం ఓ అలవాటైపోయింది. మన సరుకులన్నీ అందరికీ కనిపించేలా ఉంచడానికి, ప్రతీ షెల్ఫుకీ గ్లాసు ఉపయోగించడం. ఇంట్లో చిన్న పిల్లలుంటే ఇంక ఆ గ్లాసు సంగతి దైవాధీనమే. ఎప్పుడు వాళ్ళు విసిరిన బాల్ తగిలి పగులుతుందో తెలియదు. ఎన్ని చెప్పండి పాత సరుకుల్లో ఉన్న నాణ్యం మాత్రం ఎక్కడా దొరకదు.

5 Responses

  1. > హాయిగా బల్లమీద కొట్టడానికి కూడా వీల్లేని బతుకేం బతుకండీ?
    > ఎప్పుడైనా కోపం వస్తే బల్ల గుద్ది మరీ చెప్పేవాళ్ళం.
    బాబు గారు, అయినా ఇప్పుడు మీకు అంతలా బల్లగుద్ది చెప్పవలిసిన సందర్భాలు ఏమున్నాయబ్బా?

    Like

  2. బాగా చెప్పారండీ…
    మా ఇంట్లో కూడా ఒక విరిగిపోయిన డైనింగు టేబులు ఉంది. (సామాన్లు పెట్టుకోవడానికి వాడుతున్నాం)

    ప్రస్తుతానికి కింద కూర్చునే తింటున్నాం కాకపొతే పెద్దవారు వచ్చేలోపు ఒకటి కొనుంచాలి…
    అదేదో ఇప్పుడే చెయ్యొచ్చు కానీ ఇలా నడుస్తుంది కదా నడిపించెయ్యటమే….

    Like

  3. నేనిలా అంటే కోపం వద్దూ. వస్తువు కావాలా? అక్కరలేదా అనేదానితో సంబంధం లేదు, ఆలోచన లేదు, ప్లానింగులేదు, కనపడిన వస్తు ఉపయోగం ఎంత అన్న ఆలోచన లేదు. మన ఇంటికి సరిపోతుందా లేదు. కొనెయ్యె తెచ్చెయ్యి.ఇది బాగా అలవాటయి పోయింది. పాత వాటిని పారెయ్యలేము. కొత్తవి పనికిరావు.Consumer and exhibitionism culture

    Like

  4. /హాయిగా బల్లమీద కొట్టడానికి కూడా వీల్లేని బతుకేం బతుకండీ?/
    హ్వ..హ్వ్హా..హ్వా
    మీ కొత్త డైనింగ్ టేబుల్ బల్ల గుద్ది మరీ చెప్పగలను – మీరు చెప్పింది రైటని, ఏకీభవిస్తున్నాను … మడమ తిప్పే ప్రసక్తి లేదు… అంతే!

    Like

  5. @మిత్రాగారూ,

    ఏమిటో అదో సరదా! చిన్న చిన్న సరదాలు కూడా తీర్చుకోకూడదా!!!

    @Maddy,

    ఆ పనేదో త్వరలో కానిచ్చేస్తే మంచిది.

    @శర్మగారూ,

    నిజమే.

    @SNKR,
    నా అభిప్రాయం తో ఏకీభవిస్తున్నందుకు ధన్యవాదాలు.

    Like

Leave a comment