బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— ఇంటావిడతో సిణేమాకి….


    నేను బ్ల్లాగులు వ్రాయడం కొత్తగా మొదలెట్టినప్పుడు, నా శ్రీమతిని “ఇంటావిడ” అని సంబోధించినప్పుడు, ఒకాయన వ్యాఖ్య పెట్టారు- ” ఇంటావిడ అంటే ఇల్లుగలావిడా అని అర్ధం వస్తోందీ, భార్య అనో శ్రీమతి అనో అనొచ్చు కదా”. అదేమిటండి బాబూ , మావైపు ఇంటావిడ అంటే, భార్యనే అర్ధం, పైగా ఊళ్ళోవాళ్ళందరినీ అనడం లేదుగా, ఆవిడకి లేని అభ్యంతరం మీకెందుకూ అన్నాను. ఈ టపాకి అందుకే శీర్షిక పెట్టాను. అఛ్ఛంగా, నిఝంగా మా ఇంటావిడతోనే ఈవేళ సినిమాకి వెళ్ళాను “I swear in the name of God….”.

    ఏదో క్రిందటి వారం అంతా ఇంటావిడ ధ్యాసే. పోనీ కొసమెరుపుగా ఓ సిణేమా కూడా చూపించేస్తే బావుంటుందీ అనుకొని, నిన్న టిక్కెట్లు కొన్నాను. ఈమధ్యన ఎప్పుడైనా సినిమాకెళ్ళిన మొహమా నాదీ. ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంలో రాజమండ్రీలో ఓ సినిమా చూశాము. టిక్కెట్టు ధర 50 రూపాయలు. తీరా నిన్న టిక్కెట్టు కొన్నప్పుడు, రెండు టిక్కెట్లకీ కలిపి, ముక్కు పిండి, 250 రూపాయలు తీసికున్నాడు! వామ్మోయ్, ఎప్పుడో చిన్నప్పుడు అమలాపురం కమలేశ్వర లో బాల్కనీ కి టిక్కెట్టు ఒక రూపాయి, ఒక్క అణా ! టిక్కెట్టుకే గూబ గుయ్యిమంది కదా, ఈ మాత్రం దానికి మళ్ళీ ఆటో కూడా ఎందుకూ అనుకుని, నిన్న మా ఇంటావిడ ఏదో పనిలో ఉన్నప్పుడు, జనాంతికంగా టిక్కెట్ట్లు తీసికున్నానూ, బస్సులోనే వెళ్దామూ అన్నాను. అప్పటికీ గయ్యిమంది. ఇప్పుడు సినిమా ఏమిటండీ, పిల్లలేమనుకుంటారూ , ఏదో వేరే ఊళ్ళో ఉంటే ఫరవాలేదు కానీ, ఒకే ఊళ్ళో ఉంటూ, మనం సినిమాలంటూ తిరిగితే బావుంటుందా అని. ఎప్పుడు చూసినా పిల్లలూ పిల్లలూ అనడమే కానీ, మనకీ టైంపాసంటూ ఒకటుండాలి కదా అని ఆవిణ్ణి సముదాయించాను. మొత్తానికి ఒప్పుకుందండి.

    పొద్దుటే లేచి పనులన్నీ పూర్తిచేసింది. పాలు కాచేసి, ఆ గిన్నెని నీళ్ళల్లో పెట్టేస్తే హాయిగా అవి చల్లారేక ఫ్రిజ్ లో పెట్టేయొచ్చుకదా అంటే, మా ఇంటావిడకి ఈ cryogenic treatment నచ్చదు. పాలు సరీగ్గా తొరక పట్టవూ అంటుంది. ఏదో పూర్తి చేసి బయలుదేరాము. ఆటోలు ఉండే వైపు వెళ్ళబోతుంటే, కాదూ బస్సులోనూ అన్నాను, నిన్ననే చెప్పానుగా అంటే, నాతో ఎప్పుడన్నారూ అని, ఏదో మొత్తానికి బస్సులోనే ఎక్కడానికి ఒప్పుకుంది. అప్పుడప్పుడు, నాలాటి అర్భకులు బస్సుల్లో ఎలా ప్రయాణం చేస్తారో అన్నది కూడా తెలియాలి కదా. ఎప్పుడూ, ఆరోగ్యకరమైన పదార్ధాలే తింటూ, మినరల్ వాటరే తాగడం కాదు, అప్పుడప్పుడు రోడ్డు పక్కనుండే ” చెత్త” పదార్ధాలు కూడా తింటేనే, మన శరీరంలో anti bodies బయలుదేరి, రోగనిరోధ శక్తి పెరుగుతుందట! అప్పుడెప్పుడో ఎక్కడో చదివానులెండి, అవసరార్ధం ఉపయోగిస్తూంటాను.

   బస్సులో కూర్చోడానికి సీటు దొరకలేదు. వెనక్కి తిరిగి ఆవిణ్ణి చూసే ధైర్యం లేదు. పాపం, బస్సు సడెన్ బ్రేక్ వేసినప్పుడల్లా భరతనాట్యం చేసేస్తోంది. ఎలాగోలాగ నిలదొక్కుకుంటోంది, ఇంతలో ఎవరో ఒకతను, తన సీటు లోంచి లేచి, నన్ను కూర్చోమన్నాడు. మరీ బావుండదు కదా అని, మా ఇంటావిణ్ణి పిలిచి కూర్చోమన్నాను. నేను సీటు మీకు ఆఫర్ చేస్తే, మీరేమిటీ ఆవిడెవరికో ఇచ్చేశారూ అంటే, ఆవిడెవరో కాదుబాబూ, నా జీవిత భాగస్వామీ, నా హృదయ సామ్రాజ్ఞీ … వగైరా వగైరాలు చెప్పి ఊరుకోపెట్టాను!

   మొత్తానికి థియేటరు కి వెళ్ళి చూద్దుం కదా అందులో ఉన్నవారు అక్షరాలా “పరక” ( మా కోనసీమ లో పరక అంటే పదమూడు) ప్రాణులున్నారు. సినిమా ఏమిటీ “దూకుడు”. ఏదో బ్లాగుల్లోనూ, చానెళ్ళలోనూ హోరెత్తించేస్తున్నారు కదా, అదేమిటో మనమూ చూస్తే పుణ్యమైనా దక్కుతుందీ అనుకుని వెళ్తే అదండి విషయం!

    సినిమా విషయానికొస్తే, ఏదో బావున్నట్లే అనిపించింది. కథా వ్యవహారం పాతదే అయినా, కామెడీ బాగుంది. అప్పుడప్పుడు ఇలాటివి కూడా చేస్తేనే కదా రిలాక్సేషన్. కానీ మా ఇంటావిడ వీటినేమీ గుర్తించకుండా ఓ టపా పెట్టేసింది. చెప్పానుగా మంచివాళ్ళకి రోజులు కావండి బాబూ…..

Advertisements

9 Responses

 1. మా గోదావరి జిల్లాలో కూడా పరక అంటే పదమూడే! కాని ఒకటి ఎక్కువ వేస్తాడు కనుక పద్నాలుగు వస్తాయి. పఱక అని రాస్తారని గుర్తు!

  Like

 2. మొత్తానికి సిణెమాచూసి తరించారన్నమాట. రసఙ్ఞ గారూ పరకంటే 13 మాత్రమే. డజను అంటే 12 దానికి పైన ఒకటి ఫ్రీ అప్పుడు దాన్ని పరక అని గో.జి ల వాడకం.

  Like

 3. కష్టేఫలే శర్మ గారు
  నేను కూడా పఱక అంటే పదమూడనే అన్నా. కానీ నేనెప్పుడైనా మా రాజమండ్రీలో ఏవండీ ఒక పఱక మామిడి పళ్ళు ఇవ్వండి అంటే అసలు పదమూడు వేసి కొసరు ఒకటి ఎక్కువ వేస్తాడు అలా పద్నాలుగు అని చెప్పా.

  Like

 4. @రసజ్ఞ గారూ,

  మరీ “మా గోదావరి జిల్లా” అనఖ్ఖర్లేదు. మాదీ అక్కడే, అదీ అమలాపురం !!

  @శర్మగారూ,

  ఏదో ఒకటి లెండి. అక్కడున్నవాళ్ళు మాత్రం 13.

  Like

 5. బాబాయ్ గారూ..
  మాంచి ‘దూకుడు’ మీదున్నట్లున్నారు.. ఈ మధ్య షాపింగులు.. సినేమాలు.. అబ్బో. 🙂

  Like

 6. >>> అఛ్ఛంగా, నిఝంగా మా ఇంటావిడతోనే ఈవేళ సినిమాకి వెళ్ళాను “I swear in the name of God….”.

  ఈ వాక్యం లో ఏదో తిరకాసు ఉన్నట్టనిపిస్తోంది. యే క్యా హై ?

  >>>ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంలో రాజమండ్రీలో ఓ సినిమా చూశాము…………

  మళ్ళీ గాంధీల కాలం లో కానీ సినిమాకి తీసుకెళ్ళడం కుదరలేదన్నమాట.

  >>>ఈ మాత్రం దానికి మళ్ళీ ఆటో కూడా ఎందుకూ అనుకుని,……

  పొద్దున్నించి కష్టపడి పాలు కాచి తొరక కట్టించి ఆవిడ రెడీ అయితే అంత మాట అనడానికి మీకు మనసు ఎలా ఒప్పింది అని ప్రశ్నిస్తున్నాను.

  Like

 7. @సుబ్రహ్మణ్యం గారూ,

  మీలాటివారు నా “శీలాన్ని” శంకిస్తారనే, మా ఇంటావిడ పెట్టిన టపాని ఓ affidavit లా ప్రస్తావించాను. ఔనులెండి, కనిపించినవాళ్ళందరూ ఇలియానాల్లాగా, జెనీలియాల్లాగ కనిపిస్తున్నప్పుడు, ఏం అని లాభం లెండి !!!!

  @శ్రీనివాసా,

  చేయవలసిన వయస్సులో, చేయవలసినవాళ్ళు చేయకుండా, ఫిలసాఫికల్ మోడ్లలోకి వెళ్తూంటే ఇలాగే ఉంటుంది నాయనా !!!!

  Like

 8. Oh I see ! allaagaa, Jeniliya evarandi ?

  Like

 9. సుబ్రహ్మణ్యం గారూ,

  మీరే చెప్పాలి జనీలియా ఎవరో ….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: