బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   ఈ వీకెండు చాలా చాలా బిజీ అయిపోయాము. శుక్రవారం నాడు, అకస్మాత్తుగా మూడు ఫోన్లు. నా మిస్టరీ షాపింగు ఏజన్సీల దగ్గరనుంచి. ఒకటేమో మా ఇంటావిడకి, మిగిలినవి నాకు! ఇంటావిడకి Shopperstop చేయమని. అక్కడకది సరిపోదేమో అని, వాళ్ళే ఇంకో Shopperstop కూడా చేయమని నన్నూ. వాళ్ళతో మాట్లాడడం పూర్తయిందో లేదో, ఇంకో ఏజన్సీ నుంచి, మూడు- రెండు SOTC బ్రాంచీలూ, ఒక Lawrence & Mayo కళ్ళజోళ్ళ షాపు చేయమని. క్రిందటి వారమే Cox & Kings వాళ్ళది చేసి రిపోర్ట్ ఇచ్చాను.
మొత్తానికి శని ఆది సోమవారాల్లో ఈ అయిదూ పూర్తిచేసి వచ్చాము. ఇంతలో మళ్ళీ మెయిలూ, ఇంకో చోట ఓ Shopperstop ఉందిట, ఏడో తారీకు లోపల చేయమని! మొత్తం ఆరు ఆడిట్లు. కాలక్షేపం మాత్రం బలేగా అవుతోందిలెండి. ఇంత హడావిడిలోనూ, నిన్న( ఆదివారం) అల్లుడూ,అమ్మాయీ మనవడూ, మనవరాలూ మేముండే ఇంటికి వచ్చి భోజనం చేసి, ఓ మూడు గంటలు గడిపి వెళ్ళారు.

   మేమేం తక్కువా అని, అబ్బాయీ కోడలూ మనవరాలూ,మనవడూ ఈవేళ ప్రోగ్రాం పెట్టుకుని వచ్చారు. అసలు ఈ నాలుగు రోజులూ ఎలా గడచిపోయాయో తెలియలేదు! రెండు రిపోర్టులు వ్రాసేశాను. ఇంక మూడింటివి వ్రాయాలి. ఒక్కొప్పుడనిపిస్తూంటుంది, భగవంతుడు ఇలా చల్లగా చూస్తూ, మా కాలక్షేపం ఏదో మాకుంచి, రోజులు వెళ్ళగలిగేటట్లు చూస్తే చాలూ అని.

   మొన్నెప్పుడో స్టేషన్ కి వెళ్ళాను, తెలుగు పుస్తకాలకోసం, బస్సులోంచి కనిపించిందీ, ఓ ఊరేగింపు, చేతుల్లో placards పట్టుకుని, నినాదాలు చేస్తూ కలెక్టరాఫీసుకి ఊరేగింపుగా వెళ్తున్నారు. ఆ ఊరేగింపు కనీసం ఓ కిలోమీటరు పొడుగుండుంటుంది. అయినా సరే, వాళ్ళ దారిన వాళ్ళెడుతున్నారే తప్ప, సామాన్య ప్రజలకి ఎటువంటి సమస్యా ఇవ్వలేదు. ట్రాఫిక్కు కి ఆటంకం లేదు. ఏదో షేత్కరీ ( రైతు సంఘం లాటిదన్నమాట) ఊరేగింపనుకుంటా. చెప్పొచ్చేదేమిటంటే, మన తెలుగు చానెళ్ళు ఏరోజు చూసినా, భాగ్యనగరం లో బందులూ, ఊరేగింపులూ, పోలీసు లాఠీ చార్జీలూ, సామాన్య ప్రజానీకం ఒక్కరోజైనా తెరిపిగా ఉన్నారని అనుకోను. ఎక్కడో బయటి రాష్ట్రంలో ఉంటూ, ఆంధ్రదేశం గురించి, అక్కడి సమస్యల గురించీ, మీకేం తెలుసునూ అని అడగొచ్చు. సమస్యలనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ మహరాష్ట్రలో మాత్రం లేవా? ఛాన్సొస్తే విదర్భ విడిగా కావాలని అడిగేవాళ్ళు కావలిసినంత మందున్నారు. అలాగని రైళ్ళూ, బస్సులూ, బొగ్గూ, స్కూళ్ళూ, ఆఫీసులూ, దేవాలయాలూ ఆపేస్తున్నారా?

   ఇక్కడ గత యాభైఏళ్ళనుండీ ఉంటున్నాను. ఒక్కసారి కూడా, సామాన్యప్రజానీకం కష్టపడేటట్లు ఉద్యమాలు చూడలేదు. అక్కడికేదో ఇక్కడి రాజకీయనాయకులంతా మహా పతివ్రతలనడం లేదు. కల్మాడీలూ, పవార్లూ, పటేళ్ళు కావలిసినంతమందున్నారు. ఒకళ్ళనిమించినవాళ్ళొకరూ. గుడిని మింగేవాడోటైతే, గుళ్ళో లింగాన్ని మింగేవాడోడు. ఇప్పుడు మనరాష్ట్రం విభజిస్తే వచ్చే నష్టం ఏమిటో తెలియడం లేదు. చిన్న చిన్న రాష్ట్రాలు కావలిసినన్నున్నాయి. పైగా వాళ్ళూ ఒకేభాష మాట్లాడేవాళ్ళే ఉదాహరణకి తమిళనాడు, పుదుచ్చేరి. లేకపోతే యూ.పి, ఉత్తరాంచల్,ఇంకా కాకపోతే బీహార్, జార్ఖండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మరి సెపరేట్ చేయడానికి వస్తున్న సమస్యేమిటో?

   సామాన్య ప్రజానీకానికి, రాష్ట్రం విభజించడం వల్ల ఒరిగేదేమీ లేదు.కాదూ, విభజించమూ అన్నా వచ్చే నష్టమూ లేదు. మరీ వీసాలూ, పాస్పోర్టులూ కావాలనకుండా ఉంటే చాలు!
పోనీ విభజించారూ అనుకుందాము- ఏదైనా మాజిక్కు జరిగిపోయి, చదువుకున్నవాళ్ళందరికీ ఉద్యోగాలొచ్చేస్తాయా? ధరలు ఏమైనా రాత్రికి రాత్రి తగ్గిపోతాయా? గత ముఫై ఏళ్ళనుండీ, కలిసి కాపురాలు చేస్తున్నవాళ్ళేమైనా విడిపోతారా? ఏమీ అవదు. ఈ గొడవలన్నీ తగ్గి హాయిగా ఉంటారు. శుభ్రంగా ఉంటున్నవారిమధ్య ఉత్తిపుణ్యాన్న మనస్పర్ధలు కల్పిస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. అసలు చదువులేమన్నా జరుగుతున్నాయా? ఓవైపున బస్సులేమో బందూ. ఎప్పుడు మొదలెడతారో తెలియదు, తరువాత నష్టాలు పూడ్చడానికి రేట్లు పెంచితే, మళ్ళీ ఈ నాయకులే ధాం ధూం అంటారు. మనవైపు బయలుదేరదామంటే ఒణుకూ, దడానూ. అదృష్టం కొద్దీ, పిల్లలిద్దరూ ఇక్కడే ఉండడంతో హాయిగా ఉంది. ఇంకా రాజమండ్రీలోనే ఉండుంటే వామ్మోయ్, హైదరాబాద్ మీదుగా రావడానికే వీలుండేది కాదూ ప్రస్తుత వాతావరణం లో!

   రాష్ట్ర విభజన మంచిదా కాదా అనే విషయం లోకి వెళ్ళడం లేదు. నేనేమీ అంత అభిప్రాయం వ్యక్తపరిచేటంత intellectual కాదు. అధవా చెప్పినా వినేవాడెవడూ లేడు. అరవ్వాళ్ళ దగ్గరనుండి మనం విడిపోయాము కదా అని, మనవాళ్ళని మద్రాసునుండి తరిమేశారా ఏమిటీ? అలాగే, ఇప్పుడేదో రాష్ట్రం విభజిస్తే కొంపలేమీ అంటుకుపోవు. ఎందుకొచ్చిన గొడవ? ఏదో తొందరగా ఏదో ఒక నిర్ణయం వచ్చేసి, జనం అందరూ సుఖంగా ఉంటే చాలు .

Advertisements

11 Responses

 1. మొదట తెలంగానా ఇస్తె తరువాత రాయలసీమ ఇవ్వవలసి వస్తుంది.

  Like

 2. దావత్ అంటె చాలు ఊర కుక్కలు లాగా వస్తారు

  Like

 3. అన్నిపార్టీలు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు కానీ నా ఉద్దేశంలో దానర్ధం మేము చెప్పిన నిర్ణయమే తీసుకోవాలి అని. అది కాదుపో వాళ్ళు నిజంగా అనేటట్టు అయితే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మర్నాటినుండీ సమ్మెలు బంధులూ ఉండవని ఎవరన్నా రాసిస్తున్నారా?

  Like

 4. అదేంటి సార్! అలా అంటారు? అంత త్వరగా తేల్చేస్తే వాళ్ళ “చేతి”కి మరో పనుండొద్దూ?! ఇంతకాలం కేంద్రంలో మంత్రి పదవిచ్చి నెత్తినెక్కించుకొన్నారు. ఇప్పుడు ఎటూ తేల్చక జనాల్ని బాగా ముంచుతున్నారు. మా రాజమండ్రిలో ఉదయం ఏడు నుంచు కరెంట్ కటింగ్ ఏడుపు మొదలై పట్టుమని పదింటికి
  వచ్చి మళ్ళీ ఒంటిగంటకు ఆ(మ్)ఫ్ (ఫట్)య్యి నాల్గింటికి వస్తుంది ! బొంబాయిలో వున్న పిల్లలు రావాలంటే ఆ హైద్రాబాదుడి నుంచే రావాలి గదా? అసలు
  తప్పంతా సిరివెన్నెల అన్నట్లు “నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాల్ని” అంటూ గట్టిగా పాడాలనిపిస్తున్నది. ఈ గొడవలు ఇప్పట్లో తేలవు గనక మీరు మా
  ఊరు రానట్లే !! అక్కడెలా వుందోగానీ ఇక్కడ ఎండలు దంచేస్తున్నాయ్ !!

  Like

 5. నాకేంటీ! అని అలోచించినంత కాలం ఇలాగే ఉంటుంది మరి. విడతీస్తే నాకేంటి లాభం ఓట్లుపడతాయా, అధికారంలోకి వస్తామా లేదా? ఇదే గోల. మేం ఇక్కడ సంపాదించిన ఆస్థులఏమైపోతాయీ?

  Like

 6. మీ అభిప్రాయంతో నేను విభేధిస్తున్నానండి. ఇక్కడ రాష్ట్రం విభజించడం విభజించాక ఏమవుతుందో అన్నదీ సమస్య కాదు. ఒక ప్రాంత ప్రజలు, మరో ప్రాంత ప్రజలను టోకున దుర్భాషలాడటం, అపద్దాలు ప్రచారంచేయడం, మధ్యవర్తుల(కమిటీ) మాట బేఖాతరు చేయడం, ప్రాతిపదైకన గూడాయిజంకు తలొగ్గి విభజన చేస్తూ పోవాలా? అన్నది పాయింటు.
  రెండు ప్రాంతాల MLAలకు ఓ అసెంబ్లీ అంటూ ఇచ్చాము, రాళ్ళేసుకుని, కేంటీన్లు బంద్ చేసుకుని, జీతాలు తీసుకోకుండా, కొట్టుకు చచ్చి ఓ తీర్మానం చేస్తే, కేంద్రం ఎందుకు కాదంటుంది? మాకు కావలిసింది చేస్తేనే ‘స్పష్టం’ లేదా తిరగనీయం అనే వాదన ప్రజాస్వామ్యమవుతుందా? నిషేదిత మావోల అజెండా పాటిస్తాము అని వాళ్ళు మూర్ఖంగా వాదిస్తూవుంటే … తలవొగ్గి తాంబూలంలో పెట్టి ఇచ్చేయాలా? ఇలా ఎవడికి వాడు రాళ్ళేసి, రాష్ట్రాలు, దేశాలుగా విడగొట్టుకుంటూ పోతే…?!?! అంతం ఎక్కడ? చిన్న రాష్టారాలు మంచి పరిపాలన వుంటుంది అన్నది ఒట్టి నేతిబీరకాయ వాదన మాత్రమే, ప్రాక్టికల్‌గా ఈ దేశంలో ఎక్కడా నిరూపించబడలేదు.

  Like

 7. ‘రైతు సంఘం లాటిదన్నమాట’

  రైతులు పండిస్తే నువ్వు తేరగా భోంచేయటానికి బియ్యం రాళ్లు దొరుకుతున్నాయ్. డబ్బులుంటే బియ్యం రావు. రైతులు పండిస్తేనే కదా వచ్చేది. ‘ఇదేదో రైతుల వూరేగింపూ’ అంటో కామెంట్ చేయటం కాదు. పావు ఎకరం దున్ని బియ్యం రాళ్ళు పండించు. తెలుస్తుంది అప్పుడు రైతులు రోడ్డు పైకొచ్చి వూరేగింపు కోసం ఎందుకొసం వస్తున్నారో ???

  Like

  • శ్రీధర్ గారూ,

   మీకు కాస్త ఆవేశం ఎక్కువలా ఉంది. ఒక పెద్దమనిషిని పట్టుకుని ఆయన సొంత వేదిక మీదికే ఎక్కి ఆయన్ని ఉద్దేశించి మీకు తోచినట్లు రాసేముందు మరోసారి విపులంగా మీరు ఆ టపా చదివుంటే బాగుండేది. ఆ రైతుసంఘం వాళ్ళు ఎంత పద్ధతిగా నిరసన తెలుపుతున్నారో అని వాళ్ళని మెచ్చుకుంటున్నట్టుగా రాసారు ఫణిబాబుగారు. ఆయన టపాలు మీకు నచ్చితీరాలి అని నేను అనడం లేదు. మీ అభిప్రాయం మీది. కాని అది వ్యక్తపరిచిన విధానం చాలా తప్పు అని నేను అభిప్రాయపడుతున్నాను. ముందు మిమ్మల్ని ఏకవచనంతో సంబోధిస్తూ రాసినా, వెంటనే మళ్ళీ అది మార్చాను. ఒకవేళ వయసులో నాకంటే పెద్దవారేమో, కనీసం ఆ వయసుకన్నా గౌరవం ఇద్దామని.

   భవదీయుడు
   వర్మ

   Like

 8. @జ్ఞానీ,

  ఏదో ఒకటీ, పరిస్థితులు త్వరలో చక్కబడుతాయని భావిద్దాం.

  @రావుగారూ,
  సమ్మెలూ బందులూ మాట దేముడెరుగు, కనీసం సాటి తెలుగువారితో మర్యాదగా ఉండొచ్చేమో.

  @గురువుగారూ,

  మీ సింగరేణి “శగ” మాకూ పాకింది. రోజులో ఓ గంట కరెంటు తీసేస్తున్నారు. రాజమండ్రీ కి టిక్కెట్లైతే రిజర్వ్ చేసేశాను. చూద్దాం మీ అందరినీ కలిసే అదృష్టం ఉందో లేదో..

  @శర్మగారూ,
  వచ్చిన గొడవల్లా అదే కదండి బాబూ.

  @SNKR,

  మీరు చెప్పేది కరెక్టే, కాదనము. కానీ ఈ సందిగ్ధ పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళు?

  @శ్రీధర్,

  మీకు నేను వ్రాసినది అర్ధం అవకపోతే ఏమీ చేయలేను. క్రింద వర్మగారిచ్చిన వివరమే నా అభిప్రాయమూనూ.

  @అబ్బులూ,

  థాంక్స్.

  Like

 9. /కానీ ఈ సందిగ్ధ పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళు?/

  63ఏళ్ళు కలిసున్నాము, ఇలానే 100ఏళ్ళు వుండి ఆంధ్రరాష్ట్ర శతావిర్భోత్సవం జరుపుకోలేమా?! :)) మీరు హైదరాబాద్ మీదుగా రాజమండ్రికి వెళ్ళడానికి ఇబ్బందిగా వుంటే పూనే నుంచి రాయచూర్, కర్నూల్, బెజవాడ మీదుగా ఈ ఒక్కసారి వెళ్ళిరండి. అంతేగాని, కొంచెం దూరం పెరుగుతుందని ఆ ముష్కరులతో రాజీ పడకండి. పూనె నుంచి బెజవాడ, వైజాగ్‌లకు బడ్జెట్ ఫ్లైట్ వుంటుందేమో ఈ ఒక్కసారి వెళ్ళొచ్చేయండి.

  Like

 10. SNKR,

  ఏమిటో ఇన్ని తిప్పలు పడి వెళ్ళకపోతేనేం?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: